Read more!
 Previous Page Next Page 
రాగహేల పేజి 2

    "ఆంటీ నిజంగా మీరు..." "ఆ( ఆ( మహతీమరీ "మీ ఆంటీని పొగడకు. అంతా ఆవిడ గొప్పేం కాదు...." "మరి మీ గొప్పా?" "అంతా కాదనుకో కొంత మీనాన్నకు కూడా ఇస్తాను. నాతో ముఫ్ఫయ్ ఏళ్ళు కాపరం చేశావు కాబట్టే ఇంత నిశితంగా ఆలోచిస్తున్నావ్". "అయ్యో సంబరం! మీ ప్రభావం నా మీద పడిఉంటే ఇక్కడ ఉండేదాన్నే కాదు" "మరెక్కడ ఉండే దానివి?" "పిచ్చాసుపత్రిలో" "ఇప్పుడు మాత్రం వెళ్ళవనినమ్మకం ఏమిటి?" "ఇక చాల్లెండి సరసాలు.    
    టిఫిన్ కు లేవండి. నువుకూడా రామ్మా!" అన్నది వసుంధర. "ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను ఆంటీ! అంకుల్ తో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి" "అవునవును! ఇక నువెళ్ళు! ఆ( కాఫీ టిఫిన్ ఇక్కడికేపంపించు" "ఇదిగో!" లోపలకు వెళ్తున్నవసుంధరను వెనక్కు పిల్చాడు ప్రొఫెసర్. గడపలో ఆగి వెనక్కు తిరిగి చూసింది వసుంధర. "ఆ కాఫీ టిఫినేదో నర్సమ్మకిచ్చి పంపించు. మళ్ళీ వాటితోపాటు నువు రాకు" కొంటెగానవ్వాడు. భర్త మాటలకు ముసి ముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది వసుంధర.    
    "మీరు అదృష్టవంతులు అంకుల్!" "ఎందుకో?" పరశురాం గుబురు కనుబొమ్మలు దగ్గరైనాయి.  "ఆంటీ లాంటి స్త్రీ మీకు భార్యగా లభించడం అదృష్టం కాదా అంకుల్?" పళ్ళమధ్య పైపును బిగించి మెల్లగా నవ్వాడు. "చెప్పండి అంకుల్?" "అసలు నాలాంటిభర్త దొరకడం "మీ ఆంటీ అదృష్టం. అందుకే నీ క్కూడా నాలాంటి భర్తనే వెతికే ప్రయత్నంలో ఉన్నాను. నువు ఊ (అనాలే గాని...." మహతి ముఖంలోకి చూసి గతుక్కుమన్నాడు ప్రొఫెసర్.    
    "సారీ! బేబీ!" నొచ్చుకుంటూ అన్నాడు. "మీరు నాకు సారీ చెప్పడం ఏమిటి అంకుల్!" మహతి కంఠంలో అంతవరకూ ఉన్న ఉత్సాహం లేదు. "ఓకే. ఓకే" ఓ క్షణం ఆమెనుచూసి "ఆ(ఇప్పుడు చెప్పమ్మా! ఎంతవరకు వచ్చింది?" అని అడిగాడు. "ఏం చెప్పను అంకుల్?" "అదేనమ్మా నీ మనసులో ఉన్నది....ఏమాలోచించావ్?" "తల బద్దలుకొట్టుకొన్నా ఒక నిర్ణయానికి రాలేక పోతున్నా అంకుల్". "ప్రయత్నించు" పరశురాం కంఠం గంభీరంగా పలికింది. పైపులో పొగాకు దట్టించుకొంటూ కూర్చున్నాడు. అతను ఆ పని చేస్తున్న తీరు చూస్తుంటే లోతుగా దేన్ని గురించో ఆలోచిస్తున్నట్టుగా ఉంది.    
    "అంకుల్ నాకు ఇద్దరూ కావాలి!" ప్రొఫెసర్ పైపులో పొగాకు కూరుతున్నాడు గట్టిగా. "ఇద్దర్నీ సమానంగా ప్రేమిస్తున్నాను అంకుల్!" పరశురాం పైపును తుడిచినోట్లో పెట్టుకున్నాడు. "ఆ ఇద్దర్లో ఎవర్నీ వదులుకోలేను అంకుల్. నాకు ఇద్దరూ కావాలి". పరశురాం తల ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు. పైపు పొగను సన్నగా ఊదుతూఆలోచిస్తున్నాడు.    
    "ఊ(" "రవి....కిరణ్..." "ఇద్దరూ కావాలంటావ్? ఇందులో ఏ ఒక్కర్నీ వదులుకోలేనంటావ్!" సాలోచనగా అన్నాడు పరశురాం. "అవును అంకుల్. రవి నాలో ఒక భాగం అని అన్పిస్తుంది అంకుల్!" "ఐ.సీ" సాలోచనగా అన్నాడు. "ఇద్దరిలో ఎ ఒక్కరు దూరమైనా నేను బ్రతకలేను. నాలోని అతి విలువైన భాగం ఏదో నానుంచి విడిపోయినట్టు దుర్భర మానసిక వేదనకు గురికాక తప్పదు". "ఊ(" పైపును పళ్ళతోనొక్కుతూ అన్నాడు పరశురాం.
