ఉదయం పదిగంటలు దాటింది. ప్రొఫెసర్ పరశురాం ఇంటిముందు ఆటోదిగింది మహతి. అప్పటికే కన్సల్టింగ్ రూం ముందు బెంచీలమీదా, కుర్చీలలో పది పన్నెండుమందిదాకా కూర్చుని వున్నారు. మహతి ఒక ఖాళీకుర్చీ చూసుకొని వచ్చికూర్చుంది. "బుల్లెమ్మా" మహతి ఆలోచనలనుంచి బయటపడి పక్కకుచూసింది. "అమ్మాయ్, నువన్నా చెప్పమ్మా డాక్టర్ గారికి" మాటలు ఒకదాన్నిఒకటి తోడుకుంటున్నట్టువచ్చాయి. ఆమె అతడ్ని ఎగాదిగా చూసింది "చెప్తావా?" "ఏమని" "అసలు ఇచ్చుకుంటాను. వడ్డీ ఇచ్చుకోలేను" "డాక్టరు గారు నీకు వడ్డీకి అప్పులివ్వడం ఏమిటి?" ఆశ్చర్యంగా అంది. "ఆ శేషయ్య గాడి దగ్గర బుద్ది తక్కువై అప్పు తీసుకున్నాను. డాక్టరుగారే అడ్డం వుండి ఆ శేషయ్య గాడికి చెప్పి ఒప్పిస్తానన్నారు. ఇపుడా దగుల్భాజీముందు వడ్డీ కట్టమని గొడవ చేస్తున్నాడు. నిద్రపోనివ్వడు...." చివరి మాటలు గొణుగుతున్నట్టుగా అన్నాడు.
ఇతన్నేగా కొన్ని రోజులక్రితం తను అంకుల్ దగ్గరచూసింది! అప్పుడు ఆతని పేరు శేషయ్యని చెప్పాడు అంకుల్. అంకుల్ చెప్పాడా? కాదు అంకుల్ పిలుస్తుంటే తను వింది. మరి ఇప్పుడు ఆ శేషయ్యగాడెవడో అన్నట్లు మాట్లాడుతున్నాడేంయీయన? అంకుల్ ఈ కేసు గురించి ఏదో చెప్పారు. కాని తనకు గుర్తులేదు. ఇతనిపేరు శేషయ్య అని మాత్రం తనకు బాగా గుర్తుంది. "ఏం బుల్లెమ్మా చెబుతావా?" మహతి అతనికేసిపరిశీలనగా చూస్తూ "నీ పేరేగా శేషయ్య" అన్నది. అతని ముఖంలోకి సర్రున రక్తం చిమ్మింది. ఆ నల్లటి ముఖం కమిలిన వంకాయ రంగునుపులుముకుంది. "నా పేరు అవతారం. ఆ దగుల్భాజీ పేరు శేషయ్య. బుద్ది గడ్డితిని వాడి దగ్గర అప్పు తీసుకున్నాను. అసలువద్దట. వడ్డీఇవ్వాలట" అతని మాటలలో ఉద్వేగం వుంది. "అదికాదు శేషయ్యా..." "అదిగో మళ్ళీ..." చివ్వునలేచి నిల్చుని" నా పేరు అవతారం" అన్నాడు ఉద్రేకంగా. మహతికి గాభరాగానూసరదాగానూ వుంది అతనితో మాట్లాడటం. "పొరపాటయింది కూర్చో అవతారం. అసలు సంగతేమిటో చెప్పు" అతను కొంత స్థిమితపడికూర్చున్నాడు.
"మరి డాక్టర్ గారికి చెబుతావా?" "చెబుతాగాని-మరిఇంతకు ముందు డాక్టరుగారు దగ్గరకొచ్చి అతను వడ్డీ ఇవ్వనంటున్నాడని ఫిర్యాదు చేశావుగా? వడ్డీ ఇప్పించమని అడిగావు కూడా. ఇప్పుడు ఇదేమిటి ఇలా అంటున్నావ్?" అతను మళ్ళీ చివ్వున లేచి నిలబడ్డాడు. "నీకేమన్నా పిచ్చా?" వెర్రెక్కిపోయి అరిచాడు. మహతి ఖంగారుపడింది. బిత్తరచూపులు చూసింది. అతని ముఖంలోకి చూసింది. అతని ముఖంలో ఉద్రిక్తత- కళ్ళల్లో పిచ్చి ఆవేశం. పెదవులు వణుకుతున్నాయి. "నాకు తెలుసు, నువ్వూ ఆ శేషయ్యగాడితో కలిసిపోయి మాట్లాడుతున్నావు! అసలు వాడే నిన్ను ఇక్కడికి పంపించాడు" గోలగోలగా అరుస్తూ పెద్దపెద్ద అంగలతో పరశురాం గదికేసి నడిచాడు. బయటనుంచి కేకలువిని డాక్టర్ పరశురాం గదిలోనుంచి వచ్చాడు. అవతారాంభుజం తడుతూ అనునయంగా ఏదో చెబుతూలోపలకు