ఆకలి తీరింది
"ఒసేయ్ ....మొద్దూ ....లే ఎంతసేపు నిద్ర? అవతల బోలెడు పనుంది.... లేలే... అపక్కలు మడత పెట్టుకుని ఓ మూల తగలేసి లోపలికి రా..." భ్రమరాంబ బిగ్గరగా అరుస్తూ చేతిలో ఉన్న అట్లకాడ తో గాడనిద్రలో ఉన్న పార్వతిని వీపు మీద ఒక్కటేసింది. పార్వతి ఉలిక్కిపడి , బిత్తర చూపులు చూస్తూ లేచి కూచుంది.
"ఏవిటీ అలా దిక్కులు చూస్తావు.... ఇవాళ ఇంట్లో పూజ ఉంది... త్వరగా లెమ్మని చెప్పనా రాత్రి.... లే ఇంక..."మరోసారి బిగ్గరగా అరుస్తూ లోపలికి వెళ్ళి పోయింది భ్రమరాంబ.
పార్వతి మూసుకుపోతున్న కళ్ళు బలవంతంగా తెరుస్తూ బద్ధకం వదిలించుకుంటూ లేచి దుప్పటి మడత పెట్టసాగింది. దాని కళ్ళు ససేమిరా తెరవనంటున్నాయి. రాత్రి పడుకునేటప్ప టికీ బాగా పొద్దు పోయింది. దాదాపు నాలుగు రోజుల్నుంచీ బోలెడంత పని.... ఇంటికి చుట్టాలు, పక్కాలు, రావడం వాళ్ళందరికీ నీళ్ళు, కాఫీలు, టిఫిన్లు అందించడాలు.... అంట్లు తోమడాలు, బట్టలు ఉతకడాలూ... పిల్లలని ఆడించడం....అసలు నిద్రపోడానిక్కూడా టైం ఉండడం లేదు.ఎలాగోలా పన్నెండు అవుతోంటే , ఎంతో జాలిగా పోవేపడుకో పో,పెందలాడే లేవాలి సుమా.... అంటూ అమ్మగారు పడుకోడానికి పర్మిషన్ ఇస్తే ....మెల్లిగా వరండాలో మూల తనకిచ్చిన చినిగిన చాప,పర్చుకుని ,దాని మీద మరో చినిగిన దుప్పటి వేసుకుని పడుకోగానే నిద్ర కమ్మెస్తోంది. మళ్ళీ తెల్లవార కుండానే చీకట్లు తొలగి పోకుండానే లేపెస్తున్నారు. చేసేపనికి తీసుకుంటున్న విశ్రాంతి సరిపోవడం లేదు.
"ఏవే...లేచి చచ్చావా?" లేదా? త్వరగా వచ్చి ఈ గిన్నెలు తోమివ్వు" భ్రమరాంబ స్వరం ఈసారి మరింత బిగ్గరగా వినిపించడంతో నిద్రాదేవత బెదిరి పారిపోయింది.
"వత్తున్నానమ్మగారూ..." అంటూ మడత పెట్టిన చిరుగుల దుప్పటి, చింకి చాప తీసుకుని పెరటి వైపు నడిచి, జామ చెట్టు వెనకాల దాచుకుంది. ఆ రెండు వస్తువులు ఇంట్లో పెట్టకూడదు. అక్కడి నుంచి పెరట్లో ఓ మూలాన ఉన్న చిన్న గదిలో , అయ్యగారు చేస్తున్న వ్యాపారం తాలుకూ పనికిరాని చెక్క వస్తువులు దాచిన గదిలో దాచుకున్న తన పాలిదీన్ కవర్ తీసుకుని, బ్రేష్షు , నాలిక బడ్డ, పేస్టు తువ్వాలు తీసుకుని పంపు దగ్గరకు నడిచింది. పళ్ళు తోముకుని, అక్కడే చలితో వణికిపోతున్న శరీరాన్ని బలవంతంగా చన్నీళ్ళ తో తడిపి స్నానం కానిచ్చింది. గౌను మార్చుకో బోతూ ఓసారి ఆలోచించింది.... ఇవాళ పూజ ఉంది ఇంట్లో ... ఇంటికి ఊళ్ళ నించి వచ్చిన అమ్మగారి పిల్లలు, వాళ్ళ భార్యలు, పిల్లలు,అత్తగార్లు, మావగార్లు ఇతర బంధువులే కాక ఊళ్ళో ఉండే అనేక మంది స్నేహితులు , చుట్టాలు వస్తారు. వాళ్ళందరి ముందు తను చినిగిన గౌను వేసుకుని తిరగాలంటే మనసొప్పడం లేదు. అంతా ఖరీదైన బట్టల్తో, వంటి నిండా నగలతో ఉంటె తానెప్పుడూ చిరిగిన బట్టలు కట్టుకుని, చాకిరీ చేస్తూ , మంచినీళ్ళు, కాఫీలు, అందిస్తూ ఆ ఎంగిలి గ్లాసులు, పళ్ళాలు కడుగుతూ ఉండాల్సి వస్తోంది. ఈ పని ఎలాగా తప్పదు. కనీసం మంచి గౌనన్నా వేసుకోవాలి అనుకుంటూ కవర్లో దాచిన నాలుగు గౌన్లు కింద పారేసి, వాటిలో చిరుగులు లేని గౌను కోసం వెతికింది. ముదురు నీలం , లేత రంగులా మారిన పాత గౌనొకటి తీసుకుని వేసుకుంది. జడ వేసుకుని, పక్కింటి సుగుణ నడిగి కాగితంలో పొట్లం కట్టి తెచ్చుకున్న పౌడరు రాసుకుంది. బొట్టు బిళ్ళ మొహానికి తగిలించుకుని వంటగది గుమ్మం దగ్గరకు నడిచి "అమ్మగారూ ...గిన్నెలిత్తారా ?' అడిగింది.
