సంతానం ఎప్పుడు బయటికి వస్తాడా అని ఆతృతగా చూస్తున్న మహతి లేచి కన్ సల్టింగ్ రూంలోకి వెళ్ళింది. "హల్లో! రా బేబీ" అక్కడ పరశురాం ఒక్కడే వుండడంచూసి ఆశ్చర్యపోయింది మహతి. సంతానం ఆ కుర్రాడు కూడా లోపల వున్నాడని చెప్పాడే? "కూర్చో మహతీ అలా నిలబడిపోయావేం?" "అంకుల్?" "ఊ( చెప్పు. ఏమిటి?" "అతడు...." "వచ్చాడు" "వచ్చాడు? మరెప్పుడువెళ్ళిపోయాడు?" "వెళ్ళిపోలేదు" డాక్టర్ ముఖంలోకి అయోమయంగా చూసింది. "ఇక్కడే వున్నాడు. యాంటీ రూంలో వున్నాడు" మహతి యాంటీరూంకేసి వెళ్ళబోయింది. "ఆగు మహతీ" పరశురాం ఆమెను ఆపాడు. మహతి ఆగి పరశురాంను చూసింది. "డీప్ స్లీప్ లో వున్నాడు" "డీప్ స్లీప్ లోనా?" ఆశ్చర్యంగా అడిగింది. "ఇలా వచ్చి కూర్చో" మహతి కూర్చుంది ఏదో అడగాలని వుంది. కాని అడగలేక పోతున్నది. "ఏమిటో అడగాలనుకుంటున్నావ్ కదూ. అడుగమ్మా సందేహం ఎందుకు?" "ఆ లోపల వుంది...." ఆగి పరశురాం ముఖంలోకి చూసింది. "ఊ( ప్రొసీడ్" ఆరిపోయిన పైపును బల్లమీద కొట్టాడు. "ఏ....ఎవరు?" "అంటే?" "అదే అంకుల్. లోపలుంది ఎవరు? రవా? కిరణా?" "నువు చెప్పలేవా?" మహతి సమాధానం ఇవ్వలేదు. "ఆలోచించు" "కిరణ్" "కాదు" "రవి" "కాదు" "ఇద్దరూ కాదా? మరెవరూ?" పరశురాం లేచి వచ్చి మహతి భుజంతడుతూ "ఏమిటి అలా అయిపోయావ్ మహతీ. కంగారేమీ లేదు. నేనుచెప్పేది శ్రద్దగా విను." అన్నాడు. మహతి తలవూపింది.
"దేవయాని వల్లమనకు మంచేజరిగింది" మహతి పరశురాంముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూసింది. "ఆమెను హిప్నటైజ్ చేస్తూ అతడ్ని కూడా ఇన్ వాల్ చేశాను. అతనికి తెలియకుండానే హిప్నటిక్ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు. డీప్ స్లీప్ లోకి పంపించాను. అతడిని ఎలా లొంగదీసుకోవడమా అని ఇంతకాలం ఆలోచిస్తూనే వున్నాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను" ఆగి మహతిని చూశాడు. "ఆ తర్వాత ఏం జరిగింది అంకుల్. దేవయానికూడా డీప్ స్లీప్ లోకి వెళ్ళిందా?" "అవును ఆమెను డీప్ స్లీప్ లోకి పంపించి సజెషన్ ఇచ్చాను" "ఏమని? సంతానం ఆమెకు తండ్రి అవుతాడనా?" పరశురాం పకపక నవ్వాడు. "కాదు. తను భర్తగా భావిస్తున్న అతడు ఆమె భర్తకాదనీ, అన్నా అనీ!" "అంకుల్ క్షమించండి, మధ్యలో మాట్లాడుతున్నందుకు. అసలు దేవయానికి అతడే తన భర్త అనే ఆలోచన ఎందుకొచ్చిందంటారు?" "ఆమెను అతడు ప్రొటెక్టు చేశాడు. దుండగులబారినుండి కాపాడాడు. మతిచెదిరేముందు ఆమె అతడ్నే చూసింది. ఆ వయసులో ఉన్న కుర్రవాడే అన్నీ సవ్యంగా జరిగితేదేవయాని లాంటి యువతికి భర్త అవుతాడు. ఆ కారణంగానే ఆమె అతడ్ని భర్తగా భావించసాగింది. రక్షణ ఇచ్చేవాడు భర్తేకానక్కర్లేదనీ అన్నకూడా కావచ్చుననీ సజెస్టు చేశాను. ఆ తర్వాత హిప్నటిక్ స్లీప్ నుండి లేపాను. ఆమె సంతృప్తిగా వెళ్ళిపోయింది".
