Previous Page Next Page 
రాగహేల పేజి 24

    నేను దిగి కిరణ్ ను లోపలకు ఆహ్వానించాను. 'ఇప్పుడు కాదు' అంటూ వెళ్ళి స్టీరింగ్ ముందు కూర్చొని కారు స్టార్టు చేశాడు. నాకు మరోమాట మాట్లాడేందుకు అవకాశం కూడా దొరకలేదు". "గుడ్ ప్రోగ్రెస్!" మహతి పరశురాంముఖంలోకి విసుగ్గా చూసింది. "ఆ అవకాశం కోసమే నే ఎదురుచూస్తున్నాను. వాళ్ళిద్దరికీ పరిచయం అయి 48 గంటలుదాటలేదు. అనుకున్న దానికంటే ఎక్కువ ప్రోగ్రెసే ఉంది. ఐ యామ్ గ్లాడ్!" "ఇద్దరికీ పరిచయంఅయిందా" ఆశ్చర్యంలో తలమునకలైపోతూ ప్రశ్నించింది. "అవును!" తాపీగా అన్నాడు ప్రొఫెసర్ పరశురాం. "ఎప్పుడూ, ఎక్కడా?" ఇనుమడించిన ఆశ్చర్యంతో అడిగింది మహతి. "ఇంకెక్కడ, ఇక్కడే!" మహతి విస్మయంగా చూసింది. "మొన్న డీప్ స్లీప్ లోకి వెళ్ళినపుడు పరిచయం చేశాను" మహతి అయోమయంగా చూసింది. "ఇంతవరకూ ఒకరికొకరు తెలియకుండా ఉన్నారు?" "కిరణ్ కు తెలుసు అంకుల్! రవి అంటే తగని ఈర్ష్య అని చెప్పానుగా!" "ఆ తెలియడంవేరు" "అంటే!" "ఇప్పుడు వాళ్ళు తమఉనికిని తెలుసుకున్నారు" "ఏమిటో అంకుల్, నాకంతా అయోమయంగా ఉంది" ఓ క్షణం ఆగి పైపు చేతిలోకి తీసుకొని పొగాకు దట్టిస్తూ అన్నాడు. "ఒకళ్ళ కొకళ్ళు పరిచయం అయ్యాక కొంతకాలం ఎడమొహం పెడమొహంగా ఉంటారనుకొన్నాను. కాని వాళ్ళు ఒకరి తర్వాతమరొకరు వస్తున్నారు. ఒకరు వదిలేసిన పనిని మరొకరు పూర్తి చెయ్యడానికి సంసిద్దమై వస్తున్నారు. వెరీగుడ్ సిస్టమ్" "నాకు మీ మాటలు అర్ధంకావడం లేదు అంకుల్" "ఇద్దరూ కన్ ఫెంట్ అయితే వైలెంట్ గా తయారవుతారనిభయపడ్డాను. థ్యాంక్స్ గాడ్! ఇక భయంలేదు. దారిలో పెట్టవచ్చనే నమ్మకం ఏర్పడింది" అని పైపు వెలిగించుకోవడంలో నిమగ్నుడైనాడు పరశురాం.
