కానీ, ఆ గౌరవాలు, ఆరక్షణ వలయాలు అభద్రతా జీవితం తనకి ఏవగింపు అతనింట్లో ఆ రక్తపు కూడు తినాలంటే అసహ్యం. ఆ పటిష్టమైన భవనం నుంచి, అతని భార్య అన్న పంజరపు బతుకు నుంచి పారిపోవడానికి ఎంతో ప్రయత్నించింది.... ప్రతిఘటించింది. పెళ్ళాం వదిలేసిందని ప్రజలకి తెలిస్తే చెడ్డపేరు వస్తుందని కాపలా కుక్కల్ని పెట్టి కదలకుండా చేశాడు. బలవంతంగా హిమబిందు మిసెస్ రాజారావు గా వుండి పోవాల్సి వచ్చింది. అయిష్టంగా, అసహ్యం గా వాడి రాక్షస రతి నుంచి జనించిన పిల్లలు.... దురదృష్టవశాత్తూ ఆడపిల్లలు... అయినా ఈ పాప కార్యంతో ఎటువంటి సంబంధం లేని పసివాళ్ళ ని, తను ప్రేమించింది. వాళ్ళ కోసం వాళ్ళని తండ్రి లేని వాళ్ళుగా చేయకూడదని భావించింది. ఒక దుర్మార్గుడిని, పరమ నీచుడిని భర్తగా.... అతని పడగ నీడలో జీవితం వెళ్ళ బుచ్చింది. క్షణం క్షణం భయపడుతూ, ప్రతి చిన్న సవ్వడి కీ బెదిరిపోతూ , ఏ క్షణంలో ఏ ఉపద్రవం వస్తుందో అని అదిరిపడుతూ పిల్లలు ఎదుగుతున్నరని భయపడుతూ ఎదిగిన కొద్దీ ఆ నీచుడి కళ్ళకి వీళ్ళు కూడా వ్యాపార వస్తువులుగా కనిపిస్తారేమో నని... భయం గుప్పిట్లో బతుకు పెట్టుకుని చస్తూ బతికింది.
"హమ్మయ్యా"...ఆరోజు సరిగ్గా నాలుగు నెలల క్రితం....ఎంత మంచి వార్తా వింది.
ఎన్నికల ప్రచారానికి సిద్ధిపేట వెళ్ళిన ఎవరో దుండగులు కిరతాకంగా కాల్చిచంపారని టివిలో ఫ్లాష్ న్యూస్. పిల్లలకి అన్నం పెడుతోంటే కనిపించింది. అత్తగారు గుండెలు బాదుకుంది. కానీ, తను నింపాదిగా పిల్లలకి అన్నం పెట్టేసింది. అదేంటో! చిత్రంగా తనకి బాధ కలగలేదు. దుఃఖం రాలేదు. భయం వేయలేదు. ఎంతో నిశ్చింతగా , ఎవరో వచ్చి తన చుట్టూ వున్న క్రూర సర్పాలను చేత్తో విసిరి పారేసినంత హాయిగా నిట్టూర్చింది.
తానిప్పుడు మిసెస్ రాజారావు కాదు....ఎంత బాగుంది కొత్తగా లభించింది ఈ స్వేచ్చ...
ఒక రాక్షస సంహారం జరిగితే పండగ చేసుకున్న ప్రజల్లాగా కేరింతలు కొట్టాలనిపించింది. కళ్ళ ముందు పునర్జన్మ పొందిన ఎందరో అమాయకులు కదలాడారు. ఎవరో అతడిని కాల్చి చంపిన వీరుడు. అతడిని పూలదండతో సత్కరించాలని పించింది. తను చేయలేని ఓ మహత్కార్యాన్ని ధైర్యంగా చేసిన అతనికి మనసారా కృతజ్ఞతలు అర్పించాలని పించింది.
ఆరోజు గుర్చోచ్చింది. ఆమె కళ్ళ ముందు ఆనాటి సంఘటన, సన్నివేశం కదలాడాయి.
రాజారావు అన్నలు, తమ్ముళ్ళు అతని ఆఖరి ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నారు.
అప్పటికి ఆమె నిర్వికారంగా నెల చూపులు చూస్తూ అక్కడే కూర్చుని వుంది.
ఆమెకి కొంచెం ఎడంగా అతను నిర్జీవంగా పడుకుని వున్నాడు. బాగా స్పురద్రూపి అయిన అతని శరీరం చాలా స్థలం ఆక్రమించింది. తెల్లటి దుప్పటి లో అతని శరీరం కప్పి వుంది. కేవలం ఒక చాప మీద అతను పడుకుని ఉన్నాడు. అతని తల దగ్గర చిన్న ప్రమిదలో దీపం వెలుగుతోంది.