    రవి మనస్తత్వం పసివాడి మనస్తత్వం- అంతేకాదు చాలా మేధకుడిలా ఉంటాడు. అతన్ని చూస్తుంటే, ప్రపంచంలో అతను ఒంటరిగా బతకలేడనిపిస్తుంది అంకుల్. పైగా తనకు కావాల్సినదాన్ని సాధించుకోగలమనస్థయిర్యం, ధైర్యం అతనిలో మచ్చుకుకూడా కన్పించవు" ఆగి మహతి ప్రొఫెసర్ ముఖంలోకి చూసింది. "యస్! ప్రొసీడ్!" ప్రొఫెసర్ కంఠం గంభీరంగా వుంది. "చాలా నిర్లిప్తంగా ఉంటాడు. ప్రపంచంలో దేనిమీదా అతనికి ఆసక్తి ఉన్నట్టు కనిపించదు. పలకరిస్తే గాని పలకడు. ఎప్పుడూ ముభావంగా ఉంటాడు అంకుల్" ఆగిందామె.    
    "ఊ( చెప్పు". "వస్తాడా అంకుల్! ఎన్ని గంటలయినా మాటాపలుకూ లేకుండా బెల్లంకొట్టిన రాయిలాకూర్చుంటాడు. అతన్ని మాటల్లోకి దించడానికి ఎంత శ్రమ పడతానోతెలుసా?" "ఇంట్రావర్ట్" తనకు తనే  చెప్పుకొంటున్నట్టుగా అన్నాడు ప్రొఫెసర్. అగ్గిపుల్లను గీసి ఆరిపోయినపైపును వెలిగించుకున్నాడు. గుప్పుగుప్పున పొగ వదిలాడు. వలయాకారంగా సుడులు తిరుగుతున్న పొగలోనుంచి మహతి కళ్ళల్లోకి చూశాడు ప్రొఫెసర్ పరశురాం.
    "అంకుల్! మీరన్నట్టు రవి ఇంట్రావర్టే కావచ్చు. కాని అతనిలో ఉన్న ఆరాధనాభావం అనిర్వచనీయం, అద్వితీయంమ, అద్బుతం, మూర్తీభవించిన ప్రేమే అతడు" "ఊ( ఇంకా?" "అతడు నన్నెంతగా ప్రేమిస్తున్నాడో "మీకు తెలిస్తే...." మహతి గొంతు మూగపోయింది. "బేబీ! ఐ కెన్ అండర్ స్టాండ్. ఇంట్రావర్ట్ అంటే అతనిలో నువ్వుకోరుకోగల గుణాలేలేవని కాదు. నీకునచ్చిన ఎన్నో సద్గుణాలు రవిలో ఉండవచ్చు. బట్ ది పాయంటీజ్..." "అంకుల్....." మహతి ఉలిక్కిపడింది. పరశురాం పెదవుల మధ్యనుంచి పైపు తీశాడు. యాష్ ట్రేలో దులిపాడు. మహతిని మౌనంగా చూశాడు. మహతి తలదించుకుంది. నేలచూపులు చూస్తోంది. "బేబీ! ఇలా చూడు, ఇంతలోనే ఇంత నీరుకారిపోతే ఎలా?" పరశురాం కంఠంలో వాత్సల్యం పొంగింది. "మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు" మహతి కంఠం స్థిరంగా పలికింది. "ఓ? ఐసి, నేనేం చెప్పబోతున్నానో నీకు తెలుసన్నమాట" బిగ్గరగా నవ్వాడు పరశురాం. "ఆ మాత్రం ఊహించలేనా అంకుల్?" స్పోర్టివ్ గా అంది మహతి. "బ్రేవో మై కిడ్! ఊ( చెప్పు" పరశురాం ముందుకు వంగి మహతి కళ్ళల్లోకి ఉత్సాహంగా చూశాడు. "అసంభవం" మహతి ఎదురుగా ఉన్న ఆ కంఠధ్వని ఎక్కడో దూరతీరాలనుంచి వచ్చినట్టుగా వినిపించింది. "ఏమిటసంభవం?" పరుసాం అప్రయత్నంగా గానే అడిగాడు. "అంకుల్! మీరు చెప్పబోయే మాటే అది. అసంభవం" మహతి కంఠం స్పష్టంగా ఉంది. ప్రొఫెసర్ పరశురాం అదిరిపడ్డాడు. ఈ కిడ్ తనకే సజెషన్ ఇస్తోందా? తన రెండి దశాబ్దాలుగా సైకియాట్రిస్టుగా ఉన్నాడు. జాతీయఅంతర్జాతీయ సభల్లో సైకోథెరపీ మీద ఎన్నో పేపర్లు చదివాడు. హిప్నోథెరపీ మీద తను చేసిన పరిశోధన, సాధించిన ఫలితాలు, అంతర్జాతీయంగా గుర్తింపు...... "అసంభవం! అవునా? మీ మనసులో ఉన్నమాట అదే కదూ?" "యస్! అసంభవం!" తనకు తెలియకుండానే  అనేశాడు ప్రొఫెసర్. "ఆ మాటే అంటారని నాకు తెలుసు" మెల్లగా అంది మహతి. "వాట్? నేనేమన్నానూ?" "అసంభవమని" "ఏది అసంభవం?" "రవినీ, కిరణ్ నూ ఇద్దర్నీ ప్రేమించడం" మహతి గొంతులో జీర పలికింది. "రవినీ, కిరణ్ నూ ప్రేమించడం అసంభవం ఏమీ కాదు. అది అసంభవం అని నేను అనలేదు" . "మరి ఏది అసంభవం?" "ఇద్దరితో కలిసి జీవించడం" ప్రొఫెసర్ పరశురాం కంఠం ప్రస్ఫుటంగా ఉంది.

 Previous Page Next Page