తీసుకెళ్ళాడు. మహతికి ఇంకా అతని కేకలు బయటికి వినిపిస్తూనే ఉన్నాయ్. హాల్లో కూర్చున్న అందర్నీ పరిశీలనగా చూసింది. రోగులు ఇంతగొడవ జరుగుతున్నా తమదైన మరోలోకంలో ఉన్నారు. రోగులతోవచ్చిన వాళ్ళుమాత్రం తనకేసి చూస్తున్నారు. వాళ్ళుతనను జాలిగాచూడటం గమనించింది. వాళ్ళు తనకేసి జాలిగా చూస్తున్నారేం? తనను కూడా పిచ్చిదనుకుంటున్నారేమో? అవును? అలాగే అనుకుంటున్నట్టువాళ్ళ చూపులే చెప్తున్నాయి. ఆ చూపుల్లో కేవలం జాలేకాదు-ఏదో ఒక కుతూహలం కూడా ఉంది! "అమ్మగారూ! డాక్టరుగారు పిలుస్తున్నారు" బోయ్ వచ్చి చెప్పాడు. మహతి లోపలకువెళ్ళింది. బోయ్ యాంటీరూంకేసి చూపించాడు. పరశురాం కంఠం చిన్నగా బుజ్జగిస్తున్నట్టుగా విన్పిస్తూ ఉంది. అతను మంచంమీద వెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు. మహాతిని పరశురాం పక్క చైర్లో కూర్చోమని సైగ చేశాడు. "నువు గాఢ నిద్రలో ఉన్నావు. అయినా నా కంఠం మాత్రమే వింటున్నావు. నా మాటలు స్పష్టంగా వింటున్నావు. నువు గాఢనిద్రలో వున్నావు. గాఢనిద్రలో ఉన్నావు. ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం చెబుతావు..." "నీ పేరేమిటి?" "అవతారం" పరశురాం ముందుకు వంగాడు. "అవతారం!" "ఊఁ" "నీకు శేషయ్యంటే కోపం ఎందుకూ?" "వాడు దగుల్భాజీ, పాపిష్టివాడు. వాడంటేనాకు అసహ్యం" "అదే ఎందుకంటున్నాను?" పరశురాం కంఠం. మహతి కళ్ళు పెద్దవి చేసుకొని కుతూహలంగా చూడసాగింది.
"వాడు వడ్డీ వ్యాపారం చేసి లక్షలు సంపాదించాడు. ఎన్నో అన్యాయాలు చేశాడు. వడ్డీకి చక్రవడ్డీ కట్టేవాడు. ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేశాడు. ఆడవాళ్ళ పుస్తెలుకూడా తాకట్టు పెట్టుకొని వడ్డీకి డబ్బిచ్చేవాడు. ఒక్కటీ తిరిగిచ్చినపాపాన పోలేదు. గడువుఅయిపోయిందని అమ్మేసుకున్నాడు. తినే బొచ్చెలుకూడా కుదువపెట్టుకునేవాడు. ఎంతమందిని తాకట్టుపెట్టిన ఇళ్ళల్లో నుంచి బయటకు నెట్టాడో దుర్మార్గుడు. మీకు తెలవదు...." ఆగాడు అవతారం. "అవతారం- చెప్పు, శేషయ్య ఇంకా ఏం చేశాడు?" "ఆ పాపిష్టివాడ్ని తలుచుకుంటేనే నాకు అసహ్యం. నేనుచెప్పను" ఖచ్చితంగా విసుగ్గా అన్నాడు. మహతి పరశురాం ముఖంలోకి చూస్తూ "అంకుల్!" అని ఏదో అడగబోయింది. డాక్టర్ పరశురాం మాట్లాడవద్దని చేత్తో సైగ చేశాడు. "అవతారం!" "ఊ(" "శేషయ్య ఇంకా ఏం చేశాడోచెప్పు!". "వాడి వల్లనే ఆ మంగమ్మ పాపం ఆత్మహత్య చేసుకుంది. అది చచ్చివీడ్ని దయ్యమైపట్టింది. తెగపీడిస్తోంది. అయినా వాడికిబుద్ది రాలేదు. ఆ వడ్డీ పిచ్చి వదల్లేదు" మళ్ళీ మౌనం. "మంగమ్మ ఎవరూ?" "రామచంద్రయ్య పెళ్ళాం" "వాళ్ళిద్దర్నీ నేనెరుగను. నువు వివరంగా చెబితేగాని నాకు అర్ధం కాదు" అవతారం పెదవులుకదపలేదు. "చెప్పు అవతారం!" లాలనగా అడిగాడు పరశురాం. "రామచంద్రయ్యమంగమ్మ మొగుడు-పాపం-చాలా మంచివాడు" మళ్ళీ మౌనం.
