ఇంటికివెళ్ళాక తను ఇవే విషయాలు వివరిస్తూ సుధీర్ కి పెద్ద ఉత్తరంరాయాలనుకుంటోంది. అయినా ఈ మగాళ్ళకు మరీ ఇంత చిన్న పిల్లల మనస్తత్వమేమిటి? తనకు మగ స్నేహితులుకూడా ఉన్నారు. ఇంకా తన స్నేహితురాండ్ర అన్నయ్యలూ, తమ్ముళ్ళూ చాలామంది తెలుసు. సాధరణంగా అందరిదీ ఒకటే మూస. అందరూ స్త్రీలు కోరుతున్న సమాన హక్కులను నిరసించేవారే! తన ఎదురుగా కాకపోయినా, వేనుకయినా తనని అవహేళనచేసేవారే! హఠాత్తుగా శ్రీనివాసరావ్ గుర్తుకొచ్చాడు హేమకు.
అవును అతనికి స్త్రీ అంటే గౌరవం వున్నట్లే వుంది. అవగాహన వుంది. సంఘంలో ఆమెకు జరుగుతోన్నా అన్యాయాన్ని అతనూ నిరసిస్తూన్నాడు. మగాళ్ళతో శ్రీనివాసరావులాంటి వ్యక్తులు ఉన్నా చాలు! ఆడదాని పరిస్థితి అతివేగంగా మార్పు చెందుతుంది! మగవాడితో సమానంగా మనగలుగుతుంది. అతనితో మరికాసేపు మాట్లాడాలనీ తన అభిప్రాయాలను ఆలోచనలనూ అతనితో పంచుకోవాలనీ, అతనిని మరింత దగ్గరగా పరిశీలించాలనీ అనుకొంది తను. కానీ అవకాశం లభించలేదు. సుధీర్ ఏమనుకుంటాడోనని వెనుకాడింది. కనీసం అతని అడ్రస్ తెలిసినా కలం స్నేహం చేసేది. సాయంత్రం సుధీర్ తోపాటు బస్ స్టాండ్ కి వెళ్ళింది హేమ. మర్నాటికి రిజర్వేషన్ తేలిగ్గానే దొరికింది. ఇద్దరూ ముక్తసరిగానే మాట్లాడుతూ ఇల్లు చేరుకొన్నారు. ఆ రాత్రంతా సుధీర్ కి నిద్రలేదుసరిగ్గా.
తనమనసులోని విషయాలు హేమకి తెలియజేయాలావద్దా అనే మీమాంసలోపడిపోయాడు. ఆమెకు తెలియజేస్తే, మామయ్యకు తెలిసిపోతుంది. దాంతో యుద్ధం మొదలవుతుంది. అయినా సరే! తను ఆఖరిక్షణం వరకూ దాచడంకూడా మంచిది కాదు. అలా చేస్తే తప్పు తనదవుతుంది. తెల్లారుజామున తల్లి నిద్ర లేపుతుండగా మెలకువ వచ్చిందతనికి.
"లే త్వరగా! హేమరెడీ అయిపోయిందప్పుడే" అంది దేవకి. సుధీర్ లేచి కూర్చున్నాడు. వెంటనే బాత్ రూమ్ లోకి నడిచాడతను. తనూ బట్టలు మార్చుకొని రెడీ అయేసరికి టైము ఆరుదాటింది.
ఆటోలో త్వరగానే బస్ స్టాండ్ చేరుకున్నారిద్దరూ. ఏడు గంటలకు బయల్దేరాల్సినబస్సు ఏడు దాటినా బయటకు రాలేదు. సుధీర్, హేమ పక్క పక్కనే కూర్చున్నారు బస్ కోసం ఎదురుచూస్తూ. ఆ విషయం ఎలా కదపాలో తెలీటం లేదతనికి. తనేదో తప్పు చేయబోతున్నట్లు అనిపిస్తోంది.
"మా ఊరెప్పుడొస్తావ్ బావా?" అడిగింది హేమ.
