Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 4


    ఇదే ప్రేమకు సంబంధించినదికాక, మరో నేరానికి సంబంధించిన మోసమయితే మోసంచేసినవాడినే కోర్టులు శిక్షిస్తాయి. మోసగింపబడిన వారిమీద జాలి పడతాయి. తన మనసు మీద బాగా ముద్రపడిన సంఘటన యిదే. ఇవికాక ఎప్పటికప్పుడు ఆలోచింపజేసే జీవితాలెన్నో తటస్థపడినాయితనకి.
    ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచీ అర్ధరాత్రి వరకూ భర్తకూ, అత్తమామలకూ, మరుదులకూ పని మనిషిలాగా చాకిరిచేసే తమపక్కింటి శాంతాదేవి; భర్త వ్యభిచారి అని తెలిసినా రోజూ రాత్రుళ్ళు ఇంటికి రాకపోయినా ఏమీ చేయలేని నిస్సహాయురాలు అనుపమ. ఎప్పటికయినా తన మీద దయతలచి కాపురానికి తీసుకెళ్తాడని భర్త కోసం గత ఆరేళ్ళుగా ఎదురు చూస్తున్న భవానీ.... ఇంతమంది స్త్రీలజీవితాలిలా మోడువారిపోవడానికి మగవాడి అహంకారమే కారణమన్న నిజం తనకు మనశ్శాంతి కరువు చేసింది. చదువుకొన్న స్త్రీలందరూ పూనుకోకపోతే తమకు తాము అన్యాయం చేసుకోవడమే కాదు భావితరం స్త్రీకి కూడా ద్రోహం చేసినట్లవుతుంది.
    ఈ విషయంలో తన తండ్రి కూడా విశాల హృదయంలో ఆలోచించగలగటం తన అదృష్టం! తనను విప్లవనారీసమితిలో చేరమని ప్రోత్సహించిందికూడా ఆయనే. స్త్రీకి సమానహక్కులుండాలని కేవలం వాదించడమేకాదు తమ ఇంట్లోనే ఆచరణలో పెట్టారు తన తల్లికి ఏ పని చేయడానికీ తండ్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆమెకూడా క్లబ్ లోమెంబరు. ఆమెకు క్లబ్ మీటింగ్ లున్న రోజు తండ్రేవంట చేసేవారు ఆయన అభిరుచులూ, ఆశయాలే తనలోనూ జీర్ణించుకున్నాయి.
    "ఏమిటి హేమా? ఆలోచిస్తున్నావా?" సుధీర్ గొంతువిని ఆలోచనల్లోనుంచి బయటపడింది ఆమె.
    తన పరధ్యానానికి తనకేనవ్వు వచ్చిందామెకి. అతనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా గతాన్ని ఎందుకు గుర్తు తెచ్చుకొంటున్నట్లు?" అవును బావా! నువ్వు అన్న మాటల్లో నిజం ఉంది. మనిద్దరినీ పరస్పర విరుద్ద భావాలుమనం పెళ్ళాడడం మన భవిష్యత్తుమీద జూదం ఆడటంలాంటిది..." తల వంచుకుని అంది.
    ఆమె అలా అంటూంటే ఆమె గొంతు కొంచెం వణికింది. అంతవరకూ అతనితో ఉన్న సన్నిహితత్వం ఆ క్షణంనుంచీ తెగిపోతున్నట్లనిపించి మనసు విలవిలలాడింది. అయినా ఇందులో తనప్రమేయం ఏముందని? బావకెలాగూ తనను చేసుకోవడం ఇష్టంలేదు అలాంటప్పుడు తనింక ఆ విషయం గురించి ఆలోచించడమే అనవసరం. బావ అలాంటి అభిప్రాయానికి రావడంకూడా సమంజసమే మరి!
    సుధీర్ ఆశ్చర్యంగా ఆమెవంక చూశాడు. ఆమె ఆ విషయం ఇంత త్వరగా, ఇంత తేలిగ్గా తేల్చేస్తుందనుకోలేదు.
    "నీకు నా మీద కోపంగా ఉందా హేమా?" అనుమానంగా అడిగాడు.'
    'ఉహు! కోపమెందుకు బావా? ఇందులో నువ్వు అనుచితంగా మాట్లాడించేదేముందని? నువ్వు చెప్పిన విషయాలన్నీ నిజమేగా!"
