Previous Page Next Page 
రాగహేల పేజి 23

    "అంకుల్!" అప్పుడే టిఫిన్ చేసి, పైపు అంటించుకొంటున్న ప్రొఫెసర్ తలెత్తిచూశాడు. "వసూ! మహతివచ్చింది. టిఫిన్ తీసుకురా" వంటగది వైపుకు చూస్తూ కేక పెట్టాడు. "ఆ( వస్తున్నా...." "వద్దు అంకుల్. ఇప్పుడేచేసి వస్తున్నా" "నీ ముఖం చూస్తే టిఫిన్ చేసినట్టుగా లేదు. పైగా రాత్రంతా నిద్ర పోయినట్టుగా లేదు" వసుంధర టిఫెన్ ప్లేటుతో వచ్చింది. "ఏవమ్మా మహతీ! ఈ మధ్య కనిపించడం లేదు" అంది వసుంధర. "ఆంటీ! అంకుల్ మతిమరుపు మీకూ వస్తున్నట్టుంది!" ప్రొఫెసర్ నవ్వుతూ "అదీఅలా అడుగు. నేనూ అదే అంటున్నాను" అన్నాడు. "చాల్లే ఊరుకోండి. నాకేం మతిమరుపు లేదు" "ఆంటీ! నేను మొన్నసాయంత్రం వచ్చిందా?" "సారీ ఆంటీ! నాదే పొరపాటు. అంకుల్ తో మాట్లాడివెళ్ళి పోయాను. లోపలకు రాలేదు" "చూశారా! మీ మతిమరుపు మహతికి కూడా వస్తోంది" "అవునవును!" "ఏమిటీ అవునవును?" "అదే వసూ! మహతి మతిమరుపు" "ఇంక చాల్లే ఊరుకోండి. మతిలేని మాటలూమీరూను...." "దారుణం.... మరీ దారుణంగా మాట్లాడుతున్నారు ఆంటీ! అంకుల్ మతిపోయినవాళ్ళకు..." "సార్, శేషావతారం వచ్చాడు. అల్లరి చేస్తున్నాడు" బాయ్ వచ్చి చెప్పాడు. "వస్తున్నా!" ప్రొఫెసర్ లేచి నిల్చున్నాడు. "శేషావతారం అంటే వడ్డీ--అసలు..అతనేకదా అంకుల్" "అవునవును నువుటిఫిన్ చేసివచ్చెయ్" అనిచెప్పి పరశురాం వెళ్ళిపోయాడు. "వడ్డీ-అసలు-----ఏమిటి మహతీ!" వసుంధర అడిగింది. "భలే కేసు ఆంటీ!" అంటూ శేషావతారం గురించి చెప్పింది మహతి. "నర్సమ్మ కోడలు ఎలా ఉంది ఆంటీ?" "ఈ మధ్య కొంత మెరుగ్గానే ఉందట" మహతి కాఫీతాగి పరశురాం గది దగ్గరకు వచ్చింది. గడపలోనే ఆగిపోయింది, బయటకువస్తున్న శేషావతారాన్ని చూస్తూ. "రా! మహతీ! అక్కడే నిలబడిపోయావేం?" మహతి లోపలకు వెళ్ళిపరశురాం ఎదురుగా కూర్చుంది. "చెప్పు మహతీ! ఎందుకలా ఉన్నావ్? నువు ఊహించని మార్పు అతడిలో కన్పించిందా?" "అవును అంకుల్, రాత్రి డిస్కో డ్యాన్సు  క్లబ్ కు రమ్మన్నాడు" "అంతకు ముందుకూడా ఒకటి రెండుసార్లు వెళ్ళావనుకుంటాను" "కిరణ్ తో వెళ్ళాను" "రాత్రి?" "రవి డిస్కో డ్యాన్సుకు వెళ్దాం బయలుదేరమన్నాడు లోపలకు వస్తూనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అతనిలో వచ్చిన మార్పు చూసి..." "నువు కోరుకున్నదదేగా మహతీ?" "అవును అంకుల్. రవి అలాఅడగడం నాకు సంతోషాన్ని కలిగించింది.    