"అయితే సంతానాన్ని నాన్నా అని ఎందుకు పిలుస్తోంది?" పరశురాం ముఖంలోకి చూస్తూ అడిగింది. "నేను అలాంటి సజెషన్ ఇచ్చి ఉంటానని కదూ నీ అనుమానం?" "ఏ సజెషన్ లేకుండానే భర్తను తండ్రి అని ఎందుకనుకుంటోంది!" సందేహాన్ని వెలిబుచ్చింది. "ఆమె అంతవరకు భర్తగా అనుకొన్న వాడ్ని అన్నగా భావించసాగింది. ఇకపోతే సంతానం మిగిలాడు. వయసులో తండ్రిలా ఉన్నాడు. రక్షణ నిస్తున్నాడు. అందువల్లనే సంతానాన్ని ఆమె తండ్రిగా భావిస్తున్నది" "ఓ మైగాడ్! ఎంత లాజిక్?" మహతి ఆశ్చర్యంగా అన్నది. "మానసికంగా దెబ్బతిన్న వాళ్ళకు బొత్తిగా లాజిక్ ఉండదనుకోకు. వాళ్ళ లాజిక్ వాళ్ళకుంటుంది" "పాపం! మరి సంతానం..." "ఆమె సంతానాన్ని తండ్రిగా అనుకోవడం ఆమెకూ అతనికీకూడా మంచిదే. క్రమంగా ఆమెను ఆ భ్రమలో నుంచి బయట పడెయ్యొచ్చు" "అంకుల్...." ఒక్కసారిగా అరిచినట్టే అందామె. "ఏమిటి మహతీ!" "అసలు సంగతి మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాం" "అసలు సంగతా! ఏమిటి?" "అంకుల్, నేనీ సస్పెన్సు భరించలేను. చెప్పండి అంకుల్. ఆ లోపలున్నది ఎవరు?" ఆతృతగా అడిగింది.
"నువు చెప్పలేవుగదూ?" "రవి కాదన్నారు. కిరణ్ కూడా కాదన్నారు. ఇంకేం చెప్పమంటారు అంకుల్? నన్ను సస్పెన్స్ తో చంపక చెప్పండి అంకుల్?" ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది. "రవి కిరణ్!" ప్రొఫెసర్ కంఠం గంభీరంగా పలికింది. చివ్వున తలెత్తిచూసింది మహతి. "రవి కిరణా? అతడెవరు?" "నీకు తెలిసినంతవరకు---- నువు చెప్పేదినిజమే. నీకు ఆ ఇద్దరుమాత్రమే తెలుసు. మూడో వ్యక్తి నీకుతెలియదు. అతడ్ని నువు చూడలేదు" "మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడంలేదు అంకుల్" "నో!నో! నువ్వంతగా అప్ సెట్ అవద్దు. రాలోపలకు ఆ మూడో వ్యక్తిని చూపిస్తాను" పరశురాం యాంటీరూంకేసి దారితీశాడు. మహతి అతడ్ని అనుసరించింది. మంచం మీద గాఢనిద్రలో ఉన్న అతడ్నిచూసింది. మంత్రముగ్ధలా కనురెప్పలు వెయ్యడంకూడా మర్చిపోయి చూస్తూనిల్చుండిపోయింది.