Previous Page Next Page 
రాగహేల పేజి 21

    మహతి ఎవరోతట్టి లేపినట్టుగా త్రుళ్ళిపడి లేచికూర్చుంది. పక్కనే ఉన్న టేబుల్ మీది వాచీ తీసుకుని చూసింది. ఏడున్నర అయింది. గాభరాగా మంచం దిగింది. కళ్ళు మిరమిరలాడుతున్నాయి. రాత్రంతా రవి ప్రవర్తనగురించి ఆలోచిస్తూనే వుంది. తెల్లవారుఝామున నిద్రపట్టింది. పళ్ళుతోముకుంటూ ఆలోచిస్తోంది. ఏడున్నర అయింది. ఎనిమిదింటికి వస్తానన్నాడు. రాత్రిఅతనిలో మార్పు కన్పించింది. అంకుల్ రవిరాడేమోకాని కిరణ్ వస్తాడు' అన్నమాట అతనిలో ఏదో అలజడిని రేపినట్టు స్పష్టంగా కన్పించింది. కొంచెం ఎగ్రెసివ్ గా ప్రవర్తించాడు. మందకొడిగా ఉండే రవి చాలా చురుగ్గా కన్పించాడు. కిరణ్ మీద అసూయ కలిగినట్టుగా తనకు కన్పించింది. అతనిలో ఆ మార్పునేతను కోరుకున్నది కూడా. మహతి స్నానంచేసి బయటకు వెళ్ళడానికి సిద్దమయింది. ఎనిమిదింటికీ వస్తానన్నరవి ఎనిమిదిన్నర అయినా ఇంకారాలేదు. రవి అన్నటైంకు ముందే వస్తాడు. మహతి అశాంతిగా బయటికీ లోపలకూ తిరగసాగింది. తొమ్మిది అయింది. అయినా యింకా రవి రాలేదు. ఫోన్ చేసింది రవికోసం. "ఎవరు?" "నేనమ్మా. సాంబయ్యను" "సాంబయ్యా! రవి బాబు ఇంకా నిద్రలేవలేదా?" "బాబుగారు రాత్రి ఇంటికి రాలేదమ్మా ఆరికోసమే ఎదురు సూత్తున్నాన" మహతికి నెత్తి మీద ఎవరో కొట్టినట్టుగా అయింది. చేతిలోవున్న మౌత్ పీస్ కేసి అయోమయంగా చూసింది. కొద్ది నిముషాలపాటు రిసీవర్ ను పెట్టాలనే ఆలోచనే లేకుండా కూర్చుండిపోయింది. రవి రాత్రి ఇంటికి వెళ్ళలేదా? తనను ఇంటిదగ్గర దించాక ఎక్కడికెళ్ళాడు. 'రేపు ఉదయం ఎనిమిదిగంటలకు వస్తావుగా' అని తను అడిగింది. మరోసారయితే'ఆ(వస్తాను' అని ఉత్సాహంగా అనేవాడు. రాత్రి 'ఊ(' అని మాత్రం అన్నాడు. అప్పుడు తను గమనించలేదు. రవి కారు నడుపుతూ ఒక్కమాటకూడా మాట్లాడలేదు. గంభీరంగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. తనుకూడా పలకరించలేదు. తను కోరుకున్న మార్పు అతనిలో కన్పిస్తోందన్నసంతోషంతో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చుంది. కాని.....ఇదేమిటి, ఇలాజరిగింది? రవి ఎక్కడి కెళ్ళాడు? రాత్రంతా ఎక్కడున్నాడు? దాని దగ్గరకే వెళ్ళాడా? అంతే అయి ఉంటుంది. ఆ దేవయాని దగ్గరకే వెళ్ళాడు. సందేహంలేదు. అక్కడికే వెళ్ళాడు.    
