Previous Page Next Page 
ఖజురహో పేజి 21


    అతను ఆమె నుదుటిమీద చేయివేసి చూసాడు. వేడిగా వుంది. దాదాపుగా సంధ్య వయసే వుంటుంది అనుకున్నాడు.
    
    ఇందాక తనలో కలిగిన కోర్కెకి కాస్త ఇబ్బందిగా అనిపించి మరో సిగరెట్ వెలిగించుకున్నాడు.
    
    అర్ధరాత్రి ఇంత జ్వరంతో ఆమెను ఎక్కడ దిగవిడిచి వెళ్ళాలో అతనికి తెలియలేదు. ఆమెని ఏమని పిలవాలో అర్ధంగాక భుజంమీద సున్నితంగా తట్టి లేపడానికి ప్రయత్నించాడు.
    
    ఆమె చలిలో వణుకుతూ మరింత అతన్ని హత్తుకుపోయింది. సన్నగా ఏదో పలవరించింది! ఆమె శరీరం అతనికి అంత దగ్గరగా వుండడం వలన అతనికి కూడా టెంపరేచర్ పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.
    
    "మైగాడ్!" నుదుట పట్టిన చెమట బిందువుల్ని తుడుచుకుంటూ అనుకున్నాడు జయచంద్ర.
    
    టెంపరేచర్ నూటమూడికి తక్కువ వుండదు! అనుకున్నాడు జయచంద్ర.
    
    ఒక్కసారిగా మనసంతా ఆమెమీద జాలితో నిండిపోయింది. అమాయకంగా, అందంగా, అతి దీనంగా, బాల్యావస్థలోంచి అప్పుడప్పుడే బయటపడుతూన్న లతాంగిలా వుంది.
    
    "ఇంత జ్వరంలో వున్న అమ్మాయిని ఎక్కడ దింపడం?" అనుకోగానే అతనికి తట్టింది. కారు స్టార్టుచేసి గాయత్రి నర్సింగ్ హోమ్ కి పోనిచ్చాడు.
    
                                                                * * *
    
    "అంత అర్దరాత్రివేళ స్పృహలేని స్థితిలో ఆమెని ఎక్కడ దింపాలో తెలియక హాస్పిటల్ లో అడ్మిట్ చేసి వచ్చాను" అన్నాడు జయచంద్ర.
    
    "అయ్యోపాపం! ఎవరిపిల్లో?" కాంచన జాలిగా అంది.
    
    "గుడ్ మార్నింగ్ డాడీ!" సంధ్య డైనింగ్ హాల్లోకి వస్తూ అంది.
    
    "గుడ్ మార్నింగ్ బేబీ! ఏమిటీ ఇంత ప్రొద్దుటే కాలేజీకి బయలుదేరావు?" ఇడ్లీని స్పూన్ తో ముక్కలుచేస్తూ అన్నాడు.
    
    "లేట్ గా జాయిన్ అయ్యానుగా నోట్స్ లన్నీ ఇన్ కంప్లీట్ గా వున్నాయి. కాస్త ముందుగా వెళ్ళి లైబ్రరీలో కూర్చుని వ్రాసుకుందామని" తనూ ఓ ప్లేట్ అందుకుంటూ అందిస సంధ్య.
    
    ఫోన్ మోగింది.
    
    జయచంద్ర స్పూన్ ప్లేట్లో వదిలేసి ఫోన్ అందుకున్నాడు.
    
    "హలో!"
    
    "హ.....హలో" అవతలినుండి సన్నని కంఠస్వరం వినిపించింది.
    
    "జేసీ హియర్" అతని గొంతులో ఇందాకటి మార్దవం స్థానే గంభీరత చాలా సహజంగా ప్రవేశించింది.
    
    "నేను....నేనండీ.....రాత్రి మీ కారులో ఎక్కా చూడండి."
    
    జయచంద్ర ముఖంలో ప్రసన్నత చోటు చేసుకుంది.
    
    "ఓ! రాత్రి కారులో ఎక్కినా అమ్మాయా? హౌ ఆర్ యూ?" స్పూన్ చేతిలోకి తీసుకుంటూ అన్నాడు.
    