"బహుశా ఇప్పట్లో రాననుకుంటాను...."
"ఎందుకనో? కోపం వచ్చిందా మా ఊరంటే?" నవ్వుతూ అందామె.
"ఊరేంచేసిందని కోపం రావడానికి?" తనూ నవ్వుతూ అన్నాడు.
"అయితే నామీదే నన్నమాటకోపం!"
"బావుంది! అయినా మనిద్దరికీ ఒకరంటే ఒకరికి పడకపోవచ్చుగానీ అంతమాత్రాన కోపాలెందుకుంటాయ్?" తను చెప్పదల్చుకొన్న విషయానికి నాందిగా అన్నాడతను.
"ఏమో! నువ్వీ మధ్య మరీ చిన్న పిల్లాడిలా ఉడికిస్తున్నావులే!" "అదేం లేదు. అయినా హేమా! మనిద్దరి అభిప్రాయాలూ వేరు! మనిద్దరి ఆలోచనలూ వేరు! నిజం చెప్పాలంటే నీది ఉత్తర దృవం, నాది దక్షిణ ధృవం అవునా? అలాంటప్పుడు మన మధ్య ప్రేమ, అభిమానం వగైరాలు ఎలా ఉంటాయ్ చెప్పు!
అంచేత ఎంత తక్కువగా కలిసి ఉంటే అంత మంచిది! తరుచుగా కలుసుకొని దెబ్బలాడుకోవడం కంటే ఎప్పుడో ఓసారి కలుసుకొని ఆప్యాయంగా పలుకరించుకోవడం మంచిది కాదూ?" తన మాటలను ఆమె అర్ధం చేసుకుంటుందో లేదోనని ఆమెవేపు పరీక్షగా చూస్తూ అన్నాడు సుధీర్. హేమకొంచెం కలవరపడింది. "అవును బావా! అదీ నిజమే!" అంది ఆలోచిస్తూ. "హేమా! నిన్నో విషయం అడుగుతాను! కాని నువ్వేమీ బాధపడనని మాట ఇస్తేనే!" అన్నాడతను ధైర్యం తెచ్చుకొని "తప్పకుండా అడుగు బావా! అయినా నేనంత తేలిగ్గా బాధపడే మనిషిని కాదులే! నీకా భయమేమీ అవసరం లేదు..." వేగంగా కొట్టుకొంటున్న గుండెలలో అందామె అతనేమడుగబోతున్నాడో ఆమె ఊహించలేకపోతోంది.
"మనిద్దరికీ పెళ్ళి చేయాలనిమనవాళ్ళను కొంటున్నారు కదా! మరి మనం వివాహం చేసుకొంటే ఎలాంటి గొడవలూ లేకుండా సంసారం చేయగలమంటావా? ప్రతి విషయంలోనూ కీచులాడుకొంటూ, ఒకరినొకరు మాటలతో గాయపరుచుకొంటూ గడిపే ఆ జీవితంలో సుఖం ఎక్కడ ఉంటుంది? ఈ పరిస్థితుల్లో మనం పెళ్ళిచేసుకోవటం ఎంతవరకూ సమంజసమో నువ్వే ఆలోచించు! అసలు నీ అభిప్రాయం ఏమిటో నాకు చెప్పు ఈ విషయంలో!"
హేమ తెల్లబోయింది. అతని మాటలు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మనసులో ఏవేవో ఆలోచనలను రేకెత్తించసాగాయి తామిద్దరూ వివాహం గురించి మాట్లాడుకోవడం ఇది రెండో సారి. మొట్టమొదటిసారి తామిద్దరూ ఇదే బస్ స్టాండ్ లో తను ఇలాగే తను వూరువెళ్తున్నప్పుడు అతను ఆ ప్రసక్తి తెచ్చాడు. అది రాత్రి పదిగంటల బస్ లో తన సీటు దగ్గర బాగ్ ఉచి తన కిందకు దిగి సుధీర్ తో మాట్లాడుతోంది. తమ పక్కనే ఇద్దరు దంపతులు కూడా నిలబడి మాట్లాడుకొంటున్నారు. వారి మాటలను బట్టి అతను ఆమెను పుట్టింటికి పంపుతున్నట్లు తెలిసింది తమకు. బస్ నీడ పడడంవల్ల తాము నుంచున్న ప్రాంతం చీకటిగా ఉంది.