   మహతికి జుట్టుపీక్కోవాలనిపించింది. "నేను చెప్పింది అర్ధం కాలేదా బేబీ?" మహతి తలఅడ్డంగా తిప్పింది. "డిస్కోడ్యాన్సు గురించి ఎనలైజ్ చేసి చెబుతాను, విను. అప్పుడు నీకు విషయం అర్ధం అవుతుంది". "చెప్పండి అంకుల్" ఇంక ఎంతమాత్రం ఆలస్యాన్ని భరించలేనట్టుగా అంది. "రవి నిన్ను డిస్కోడ్యాన్సు క్లబ్బుకు తీసుకెళ్ళడం అనూహ్యం. అవునా?" "అవును అంకుల్! తీసుకెళ్ళడం--పైగా డ్యాన్సు చెయ్యడం....అంత మార్పు అతనిలోరావడం అపూర్వం అంకుల్". "రవికి కిరణ్ ను వెనక్కు నెట్టేయాలనేభావం కలిగింది. ఆ ప్రయత్నంలోనే నిన్ను డిస్కో డ్యాన్సుకు తీసుకెళ్ళాడు. అది అతనిలో వస్తున్న మార్పును సూచిస్తున్నది". "బాత్ రూం కెళ్ళే మిషతో ఎందుకు జారుకున్నాడు?" "రవి స్వభావం అదికాదు. డిస్కో డ్యాన్సు వల్ల కలిగే ఉద్రిక్తతను అతడు తట్టుకోలేక పోయాడు. అందుకే చిన్నగా జారుకున్నాడు" పైపు దమ్ములాగి పొగవదిలాడు. "చెప్పండి అంకుల్!" "వెరీ సింపుల్ అతడు జారుకోగానే కిరణ్ వచ్చాడు. కిరణ్ ఉద్రిక్త స్వభావానికి డిస్కో డ్యాన్స్ సరిపోతుంది. అందుకే ఉత్సాహంగా డాన్సు చేశాడు. నువుచూసినా నిర్లిప్తతకు అతనికి చిరాకు కలిగింది. కోపం కూడా వచ్చింది. రవితో అంతసేపు డ్యాన్సు చేసిన నువుతనతో ఎక్కువసేపు నిలబడలేకపోవడం అతనిలో అసూయ తలెత్తటానికి కారణమయింది. ఇలాంటి మార్పు నేను కోరుకున్నదే కాని...." "చెప్పండి అంకుల్!" "ఈ సమయంలో నువు చాలా ధైర్యంగా ఉండాలి" "ఇలాగే ఇంకా కొన్ని సంఘటనలు జరుగుతాయంటారా?" "అలాగే జరిగితే నిన్ను హెచ్చరించాల్సిన అవసరం లేదు" "మరి?" "ఇక జరగబోయే సంఘటనలు ఇంతకంటే జఠిలంగా ఉండొచ్చు. వింతగా కూడా ఉండొచ్చు" "అంకుల్!" మహతి ముఖంలో భయం, కంఠంలో ఖంగారు. "అందుకే నిన్ను ధైర్యంగా ఉండాలన్నాను. కిరణ్ కంటే రవితో డీల్ చెయ్యడమే కష్టం కావచ్చు. స్తబ్దంగా ఉండే రవిలో కదలిక ప్రారంభం అయింది. కిరణ్ ను ఎదుర్కోవడానికి సిద్దమౌతున్నాడు" "నాకు భయంగా ఉంది అంకుల్. కిరణ్ లోని ఉద్రిక్తతను తట్టుకోగలను. కాని రవిలో అలాంటి గుణం చూసినప్పుడు సంతోషంతో పాటు భయంకలుగుతోంది" "అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను. రవిని నిరుత్సాహపరచకు. అతనిలోని మార్పును ప్రోత్సహించు" "కిరణ్ స్వభావం నాకు తెలుసు. ఎదురు తిరిగి రవిని అణచడానికి ప్రయత్నిస్తాడేమో!" "రవి తక్కువవాడు కాదు. రవి ఒక పట్టాన కిరణ్ కు లొంగిపోడు. నువ్వే చూస్తావుగా?"
      ఫోన్ ఎత్తిన మహతి క్షణకాలం విస్మయంగా ఉండిపోయింది. "హల్లో! హల్లో!" "హల్లో!" విస్మయంనుంచి కోలుకోకుండానే అంది చిన్నగా. "నేను రవిని మాట్లాడుతున్నాను" "చెప్పు!" "వాడొచ్చాడా" "ఎవరూ?" "ఇంకెవరు, ఆ రాస్కెల్" గొంతు తీవ్రంగా వుంది. మహతి త్రుళ్ళిపడింది. ఏదో అనబోయింది. గొంతుపెగల్లేదు. "మాట్లాడవేం మహతీ, ఆ రాస్కెల్ గాడొచ్చాడా?" మహతికి ఎం చెప్పాలో తోచక తికమక పడింది. "చెప్పవేం?" రెట్టించాడు రవి. "ఎవరిగురించి అడుగుతున్నావు?" "అర్ధం కాలేదా" మధ్యలోనే అందుకున్నాడు. మహతి మాట్లాడలేదు. "వాడే! ఆ కిరణ్ గాడు వచ్చాడా అని అడుగుతున్నాను" "రా......