Previous Page Next Page 
రాగహేల పేజి 26

    "ఇంతవరకు నువు అవతారం చెప్పింది విన్నావు. అవతారం దృష్టిలో శేషయ్య పరమ దుర్మార్గుడు. కాని శేషయ్య చెప్పేది ఇందుకు భిన్నంగా ఉండాలి--ఉంటుంది" "మరి శేషయ్య..." పరశురాం చిరునవ్వు నవ్వాడు. చేతిగడియారం కేసిచూశాడు. అవతారం ముఖంలోకి చూశాడు. అతడు ప్రశాంతంగా నిద్రలో ఉన్నాడు. "అవతారం?" అవతారం పలకలేదు. "అవతారం" లాలనగా పిల్చాడు పరశురాం అతనుపడుకొని ఉన్న మంచంమీదకువంగి. "ఊ(" "నువు ఇంకేమయినా చెప్తావా?" "లేదు. అయిపోయింది" "ఇక నువ్వెళ్ళిపోతావా?" "ఊ(హూ!" "లేదు. నువువెళ్ళిపోవాలి. మళ్ళీకలుస్తాగా!" "ఆ శేషయ్యగాడు వస్తానన్నాడా?" కసిగా అడిగాడు. "అవును" "వాడి మాటలు నమ్మి నన్ను..." "లేదు అవతారం నాకు ఆ శేషయ్య సంగతి తెలియనిదా ఏం? ఇక నువెళ్ళిపో" "సరే! వాడు వెళ్ళిపోయాక మళ్ళీ నన్నుపిలవాలి" మహతి కళ్ళు మూసుకొని పడుకొని మాట్లాడుతున్న శేషావతారాన్ని, అతనితోమాట్లాడుతున్న పరశురాం నూ మార్చి మార్చి చూడసాగింది. అవతారం వెళ్ళిపోతాడా? ఆ వెంటనే అంకుల్ పిలవగానే శేషయ్య వస్తాడా? ఏమిటో అంతా గందరగోళంగా వుంది. మహతికి జుట్టుపీక్కోవాలనిపించింది. "అవతారం వెళ్ళిపో వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోయావు. వెళ్ళిపోయావు." అని రెండు నిముషాలు ఆగి "శేషయ్యా? శేషయ్యా! "పిల్చాడు ప్రొఫెసర్ పరశురాం. మంచంమీద వ్యక్తిని కుతూహలంగా చూస్తూ వుంది మహతి. "శేషయ్యా!" "ఊ(" "నువ్వప్పుడు గాఢనిద్రలో వున్నావు--గాఢనిద్రలో ఉన్నావు--నా గొంతు వింటున్నావు--నా ప్రశ్నలకు సమాధానం చెబుతావు----నీపరిస్థితి ఇంతదీనంగా కావడానికి ఎవరు కారణం!" "ఇంకెవరు, ఆ శంకరయ్యగాడు!" దూకుడుగా అన్నాడు శేషయ్య. "శంకరయ్యెవరు?" "ఇంకెవడూ, నా బామ్మర్ది. సయానా మా ఇంటిదాని అన్నదమ్ముడు. వాడేనా కొంప దీశాడు. నన్ను నట్టేట్లో ముంచాడు" లబలబలాడుతూ చెబుతున్నవాడు ఒక్కసారిగా ఆగిపోయాడు. "చెప్పు శేషయ్యా! పూర్తికధ చెప్పు"
    "ఆ దుర్మార్గుడు నా కొంపనిలువునా కూల్చాడు. నా నడుం విరగ్గొట్టాడు మళ్ళీ లేవకుండా. నన్ను దొంగనోట్ల వ్యాపారంలోకి దించాడు. ఎన్నో ఆశలు చూపించాడు. నమ్మించాడు. ఒక పట్టాన నేను నమ్మలేదు. ఎట్టయితే ఏం చివరకు నమ్మించాడు. బ్యాంకులో ఇల్లు హామీ వుంచి నాలుగు లక్షలు అప్పుతీసుకున్నాను. ఆ నాలుగు లక్షలూ నలభై లక్షల దొంగనోట్లు ఇచ్చి  తీసుకెళ్ళడానికి శంకరయ్య నలుగుర్ని వెంటేసుకుని వచ్చాడు. డబ్బు మార్చుకుంటున్నాం. ఇంకా నోట్ల కట్టలు లెక్క పెట్టడం కానేలేదు. ఇంతలోవచ్చిపడ్డారు" ఆగిపోయాడు శేషయ్య. "ఎవరొచ్చారు?" "ఇంకెవరు? పోలీసులు మొత్తం డబ్బుగుంజుకెళ్ళారు" "పోలీసులకు ఎవరు ఇన్ ఫర్ మేషన్ ఇచ్చివుంటారంటావ్?" "అసలు వాళ్ళు పోలీసులేకారు" "మరి?" "అప్పుడు నాకు తెలియదు. పోలీసులానే