"చేసుకుని చావలేకపోయావా మరీ! నేనూ కరణంగారి మనవరాల్ని పెళ్ళాడిది నాలుగెకరాలు ఇచ్చుండేవారు. కౌలుకిచ్చుకుని కాలిమీద కాలేసుకుని దర్జాగా బతికేవాణ్ని."
"మీ మొహానికి నాలుగెకరాలు. నా రాత ఇట్లా మండిపోయి ఆ పేరిశాస్త్రిని కాదన్నాను కానీ..."
"మళ్ళీ అదే కూత!"
ధభీ దభీమని చప్పుడు.
"ఓర్నాయనోయ్... చంపేస్తున్నాడు.... రక్షించండి" మీనాక్షి కేకలు.
"చావవే... పీడా పోతుందీ!"
"వచ్చే జన్మలో మాత్రం ఇట్లాంటి మొగుడొద్దురా భగవంతుడా! యాయవారం చేసుకునే వాడైనా పర్లేదు."
"ఆ మాటే అనద్దంటే..." మళ్ళీ వీపుమీద దరువులు, మీనాక్షి శోకం.
శక్తి బయటికి వచ్చి చూసింది.
మామ్మగారు, తాతగారూ తమలపాకులు సున్నం రాసుకుని వేసుకుంటూ వసారాలో కూర్చుని వున్నారు.
"ఏవిటండీ ఈ గోలా? తనతో సమానంగా వున్న చెట్టంత మనిషిని పట్టుకుని అతను గొడ్డుని బాదినట్లు బాదడం ఏమిటి? అప్పుడే ఊహ తెలుస్తున్న పిల్లలకెలా వుంటుందీ?" అంది వాళ్ళతో శక్తి.
ఇంద్రనీల్ అటొచ్చి తాడుమీద బట్టలు ఆరేస్తూ "ఆవిడమాత్రం అన్నిసార్లు ఆ అగ్రహారం సంబంధం సంగతి చెప్పడం ఎందుకూ? ఆ మాట వినగానే ఆయన శివాలెత్తి అతనిమీద విరుచుకుపడింది.
తాతగారు గాభరాగా "వాళ్ళకి అది రోజూ అలవాటే మధ్యలో మీరు కీచులాడుకోకండి. అసలే కొత్త దంపతులు" అన్నారు.
"అదికాదు తాతగారూ! ఈయనగారు ఆయనగారిని వెనకేసుకురావడం బావుందా?" ఎరుపెక్కిన కళ్ళతో అడిగింది శక్తి.
"ఆవిణ్ణి ఆయన కొట్టడం అన్న విషయం అగ్రహారం సంబంధం, అదేవిటీ... పేరిశాస్త్రి మాటెత్తితేనే కదా! లేకపోతే ఆయనకంత కోపం వచ్చేదే కాదుగదా?"
"అంటే.... కొట్టడం చాలా ఒప్పనా మీ అభిప్రాయం?" శక్తి నడుంమీద చేతులు పెట్టేసి పోట్లాటకి సిద్దమవుతున్నట్లుగా అడిగింది.
"పేరిశాస్త్రి పేరెత్తడం కరెక్టా?"
"నిక్షేపంలా! పేరిశాస్త్రిని చేసుకుని వుంటే నిజంగా ఇంతకన్నా బావుండేదేమో!"
"ఏ బిర్లాగారి అమ్మాయినో చేసుకుని వుంటే నేనూ ఇలా బట్టలు వుతుక్కుంతూ వుండక్కర్లేదు. సొంత విమానం కొనుక్కుని తిరిగేవాణ్ణి అంటే నువ్వు భరించగలవా?"
"బిర్లాగారి అమ్మాయి నాలా సముద్రంలో దూకడానికి వస్తేకదా నీ కళ్ళబడటానికి?"
"పడిందే అనుకో!"
"నువ్వు వాటేసుకోగానే అమ్మాయి బాడీగార్డులు నీ చేతులు, కళ్ళు విరగ గొట్టేవారు అప్పుడు నువ్వు కామాక్షీదేవి ఆలయందగ్గర బల్లమీద పడుకుని అడుక్కోవలసి వచ్చేది."