    "థాంక్యూ హేమ! నన్ను ఇంత సులభంగా అర్ధం చేసుకుంటావనుకోలేదు. కానీ మన పెద్ద వాళ్ళు కూడా ఇంత కూల్ గా ఆలోచిస్తారంటావా? నాకదేభయంగా ఉంది. మనకుటుంబాల మధ్యలేని పోని కలతలు ప్రారంభమవుతాయేమోనని!" సందేహంగా అన్నాడతను.
    "మరేం ఫరవాలేదు. ముందుకొంచెం తొందర పడినా తరువాత వాళ్ళూ మన నిర్ణయమేమంచిదని వప్పుకుంటారు...." నవ్వుతూ అంది ఆమె. బస్ డిపోలోంచి వేగంగా వచ్చి వారిముందాగింది. సుధీర్, హేమ లేచి బస్ దగ్గరకు నడిచారు. ఆమె లోపల కూర్చున్నాక ఎటాచీ ఆమె కందించాడు సుధీర్.
    "సరే ఇక ఉంటాను మరి! మళ్ళీ ఆఫీసుకి టైమవుతుంది" అన్నాడతను.
    "ఓకే బావా వెళ్ళిరా!" చిరునవ్వుతో అంది ఆమె.
    "థాంక్స్ ఎలాట్...." చేయి వూపుతూ అన్నాడతను.
    "అన్నట్లు మీ ఫ్రెండ్ ని అడిగానని చెప్పు" "ఓకే..."
    అక్కడినుంచి నడిచాడు సుధీర్. అతని మనసు తేలికయిపోయిందిప్పుడు. తను ఇన్ని రోజులుగా హృదయంలో దాచుకున్న అగ్నిపర్వతం ప్రేలి చల్లారినట్లనిపిస్తుంది. హేమద్వారా సాయంత్రానికల్లా ఈ వార్తా మామయ్యకూ, అత్తయ్యకూ తెలుస్తుంది తనూ ఇంటికెళ్ళగానే తల్లికీ విషయం చెప్పేస్తాడు. ఆఫీసు కెళ్ళి వచ్చేసరికి ఆమెకూడా చల్లబడిపోతుంది. అంతే! అక్కడితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుంది. భోజనం చేస్తూండగా ఆ విషయం తనే కదిపాడు సుధీర్.
    "హేమ, నేనూ అన్నీ మాట్లాడుకున్నామమ్మా! ఆమెకేమో నన్ను చేసుకోవడం ఇష్టంలేదు. నాకేమో హేమను చేసుకోవడం ఇష్టం లేదు. అంచేత ఇంక నువ్వు మా వివాహం గొడవ పట్టించుకోనక్కరలేదు"
దేవకి త్రుళ్ళిపడిందతని మాటలకు. "నిజమేనట్రా నీ మాటలు?"అంది ఆశ్చర్యంగా.
    "అవునమ్మా! అబద్దం ఎందుకు చెప్తాను? మా ఇద్దరికీ విభిన్న మనస్తత్వాలు! మేము వివాహం చేసుకోవడం ఇద్దరికీ మంచింది కాదు. అందుకే ఆ నిర్ణయానికొచ్చాం!"
    ఆమె ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఆ వార్త ఆమెకి పూర్తిగా నిరుత్సాహాన్నీ, బాధనూ కలిగించింది.
    హేమ తప్పక తన కోడలవుతుందనే అభిప్రాయంతోనే ఉందిన్నాళ్ళూనూ! ఇటీవల సుధీర్ హేమపట్ల అనాసక్తి కనబరుస్తున్నా అది ఇలా పరిణమిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ తరం వారికీ ఆ తరం వారకీ ఎంత తేడా వుందో స్పష్టంగా తెలుస్తోందిప్పుడు. ఈ తరం వాళ్ళు తమ ఇష్టా ఇష్టాలను ఏర్పరచుకోవడం, వాటి కనుగుణంగానే జీవితాన్ని కూడా మలచుకోవడంకూడా చేస్తున్నారు. సుధీర్ ఆఫీసు కెళ్ళిపోవడం కూడా ఆమెకు తెలీదు. వంటింట్లో డైనింగ్ టేబుల్ దగ్గరే గోడ కాసుకుని చాలాసేపు ఆ విషయమే ఆలోచిస్తూండిపోయింది.