"స్నానం చేసి చచ్చావా?" ఆ పాచి మొహంతో తగలడ్డావా?" అడిగాననుకుంటూ అరిచింది భ్రమరాంబ.
ఈ అమ్మగారి గొంతు సన్నగా ఎప్పుడవుతుందో అనుకుంటూ చేసానమ్మ గారూ..." అన్నది.
"ఇలారా ...ఇవి తీసికెళ్ళి తోమి పట్రా...." తలుపు దగ్గరగా పెట్టి స్టీలు గిన్నెలు రెండు, ఒక నాలుగు గిన్నెల గుత్తి, రెండు స్టీలు బకెట్లు తోసింది.
నిన్ననే ఉదయాన్నే వంటవాళ్లు వస్తారు గిన్నెలు కావాలి అంటూ టెంటు వాళ్ళదగ్గర అద్దెకు తీసుకొచ్చిన పెద్ద పెద్ద ఇత్తడి గంగాళాలన్నిటినీ చింతపండు పామి తోమింది. అవన్నీ తోమి, తోమి చేతులు మంటగా ఉన్నాయి. కానీ అలా అని అమ్మగారికి చెప్పలేదుగా....మౌనంగా వంగి ఆ గిన్నెలను తన వైపు జరుగుకుని తీసుకుంది పార్వతి.
లోపలి నుంచి కమ్మటి వాసనలు వస్తున్నాయి. లడ్డు పాకం పడుతున్న చక్కర వాసన... పార్వతి పేగులు ఆశగా కదిలాయి. ఇవాళ పండగ. అయ్యగారికి అరవై ఏళ్ళు నిండాయిట. ఇవాళ, అయ్యగారికి, అమ్మగారికి మళ్ళీ పెళ్ళి చేస్తారుట. వారం రోజుల నుంచీ ఈనాటి పండుగ కోసం ఇంట్లో ఆర్బాటం, హడావుడి , చర్చలు, ఎవరెవరిని పిలవాలి? ఏమేం వంటలు చేయించాలి/ ఎలా చేయించాలి? అని తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈపండుగ సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ స్వామి కధ కూడా చెప్పిస్తారుట. ఆకదంటే పార్వతికి చాలా ఇష్టం. ఇదివరకు కూడా రెండు సార్లు అమ్మగారు ఇంట్లో ఈ కధ చెప్పించారు. అనేక కష్టాలు పడ్డ వాళ్ళంతా ఆకధ చెప్పించుకుంటే ఆ కష్టాలు తీరాయి కధలో, అమ్మగారు వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఎప్పుడూ చూసినా.