సుధీర్ ఏవేవో విషయాలు చెప్తూంటే తను 'ఊ' కొడుతోంది. బస్ బయల్దేరే సమయమయింది. కండక్టర్ బస్ లో కొచ్చి టికెట్లు తనిఖీ చేస్తున్నాడు. హఠాత్తుగా తమపక్కన నిలబడ్డదంపతులు కౌగలించుకొని ముద్దు పెట్టుకొన్నారు. తనూ, సుధీర్ ఆ దృశ్యం చూచి ఆశ్చర్య చకితులయిపోయారు. తను బాగా సిగ్గుపడిపోయింది. మరుక్షణంలో ఆమె బస్ లోకి వెళ్ళిపోయింది.
"మరీ ఇంత బహిరంగంగానా?" నవ్వుతూ అంది తను.
"మనకి పెళ్ళయితే- మనమూ అంతేనేమో!" నవ్వుతూ అన్నాడు సుధీర్. తను ఆ మాటలతో మరింత సిగ్గుపడిపోయింది.
ఆ తరువాత మరెప్పుడూ తామిద్దరి మధ్యామళ్ళి ఆ ప్రసక్తి రాలేదు. ఇప్పుడు తిరిగి అతను-ఇలా-ఆప్రసక్తి తీసుకురావడం-కొంచెం బాధగా ఉంది. అంతే! తను అదివరకటి హేమ అయితే అతని మాటలకు క్రుంగిపోయేదేమో! కానీ తన ఆలోచనలు ఇప్పుడు వివాహంగురించి కాని, సెక్స్ గురించి కానీ పరిభ్రమించడం లేదు. అవన్నీ తనకు సెకండరీ! తనకోధ్యేయం ఉంది! తన జీవితంలో సాధించాలనుకొన్నవి ఎన్నో ఉన్నాయ్. అందుకేనారీ విప్లవ సమితిలో సభ్యురాలయింది. అసలా దృష్టి ఏర్పడటానికి కూడా కారణముంది. అది హాబీ కోసం ఏర్పరచుకొన్నదికాదు. తనకో గుర్తింపులభించాలనీ, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనీకూడా కాదు. చిన్నప్పటినుంచీ తనచుట్టూ జరుగుతూ వచ్చిన సంఘటనలే తనను అటువేపు మళ్ళించాయి. ఆడదాని జీవితం గురించి ఆలోచించేలాచేశాయి. స్త్రీ నిర్వహిస్తోన్న పాత్రను పునః పరిశీలించేందుకు పురిగొల్పాయి.
తను ఎలిమెంటరీ స్కూల్లో అయిదో తరగతి చదువుతున్నప్పుడు తమ స్కూలుకు వెళ్ళే త్రోవలో అరుణ వాళ్ళ ఇల్లు ఉండేది. తను రోజూ అరుణ వాళ్ళింటికివెళ్ళి - అరుణను తీసుకొని స్కూలుకు వెళ్ళడం అలవాటు. అరుణ తల్లి తనను కూడా ఎంతో ప్రేమగా చూసేది. ఒకోసారి బలవంతంగా అరుణతోపాటు తనకూ అన్నంపెట్టేది. అరుణమయినా చిరుతిండికొనిపెడితే అందులో తనకూ తప్పక భాగముండేది. ఓ రోజు స్కూలునుంచి వస్తూ వాళ్ళింటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి భయకంపితురాలయిపోయింది తను. అరుణ వాళ్ళమ్మను వాళ్ళ నాన్న కర్రతో చావబాదుతున్నాడు. ఆమె బిగ్గరగా రోదిస్తూ అతని చేయి వదిలించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తోంది. అది చూసి అరుణ కూడా బిగ్గరగా ఏడ్చేయసాగింది.