"అబ్బబ్బా! మీరు ఊర్కోండర్రా!" మామ్మగారు శక్తి దగ్గరికొచ్చి "అవేం మాటలమ్మా! కాళ్ళపారాణి ఇంకా ఆరనేలేదు. మొగుణ్ని పట్టుకుని అవేం అంతలేసి మాటలంటావా?" అంది.
శక్తి చిరాగ్గా "వందరోజుల పండగదాకా ఆగి అనాలా?" అంది.
ఇంద్రనీల్ మామ్మగారితో "వాదనాపటిమ లేనిచోటే దూషణొస్తుంది మామ్మగారూ" అన్నాడు.
"అబ్బో- నీకుంది వాదనాపటిమ. పగలల్లా చాకిరీచేసి డబ్బు సంపాదించి, సాయంత్రం ఇంటికొచ్చినప్పటినుంచీ అలసిపోయేంత పనిచేసిన భార్యమీద తిని కూర్చుని జులుం చేసేవాణ్ణి వెనకేసుకొస్తావా?" అంది.
"పగలల్లా ఇంట్లో కూర్చుని ఏమీతోచక తన్నుకుంటున్నవాడికి తెలుస్తుంది భార్యతో ఎందుకు గొడవపడ్తాడో?" అన్నాడు ఇంద్రనీల్.
"ఓహో... కానీ ఖర్చులేని ఎంటర్ టైన్ మెంటన్నమాట..." వ్యంగ్యంగా అంది శక్తి.
శక్తిమతి, ఇంద్రనీల్ గొడవపడుతుండగానే సదానందం ధుమధుమ లాడుతూ భుజంమీద కండువా దులిపివేసుకుంటూ వాళ్ళముందునుంచే గేటు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు.
మీనాక్షి వెనకనుంచి "ఏవండీ.... ఏవండీ.... మీకు ఇష్టమని తోటకూర పులుసు వండాను. ఒక్కముద్ద తినివెళ్ళండీ...." అంటూ జారిన సిగని చుట్టుకుంటూ వచ్చింది.
శక్తి మీనాక్షి దగ్గరకెళ్ళి "ఒక్కపూట ఆయన తినకపోతే ఏవీ కొంప మునిగిపోదుగానీ.... నువ్వూ, పిల్లలూ తిని పడుకోండి" అంది.
మీనాక్షి కళ్ళనీళ్ళు పెట్టుకుని "పొద్దుట వుట్టి చారు పెట్టానని సరిగ్గా తినలేదుట. ఈ పూట పాపిష్టిదాన్ని తగాదా వేసుకుని తరిమేశాను" అంది.
ఇంద్రనీల్ బకెట్ పట్టుకుని వెళుతూ "ఏవైనా పేరిశాస్త్రి విషయం ఎత్తకుండా వుండాల్సింది" అన్నాడు.
"మళ్ళీ అదేమాట.... అంటే అంత పౌరుషం పొడుచుకురావాలా?" శక్తి అడ్డు తగిలింది.
"నీకు తెలీదు. మధ్యలో అడ్డురాకు ఆవిడతో మాట్లాడనీ."
"నీకు తెలుసా పేరిశాస్త్రి విషయం?"
"మధ్యలో నీ గోలేమిటి?"
"అసలు నీకెందుకు ఈ మధ్యవర్తిత్వం?"
మీనాక్షి బిత్తరబోయి చూస్తూ నిలబడింది.
శక్తీకీ, ఇంద్రనీల్ కీ మాటా మాటా పెరిగిపోతోంది.
"నీ పేరులో రెండోసగం నీకు లేదని ఇప్పుడే తెలిసింది నాకు" అక్కసుగా అన్నాడు.
"వుంటే నిన్నెందుకు చేసుకుంటానూ?" అంది శక్తిమతి.
"కట్నం ఇచ్చి ఏ ఇంజనీర్నో కొనుక్కోవలసింది"
"కట్నం ఇచ్చేదాన్నో, అద్దెకి తెచ్చుకునేదాన్నో..." ఉక్రోషంతో ఆమె ముక్కుపుటాలు అదిరిపడుతున్నాయి.