అప్పుడు చూశాడు తొలిసారి ఎగువ నుంచి దిగువగా....
క్షణం ఉలికిపాటు....మరుక్షణం గొంతు దిగని తత్తరపాటు.
నీలాకాశం నుదుటి నుంచి జారిన ఒక ఒంటరి నక్షత్రం కాదది....అంధకారపు కొసమెరుపు...అక్కడో ఇసుకతిన్నెల ఎడారి....నడుమ కనిపించే ఒక రహదారి...ముళ్ళ గులాబీ మత్తెక్కించే మల్లెచెండు.
"రా...శంకూ..." చీకటి రొమ్ము మీద నగ్నంగా నర్తించే నవ హంసగీతంలా వినిపించింది."రమ్మం ....టుం...టే...."
ఒక అరణ్యం అంతరాళంలా గోలపెడుతూంది.
"రా__శంకూ"
రగిలిన ఉన్మత్తత అవని ఆకాశం కలుసుకునే అంచును మీటుతూంది.
"నిన్నే...." రాక్షసంగా అతడ్ని క్రిందకి తోసింది.
దభీమన్న చప్పుడు__
"బామ్మా" అంటూ కేకపెట్టాడు. నులకమంచం పైనుంచి నేలమీద పడిన శంకూ కళ్ళు చిట్లించి చుట్టూ చూశాడు.
"ఏమైందిరా?" బామ్మ ఆత్మీయంగా పలకరిస్తూంది.
మరోసారి కళ్ళు నులుముకుని చూశాడు. బోధపడింది అప్పటిదాకా తాను కలగన్నానని...చుట్టూ చీకటిలేదు సాయంకాలం అవుతున్న సూచనగా తగ్గుముఖం పడుతున్న ఎండతప్ప....
"పగటిపూట నిద్రేమిట్రా అంటే వినవుకదా! పిచ్చితండ్రి! పీడకలొచ్చిందా?" లక్ష్మమ్మ ఆప్యాయంగా అడుగుతుంటే ఓ ప్రమాదం తప్పిన సంతృప్తితో ఆమె ఒడిలో తలపెట్టుకొని చుట్టుకుపోయాడు.
బయట వీధిలో పిల్లల కేరింతలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి.
మనవడి ఒంటికి పట్టిన చెమటని తుడుస్తూ అడిగింది లక్ష్మమ్మ. "భయపడ్డావా?"
"ఎందుకూ?" ఒడిలోనుంచి ఇంకా తల పైకెత్తలేదు.
"రేపటినుంచి కాలేజీకెళ్ళాలిగా?" ఇన్నాళ్ళూ సోషల్ వెల్ ఫేర్ హాస్టల్లో చదువుకున్న శంకూ పదేళ్ళ తర్వాత ఈ మధ్యనే బామ్మ దగ్గరికి వచ్చింది. బాల్యంలో పెరిగింది ఈ ఊళ్ళోనే అయినా శంకూకి యిక్కడ అంతా కొత్తగా అనిపిస్తూంది.
"ఈ వూళ్ళో పిల్లలంతా చిన్నప్పుడు నీ స్నేహితులేరా! పైగా సురేంద్ర నీకు తోడుంటాడుగా."
కాలేజీలో అడుగుపెట్టడం నిజానికి భయంగానే వున్నా బామ్మ దగ్గర ఒప్పుకోడానికి మనసు అంగీకరించలేదేమో దబాయించాడు.
"కాలేజి అంటే భయపడతారేమిటీ?"
"పిచ్చినాన్నా.....నేను నీకు బామ్మనయినా అమ్మలా పెంచిన దాన్నిరా" మృదువుగా నవ్వుతూ తల పైకెత్తుతుంటే అప్పుడు వినిపించింది.
"ఏటీ...మనవడు బామ్మకేదో మొక్కుతున్నట్లున్నాడు?"
తలతిప్పి చూసిన శంకూ నివ్వెరపోయాడు ఆ సమయంలో అక్కడ మంగని చూడగానే.
కలలోకన్నా మంగ బయటే బాగున్నట్టనిపించినా మంగ వంకర నవ్వు ఉక్రోషాన్ని తెప్పించింది.
"ఇంతమంది అబ్బాయిల్ని చూశానుగానీ ఇలాంటి పిరికిగొడ్డుని నేనెరగనమ్మా" అంటూ బామ్మగారికి సాయంగా యిల్లు పూడ్చడం మొదలుపెట్టింది.
ఆ మాటకి శంకూ పసితనంలోనే పోయిన కూతురే గుర్తుకొచ్చిందో లేక తను లేకపోతే తన పిచ్చి మనవడు ఏమౌతాడో అన్న ఆలోచన మెదిలిందో లక్ష్మమ్మగారి కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి.
"ఉలకడూ పలకడూ.... వయసుకితగ్గా పూసులయినా అతడు...."
"అందరిలాంటి బ్రతుకూ అయితే వీడూ అందరి పిల్లల్లాగే వుండే వాడు మంగా! పుట్టగానే తల్లిని తినేశాడు" బామ్మ గొంతు గాద్గదికమైనపోయి నది. "నూరేళ్ళు ఈ బామ్మ నీడలో బ్రతికేయాలనుకుంటున్నాడు....నేనైనా ఇక ఎన్నాళ్ళు మిగులుతానని....అందరితోనూ కలిసిపోరా అంటే...ఏదీ..."
"ఊరుకో బామ్మా!" మంగ ఓదార్పుగా చూసింది.
