చుట్టూ ఎర్రరాళ్ళతో మధ్యలో ఒకే ఒక తెల్లరాయితో మిలమిలా మెరిసిపోతోంది లాకెట్. బహుశా సంధ్య మెడలోంచి కిందపడి వుంటుంది. చాలా ఖరీదు అని చూడగానే తెలుస్తోంది.
"వాట్ చాయా! క్లాస్ కి రావా?" ఓ అమ్మాయి అడిగింది.
చాయ గుప్పెట మూసేసి "వస్తున్నా.....పద" అంది నడుస్తూ లాకెట్ ని జాకెట్ లోకి తోసేసింది.
చాయ వెళ్లి సంధ్య ప్రక్కనే కూర్చుంది.
సంధ్య ఇంకా లాకెట్ సంగతి చూసుకున్నట్లులేదు! మామూలుగా మాట్లాడుతోంది.
"ఏమిటి చాయా! డల్ గా వున్నావు?" అంది సంధ్య.
"కాస్త టెంపరేచర్ వచ్చినట్లుంది" చాయ ముక్తసరిగా అంది.
సంధ్య వెంటనే ఆమె నుదుటిమీద చెయ్యివేసి చూస్తూ-
"ఇంత జ్వరంతో కాలేజ్ కి ఎందుకు వచ్చావు? రెస్ట్ తీసుకోవలసింది" అంది.
"రెస్టా?" చాయ నవ్వింది. ఆమెకి తన హాస్టల్ వాతావరణం, ఆ గంటలచప్పుడూ, అమ్మాయిల అరుపులూ, ఆ రణగణ ధ్వనులూ చెవిలో మార్మోగినట్లనిపించాయి.
"ఒద్దులే.....ఇక్కడే బావుంది" అంది.
"నాకు జ్వరం వస్తే అమ్మా, నాన్నలు చేసే హడావుడికి అంతే వుండదనుకో! అందుకే నేనూ చెప్పకుండా ఇలాగే పారిపోయి వచ్చేస్తాను" గలగలా నవ్వుతూ అంది సంధ్య.
ఆ మాటలు ఎత్తిపొడిచినట్లనిపించాయి సంధ్యకి.
సంధ్య నవ్వులో రాజసం, పలుకులో అతిశయం, నడకలో గర్వం కనిపించాయి.
లెక్చరర్ రావడంతో క్లాసు ప్రారంభమయింది.
చాయలో అసహనం పెరిగిపోతోంది. 'ఇంకా లాకెట్ పోయిందని చూసుకోదేం? గొల్లున ఏడవదేం?' అనిపించింది. తలంతా సూదులతో పొడుస్తున్నట్లు నెప్పిగా అనిపిస్తోంది.
"మేడమ్....!" సంధ్య అరుపుకి అందరూ ఉలిక్కిపడి ఆమె వైపు తిరిగారు.
సంధ్య ముఖంలో నవ్వు ఇరిగిపోయినట్లుగా పాలిపోయింది. "మేడమ్! నా లాకెట్ ఎక్కడో పడిపోయినట్లుంది. బహుశా గ్రౌండ్ లో పడిపోయిందేమో.....చూసొస్తాను" వణుకుతున్న గొంతుతో అంది.
క్లాసులో కలకలం రేగింది.
అందరూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్నారు.
క్లాసంతా వెదకమని లెక్చరర్ ఆర్డర్ జారీచేసింది అందరూ పడీపడీ వెదుకుతున్నారు. గ్రౌండ్ లో వెదకటానికి సంధ్యతోబాటు కొందఱు వెళ్ళారు. సంధ్య కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఆమెని అలా చూస్తుంటే చాయకి తలనొప్పి కాస్త తగ్గినట్లు అన్పించింది.
"దొరకలేదు మేడమ్" సంధ్యతోబాటు క్లాసులోకి వచ్చిన అమ్మాయిలు చెప్పారు.
"సంధ్యా! చాలా ఖరీదు వుంటుందా?" లెక్చరర్ అడిగింది.
"ఖరీదు చెప్పలేము. అమూల్యమైనది. తరతరాలుగా మా వంశంలో వున్నది. దాని ఏంటిక్ వేల్యూ చాలా ఎక్కువ! నాన్నగారికి ఈ విషయం తెలిస్తే....మైగాడ్! చాలా బాధపడతారు...." వెక్కి వెక్కి ఏడ్చేస్తూ అంది సంధ్య.
