Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 21

విరించ సవరించ వాణి సిగలోంచి జారిన మల్లె ఒకటి ఆమె పెదవి అంచున సంతుష్టితో కూడిన చిరునగవై వెలిసింది.
పెళ్లితంతు పూర్తవగానే కొత్త దంపతులచేత బిందెలో మట్టెలూ, ఉంగరం వేసి ఇద్దరూ ఒకేసారి చేతులుపెట్టి వాటిని బైటికి తీయించే ఆట ఆడిస్తారు.
మొదట పెళ్ళికూతురు భయంగా బిందెని తాకుతుంది. రెండవసారి అడుగువరకూ గాలిస్తుంది. మూడోసారి అతని చెయ్యి లోపల తాకగానే గుప్పెటని విడదీసి అందులోని వస్తువులని సొంతం చేసుకుంటుంది. పైకి మాత్రం చుట్టూ వున్నవారికీ అమాయకమైన ఆమె ముఖమే కనిపిస్తుంటుంది. ఆటలో ఆత్రం అతనిదైనా.....ప్రతిసారీ గెలుపు ఆమెదే! ఊరికే పెట్టలేదు పెద్దలా ముచ్చట్లు అవన్నీ చెప్పక చెప్పే శృంగారపు తొలిపాఠాలు.    
                                                             * * *
శక్తి పెదవుల మీదకి ఆపుకోవాలన్నా ఆగని చిరునవ్వు దూసుకువస్తోంది. తెల్లవారాక ఇంద్రనీల్ వైపు చూడాలంటేనే చాలా సిగ్గేసింది. అతని చెయ్యి తాకినా, భుజం తగిలినా ఇంతకుముందు లేని తియ్యని జలదరింపు ఆఫీస్ కి లీవ్ పెట్టి ఇంట్లో వుండాలనే అనిపించింది. కానీ తను మూడేరోజులు లీవ్ పెట్టి ఆ తరువాత ఎక్స్ టెండ్ చేయడం అందరూ గమనిస్తారేమోనని సిగ్గుతో బయల్దేరి వచ్చేసింది.
తనేదో ఒక్కరోజులో మారిపోయినట్లూ, ఆ మార్పేదో తనలో ఇతరులకి కొట్టవచ్చినట్లుగా ఇబ్బందైన భావన.
చెంపలమీదకి జారుతున్న ముంగురులని సవరించుకునే నెపంతో బుగ్గలమీద ముద్రించుకుపోయిన అతని నఖక్షతాలని స్పర్శిస్తోంది. గుండెలమీద సడి చేస్తూ తనలో అలజడి కలిగిస్తున్న మంగళసూత్రాల్ని మాటిమాటికీ తొంగి చూసుకుంటోంది. చేతికి పచ్చగా మెరుస్తున్న గాజులు, కాలివేళ్ళకి కొత్తగా తొడిగిన మట్టెలూ.... అన్నీ ఆమెకు అతడిని పదేపదే గుర్తుచేస్తున్నాయి. పక్కకి తిరగబోతుంటే నడుంనెప్పిగా అనిపించింది. 'అబ్బా... ఎంత మొరటు.... అస్సలు నిదానమే లేదు' మురిపెంగా విసుక్కుంది. చేతిమీద ఎర్రని గాటు.... రాత్రి చిట్లిన గాజు తాలూకుది.
కాంపౌండ్ బయట బాదంచెట్టుమీద కూర్చున్న కోకిల ఒకటి ఏదో ముంచుకుపోతున్నట్టు ఒకటే కూత! ప్రాణం తీసేస్తుంది బాబూ! శక్తి కొంగుతో విసురుకుంటూ చుట్టూ చూసింది.
అందరూ ఎవరి పనుల్లో వారున్నారు. వీళ్ళెవరికీ నాకున్నలాంటి బాధలేదా? తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ఏమిటో.... ఫోన్ మోగినప్పుడల్లా ఉలికిపాటు! ఇంద్రనీల్ తనకి ఫోన్ చేసి వుండలేకపోతున్నాను. వచ్చెయ్యమంటే ఎంత బావుణ్ణు!' అనుకొంది.
లంచ్ టైంలో తార వహ్చి "దేవిగారికి ఆకలిదప్పులులాంటివి గుర్తొస్తున్నాయా..... లేక అతని ధ్యాసేనా?" అంది.
శక్తి మౌనంగా లంచ్ బాక్స్ బైటికి తీసి ఆమెతో నడిచింది.
"ఏమిటే ఆ మౌనం? అసలు ఎంత హుషారుగా వుండాలీ..... ఔనూ ఈ రోజేం తెచ్చావు?" అడిగింది తార.
