"రాత్రంతా అలా వ్యర్ధంగా గడిచిపోయిందా?" తార బుగ్గన చెయ్యేసుకుని ఆశ్చర్యంగా అడిగింది.
శక్తి స్నేహితురాలి మొహంలోకి చూడలేక తలవంచుకుని కూర్చుంది.
"అలా ఎందుకు చేశావు? ఎన్ని రాత్రులు ఆపాలనుకుంటున్నావు?" తార గట్టిగా అడిగింది.
శక్తి నెమ్మదిగా తలెత్తింది. ఆమెలో గాంభీర్యం స్థానే దైన్యం, బింకం స్థానే భయం కదలాడాయి.
"తారా! నాకు మగవాడంటే.... భయం..." అంది.
"బాగానే వుంది వరస! మరి పెళ్ళెందుకు చేసుకున్నావు?" తార కోపంగా అడిగింది.
"నాన్న వేధింపు తప్పించుకోవాలనీ!"
"మరి నీ బోడి కండిషన్లన్నింటికీ ఒప్పుకుని నిన్ను మనఃస్ఫూర్తిగా కోరుకుని చేసుకున్న అతని సంగతేంటీ? ఇంత స్వార్ధపరురాలివనుకోలేను" చిరచిర్లాడింది తార.
"అతను నామీద ఆధిపత్యం చూపిస్తే నేను తట్టుకోలేను" మొండిగా అంది శక్తి.
"మీద చెయ్యి వెయ్యగానే అధికారం చూపిస్తాడనా నీ భయం?" నవ్వుతూ అడిగింది తార.
శక్తి ఔననీ, కాదనీ జవాబివ్వలేక "ఏమో! నాకు తెలియదు..." అంది.
తార దగ్గరగా వచ్చి ఆమె భుజంమీద చెయ్యివేసి, "దాంపత్యంలోని మాధుర్యం ఆ కలయికవల్లే నీకు అవగతమౌతుంది. ఇన్ని జంటలు పొద్దుగూకులూ పోట్లాడుకుంటూ, మళ్ళీ ఒక గూట్లోనే కలిసి ఎందుకు కాపురం చేయాలనుకుంటాయీ? అని నువ్వు ఎప్పుడూ విసుక్కుంటావే....అదెందుకో నీకు అర్ధం అవుతుంది" అంది.
శక్తి మొహం చిట్లించి "అందరిలో ఒకరుగా మేము కూడా అలా అయిపోతామా? నేను చచ్చినా అలా సర్దుకోను అతను నా వ్యక్తిత్వాన్ని గౌరవించకపోయినా, మగవాడిననే అహం చూపించినా నేను భరించలేను" అంది.
తార నవ్వి "నువ్వేది భరించలేవో.... ఏది సహించలేవో కాలం చెపుతుంది. ముందు అనవసరమైన అనుమానాలు మాని హాయిగా కాపురం చేసుకో మల్లెమొగ్గలు మాల కట్టిపెట్టాను. ఇంటికెళ్ళి స్నానం చేసి పెట్టుకో. అడిగానని అనుకోకు.... నీకు తెల్లచీర వుందా?" అంది.
శక్తి మొహం ఎర్రబడింది. "ఎందుకే అవన్నీ?" అంది.
"కన్నతల్లి జడ అల్లుతూ మొగుడ్ని ఎలా అల్లుకుపోవాలో చెపుతుంది. అక్కలు తలలో పూలు తురుముతూ మధురోహలు గుబాళించే మార్గాలు చెబుతారు. వరుసకు అత్తలు సరసపు మెలకువలు నేర్పుతారు. పిన్నిలు, పెద్దమ్మలు ముద్దు ముచ్చట్లతో వన్నెలకు చిన్నెలు కూరుస్తారు. పండు ముత్తయిదువులు కడుపు తొందరగా పండాలని దీవించి పంపుతారు.
అందుకే ఆ ముచ్చట్లకి అంతమంది తోడవుతారు. తెల్లచీర.... ఏ రాతాలేని పరిశుద్దమైన కాయితంలాంటి నీ మనసుని అతనిముందు పరుస్తుంది. అతను దానిమీద అనురాగం అనే సిరాతో వలపు సంతకం చేస్తాడు. ఆ కాంట్రాక్టుకి సాక్షులు పంచభూతాలు. మీకు మాత్రమే తెలిసిన మీరు మాత్రమే పంచుకున్న మధురక్షణాలు. నీ జడలో మల్లెలు..... పరిమళించుకున్న మీ సంసార బంధానికి గుర్తులు. నీ కంటికాటుక అతని బుగ్గన దిష్టిచుక్కై వెలవాలి. అతని పంటిగుర్తులు నీ పెదవులలోని మధువుని తాగి వాటి వాడిని తగ్గిస్తాయి. ఈ రుసరుసలు రేపట్నుంచీ 'హుష్... కాకీ!' అయిపోతాయి" అని కిలకిలా నవ్వింది.