"ఎలా వుంటుందీ?" ఎవరో ఆసక్తిగా అడిగారు.
సంధ్య కళ్ళు తుడుచుకుంటూ "చుట్టూ కెంపులు, మధ్యలో డైమండ్ వుంటుంది" అంది.
"డై.....మం....డ్....!" అందరూ ఆశ్చర్యంగా అన్నారు.
చాయ గుండె ఒక్కనిముషం ఆగిపోయి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది.
"అంత విలువైనది కాలేజ్ కి ఎందుకు వేసుకొచ్చావు?" లెక్చరర్ గాభరాగా అడిగింది.
"ఆ లాకెట్ నా మెడలో వేస్తూ మా డాడీ ఎప్పుడూ తియ్యొద్దు అన్నారు. అది నా మెడలో వుంటే వాళ్ళ అమ్మని చూసినట్లే వుంటుందిట. పోయినట్లు తెలిస్తే డాడీ చాలా ఫీలవుతారు" మళ్ళీ ఏడ్చింది సంధ్య.
"లక్ష రూపాయలుంటుందా?" అడిగింది స్మిత.
"కోట్లు కూడా వుండచ్చు! కానీ దాని ఖరీదు గురించి కాదు, మా డాడీ సెంటిమెంట్ గురించి నేను బాధపడుతున్నాను" అంది వెక్కిళ్ళమధ్యే సంధ్య చాయకి జాకెట్ లో వున్న లాకెట్ మోయలేనంత భారంగా అన్పించింది.
ఈ వార్త కాలేజ్ అంతా గుప్పుమంది.
ప్రిన్సిపాల్ పరుగులు పెడ్తూవచ్చి-
"ఏమ్మా సంధ్యా! లాకెట్ పోయిందా? పోలీస్ కంప్లయింట్ ఇస్తాను. తప్పకుండా దొరుకుతుంది. నువ్వేం కంగారుపడకు" అంది తను బోలెడు కంగారుపడిపోతూ.
"డియర్ స్టూడెంట్స్! మీలో ఎవరికైనా సంధ్య లాకెట్ దొరికితే ఇచ్చెయ్యండి. వాళ్ళ నాన్నగారికి చెప్పి విలువైన బహుమానం ఇప్పిస్తాను" అంది ప్రిన్సిపాల్.
అమ్మాయిలు ఇంకా స్పీడుగా వెదకటం మొదలుపెట్టారు.
"సంధ్యా.....సంధ్యా...." ఆమెను కుదుపుతూ గాభరాగా అరిచింది అనూరాధ.
సంధ్య పక్కకి వాలిపోయింది.
సంధ్యకి స్పృహ తప్పింది.
"మీరంతా పక్కకి జరగండి. గాలి తగలనీయండి" అంటూ లెక్చరర్ అందర్నీ దూరంగా జరుపుతోంది.
ప్రిన్సిపాల్ కి ముచ్చెమటలు పోసాయి.
"వాళ్ళ రెసిడెన్స్ కి ఫోన్ చేస్తాను" అని హడావుడిగా ఆఫీస్ రూమ్ వైపు పరుగెత్తింది ఆవిడ.
అదంతా ఓ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్లు చూడసాగింది చాయ.
ఓసారి కడుపులో తిండిలేక తను కళ్ళుతిరిగి పడిపోతే, లాస్ట్ బెంచ్ లో పడుకోబెట్టి, యధాప్రకారం పాఠం కొనసాగించింది ఈ లెక్చరరే!
ఇప్పుడు సంధ్యకి స్పృహ తప్పితే ప్రపంచం మునిగిపోయినట్లు తల్లక్రిందులైపోతున్నారు.
ఒకమ్మాయి పుస్తకంతో విసుర్తోంది. ఇంకొక అమ్మాయి కాళ్ళూ, చేతులూ రాస్తోంది. లెక్చరర్ నీళ్ళు మొహంమీద జల్లి లేపడానికి ప్రయత్నిస్తోంది. ప్రిన్సిపాల్ దొర్లిపోతూ వరండామీద పరుగులు పెడుతోంది. అందరూ సర్కస్ లో బఫూన్లలా యధాశక్తి ప్రయత్నిస్తున్నారు.....ఎవర్ని రంజింప చెయ్యడానికో!
"సంధ్యా....సంధ్యా!" చాయ ఆమె మీదకి ఒంగి పిలిచింది.