చుట్టూ వున్న వాళ్ళంతా ఏడుస్తున్నారు. ఆమె కళ్ళ నుంచి నీటి చుక్క రాలడం లేదు. కళ్ళు గాజు కళ్ళలా వున్నాయి. నిశ్శబ్దంగా రాయిలా కూర్చుని వుంది.
కొందరు పరామర్శలకు వచ్చిన బంధువులు, స్నేహితులు ఆమెని ఆశ్చర్యంగా చూస్తున్నారు. గుండె పగిలేలా ఏడుస్తుందనుకుంటే ఇలా మౌనంగా వుందేంటి? ఏడవదేంటి? ఈమెకి బాధ లేదా? మొగుడు అంటే ప్రేమ లేదా? ఇలా రకరకాల ప్రశ్నలు వాళ్ళ మనుషుల్లో మెదులుతున్నాయి.అవన్నీ స్పష్టంగా కళ్ళల్లో ప్రతిఫలిస్తుంటే ఆమెనే చూస్తున్నారు. ఆమె కళ్ళల్లోంచి రాలిపడే కన్నీటి చుక్కలు లెక్కబెట్టడానికి కాబోలు ఎంతో ఉద్విగ్నంగా చూస్తున్నారు. అవన్నీ తనకేం పట్టనట్టు, ఇద్దరు ఆడపిల్లల్ని చేరోవేపు కూర్చో బెట్టుకుని మౌనంగా కూర్చుంది ఆమె.
విశాలమైన ఎసి గదిలో, డన్ లప్ పరువు మీద మఖామల్ దుప్పట్లు కప్పుకుని, దర్జాగా పడుకునే అతను కేవలం చాప మీద వున్నాడిపుడు'....నానా దుర్మార్గాలు చేసి సంపాదించినా డబ్బులో ఒక్క రూపాయి కూడా అతని వెంట పోవడం లేదు. పొందిన పదవులు, అధికారాలు ఏవీ కూడా అతని వెంట లేవు. మరి అవన్నీ ఎందుకు చేసినట్టు? ఎప్పుడూ పాతికమంది పార్టీ కార్యకర్తాలతో తిరుగుతూ, మరో పాతికమంది శాసనసభ్యులతో నిత్యం మందులో మునిగితేలే అతని వెంట ఒక్కరూ పోవటం లేదేం.
"అమ్మా హిమా! ఒక్కసారి గొంతు విప్పి ఏడుపు తల్లీ... దుఃఖం గుండెల్లో వుండకూడదు." పిన్నత్తగారుఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి ఏవో చెప్తోంది.
హిమబిందుకు నవ్వాలని అనిపించింది. విరగబడి నవ్వాలనిపించింది.
"నువ్విలా అయితే, ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు? వాళ్ళ కోసమన్నా నువ్వు గుండె దిటవు పర్చుకోవాలి" ఇంకెవరో అంటున్నారు.
తనకసలు దిగుల్లేదు. ఇకనుంచీ పిల్లల్ని తానెంతో బాగా పెంచుకాగలదు. తన ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా ఫలానా పిల్లల తల్లి ఈమె అని అందరూ అనుకునేంత గొప్పగా గర్వంగా పెంచుకోగలదు.
"సి.ఎం. గారు వస్తున్నారు" అంటూ సెక్యూరిటీ గార్డ్ హడావుడిగా వచ్చాడు.
అక్కడ చేరిన వందలమంది జనం లేచి నిలబడ్డారు.
తెల్లటి బట్టల్లో సి.ఎం అయన వెనకాల పి.ఏ గన్ మాన్ , ఎందరో ఇతర మంత్రులు, శాసనసభ్యులు వెంటరాగా మహారాజులా వచ్చాడు. ఆయనతో పాటే ఖరీదైన ఫేర్ ప్యూమ్ పరిమళం కూడా అక్కడ చేరింది.
ఆమె మౌనంగా లేచి నిలబడింది. పి.ఏ చేతుల్లోని పూలదండ సి.ఎం కి అందించాడు. అయన నేరుగా అతని దగ్గరకు నడిచి దండ అతని మీద పెట్టి నమస్కరించాడు. ఆ వెనకాలే మరెన్నో పూలదండలు అతని శరీరం కనిపించ కుండా....తిరిగి అందరూ ఆమె దగ్గరకు వచ్చారు.