"పూర్తిగా నీకు తెలిసింది చెప్పు. మంగమ్మ ఆత్మహత్య ఎందుకు చేసుకొంది?" "ఆ శేషయ్య వల్లే" "అదే పరంపరంగా ఆపకుండా నీకుతెలిసిందంతా చెప్పు" ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు డాక్టర్ పరశురాం. "రాంచంద్రయ్యమంచివాడు. అందువల్లే శేషయ్య దగ్గర అంతకాలం పనిచెయ్యగలిగాడు" "ఏం పని చేసేవాడు?" "శేషయ్య బియ్యం మిల్లులో గుమాస్తాగా చేసేవాడు. రాత్రిప్రొద్దు పోయే దాకాపద్దులు రాసేవాడు. ఒక రోజు రాత్రి పద్దులు రాస్తూ కూర్చున్న రామచంద్రయ్యమీద మిల్లు దూలం విరిగి పడింది. కొన ఊపిరితో ఉన్న రామచంద్రయ్యతో అతని కుటుంబానికి ఏలోటూ లేకుండా ఆదుకుంటానన్నాడు. మంగమ్మకు పదివేలరూపాయలు కాంపెన్ సేషన్ కింద ఇస్తానని నమ్మించాడు. అలా నమ్మించి అతనిచేతతనే దూలం ఎక్కిపడ్డానని మరణవాగ్మూలంఇప్పించాడు". "ఊ(, ఆ తర్వాత ఏమైంది?" "మంగమ్మ అమాయకురాలు పదివేలు ఆమెకు కాంపెన్ సేషన్ ఇస్తున్నట్టుగా చెప్పి కాగితం మీద వేలిముద్ర వేయించుకున్నాడు. ఆ పదివేలూ మంగమ్మ ఇల్లు తాకట్టు పెట్టివడ్డీకి తీసుకున్నట్టుపత్రంలో రాశాడు. మంగమ్మ పెద్దకొడుకు పన్నెండేళ్ళ ఆంజనేయుల్ను మిల్లులో పనికి పెట్టుకున్నాడు. మంగమ్మ భర్త మరణంతో క్రుంగిపోయింది. పైగా క్షయవ్యాధికి గురయింది. ఆంజనేయులు కాకఇద్దరు ఆడపిల్ల లున్నారు. ఇద్దరూ ఆంజనేయులుకంటే చిన్నవాళ్ళు పెద్దదానికి ఏడేళ్ళు. చిన్నదానికి రెండెళ్ళిమూడు వచ్చింది. కూర్చుని తింటే కొండలైనాకరిగిపోతాయి. సంవత్సరం ఊరుకుని ఆ తర్వాత మంగమ్మ ను వడ్డీ కట్టమని పీడించడం మొదలుపెట్టాడు. బ్యాంకులో వున్న ఆ కొద్దిపాటి డబ్బునూ వడ్డీకింద కట్టించుకున్నాడు. మంగమ్మకు కూడా మిల్లులో కూలిపని యిచ్చాడు. రెండేళ్ళు తిరక్కుండానే మంగమ్మ రెండు గదుల ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు. మంగమ్మ కాళ్ళావేళ్ళాపడి వాపోయింది. అప్పుడు తప్పుడు గాడిద కొడుకు ఏమన్నాడంటే...." ఠక్కున నోరుమూసుకున్నాడు అవతారం. "ఆ( చెప్పు అవతారం. ఏమన్నాడేమిటి?" "మంగమ్మ! నేను చేసిన అన్యాయం ఏమిటో చెప్పు? వడ్డీకిందనీ ఇల్లు వశం చేసుకున్నాను. ఇంకా అసలు అలాగే వుంది. అయినా నీ భర్త రామచంద్రయ్యమీద ఉన్న గౌరవంతో మాఫీ చేసేస్తున్నాను. ఇక నుంచి నీ సంపాదనలో నుంచిగాని, నీ కొడుకు సంపాదనలోంచి గాని వడ్డీ కింద ఇరగ్గోసుకోవడం మానెయ్యదలుచుకున్నాను. ఇంతకంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు!". అవతారం మళ్ళీ మౌనం వహించాడు. "అని అన్నాడా? ఎంత అన్యాయం? ఊ, తర్వాత ఏమైంది!" డాక్టరు పరశురాం అవతారం నుంచి విషయం రాబట్టుకోవడానికి అనునయంగా అడిగాడు. "ఆ తర్వాత పాపం మంగమ్మ ఏమైంది?" పరశురాం అడిగాడు. "మంగమ్మకు జబ్బు ఎక్కువైంది. మంచం ఎక్కింది. పెద్దవాడు శేషయ్య దగ్గిర పని మానేసి చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మంగమ్మ బతకలేకచిన్నపిల్లలిద్దర్నీ ముందు బావిలో పడేసి ఆ తర్వాత తను దూకింది. బతికుండి సాధించలేని మంగమ్మ చచ్చిదెయ్యమై శేషయ్యను పట్టిపీడించసాగింది. అయినా వాడికి బుద్ది వచ్చిందా? అందుకే అంటారు పుట్టుకతోపుట్టిన బుద్ది పుడకలతోగాని పోదని. ఇప్పుడు వాడు నా వెంటపడ్డాడు" అనేసి మౌనం వహించాడు అవతారం. "అంకుల్! ఇంతకుముందు వడ్డీ కావాలనేవాడుగా?" "అతను శేషయ్య. ఏంచెబుతాడో వింటావా?" మహతి అయోమయంగా చూసింది.