"తెలీదు" నిర్లిప్తంగా జవాబిచ్చింది.
"అదేం? వంట నువ్వు చెయ్యలేదా?"
"నేనెందుకు చేస్తాను?" విసుగ్గా అడిగింది.
తార వెటకారంగా "శక్తిమతీదేవి వంటచెయ్యదు కదూ! సరే మీ శ్రీవారి శాకపాకలేమిటో కాస్త రుచి చూపించు" అంది.
శక్తి పరమ విసుగ్గా బాక్స్ మూత తెరిచింది.
వెంటనే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. చటుక్కున ఆ రెండు వస్తువుల్నీ దాచేసి చీటీమాత్రం తీసి చదివింది.
"వీటిని చూశాకైనా నేను గుర్తుకురాలేదా? వస్తే.... హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చెయ్యి లేదా.... ఇవి పక్కకి జరిపేసి దిబ్బరొట్టె, ఆవకాయ నంజుకొని తినెయ్ నీ నీల్!"
కోయిల కూతలో మార్పొచ్చింది. ఇంతసేపటికి తాళం కుదిరినట్లు లయగా ఆగి ఆగి కూస్తోంది. శక్తి ఎర్రబడిన ముఖంతో తారవైపు చూసి "అర్జెంటుగా ఇంటికెళ్ళాలి" అంది.
"ఏమైందీ? ప్రాబ్లమా?" తార ఆదుర్దాగా అడిగింది.
"వెళ్ళకపోతే ప్రాబ్లెమ్" చెప్పి మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్ళింది శక్తి.
ఈ తెగిన హుక్కూ.... చిట్లిన గాజు ముక్కా.... లంచ్ బాక్స్ లో పెట్టి పంపించి పెద్ద రొమాంటిక్ హీరోవయిపోయాననుకుంటున్నావా?" చిరుకోపంగా అడిగింది శక్తి.
ఇంద్రనీల్ ఆమె నడుంఒంపుని సవరిస్తూ "నువ్వు వస్తావని నాకు తెలుసు" అన్నాడు.
"ఎలా?" ఆపుకోలేక అడిగింది.
"ఇంతకుముందు అమ్మాయిలకి ఈత నేర్పించేవాడిని మొదటిరోజు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవడానికి తెగ ఇబ్బంది పడేవారు. రెండోరోజునుంచీ నేనేం నేర్పాల్సినది వుండేది కాదు" అన్నాడు.
"ఛీ.... ఫో!" శక్తి అతని బుగ్గమీద గట్టిగా గిల్లింది.
"అక్కడొద్దు.... దేవుడు వీపులూ.... గుండెలు పెట్టింది ఇలా ఎవరికీ కనిపించకుండా గిల్లుకోవడానికే!" సీరియస్ గా చెప్పాడు.
శక్తి ఇంక మాట్లాడలేదు. అతడిని మాట్లాడనీయలేదు.
మీనాక్షి వాళ్ళ వాటాలోనుంచి ఆపకుండా సదానందం పిల్లలని తిడుతున్న తిట్లు వినిపిస్తున్నాయి. ట్రాన్ సిస్టర్ లో చాయాగీత్ వింటున్న శక్తికి ఈ గొడవకి చాలా చిరాగ్గా వుంది.
మీనాక్షి సన్నగా ఏడుస్తున్న ధ్వని వినిపిస్తోంది.
పేపర్ చదువుతున్న ఇంద్రనీల్ లేచి బకెట్లో బట్టలు వేసుకుని "నేను బావిదగ్గర బట్టలుతుక్కుని వస్తాను" అని బయల్దేరాడు.
శక్తి విసుగ్గా "ఇంత రాత్రి ఉతక్కపోతే ఏం కొంపలు ముంచుకు పోవులే!" అంది.
"ఇంకా ఇప్పుడు చేసే పనేముంది కనుక...." అంటూ వెళ్ళిపోయాడు.
శక్తికి అతను బండకేసి బట్టలు బాదడం వినిపించసాగింది. అది ఎందుకో అర్ధంఅయి ఆమె పెదవుల మీద సన్నని హాసరేఖ పరుచుకుంది. అతను ఆ గొడవ విని భరించలేకపోతున్నాడు.
"అగ్రహారం సంబంధం చేసుకుని వుంటే పౌరోహిత్యం చేసైనా ఆ పేరిశాస్త్రి నన్ను పోషించేవాడు" మీనాక్షి అరిచింది.

 Previous Page Next Page