"ఏమైనా నీకు చాలా ఓర్పే తారా! పగలంతా ఆఫీసులో చాకిరీ, సాయంత్రం ఇంటికొచ్చినప్పటినుంచీ చాకిరీ. శ్రీధర్ కోపతాపాలూ, ఇంటికొస్తూ పోతూ వుండేవారికి మర్యాదలూ అన్నీ చిరునవ్వుతో చేసుకుపోతావు. అంతేకానీ శ్రీధర్ తో ఎదురుతిరిగి నీలాగే నేనూ సంపాదిస్తున్నా నుగా ఇవన్నీ నేను ఒక్కదాన్నే ఎందుకు చేసుకోవాలీ? అని అడగవు! నీది గొప్పతనమో, పిరికితనమో నాకు అర్ధంకాదు" అంది శక్తి.
"ఇద్దరం సై అంటే సై అని పోట్లాడుకుంటే, రోజూ ఇంట్లో రభసే! ఆ గొడవలో పిల్లల గతేమిటీ? రెండుచేతులూ కలిస్తేనేగా చప్పట్ల మోత వినిపించేది! ఒక చెయ్యి తగ్గిపోతే పోలా?" అంది.
"నీలా నేను సర్దుకుపోలేను" తల విదిలిస్తూ అంది శక్తి.
"సరే.... చీకటి పడుతోంది. వెంటనే ఇంటికి వెళ్లి స్నానంచేసి నేను చెప్పినట్టు తయారవు. చేతులు కలిస్తే చప్పట్లు... పెదవులు కలిస్తే ముచ్చట్లు... అని మానెయ్యాలని చూడకు" అంది.
శక్తి నవ్వి బయల్దేరబోతూ, "ఏమిటో... అంతా కొత్తగా... కాస్త బెరుకుగా వుందే" అంది.
"పోనీ నేను సాయం రానా?" కొంటెగా అడిగింది తార.
"ఇది ఒకరు సహాయం చేసే విషయం కాదుగా! నేనే కష్టపడతానులే" అంది దిగులుగా.
తార పెద్దగా నవ్వి "పరీక్షకెళ్ళే విద్యార్ధిలా ఆ మొహం ఏమిటీ? శక్తి నీ పేరని మర్చిపోయావా? ఆల్ ది బెస్ట్" అంది.
"థాంక్యూ! శక్తి బ్యాగ్ తీసుకుని ఇంటిదారి పట్టింది.
ఏదియో అపూర్వ మధురరక్తి స్ఫురియించు కాని అర్ధమ్ము కాని భావగీతమ్ములని..." అన్న కవితాభావనలా శక్తి కనులు చంచలంగా తిరుగాడసాగాయి.
ఇంద్రనీల్ ఆమె భుజలని పట్టి తనవైపు తిప్పుకున్నాడు.
"నిన్నటిలా తేలుచేత కరిపిస్తావా?" నవ్వుతూ అడిగాడు.
ఆమె కళ్ళలో ఆశ్చర్యం!
అతను నవ్వి ఆమె పాపిటిలో ముద్దుపెట్టాడు.
"ఝాన్సీలక్ష్మికి భయమా?" ఆట పట్టించాడు.
"భయం అని ఎవరన్నారూ?" రోషంగా అడిగింది.
"ఇవి!" వణుకుతున్న ఆమె అధరాల్ని తన వేలితో రాస్తూ చెప్పాడు.
అప్రయత్నంగా ఆమె కనురెప్పలు వాలిపోయాయి.
అతని పెదవుల వెచ్చని స్పర్శ యమునా నదీతీరాన వినిపించిన వేణుగానమై ఆమె ఎదసవ్వడిని రాగరంజితం చేసింది.
తల అటూ ఇటూ తిప్పి ఆమె అలరింపు మొదలుపెట్టింది.
చేతుల ముద్రలు శృంగార వేదికని ఆవిష్కరించాయి. నాలుగుపాదాల లయ విన్యాసాలు జగతిన మరోకొత్త నాట్యతరంగమై వెల్లివిరిశాయి.