    దేవయాని - ఆమెభర్త సంతానం అంతా కట్టుకధేనేమో? ఇంకా సందేహం ఎందుకు? కట్టుకధే. ఫేమస్ సైకియాట్రిస్టు పరశురాం కూడా బోల్తా పడ్డాడా? అది సాధ్యమా? అంకుల్ ను బోల్తా కొట్టించడం అంత తేలిక కాదు. మరయితే? అంకుల్ కు కూడా ఈ నాటకంలో పాత్రఉందా? నో!నో! అంకుల్ అలా చెయ్యడు. తను అంకుల్ ను గురించి ఇంత దారుణంగా ఆలోచించడమా? "ఏమిటే అమ్మాయ్? ఆ ఫోన్ రిసీవర్ పట్టుకొని అలాగే కూర్చున్నావ్?" తల్లి అడిగింది. మహతి ఉలిక్కిపడింది. గాభరాగా కిందపడినా రిసీవర్ అందుకొని ఫోన్ మీద పెట్టింది. "టిఫిన్ తిందువురా!" "వద్దమ్మా, నేను అర్జంటుగా బయటికివెళ్ళాలి" అంటూలేచి నిల్చుంది మహతి. "అంత ముంచుకుపోయిన పన్లేమిటే? టిఫిన్ కూడా చెయ్యకుండా..." తల్లి మాటపూర్తి కాకుండానే మహతి తన గదిలోకి వెళ్ళింది. హాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది. రోడ్డుమీద వెళ్తున్న ఆటో ఎక్కి కూర్చుంది. ఆటోప్రొఫెసర్ పరశురాం ఇంటిముందు ఆగింది. గబగబా లోపలకు వచ్చిన మహతి కన్ సల్టింగ్ రూం ముందున్న హాల్లో కాళ్ళకు బంధం పడినట్టుఆగిపోయింది.    
    అక్కడున్న ఒక కుర్చీలో సంతానం కూర్చుని ఉన్నాడు.  కన్సల్టింగ్ రూం తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. సంతానం కాక మరో ఇద్దరు ఓ మూలగా ఉన్న బల్ల మీద కూర్చుని ఉన్నారు. "మీ పేరు సంతానం కదూ?" అతనిపక్కనున్న కుర్చీలో కూర్చుని అడిగింది. "అవును!" అన్నట్టు తల ఊపాడు. "మీరొక్కరే వచ్చారేం?" "నా భార్య కూడా వచ్చింది" "అంటే దేవయానేనా?" "అవునమ్మా, ఆ అబ్బాయికూడా వచ్చాడు" మహతి ఖంగుతిన్నట్టుగా చూసింది. "ఏ.....అబ్బాయి?" "అదేనమ్మా.....నాభార్య తన భర్తని చెబుతున్నకుర్రాడు" "ఏడీ?" "లోపలున్నాడు. ఆ బాబుదేవుడల్లే రాబట్టే సరిపోయింది. లేకపోతే దాన్ని ఇక్కడకు తీసుకురావడానికి నా తల ప్రాణం తోక్కొచ్చుండేది" సంతానం చెప్పుకుపోతున్నాడు. "ఇంతకీ ఆవిడగారి మొగుడు ఎవరు?" సంతానం మహతికేసిఅయోమయంగా చూశాడు. "ఏమిటలా చూస్తారు? దేవయానికి మొగుడు మీరా లేక ఆ కుర్రాడా?" రెట్టించింది మహతి. "నేనే దేవయాని భర్తను"    
