"జ్వరం వచ్చిందటగా, ఇప్పుడెలా వుంది?" గొంతునిండా ప్రేమని నింపుకుని అడిగాడు.
"తగ్గిందిగా! బాగానే వుంది" పొడిగా అంది.
"నీకు జ్వరం వస్తే ఏం చేస్తావు చాయా?" ఆమె అరచేతిలో తన చెయ్యివేసి రాస్తూ అడిగాడు కిరణ్.
"పడుకుంటాను. వార్డెన్ ఏదో మాత్ర ఇస్తే మింగి పడుకుంటాను."
"అప్పుడు నీకు ఎవరైనా నీ పక్కన వుండాలనీ, దాహం వేస్తే నీళ్ళు అందించేందుకైనా ఎవరైనా తోడుండాలనీ అనిపించదా?" ఆమె కళ్ళల్లోకి ఏదో శోధిస్తున్న వాడిలా చూస్తూ అడిగాడు కిరణ్.
భూమిమీదపది 'కేర్' మనగానే ఆప్యాయంగా గుండెలకి అదుముకుని నోటికి రొమ్ము అదించడానికీ, కడుపులో ఆకలి నోటితో చెప్పకుండానే పసిగట్టి తీర్చడానికీ, ఈ లోకంలో తన ప్రతినిదిగా ఆ దేవుడు సృష్టించిన మాతృమూర్తి విలువ చాయకి తెలియదు. అమ్మ ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా ఆలోచిస్తుందో కూడా ఆమె ఊహకి అందని విషయం.
కిరణ్ చాయ తలమీద చెయ్యివేసి నిమురుతూ- "చాయా! జీవితంలో నీవింకా ఇప్పుడే అడుగుపెడుతున్నావు. నెమ్మదిమీద ఇప్పుడు అర్ధంకానివన్నీ అర్ధం అవుతాయి" అన్నాడు.
చాయ అతని చేతిని గట్టిగా పట్టుకుని- "కిరణ్! నీకు జేసీ తెలుసా? పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ట కదా" అంది.
కిరణ్ ఓ క్షణం ఆలోచనగా చూసి "తెలుసు, ఏం?" అన్నాడు.
"తెలుసా?" చాయ ముఖం విప్పారింది.
"చాలా గొప్పవాడటగా?"
"కోటీశ్వరుడు. ఎందుకూ?" అడిగాడు కిరణ్.
"అతనే....అతనే నాకు నిన్న లిఫ్ట్ ఇచ్చింది" మెరుస్తున్న కళ్ళతో చెప్పింది చాయ.
కిరణ్ చెయ్యి ఆమె చేతిలోంచి జారిపోయింది. అతని మనసు ఎందుకో చేదు తిన్నట్లుగా మారిపోయింది. ఆ కళ్ళల్లో కనిపించే ఆ మెరుపు అతనిని నిలువునా కాలుస్తున్న అనుభూతి మిగిల్చింది.
"అతని కారు ఎంత బాగుందో తెలుసా?"
"చాలా ఆలస్యం అవుతోంది. పోదామా?" అసహనంగా అడిగాడు కిరణ్.
"చెప్పనీ! సెల్యులర్ ఫోన్ కూడా వుంది. అలాంటి కారులో నరకానికి కూడా నవ్వుతూ వెళ్ళిపోవచ్చు తెలుసా?"
"పద చాయా" అతను విసుగ్గా లేచి నిలబడుతూ అన్నాడు.
"అతను చాలా రిచ్ మాత్రమే కాదు, హేండ్సమ్ కూడా" అంది చాయ.
కిరణ్ కి గుండెల్లో మంట పెట్టినట్లయింది. ఆమెమీద కోపానికి బదులు అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. 'ఎంత దురదృష్టవంతుడిని నేను. నీ నుంచి ఒక్క బాధ పెట్టని జ్ఞానపం కూడా పొందలేకపోతున్నాను" అనుకున్నాడు.
"నీ కారు పాత ఇనుపసామాన్లు కొనుక్కునేవాడొస్తే వేసేసి.....అటువంటి కారు కొనుక్కోకూడదూ" అని గలగల నవ్వింది చాయ.
ఆ నవ్వు అతని గుండెల్లో రేగిన మంటని జ్వాలగా మార్చింది.
ఆమెని ఏమనడానికి సాహసంలేనివాడిగా అతను తల వంచుకుని నడిచాడు.
చాయ దారి పొడవునా జేసీ గొప్పతనం గురించి చెబుతూనే వుంది.