సిఎం గారు స్వరం ఓదార్పుగా.... "భాదపదకమ్మా ....అధైర్య పడకు మేమంతా ఉన్నాం. హంతకుడు ఎవరైనా వాడిని ఉరికంబం ఎక్కించి తీరతాం. ప్రతుపక్షాల పనే అని మాకు తెలుసు. సరైన అధారాలు దోరకగానే వాడి పని పడతాం...."
ఆమె ఏమీ మాట్లాడలేదు. ఖరీదైన అతని బట్టల్లాగే వున్న ఖరీదైన మాటలు వింటోంది.
"వేళ మించి పోతోంది కార్యక్రమం జరిపించండి." ఎవరో అన్నారు.
హడావుడి మొదలైంది. ఎన్నో ఏర్పాట్లు...అతడి బౌతిక కాయాన్ని నలుగురు అన్నదమ్ములు తీసికెళ్ళి బైట అతని కోసం , అతని చివరి ప్రయాణానికి తయారు చేసిన కట్టెల వాహనం మీద పడుకో బెట్టారు. అందరూ కన్నీళ్లు పెడుతున్నారు. పిల్లలు భయంగా తల్లిని కరుచుకుని కూర్చున్నారు. అమెకదెం తెలియడం లేదు. కళ్ళ ముందు ఏవో దృశ్యాలు.... ఇక నుంచీ తను మిసెస్ రాజారావు కాదు. ఇంక ఏ రాజాకీయాలతో తనకేం సంబంధం లేదు. తనిప్పుడు స్వేచ్చా జీవి.
"రామ్మా!" ఒకసారి, ఆఖరి సారి మొహం చూడు తల్లి వచ్చి" బలవంతంగా భుజం పట్టుకుని బైటికి తీసుకెళ్ళింది . అతని మొహం నిర్వికారంగా, నిశ్చలంగా వుంది. బతికున్నప్పుడు కనిపించిన క్రూరత్వం లేదు. దీనంగా అనిపిస్తోంది. "నాతొ ఎవరూ రారా" అని అడుగుతున్నట్టు అనిపించింది. బియ్యం గుప్పెడు తీస్ అతని నోట్లో పోయాలట. ఆమె చేతుల్లోంచి ఎటో జారిపోయాయి. ఆమె మళ్ళీ మౌనంగా వచ్చి నిలబడింది. అందరూ చిత్రంగా చూస్తున్నారు.
"పాపం హటాత్తుగా విన్న వార్తతో షాక్ తింది. జాగ్రత్తగా చూడండమ్మా ఆవిడ్ని. పాపం చిన్న పిల్లలున్నారు" సి.ఏం గారు అత్తగారితో అంటున్నారు.
ఆవిడ కుమిలి కుమిలి ఏడుస్తోంది.
ఒక్కసారిగా గోల అరుపులు, జిందాబాద్ లు, అమర్ రహేలు, ఏడుపులు, అతని ప్రయాణం సాగింది. అసెంబ్లీ వైపు కాదు స్మశానం వైపు.
హిమబిందు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించినట్టు అయి ఉలిక్కిపడింది.
"అమ్మా హోం వర్క్ అయిపొయింది.అన్నం పెడతావా?" రమ్య అడిగింది.నవ్య టేబిల్ పైన తల పెట్టుకుని నిద్రపోతోంది.
"అయ్యో!" హిమబిందు నవ్యని మృదువుగా లేపి, "రా తల్లీ అన్నం తిని పడుకుందువు గానీ " అంటూ లోపలికి తీసికెళ్ళింది. పిల్లలిద్దరూ అన్నాలు తిని పడుకున్నారు.
హిమబిందు కి నిద్ర పట్టలేదు. అమాయకంగా కల్మషం లేని మొహాలతో హాయిగా, నిశ్చింతగా నిద్రపోతున్నారు పిల్లలు. ఎంత అమాయకులు?భవిష్యత్తు లో ఈ దేశం ఎలా వుంటుందో , తమ భవిష్యత్తు ఎలా వుంటుందో అనే ఆలోచన లేకుండా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు!