    "మరి ఆ కుర్రాడు?" "దేవయాని అనుకొంటున్న భర్త" "ఎందుకలా అనుకొంటుందో మీకు తెలియదా?" "దానికి మతి సరిగాలేదు. అందుకే" "మతి సరిగా లేకపోతే ఆ కుర్రాన్నే భర్త అని ఎందుకనుకొంటున్నది?" సమాధానం తోచలేదు. నిజమే! ఎందుకనుకొంటున్నది? "అంతకు ముందు మరెవర్నయినా చూసి అతనే తనభర్త అందా?" "లేదు" సాల్కహనగా అన్నాడు. "మరి ఆ కుర్రాన్నే భర్త అని ఎందుకనుకుంటుందో ఆలోచించారా?" "నాకెట్టా తెలుస్తుందమ్మా ఆ సంగతి డాక్టరుబాబు చెప్పాలి" "ఎంతసేపయింది వాళ్ళు లోపలికెళ్ళి" "గంట దాటినట్టే ఉంది" "మరి మీరు వెళ్ళలేదేం?" "డాక్టరుబాబు నన్నిక్కడే కూర్చోమన్నారు" అంకుల్ కు కూడా మతిపోయినట్టే ఉంది. లేకపోతే....ఆలోచిస్తున్న మహతి బుర్రలో మెరుపులా ఓ ప్రశ్న తలెత్తింది. "అసలు ఆ కుర్రాడు మీ ఇంటికెప్పుడు...." మహతి వాక్యంపూర్తికాలేదు. కన్సల్టింగ్ రూం తలుపులు తెరుచుకోవడంతో అటు చూసింది ఆత్రంగా. దేవయాని బయటికివచ్చింది. మహతి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసింది. ఆమె ముఖంలో క్రితంరోజు కన్పించిన నిగారింపు లేదు. కనుగుడ్లు తేలిపోవడంలేదు. బాగా నిద్రపోయి అప్పుడే లేచివచ్చినట్టుగా ఉంది ఆమె ముఖం. ముఖంలో స్ట్రగుల్ లేదు. ప్రశాంతత ఉంది. నడకలో ఆ ఊపు కూడా లేదు. తాపీగా నడుస్తూ వచ్చి సంతానం ముందు నిల్చుంది. అతడు కుర్చీలో నుంచి లేచి నిల్చున్నాడు.
    "నాన్నగారూ, వెళ్దాంపదండి" ఆ మాట వింటూనే మహతిబిత్తరపోయింది. సంతానం అంతెత్తున ఎగిరి కుర్చీలో కూలబడ్డాడు. అది చూసి------అసలు పిచ్చి ఎవరికి? దేవయానికా? సంతానానికా? లేక తనకా? మహతి అయోమయంలో పడింది. "లేవండి" సంతానాన్ని ఉద్దేశించి అంది దేవయాని అతి మామూలుగా. "దేవయానీ!" గిర్రున తిరిగి మహాతిని చూసింది దేవయాని. "మీ యనన్ను వదిలేసిపోతున్నావేం?" అంది. "మా ఆయనా?" దేవయాని మహతి ముఖంలోకి చూసింది. "అవును మీ ఆయన్నే?" రెట్టిస్తూ అంది మహతి. "నాకు భర్తేమిటి?" ఎటో చూస్తూ అంది దేవయాని. మహతి ఏదో అనబోయింది. అంతలో మళ్ళీ దేవయాని "నా కసలు పెళ్ళేకాలేదు" అంది "ఆ లోపలున్నతడు నీకేమౌతాడు?" " ఓ అతనా" దేవయాని పకపక నవ్వింది. మహతి అయోమయంగా చూసింది. సంతానం మాటాపలుకూ లేకుండా వెర్రిచూపులు చూస్తున్నాడు. "ఎందుకలా నవ్వుతావ్?" "అతన్ని పట్టుకొని భర్త అంటుంటే నవ్వక ఏడవమంటావా?" "మరి అతను నీకేమవుతాడు" "అన్న" మహతి చివ్వున తలెత్తింది. "అన్నా?" విభ్రమాశ్చర్యాలలో తల మునకలయిపోతూ అడిగింది మహతి. "అవును.  అన్నే. మాఅన్న ఎలాంటివాడో మీకు తెలిసినట్టులేదు. ఆడ పడుచుల గౌరవాన్ని నిలబెట్టేహీరో ఏమనుకుంటున్నారో-అచ్చం సినిమా హీరో." సంతానం గుండెనిండా గాలిపీల్చుకొన్నాడు. నిన్న భర్త అన్నది. ఇవాళ అన్నా అంటున్నది. సగం పిచ్చి కుదిరినట్టే.