    హేమ తమ ఊళ్ళో బస్ దిగేసరికి సాయంత్రమయిపోయింది ఇంటి దగ్గర తన తల్లీతండ్రీ తనకోసమే ఎదురు చూస్తున్నారు. "అదిగో హేమ్ వచ్చేశాడు!" అన్నాడు తండ్రి ఆనందంగా.
    "ఎలా అయింది ఇంటర్వ్యూ!" అడిగింది తల్లి. "బాగానే జరిగింది మరి! ఏం చేస్తారో తెలీదు...." సూట్ కేస్ లోపల పెట్టికుర్చీలో కూర్చుంటూ అందామె.
    "అత్తయ్యా బావా అందరూ బావున్నారా?" అడిగాడు రామరాజుకూతురి వంక చూస్తూ.
    "అంతా క్షేమంగానే ఉన్నారు డాడీ! దేవకి అత్తయ్య నన్నసలు ఇంత త్వరగా పంపడానికి ఒప్పుకోలేదు. ఉద్యోగం వస్తే ఎలాగూ ఇక ఇక్కడే ఉంటాగదా అనికోసేసి వచ్చేశాను.."
    నవ్వుతూ అంది ఆమె.
    "అది సరేగాని ఓసారి మీ నారీసమితి ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళిరా! ఆమె నీ కోసం నిన్నటి నుంచీ తిరుగుతూంది!" అంది సౌభాగ్యమ్మ.
    "ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగిందామె.
    "ఏమో! ఏదో ఊరేగింపు, మీటింగూ ఉన్నాయట వచ్చే వారంలో..."
    "ఓహో..." ఆలోచిస్తూ తలూపిందామె. సరిగ్గా అప్పుడే "ఏమండీ" అంటూ బయటనుంచి ఎవరో పిలవడం వినిపించింది.
    "ఎవరూ?" రామరాజు బయటకునడుస్తూ అన్నాడు.
    "నేనండీ! చంద్రకాంత్ ని! వసుంధరమా సిస్టర్!" గేటు దగ్గరే నిలబడి చెప్పాడతను.
    "ఓహో వసుంధర తమ్ముడివా? రా, లోపలికి రా!" ఆదరంగా పిలిచాడు రామరాజు. చంద్రకాంత్ లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
    "ఏం చదువుకున్నావ్ నువ్వు?" అడిగాడు రామరాజు.
    "ఇంటర్మీడియట్ ఫస్టియరండీ!" బిడియంగా అన్నాడతను.
    "అలాగా! మరి తనకింత పెద్ద తమ్ముడున్నట్లు వసుంధర నాతో ఎప్పుడూ చెప్పలేదే?" నవ్వుతూ అన్నాడు రామరాజు.
    చంద్రకాంత్ చిరునవ్వు నవ్వాడు.
    ఈలోగా హేమ బయటికొచ్చి తొంగిచూసిందతనివేపు. "ఏమిటి చంద్రా! నాతోకబురేమయినా చెప్పమంచా వసుంధర?" అడిగిందామె.
    "ఉహు! లేదండీ నాకే మీతో చిన్న పని పడింది...." బిడియంగా అన్నాడతను. అతనలా సిగ్గుపడుతూ మాట్లాడటం చూసి హేమకు నవ్వొచ్చింది.
    "ఏమిటిది?" బలవంతంగా నవ్వాపుకుంటూ.
    "మావరకట్న నిషేధసంఘం తరపున ఒక సావనీర్ వేస్తున్నామండీ! దానికి మీరేదైనా ఆర్టికల్ ఇవ్వాలి".
    "ఓస్! ఇంతేనా! ఇంకేమిటో అనుకొన్నాను. సరే ఇస్తాను."
    "థాంక్యూ ఎప్పటికి ఇవ్వగలరు?"
    "రేపు సాయంత్రానికిస్తే చాలా?" అడిగిందామె.
    "ఓ! సరిపోతుంది" ఆనందంగా అన్నాడతను.
    "ఇంతకూ ఆ సంఘంలో నువ్వేమిటి? ఏమయినా పదవి ఉందా?" చంద్రకాంత్ మళ్ళీ సిగ్గుపడ్డాడు.

 Previous Page Next Page