అనుకున్నాను అందుకే భయంతో దొంగకు తేలు కుట్టినట్టుగా ఉండిపోయాను" "ఇంతకూ వాళ్ళెవరు?" "ఇంకెవరు? ఆ శంకరంగాడి మనుష్యులు". "శంకరంగాడి మనుషులా? అంటే?" "వాడే ఈ నాటకం ఆడాడు. తన వాళ్ళకే పోలీసుల వేషం వేయించి రప్పించాడు. ఆ సంగతులు నాకు ఆ తర్వాత ఎప్పటికోగాని తెలియలేదు. ఇల్లుమీద పెద్దగా ఆదా లేదు. అది ఖర్చులకూ, బ్యాంకులో తెచ్చిన అప్పు తాలూకు వడ్డీకి సరిపోయేది కాదు. వడ్డీ పెరిగిపోసాగింది. కొంపా గోడూ అమ్మికట్టినా ఇంకా బ్యాంకులో అసలు అలాగే వుండిపోయింది. చివరకు ఇల్లును బ్యాంకు అధికారులు సాధీనం చేసుకున్నారు. మా బామ్మర్ధి ఆ శంకరంగాడేనా ఇల్లు నిలువునాకూల్చాడు." "ఇక చాలుగాని కొంచెంసేపు నిద్రపో" అని పరశురాం ఒకనిముషం మౌనంగా వున్నాడు. పది నిముషాలాగి అతడ్ని నిద్ర లేపాడు. "ఇదుగో ఈ మందులువాడు" చీటీ రాసిఇచ్చాడు డాక్టర్. శేషావతారం మంచందిగాడు. చీటీ తీసుకుని డాక్టరుకు నమస్కరించి బయటకు వెళ్ళాడు. మహతి అతనిముఖంలో అంతకుముందులేని ఏదో ప్రశాంతతను చూసింది. "అంకుల్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది ఎవరూ?" ప్రొఫెసర్ పరశురాం మహతి ముఖంలోకి చూస్తూ "శేషయ్య" అన్నాడు "మీకెలా తెలిసింది అంకుల్?" "నేను శేషయ్యతో మాట్లాడాను. వెంటనేలేపాను. శేషయ్య నిద్ర లేచాడు" "ఏమిటో అంకుల్, ఇదంతా చూస్తుంటే నాకు మతిపోయేలాగుంది" ప్రొఫెసర్ ఆమెకేసి సానుభూతిగా చూశాడు. "బేబీ! నువేడీలా పడిపోతే ఎలా?" భుజంమీదతట్టాడు. "అంకుల్" "ఏమ్మా" "నాకు ఈ కేసు కొంచెం వివరంగా చెబుతారా?"
     "అలాగే" పరశురాం పైపులోకి పొగాకు దట్టిస్తూ ఆలోచిస్తున్నాడు. మహతి కుతూహలంగా అతని ముఖంలోకి చూస్తూండిపోయింది. ప్రొఫెసర్ చెప్పసాగాడు. "విన్నావుగా మహతీ?" ఏదో ఆలోచిస్తున్నమహతి తలెత్తి చూసింది. "ఏమిటి అంకుల్?" యధాలాపంగానే అన్నది. "నువేదో ఆలోచిస్తున్నావు. ఇప్పుడొద్దులే మరోసారి చెప్తాను" "వింటున్నాను చెప్పండి అంకుల్" "అతని పేరు అసలు----" "శేషయ్య...." మధ్యలోనే అందుకొని అంది మహతి, తను అతని మాటల్ని శ్రద్దగా వింటున్నట్టు తెలియజేయటానికి. "కాదు" "అవతారం" "కాదు" "సారీ శేషావతారం అతని పర్సనాలిటీ స్ప్లిట్ అయింది" "గుడ్! తర్వాత! ఎనలైజ్ చెయ్యగలవా అలా ఎందుకయిందో?" మహతి కొంచెంసేపు దీర్ఘంగా ఆలోచించింది. "మీరు చెప్పండి అంకుల్" అంది. "రామచంద్రయ్యకు అన్యాయం చేశాననే బాధ అతన్ని కలవరపెడుతోంది. అంతరాంతరాలలో ఆ బాధ గూడు కట్టుకుంది. మంగమ్మా, ఆమె పిల్లలచావుతో ఆ బాధ ఇనుమడించింది. మర్చిపోవాలనే ప్రయత్నం చేసినా మర్చిపోలేక పోయాడు" "అంకుల్, అడ్డం వచ్చినందుకు క్షమించండి. ఏదయినా తప్పుచేసి ఆ తర్వాత పశ్చాత్తాపపడటం మానవసహజం. అంతమాత్రానికే పర్సనాలిటీ స్ప్లిట్ అవుతుందా అంకుల్?"

 Previous Page Next Page