    "నాన్నారూ వెళ్దాం పదండి" దేవయాని సంతానం చెయ్యి పట్టుకొంది. సంతానం అకస్మాత్తుగా బారెడు పాముమీద పడినట్టుకుర్చీలోనుంచి ఎగిరిపడి నిల్చున్నాడు. మహతి మళ్ళీ అయోమయంలో పడింది. "దేవయానీ ఈయననీకు..." "మా నాన్నగారు" "నువ్వుండమ్మా తల్లీ. కధ అడ్డం తిరిగింది" మహతిని ఆపాడు. "పదండి నాన్నారూ?" మళ్ళీ అతడి చెయ్యి పట్టుకున్నది దేవయాని. "ఇదేం పిచ్చిరోయ్ బాబో! మొగుడ్ని పట్టుకొని నాన్న అంటుంది?" అరుస్తూ పరశురాం గదిలోకి పరుగు తీశాడు. అలా పరుగు తీస్తున ఫుట్ బాల్ లా లోపలికొచ్చి పడ్డాడు సంతానం కుర్చీలో కూర్చుని రొప్పుతున్నాడు. "ఏమిటీ? ఏం జరిగింది?" పరశురాం తాపీగా అడిగాడు. "ఇంకా ఏం జరగాలండీ బాబు! పిచ్చి ముదిరిపోయింది" "అసలు ఏం జరిగిందో చెప్పు" ప్రొఫెసర్ పైపులోకి పొగాకు దట్టిస్తున్నాడు, తలెత్తకుండానే అడిగాడు. "పొద్దుటిదాకా ఆ కుర్రాన్ని భర్త అందా?" "అవును అంది" "ఇప్పుడు అన్న అంటుంది" "అవును అంటోంది మంచిదేగా" పైపు వెలిగించే ప్రయత్నంలో పడ్డాడు పరశురాం. "అదికాదు డాక్టర్ బాబూ" గొంతుకు ఏదో అడ్డుపడ్డట్టుగా అయింది సంతానానికి. "ఏమిటో త్వరగా చెప్పు" "నన్ను నాన్నారూ అంటోంది. మొగుడ్ని పట్టుకొని నాన్న? పిచ్చి మరీముదిరిపోయినట్టుంది" లబలబలాడాడు సంతానం. ప్రొఫెసర్ పరశురాం చిరునవ్వునవ్వాడు "ఓ అంతేగదా? ఇంకేమిటో అనుకొన్నాను" సంతానం పరశురాంకేసి వింతగా చూశాడు. పిచ్చోళ్ళను చూసిచూసి ఈ డాక్టరుకు కూడా పిచ్చిపట్టలేదు కదా? లేకపోతే మొగుడ్ని పట్టుకొని నాన్న అంటుందంటే" అంతేకదా? అంటాడేం" "కొంతకాలం అలాగే అనుకోనివ్వు!" నోట్లో నుంచి పైపుతీసి అన్నాడు పరశురాం. "భయపడక అసలు ప్రమాదం పరాయివాడ్నిభర్త అనుకోవడం అవునా?" అవును అన్నట్టు తల ఊపాడు సంతానం. "ఆ ప్రమాదం నుంచి బయటపడింది. పరాయివాడిని భర్త అనుకునే మానసికస్థితి ఇప్పుడు లేదు" "కాని...." ఏదో అనబోయి డాక్టర్ ముఖంచూసి ఆగిపోయాడు సంతానం. "క్రమంగా స్వస్థత వస్తుంది. తనకు పెళ్ళి కాలేదనుకొంటున్నది. మీ వయసు పెద్దది కనుక నాన్నగారు అనుకొంటున్నది. త్వరలోనే ఆ స్థితి నుంచి కూడా బయటపడవచ్చు" "ఆ భారమంతా తమకే వదిలేస్తున్నాను" "నాలుగు రోజుల తర్వాత తీసుకురా" "అలాగే" సంతానం డాక్టర్ కు నమస్కరించి బయటికి వచ్చాడు.

 Previous Page Next Page