పార్వతి చిన్న మనసులో హటాత్తుగా ఓ అనుమానం కలిగింది. అమ్మ ఎందుకు ఈ కధ చెప్పించలేదింట్లో....ఆమె చేసి, ఉంటె తను కష్టాలు కూడా తీరేవిగా. ఇవాళ గుప్పెడు మెతుకుల కోసం తనకీ బండపని చేసే ఖర్మ ఉండేదికాదుగా. నాన్న అమ్మని వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదుగా, కనీసం వెళ్ళిపోయాకనైనా ఈ కధ చెప్పించి ఉంటె తిరిగి వచ్చేవాడుగా....తననీ, తమ్ముడినీ, అక్కనీ, అమ్మనీ ప్రేమగా చూసేవాడు. తను గుడిసె దగ్గరే ఉండే రాములమ్మ పిల్లల్లాగా తనూ, అక్కా, తమ్ముడు కూడా స్కూలు కు వెళ్ళేవాళ్ళు. అక్కడ మధ్యాహ్నం స్కూలు వాళ్ళు పెట్టె అన్నం తినేవాళ్ళు. ఎంత బాగుండేది! అమ్మకి బహుశా తెలియదేమో.... అమ్మ ఎప్పుడూ విని ఉండదు. ఎన్నాళ్ళయింది అమ్మనీ, అక్కనీ, తమ్ముడి ని చూసి. అమ్మ, అక్క, ఆ పల్లె టూల్లో దొరగారింట్లో పని చేస్తున్నారట. తమ్ముడిని ఎవరో పెద్దింటి వాళ్ళు తీసి కెళ్ళారుట. వాడిని కూడా ఏడాది కోసారి రెండు రోజుల కోసం పంపిస్తారుట అమ్మ దగ్గరకు. అమ్మ ఉత్తరం రాసింది. కానీ, తను ఈ ఇంటికి వచ్చి రెండేళ్ళు అవుతోంది. ఇంతవరకు మళ్ళీ అమ్మ దగ్గరకు వెళ్ళలేదు. ఒకసారి అమ్మగారిని ఊరు వెళతానని అడిగితె, "ఎక్కడికే వెళ్ళేది? వెళ్ళి అక్కడ ఏం తింటావు? మీ అమ్మకే గతిలేదు. నీకేం పెడుతుంది....హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఇక్కడ ఉండక వెళ్తానంటావెం? మీ అమ్మనే రమ్మని ఉత్తరం రాయి, వచ్చి చూసి వెడుతుంది....' అంటూ గదిమింది భ్రమరాంబ. అసలు సంగతి అది కాదు.... తను వెళితే, ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉండరు. ఆవిడ మనవడిని స్కూల్లో దింపేవాళ్ళు, తీసుకొచ్చే వాళ్ళు ఉండరు. ఏడాది వయసున్న మనవరాలిని ఎత్తుకు తిప్పేవాళ్ళు ఆడించేవాళ్ళు ఉండరు. ఈ పనులన్నీ తానె చేయాలి. మనవరాలి పేరు ఆర్తి.... ముద్దుగా బొద్దుగా ఉంటుంది. ఆ పాపని ఆడించడం, ఒక్కటే తన కిష్టమైన పని. ఇంక మిగతా పనులన్నీ అయిష్టంగా, బలవంతంగా చేస్తోంది. ఆకలికి ఆగలేక, అన్నం కోసం చేస్తోంది. రెండు పూటలా మిగిలిన చద్దన్నం, అంతో ఇంతో మిగిలిన పప్పు, ఇంత పచ్చడి వేసి అమ్మగారు అన్నం పెడతారు. ఆ అన్నం కోసం ఎంత పనైనా చేయాలని పోస్తుంది. ఏం చేయాలి మరి? అన్నం ఎవరు పెడతారు? ఆ అన్నం లేకేగా.... రోజులకి రోజులు రాములమ్మ వార్చిన గంజినీళ్ళు అడుక్కొని తాగేవాళ్లు..... ఈ పని మానేస్తే మళ్ళీ ఆ గంజే దిక్కేమో అని భయం వేస్తుంది. గంజి తాగితే ఆకలి తీరదు. నీరసం వస్తుంది. ఇప్పుడు చక్కగా అన్నం తింటుంటే హాయిగా ఉంది. పచ్చడి మెతుకులు కూడా పార్వతికి రుచిగానే ఉన్నాయి. అమ్మగారు వాళ్ళు రెండు కూరలు, పప్పు, పెరుగు ,పచ్చడి వేసుకుని తింటారు. మధ్యమధ్య పళ్ళరసాలు తాగుతారు. తనకీ పళ్ళరసం తాగాలనీ, పండు తినాలని అనిపిస్తుంది. వాళ్ళు రసం తీసుకుని, పారేయమని ఇచ్చిన బత్తాయి చెక్కలు వలుచుకు తింటుంది పార్వతి. అవే ఆ పిల్లకేంతో రుచిగా అనిపిస్తాయి.
"ఎంతసేపే....అయిందా?" భ్రమరాంబ స్వరంతో ఉలిక్కిపడి, తోమినగిన్నెలు చకచకా కడిగి లోపల పెట్టింది. "వాకిలూడ్చి ముగ్గేసిరా...త్వరగా చేయి పనులు....జాగు చేయకు....ఈలోగా పిల్లలు లేస్తారు....గదులు తుడిచెయ్... ఎక్కడికి? వంట గదిలోకి వస్తావా? వెళ్ళు దూరంగా ఉండు.... ఆ గిన్నేలక్కడ పెట్టు....నేను తొల్చి తీసుకుంటా" గబగబా పెద్ద స్వరంతో అరుస్తూ చేయాల్సిన పనులు పురమాయించింది.