"అదికాదే మంగా! నాకు తప్ప అర్ధంకాని వీడు-నేను లేకపోతే...."
ఇప్పుడు శంకూ కళ్ళు నీళ్ళను చిమ్ముతున్నాయి. బామ్మ అలా తన గురించి భయపడటం అతడికే ఇష్టంలేదు. "ఇప్పుడు నాకేమైందే?"
లాలనగా శంకూ జుట్టు సవరించింది. "రోషానికేం తక్కువలేదు"
"నేను మా అమ్మ పోలికన్నావుగా"
"అవును" ఏ స్మృతుల శకలాలో కలచివేస్తున్నట్లు నెమ్మదిగా అంది. "అదీ అంతేగా బ్రతికినంతకాలం అది నాకు అర్ధం కాలేదురా. అయ్యేసరికి మిగలకుండా పోయింది. మనసులో ఏముందో తెలిసేది కాదు. చెప్పమంటే నీలాగే చిర్రుబుర్రులాడేది" తనకు అర్ధంకాని ఓ ప్రపంచాన్ని సృష్టించుకొని అందులో మరెవర్నీ అడుగుపెట్టనివ్వకుండా ఒంటరిగా బ్రతికేసే శంకూ ఇప్పుడు పోయిన కూతురిలాగే అనిపిస్తున్నాడు.
క్రమంగా శంకూలొ ఉద్విగ్నత పెరుగుతుంది.
ఓ ప్రపంచపు గోడల్ని దాటి బయటకి వచ్చిన అమ్మ గురించి చెడుగా చాలా విన్నాడు. అదే అడగాలనుకున్నాడు. పదకొండునెలల ప్రాయములో అమ్మ తనను విడిచి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పమని, అలా చేసిన అమ్మ మీద అసహ్యంతో చాలా చాలా అడిగేయాలనుకున్నాడు ఎప్పటిలాగే.
ఆ విషయాన్ని గ్రహించింది లక్ష్మమ్మ.
అందుకే ఏదో పనున్నట్లు వంటగదివేపు నడవబోతుంటే- "బామ్మా" అన్నాడు సూటిగా చూస్తూ.
ఇక్కడ లక్ష్మమ్మగార్ని అసంకల్పితంగా కాపాడింది మంగ. "అవునూ ఆడపిల్లలా ఇంటిపట్టున కూచునేకంటే కాస్త బయట తిరిగిరావచ్చుగా?" శంకూని నిలదీస్తుంటే చిర్రెత్తుకొచ్చేసింది "ఇలా అయితే కష్టమే."
"నీకేమైందీ మధ్య?"
బామ్మగారు అప్పటికే వంటగదిలోకి వెళ్ళటంతో ఊడ్చుతున్నట్లు నేలకు వంగి శంకూని సమీపించింది. రహస్యంలా అంది. "చెప్పేదా?"
"ఏమిటి?"
"నాకేమవుతుందో" యిప్పుడు మంగ నవ్వు కలలోలా అనిపించింది.
"అయినా పిరిగ్గొడ్డువి. చెప్పి నేను తేలికపడటం తప్ప ఆర్చేవాడివా? తీర్చేవాడివా" మంగ పైట దిగువగా చూసిన శంకూ కళ్ళు మంగ చూపుల్ని కలుసుకొని క్షణంలొ విడిపోయాయి. "ఇలా అయితే ఎత్తుకుపోతారు."
"ఎవరూ?"
"కాలేజీలో చేరుతున్నావుగా....అక్కడి అమ్మాయిలు"
"పెద్ద తెలిసినట్టు"
"తెలీకేం అమ్మాయిగారు చెప్పారు. అందుకే నువ్వు సరేనంటే నిన్ను ధైర్యవంతుడ్ని చేస్తా."
మంగ అలా అంటుంటే కలలో చర్చ గుర్తుకొచ్చేసింది. కట్రాటలా బిగుసుకుపోయాడు.
"అసలు అబ్బాయిలంటే వుండేది ఇలాగా....అమ్మాయిగారిలా వుండాలి....ఎంత మొండిపిల్లవి మాటంటే చాలు తాట ఒలిచేస్తుంది. చెడు గుడాడేస్తుంది."
"అబ్బా" కోపంగా తలపట్టుకున్నాడు. "చంపుతా"
"సరిగ్గా ఇలాగే అంటుంది"
"ఎవరూ?"
"అమ్మాయిగారు....సావేరి"
* * * *
"పట్టుకు తీరాల్రా....లేకపోతే సావేరమ్మగారు సంపేస్తారు రాజిగా" ఏటి ఒడ్డున కొండ శిఖరాగ్రాన వున్న పొదల్లో ఆత్రంగా వెదుకుతున్నారు నలుగురు వ్యక్తులు. ఆ గాలింపు గంటగా అలా కొనసాగుతూనే వుంది.
"పాడుముండ ఎక్కడ నక్కేసిందో ఏటో ఒకపక్క పొద్దుగూకి పోతోంది" బండరాళ్ళ మధ్య కదులుతూ శీనయ్య స్వగతంలా అనుకుంటున్నాడు.
"జార్తరోరే....పురుగూ పుట్రా వుంటాయి" యాదయ్య మరో మూలనుంచి గాలిస్తూ శీనయ్యని హెచ్చరించాడు.
"పురుగూ పుట్రా అని ఆలోచిస్తే పుచ్చె లేసిపోద్ది ఎలాగన్నా దాన్ని పట్టుకు తీరాలి. అప్పుడు అయ్యగారి లోగిట్లో అడుగుపెట్టాలి."