Previous Page Next Page 
ఖజురహో పేజి 22


    దయామణి ఓ క్షణం ఆలోచించి ఫోన్ అందుకుంది.
    
    ఫోన్ లో మాట్లాడాక కొద్దిగా సిగ్గుపడుతూ- "సారీ చాయా! నీమీద నమ్మకం లేక కాదు, నా వుద్యోగం అలాంటిది" అంది.
    
    "ఫర్వాలేదు" అని తన రూంవేపు నడవబోయింది చాయ.
    
    "ఆ! చెప్పడం మర్చిపోయాను. నీకోసం ప్రొద్దుట్నించీ కిరణ్ నాలుగుసార్లు ఫోన్ చేశాడు" అంది దయామణి.
    
    'ఫోన్ చేసాడంటే బాగానే వున్నాడన్నమాట' మనసులో అనుకుంది చాయ.
    
    తన గడిలోకెళ్ళి బట్టలు మార్చుకోబోతూ అద్దంలో చూసుకుంది.
    
    పైన చున్నీ-క్రింద పైజమా లేకుండా తను చాలా సెక్సీగా అనిపించింది.
    
    అందుకే పాపం..... ఆ పెద్దమనిషి రాత్రి అన్ని సిగరెట్లు కాల్చి అంత బాధపడ్డాడు అనుకుంది.
    
    ఆమెకు జయచంద్ర గుర్తుకురాగానే పెదవులపైన చిలిపి నవ్వు చేరింది.
    
    రాత్రి తను తెలివిగా వుండే అతన్ని పరీక్షించడానికి ఆడిన నాటకం గుర్తొచ్చింది. 'మొత్తానికి గట్టిపిండమే' అనుకుంది.
    
    డాక్టర్ని తను అతని అడ్రస్ గురించి అడిగినప్పుడు- "జేసీ తెలీదా! మరి అతని కారులో ఎలా వచ్చారు?" అంది.
    
    బోలెడు అబద్దాలు కల్పించి చెప్పాక అతని ఫోన్ నెంబర్ మాత్రం సంపాదించగలిగింది.
    
    'జేసీ' ఎక్కడో విన్నట్లే వుంది ఈ పేరు. కానీ ఎక్కడో గుర్తుకు రావడంలేదు అనుకుంది.
    
    "చాయా! రాత్రంతా ఎక్కడ గడిపావే?" మేరి కన్నుకొడుతూ వచ్చి అడిగింది.
    
    "హాస్పిటల్లో" చాయ లంగా కట్టుకుంటూ జవాబిచ్చింది.
    
    "నా దగ్గర పాఠాలు నేర్చుకుని నాకే కాపీలు అందించేటంత తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసుగానీ నిజం చెప్పు" అంది.
    
    ఓణీ కుచ్చిళ్ళు పెట్టి వేసుకుంటూ- "నిజమే చెబుతున్నాను" అంది చాయ.
    
    "అయితే మరి ఇదేమిటి?" మేరి ఆమె మెడ క్రిందుగా ఏర్పడిన ఎర్రటి గాటు చూపిస్తూ అడిగింది.
    
    చాయ కూడా ఆశ్చర్యంగా చూసింది.
    
    కిరణ్ అలా ఏం చేసినట్లు ఆమెకు గుర్తులేదు!
    
    ఆమెకు నెమ్మదిగా గుర్తొచ్చింది.
    
    జయచంద్ర మెడలోని పులిగోరు పథకం తనకి గుచ్చుకున్నప్పుడు తను బాధని బయటపడనివ్వకపోవడం!
    
    "ఎవరే?" మేరీ కొంటెగా నవ్వుతూ అడిగింది.
    
    చాయ జవాబివ్వలేదు.
    
    "ఆ కిరణేనా?" అడిగింది మేరీ.
    
    చాయ అడ్డంగా తల వూపింది.
    
    మేరీ కుతూహలంగా- "మరి?" అంది.
    
    "అతని వివరాలు నాకు తెలియవు" అంది.
    
    మేరీ విషయాన్ని తట్టుకోలేనట్టు ఓసారి విజిల్ వేసి-
    
    "తెలీదా? మరయితే నీ రెండో ఇయర్ రింగ్ ఎలా అడిగి తెచ్చుకుంటావు?" అని అడిగింది.
    