    అయినా చూద్దామని ఇప్పుడు క్లబ్ కేమిటి? వీణ వాయిస్తా" నన్నాను. "అందుకు ఒప్పుకున్నాడా?" "లేదు. ఒకప్పుడు వీణ వాయిస్తుంటే గంటలు గంటలు మంత్రించి నట్టుగా కూర్చుండిపోయేవాడు. ఒకోసారి నాకు చాలా విసుగ్గా అనిపించేది. ఏడుపొచ్చినంత పనయ్యేది. నాకువంట్లో బాగాలేదన్నా, మనసు బాగాలేదన్నా కూడా వదిలేవాడుకాదు. మరీ నేను మొండికేస్తేవీణను చూస్తూ మాటాపలుకూలేకుండా కూర్చుండిపోయేవాడు. అలాంటివాడు...." ఆగిప్రొఫెసర్ ముఖంలోకి చూసింది. "యస్, ప్రొసీడ్" "ఇప్పుడా? వీణా? వద్దు మహతీ! క్లబ్బుకు వెళ్దాం బయలుదేరు అంటూ ఒకటే తొందరపెట్టాడు" "గుడ్! కిక్ ప్రోగ్రెస్!" "నాకూ అలాగే అన్పించింది అంకుల్. కాని..." "కానీ.....ఊ(చెప్పు!" "ఆ సంతృప్తి ఎంతోసేపు మిగల్లేదు" "ఏమైంది?" "ఎంతో ఉత్సాహంగా క్లబ్బుకు తీసుకెళ్ళాడు. డాన్స్ కూడా చేస్తుంటేనాకు చాలా ఆశ్చర్యం వేసింది. రవిలో సాధారణంగా కన్పించేబిడియం లేదు. స్తబ్దత లేదు. అలా ఉత్సాహంగా ఉన్నారని చూస్తుంటే నాకు పట్టలేని ఆనందం కలిగింది. డ్యాన్స్ చేస్తూ ఎవరో మీట నొక్కినట్టు అకస్మాత్తుగా ఆగిపోయాడు. బాత్ రూంకు వెళ్ళొస్తానని వెళ్ళాడు" అని ఆగి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంది. "ప్రొసీడ్ బేబీ!" "కొద్ది నిముషాల్లోనే కిరణ్ వచ్చాడు. అసలే దూకుడుగా ఉంటాడు. రాత్రి మరీ దూకుడుగా ఉన్నాడు. నాతో ఒక్కమాట కొదొఆ మాట్లాడకుండా చెయ్యి పట్టుకుని లాగి డ్యాన్సు ప్రారంభించాడు. అంతవేగం నేను తట్టుకోలేకపోయాను. పైగా అనుకోకుండా కిరణ్ రావడంతో నాకుమతిపోయినట్టుగా అయింది" "మరి ఆ తర్వాత రవి రానేలేదా!" "లేదు అంకుల్. అలాచెప్పాపెట్టకుండా ఎందుకు జారిపోయాడో, అంత అకస్మాత్తుగా కిరణ్ ఎలా వచ్చాడో నాకుఅర్ధం కావడం లేదు అంకుల్" మహతి పరశురాం ముఖంలోకి ఆతృతగా చూస్తూ అన్నది. "ఐ సీ!" "నాకేదో భయంగా ఉంది అంకుల్!" "భయమా, ఎందుకూ? నువు కోరుకుంది వాళ్ళల్లో మార్పు రావాలనేగా?" "అదికాదు అంకుల్!"    
    "జోరుగా డ్యాన్సు ప్రారంభించాడు రవి....." "రవి కాదు  కిరణ్!" "యస్. యస్. కిరణ్! ఎంత సేపు నీతో డ్యాన్సు చేశాడు?" "కిరణ్ తో నేను డ్యాన్సు చెయ్యలేనన్నాను. అలసటగా ఉంది అన్నాను. నేను కూర్చుని చూస్తాననీ, మరెవరి తోనైనా చెయ్యమనీ అన్నాను...." "అందుకు కిరణ్ అంగీకరించాడా?" "లేదు. కోపంతో రెచ్చిపోయినన్ను వదిలేశాడు. వాడితో అయితే ఎంతసేపయినా చేస్తావా? నాకు తెలుసు నీకు ఆ స్నీకి బాస్టర్డు అంటేనే ఇష్టం అంటూ బయటికి నడిచాడు. నేనుకూడా అతన్ని అనుసరించాను. అప్పటికే కారు స్టార్టు చేశాడు" "నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా?" అడిగాడు పరశురాం. "నేను బయటికిరావడం ఆలస్యం అయితేవెళ్ళిపోయేవాడేనేమో!" "నువు పొరపాటు పడుతున్నావ్. అలా ఛస్తే వెళ్ళడు. అతని స్వభావం అదికాదు. ఊ( తర్వాత?" "తను వంగి రెండోవైపు డోర్ తెరిచాడు. నేనుకూర్చోగానే చాలా విసురుగా వేశాడు. అంతే అంకుల్! ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కారు ఎంత స్పీడుగా నడిపాడనుకొన్నారు? కారు ఇంటి గేటు ముందు ఆగింది. అతను దిగి డోర్ తెరిచాడు. ఆ మర్యాదమాత్రం మర్చిపోలేదు. రవిలో లేని ఇలాంటికొన్ని మంచి అలవాట్లు కిరణ్ లో ఉన్నాయి.

 Previous Page Next Page