తనూ బిక్క మొగం వేసుకొని నిలబడిపోయింది చాలాసేపు. మరి కాసేపటికి చుట్టుపక్కల వాళ్ళెవరో కలుగ జేసుకొని అతనిని చివాట్లు వేసి ఆమెను దూరంగా లాగారు. అప్పటికే ఆమె ఆ దెబ్బలకు తాళలేక పడిపోయింది. అంతే! ఆ తరువాత తను వాళ్ళింటికెళ్ళలేదు. భయం! అరుణ కూడా సరిగ్గా స్కూలుకి రావడం మానేసింది. వాళ్ళమ్మకు దెబ్బలవల్ల జ్వరం వచ్చిందట మరి కొద్ది రోజుల తర్వాత ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన రోజు తనకి బాగా గుర్తుంది. అదో పీడకలలాంటిది తనకు అరుణ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య రావడం, అరుణ బిగ్గరగా ఏడవడం, అరుణ వాళ్ళమ్మను స్మశానానికి తీసుకెళ్ళడం అన్నీ చూసింది తను. అరుణతోపాటు తనూ ఏడ్చేసింది. ఆ రోజు నుంచీ ఎవరు చనిపోయినా తనకు ఠక్కున ఆనాటి దృశ్యమే కళ్ళముందు కనబడుతుంది. అరుణను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు.
అరుణ తండ్రి చాలా కాలం ఒంటరిగానే తనకు కనిపించేవాడు. అతన్ని చూస్తూంటే భయంతో పాటు ద్వేషం కూడా కలిగేది. ఆ తరువాత సంఘటన తన శాంతి పిన్నికి సంబంధించినది. తను టెన్త్ చదువుతోండగా ఆమె వివాహమయింది. వివాహమయిన వారం రోజులకే ఆమెను భర్త, అత్తా కనిసి నానా హింసలూ పెట్టటం మొదలు పెట్టారు. తమ బంధువు లెవరూ వాళ్ళింటికి రాగూడదని శాసించాడతను. ఆమె సంసారంలో జోక్యం కలుగజేసుకోడానికి భయపడి అందరూ వెనక్కు తగ్గారు. అంతే! చాలా రోజులు శాంతపిన్ని ఆ ఇంట్లో ఖైదీ అయిపోయింది. లోపల ఏమి జరుగుతోందో, ఆమెను ఎంతగా హింసిస్తున్నారో అని అందరూ తల్లడిల్లిపోతూండే వాళ్ళు మరికొద్ది రోజుల తర్వాత శాంతిపిన్నే భర్తతో పాటు తమ ఇంటికొచ్చింది.
"సరిగ్గా పది నిమిషాలు టైమిస్తున్నాను. మాట్లాడి బయటకురా! నేను రిక్షా దగ్గరే నుంచుంటాను" అనేసి బయటికెళ్ళి నిలబడ్డాడతను. శాంతపిన్ని వణుకుతూ తలూపి ఇంట్లోకొచ్చింది. అందరూ ఆమె చుట్టూ మూగారు. అందరి ప్రశ్నలకూ ఒకటే సమాధానం చెప్పిందామె.
"నారాత ఎలా వుంటే అలా జరుగుతుంది. మీరేమీ దిగులు పెట్టుకోకండి! నాకు మీరు చేయగలిగిన సహాయం ఒక్కటే ఉంది. అదేమిటంటే నెలకోసారయినా మీరు ఎవరయినా వచ్చి నాకు కనబడుతూండండి. అంతే చాలు. ఒక వేళ మమ్మల్ని మావారుగానీ, మరెవరుగానీ తూలనాడినా సహించండి. నా కోసం మరీ అవమానం పొందండి! అంతే...." కన్నీళ్లు తుడుచుకొంటూ అంది శాంతిపిన్ని అందరూ ఆమె పరిస్థితికి కన్నీరు పెట్టుకొన్నారు. మాటల్లో పదినిమిషాలు గడిచిపోవడం ఎవరూ గమనించలేదు. బయటనుంచి "శాంతా" అంటూ ఆమె భర్త గర్జించేసరికి అందరూ ఉలిక్కిపడిపోయారు. శాంతిపిన్ని ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తింది. అప్పటికే ఉగ్రుడైపోయాడతను.