* * *
చాలాసేపట్నుంచీ చాయ సంధ్యనే గమనిస్తోంది.
సంధ్య చాలా నమ్రతగా నికబడి మాట్లాడుతోంది ప్రిన్సిపాల్ తో.
ప్రిన్సిపాల్ ఇంకా ఒద్దికగా మొహంపెట్టి మాట్లాడుతోంది సంధ్యతో.
"డాడీతో అపాయింట్ మెంట్ కోసం చాలా ప్రయత్నించాను. వారం వరకూ కుదరదంది ఆయన సెక్రటరీ కొంచెం చెప్పి చూడమ్మా! కాలేజీ డే కూడా దగ్గరకొస్తోంది. ఆయనలాంటి పెద్దలు కలగాజేసుకుంటేనే ఇలాంటి చారిటీఫండ్స్ పెద్ద మొత్తాలలో వచ్చేవి" అంది ప్రిన్సిపాల్.
"అలాగే మేడం! తప్పకుండా చెప్తాను" అంది సంధ్య.
చుట్టూ వున్నవాళ్ళు సంధ్యనే ఆసక్తిగా గమనిస్తున్నారు.
సంధ్య నవ్వుతోంది. ఆ నవ్వు చాలా సహజంగా, చాలా నిర్మలంగా మనసులోంచి నవ్వుతున్నట్లుగా వుంది.
"అంత డబ్బున్న బాబుంటే ఎందుకు నవ్వదూ?" కసిగా అనుకుంది చాయ.
ఆమెకి ఈమధ్య సంధ్యని, ఆమె ప్రాముఖ్యతని చూస్తుంటే చిరాకు పెరిగిపోతోంది. తనచుట్టూ తిరిగే స్మితా, అనూరాధ కూడా సంధ్య స్నేహం కోసం, ఆమెతో ఎక్కువసేపు గడపడంకోసం పడి చచ్చిపోతున్నారు. అదంతా ఆమెకోసం కాదు, ఇంపోర్టెడ్ కారు, ఆమె తండ్రి ఐశ్వర్యం మహిమా అనుకుంది చాయ.
ఇంతలో చాయ వీపుమీద దభీమని వచ్చి తగిలింది బాల్. చటుక్కున వెనక్కి తిరిగేసరికి సంధ్య నవ్వుతూ కనిపించింది.
"కమాన్....త్రో ఇట్ "మళ్ళీ బాల్ తనకి వెయ్యమన్నట్లుగా చూపిస్తూ అంటోంది.
చాయ బాల్ ని పట్టుకుని బరువుని చూస్తున్నట్లుగా చూసింది. చాలా బరువుగానే వుంది.
ప్లే గ్రౌండ్ లో ఎవరి ధోరణిలో వాళ్ళున్నారు. కేరింతలూ, నవ్వులూ గొడవ గొడవగా వుంది వాతావరణం.
చాయ గురిచూసి కొట్టింది సంధ్యని.
బాల్ వెళ్ళి ఫోర్స్ గా సంధ్య ముఖానికి కొట్టుకుంది.
ఆ దెబ్బకి ఆమె "అమ్మా" అంటూ వెనక్కిపడింది.
"అరెరె...సంధ్యా....వాట్ హేపెండ్?" అంటూ ఆమె చుట్టూ ఫ్రెండ్స్ మూగారు.
సంధ్య ముఖాన్ని అరచేతుల్లో దాచుకుని తల అడ్డంగా వూపింది.
"సారీ సంధ్యా! దెబ్బ గట్టిగా తగిలిందా? ఏదీ చూడనీ" అందర్నీ తోసుకుని సంధ్యని పట్టుకుని అంది చాయ.
సంధ్య చేతులు తీసి నవ్వడానికి ప్రయత్నిస్తూ "ఇట్స్ ఆల్ రైట్! పెద్దగా ఏం తగల్లేదు" అంది.
"లే.....క్లాసుకు వెళదాం" చెయ్యి అందిస్తూ అంది అనూరాధ.
చాయ మోకాళ్ళమీద కూర్చునే బాల్ ని గుండ్రంగా తిప్పుతూ సంధ్యావాళ్ళు వెళుతున్న వైపే చూసింది. వాళ్ళు క్లాసులోకి వెళ్ళిపోయాక తన మోకాలిక్రింద గుచ్చుకుంటున్న దాన్ని బయటకితీసి చేతిలో పట్టుకుని చూసింది.