    "జ్వరం తగ్గింది. మీకు థాంక్స్ చెప్దామని చేశాను" అంది.
    
    "టేక్ రెస్ట్. ఇంట్లో ఇన్ ఫార్మ్ చేశారా? పాపం మీ పేరెంట్స్ కంగారుపడి వుంటారు" అన్నాడు.
    
    "అటువంటి సమస్య నాకులేదు" కాస్త గట్టిగా అంది.
    
    "ఓకే బై...." అన్నాడు వాచ్ వైపు చూసుకుంటూ జయచంద్ర.
    
    "ఒక్క మాటండీ?" ఆ అమ్మాయి కంగారుగా అంది.
    
    "ఏమిటీ?"
    
    "మిమ్మల్ని ఓసారి పర్సనల్ గా కలవాలి."
    
    అతని భ్రుకుటి ముడివడింది. కొద్దిగా ఆలోచించి-
    
    "ఓ వారం తర్వాత ఫోన్ చేయండి చూద్దాం" అని ఫోన్ పెట్టేసాడు.
    
    సాధారణంగా ఉద్యోగాలకోసమో, పైరవీల కోసమో అతని దగ్గరికి మనుషులు రావడం అతనికి అలవాటే.
    
    అతను అంతసేపు మాట్లాడటం సంధ్యకీ, కాంచనకీ కొద్దిగా ఆశ్చర్యము కలిగించింది.
    
    అఫీషియల్ ఫోన్స్ గానీ, మామూలుగా వచ్చే కులాసా కాల్స్ గానీ అతను భార్య, కూతురితో వున్నప్పుడు రిసీవ్ చేసుకోడు.
    
    అందుకన్నా, అలా క్లుప్తంగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు.
    
    అతను వారివైపు చూసి నవ్వి.
    
    "ఆ అమ్మాయే.....ఇందాక చెప్పానే" అన్నాడు.
    
    "ఎలా వుందిట?" కాంచన ఆత్రుతగా అడిగింది.
    
    "కులాసాగా వుంది కాబట్టే ఫోన్ చేసింది" నవ్వుతూ అన్నాడు.
    
    "ఏం అడిగింది డాడీ? వారం తర్వాత చూద్దాం అన్నారు" సంధ్య కుతూహలంగా అడిగింది.
    
    "అదా....అదీ ఏదో వేకెన్సీ వుంది నా దగ్గరని తెలిసిందట" అన్నాడు.
    
    "అదే అనుకున్నాను" అంది సంధ్య.
    
    కాంచన భర్తవేపు పరీక్షగా చూసింది.
    
    జయచంద్ర జేబులోంచి రుమాలుతీసి ముఖం తుడుచుకున్నాడు.
    
    ఎందుకలా అబద్దం ఆడాలనిపించిందో అతనికే అర్ధం కాలేదు.
    
    'ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్' అంటారు.
    
    భార్యవేపు చూడలేకపోయాడు.
    
    గబుక్కున లేచి వెళ్ళిపోయాడు.
    
    "డాడీ.....ఆగండి నేనూ వస్తున్నా" సంధ్య అరిచింది.
    
                                              * * *
    
    "నువ్వు చెపుతున్న మాటలు కనీసం నీకయినా నమ్మాలనిపిస్తున్నాయా?" దయామణి కాస్త కోపంగా అడిగింది.
    
    "నేను చెపుతున్నది నిజం" ఛాయా నిర్లక్ష్యంగా అంది.
    
    "చాయా! ఒక రాత్రి మొత్తం నువ్వు పత్తాలేకుండా పోయావు. తెలవారి వచ్చి ఏవో కథలు అల్లి చెబుతున్నావు.
    
    అసలు ఎలా వచ్చావో నీకు తెలుస్తుందా? నీ వంటిమీద బట్టలు ఏమయ్యాయో అన్న ధ్యాసన్నా నీకుందా?" తీవ్రంగా అడిగింది దయామణి.
    
    "ఇదిగో.....ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి" నదురూ-బెదురూ లేకుండా వుంది చాయ కంఠం.
    
    దయామణి ఆ చీటీ అందుకుంటూ- "ఎవరి నెంబర్ ఇది?" నన్ను ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళారుట."

 Previous Page Next Page