"నీకుబుద్ది ఉందా? పదినిమిషాల్లో రమ్మని చెప్తే నామాట అంతలెక్కలేకుండా ఉందా నీకు? ఇడియట్....పద!" అంటూ అరిచాడు. ఆమె వెళ్ళిపోయింది. రాన్రాను ఆమె స్థితి గతులు అందరికీ తెలిసిపోయినయ్. భర్త పెట్టేబాధలు భరించలేక ఆమెకు మతిస్థిమితం తప్పింది. కొద్దిరోజులు ఆమెని పిచ్చి ఆసుపత్రిలోకూడా ఉంచాల్సి వచ్చింది. ఆ తరువాత ఆమెకు పిచ్చి తగ్గింది గాని మతిపోగొట్టుకొంది జైర్గినవేమీ గుర్తుండవు. ఎవరితోనూ మాట్లాడదు. పూర్తిగా మౌనం పాటిస్తుంది. ఆమె జీవితం అలా నాశనమయిపోయింది.
మూడోది తను పేటలోనే వున్న శ్రీదేవి విషయం, ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. వాళ్ళింట్లో వాళ్ళు ఎంతో ఆధునికభావాలు కలవారు అవడం చేత ఆమె నెవరూ అభ్యంతర పెట్టలేదు. అతనూ శ్రీదేవి కలిసి పార్కులకూ, సినిమాలకు తిరగడం అందరికీ తెలుసు. అయితే అతనిది కపట ప్రేమ అన్న విషయం శ్రీదేవి గ్రహించలేదు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని అతను వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఆమె నమ్మింది. అతనికి తనశీలాన్ని అర్పించింది. ఆమె గర్భవతి కాగానే అతను మొఖం చాటుచేశాడు అసలా ఊరే వదిలివెళ్ళిపోయాడు. తను గర్భవతి అయిన విషయం తల్లిదండ్రులకు తెలియజేయడానికి భయపడి ఆత్మహత్య చేసుకోబోయిందామె. కిరసనాయిలు పోసుకొని నిప్పంటించుకున్న ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్ళేరు. పదిరోజుల తర్వాత గానీ ఆమెను హాస్పిటల్ నుంచీ డిశ్చార్జ్ చేయలేదు. ఆమెకు అబార్షన్ అయిపోయింది. ఆ రోజు నుంచీ ఆమె బయటకు రావడం మానేసింది ఆమెకు వివాహం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆమె తల్లి దండ్రులు. కానీ ఎవ్వరూ ఆమెను చేసుకోడానికి ముందుకు రాలేదు. కనీసం రెండో పెళ్ళి వాళ్ళు కూడా ఆమెను చేసుకోడానికి అంగీకరించలేదు. ఆమె మధ్య వయస్కురాలయిపోయింది. మిగతా జీవితం కూడా బ్రహ్మచారిణిగానే గడిచిపోతుందనడంలో ఎలాంటి సందేహము లేదు. కానీ ఆ యువకుడికి మాత్రం తమవూళ్ళోనే మరో అమ్మాయితో వివాహం అయిపోయింది. శ్రీదేవి అంటే కూడా ఎవరో తనకు తెలీనట్లు హాయిగా కాపురం చేసుకోమంటున్నాడు. తను కోపంతో మండిపడేదీ విషయంలోనే. మోసపోయిన అమ్మాయిని మన సంఘం ఎంతో తీవ్రంగా శిక్షించింది. కానీ మోసగించిన వాడిని అసలు పట్టించుకోదు! ఇదెక్కడి విడ్డూరం?