వీళ్ళని బాగా చదివించాలి. ఈ రాజకీయాలకు దూరంగా పెంచాలి. ఐ.ఎ.యస్ , ఐ.పి.యస్ , డాక్టర్స్ , ఇంజనీర్స్ ఇలా ఉన్నత చదువులు చదవాలి వీళ్ళు. చదివాక! ఆమె మనసులో హటాత్తుగా ఒక ప్రశ్న మెదిలింది. అవును చదివాక ఏం చేయాలి? ఐ.ఏ.ఎస్ లు, ఐ.పి.ఎస్ లు మంత్రుల చేతుల్లో జీలుబోమ్మలు, వాళ్ళెలా చెబితే అలా వుండాలి. స్వంత నిర్ణయాలు తీసుకోకూడదు. స్వంత ఆలోచనలు చేయకూడదు. స్వంత ప్రణాళికలు వేయకూడదు. ఎన్ని ఆదర్శాలున్నా ఎన్ని మంచి ఆలోచనలున్నా అన్నీ వ్యర్ధం మరేం చేయాలి? వీళ్ళ భవిష్యత్త్రేంటి? ఇంజనీర్ల ను చేసి అమెరికా పంపించాలా? యువత మొత్తం అమెరికా వెళ్ళిపోతే, ఈ దేశం ఇలా వృద్ద జంబూకాల చేతుల్లో ఏమైపోతుంది? వీళ్ళే ఈ గుండాలు, ఖూనీ కోరులు, అవినీతి పరులు, స్వార్ధ పరులు, ధనమదంధులు , కామందులూ వీళ్ళే ఈ దేశాన్ని ఎలతారు. ఈ దేశం ఎవరిది? ఈ నాయకులంతా ఎవరు? ఎవరి వలన వీళ్ళు నాయకులు అయ్యారు? ప్రజల వలన, ప్రజల చేత , ప్రజల కొరకు నాయకులైన వీళ్ళంతా ప్రజలకి ఏం చేస్తున్నారు? ప్రజలంటే వాళ్ళ కుటుంబాలేనా? నిరుపేదల బతుకులు ఎన్నికలప్పుడు ప్రచారానికి ఉపయోగించుకునేవాళ్ళు, తుఫాను లు,మ వరదలను ఆస్తులు పెంచుకోడానికి ఉపయోగించేవాళ్ళు. పసిపిల్లల, వీధి బాలల బతుకులతో చేలగాటాలాడే వాళ్ళు ఈ నాయకులు. వీళ్ళంతా ఇలాగే కొనసాగితే ఈ దేశంలో యువత మిగలదు.
"నో" ఎందుకో హిమబిందు కి ఒక్కసారిగా నిలువెల్లా వణుకు లాంటిది వచ్చింది. నుదుటి మీద చిరుచేమట్లు పట్టాయి. ఈ దేశం నాది....నేను కూడా ఇందులో భాగస్వామిని... అనుకుంది. చదువు, ఆలోచన, ఆదర్శాలు వున్న తను వీళ్ళందరికి భయపడి ఈ నాలుగు గోడల మధ్య వుండకూడదు... వుండకూడదు. అలా అని ఏం చేయగలదు తను! చేయాలి, ఏదో ఒకటి చేయాలి.
అలాగని జీవితాంతం మిసెస్ రాజారాం గా బతకలేదు. ఒక ఖూనీ కోరుకి ఖర్మకాలి భార్య అయింది. అతను మరణించినా అతని భార్యగా ఎందుకు బతకాలి? ఇహ నుంచి ఈ జీవితం తనది.... తన స్వంతం .. దీని మీద ఎవరికీ ఏ అధికారం లేదు. తను ఏమైనా చేయొచ్చు తన పిల్లల కోసం.... వాళ్ళ భవిష్యత్తు కోసం... ఈ పిల్లలు ఇలాంటి మరెందరో వేల, లక్షల మంది పిల్లలు.... వీళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళై ఈ దేశాన్ని కాపాడుకోవాలి. దేశ భవిష్యత్తు వయసు మళ్ళిన వాళ్ళది కాదు. పిల్లలది.... నేటి బాలలే రేపటి పౌరులు. .. కాదు....కాదు...నేటి బాలలే రేపటి పాలకులు కావాలి. అవును పాలకులు కావాలి. అందుకు తానూ ముందుగా రాజకీయాల్లో పాదం మోపాలి. కానీ, మిసెస్ రాజారావు గా కాదు.. ప్రతిపక్ష పార్టీలో కాదు.. తనది మరో పార్టీ ....కొత్త పార్టీ ....స్వంత పార్టీ....
దృడమైన నిర్ణయంతో , కొండంత ఆత్మవిశ్వాసంతో హిమబిందు పిల్లలిద్దరి మధ్యా పడుకుని, నిశ్చింతగా కళ్ళు మూసుకుంది.
***