    చాయ అప్పుడు చూసుకుంది తన చెవికి ఒక రింగు లేకపోవడం.
    
                                             * * *
    
    రింగు....అమాయకంగా ఊగుతోంది.
    
    దాన్ని వెలికి వేసుకుని పరీక్షగా చూస్తుంది కాంచన.
    
    "అయ్యగారి షర్టు గుండీకి తగులుకుందమ్మా!" అంది రత్నం.
    
    కాంచన రత్నంవేపు గిరుక్కున తిరిగిచూసింది.
    
    రత్నం తప్పు చేసినట్లుగా తల వంచుకుంది.
    
    "లవకుశ సినిమా చూసావా నువ్వు?" అడిగింది కాంచన.
    
    తిడుతుందనుకున్న యజమానురాలు అలా సినిమా కబుర్లు అడిగేసరికి రత్నానికి హుషారొచ్చింది. "ఒకసారికాదు ఆరుసార్లు చూసానమ్మా" అంది.
    
    "నేనూ చూసాను అందులో ఓ సీన్ నాకు నచ్చలేదు." అంది.
    
    "అదేంటమ్మా అంత గొప్ప సినిమాలో?" ఆ సినిమా తనే తీసినంత బాధపడిపోతూ అంది రత్నం.
    
    "సినిమా గొప్పదే కానీ సీతాదేవి పాత్ర అంత గొప్పగా లేదు. రాముడిలాంటి భర్తను శంకించి "సందేహించకుమమ్మా రఘురాము ప్రేమని సీతమ్మా' అని ఎవరిచేతో చెప్పించుకోవడం నాకు నచ్చలేదు" అంది కాంచన.
    
    అమ్మగారు ఏం చెప్పదలుచుకున్నారో రత్నానికి అర్ధమయింది.
    
    'రాముడిలాంటి నా భర్తను అనుమానించడానికి నేను సీతమ్మలాంటి తెలివి తక్కువదాన్నికాను' అంటోందని ఆమెకు తెలిసింది.
    
    రత్నం నవ్వుతూ- "ఈ రింగు రోల్డుగోల్డుదాన్లానే వుందమ్మా! పారెయ్యమంటారా?" అంది.
    
    "వద్దు! అది చాలా అదృష్టం చేసుకుంది" రింగుని భద్రంగా అల్మారాలో పెడుతూ అంది కాంచన.
    
                                          * * *
    
    "ఏమైపోయావో, ఎలా వున్నావోనని ఎంతగా హడలిచచ్చానో తెలుసా?" కాస్త కోపంగా అన్నాడు కిరణ్.
    
    చాయ కిరణ్ వైపు చూసింది.
    
    "అనకేమైనా అయితే నీకేమిటి?" అంది.
    
    ఆ మాటకే విలవిలాడుతున్నట్లు "చాయా!" అన్నాడు కిరణ్.
    
    "నాకేమైనా అవుతుందేమోనని బాధపడడం, నా కోసం బెంగపడడం, ఎదురుగా లేకపోతే తోచకపోవడం, వుంటే భరించలేకపోవడం, ఇవన్నీ ఏమిటీ? ఎందుకు? ఇలా చేయమని నేను నిన్ను ఎప్పుడూ అడగలేదే?"
    
    ఆమె ఒక్కొక్క మాటా అతని హృదయాన్ని తూట్లు తూట్లుగా చేసినట్లు అనిపించింది అతనికి.
    
    "చాయా! అవన్నీ ఒకరు అడిగితే చేసే పనులా? హృదయం దానంతట అదే అసంకల్పితంగా చేసే చర్యలు. దాన్నే ప్రేమంటారు" అన్నాడు.
    
    "ఏమో! అవన్నీ నాకు తెలియదు. నేను అడిగిన పనులు కరెక్ట్ గా చేస్తూ వుండు చాలు. ఇలా నా కోసం బెంగపడడాలూ, చిక్కిపోవడాలూ నాకు అక్కరలేదు" అనేసింది తేలిగ్గా.
    
    చెవిటివాడి ముందు శంఖం ఊదడం ఎంతో, ఆమె ముందు ప్రేమ గురించి చెప్పడం అంతే! అనుకున్నాడు కిరణ్ అమ్మపాల తియ్యతనం, ప్రేమలోని మాధుర్యం ఒకరు వర్ణిస్తే అర్ధం అయ్యేది కాదు.

 Previous Page Next Page