రా.......లేదు" "నే వస్తున్నా" అనేసి ఠక్కున ఫోన్ పెట్టేశాడు. బాబోయ్ రవి ఏమిటి ఇలా తయారౌతున్నాడు? తను రవిలో మార్పునుకోరుకుంది. కాని కిరణ్ లాగే ప్రవర్తిస్తున్నాడు కొంచెం అటూ ఇటూగా! ప్రొఫెసర్ పరశురాం మాటలు గుర్తొచ్చాయి. తను ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదు. రవి ఉద్రేకంగా వున్నాడు. ఎక్కడికి రమ్మంటాడో? కిరణ్ గురించి ప్రశ్నలు వేస్తాడేమో? రవికి వీణ అంటే ఇష్టం. అతను వచ్చేసరికి తను వీణ వాయిస్తూ వుంటే సరి. అన్ని ఉద్రేకలకూ ఆనకట్టపడిపోతుంది. మహతి వీణచేతిలోకి తీసుకుంది. శృతి చేస్తుండగాకారు ఆగిన శబ్దం వినిపించింది. అరె ఇంత త్వరగా వచ్చేశాడా? అంటే కారు డ్రైవింగ్ లో కూడా కిరణ్ ను అనుసరిస్తున్నాడన్న మాట. అతడు లోపలకు వచ్చాడు. "కమాన్ హర్రీ అప్" అన్నాడు కారు కీ చైన్ ను చూపుడు వేలుతో గాలిలో తిప్పుతున్నాడు. మహతి రవిని కొత్త వ్యక్తిని చూసినట్టుగా చూడసాగింది. "ఏమిటి మహతీ, అలా చూస్తావ్? బయలుదేరు" "ఎక్కడికి?" వీణ శృతిచేస్తూ అడిగింది. "అలా బయటికెళ్దాం. లే, త్వరగా" అంటూ మహతి చేతిలోకి వీణను తీసి పక్కకు పెట్టాడు. మహతి రవిముఖంలోకి వెర్రిదానిలా చూసింది. ఇతను రవేనా? వీణానాదం వింటూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయే రవి తనచేతిలోని వీణను పక్కకు లాగేయడమా? "ఆ రాస్కెల్ గాడికోసం ఎదురు చూస్తున్నావా?" "లేదు నీ కోసమే చూస్తున్నాను" అంది మహతి. "నిజంగానా?" "నిజంగానే అందుకే వీణవాయిస్తూ కూర్చున్నాను. నీకు వీణ అంటే ఇష్టంగా? అందుకే" ఆగి రవి ముఖంలోకి వచ్చే మార్పుకోసం చూసింది. ఆమె ఆశించిన విధంగానే అతని ముఖంలో అంతవరకూ కన్పించిన ఉద్రిక్తత కొంతతగ్గింది. "వాడికి వీణంటే ఇష్టం లేదు కదూ" "ఇప్పుడు నువ్వు చేసిన పనేమిటి?" ఎదురు ప్రశ్నవేసింది మహతి. అతడి ముఖంలో కలవరపాటు కన్పించింది. ఓ క్షణం వీణను చూస్తూ నిల్చున్నాడు. మౌనంగా వెళ్లి వీణను ఎత్తి మహతికి అందించాడు. మహతి ఉత్సహంగా వీణ వాయించసాగింది. వీణ వాయిస్తూ ఉన్నా ఆమె దృష్టి అతడి మీదే లగ్నమయింది. అతడు వీణ వినడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని అంతకుముందు అతనిలో కన్పించే తన్మయత్వం ఇప్పుదు లేదు. ఆ ఏకాగ్రతకూడా లేదు. ముళ్ళమీద కూర్చున్నట్టుగా అశాంతిగా కన్పించాడు. మహతి వీణపక్కకు పెట్టింది. "ఆపావేం మహతీ?" "నీకు వినాలని లేదుగా?" "అలా అని నేనన్నానా?" "అలానా! నీ ముఖం చూస్తే తెలుస్తూనే ఉంది" అతను సమాధానం ఇవలేదు. "బయటికి వెళదామా?" మహతి మృదువుగా అడిగింది. "ఎక్కడికి వెళ్దాం" ఉత్సాహంగా లేచి నిల్చున్నాడు. "అంకుల్ దగ్గరకు" "ఆ సైక్రియాటిస్టు దగ్గరకా" మహతి తలఊపింది. "అతని దగ్గరకెందుకూ?" "అంకుల్ నిన్నొకసారి తీసుకురమ్మన్నాడు" "ఎందుకూ?" "ఏమో! నేను అడగలేదు" ఓ క్షణం ఆలోచించి "సరే పద" అంటూ బయటకు నడిచాడు.

 Previous Page Next Page