Previous Page Next Page 
ఒప్పందం పేజి 21

 

    భ్రమరాంబది పెద్ద గొంతు. ఆవిడ మాట్లాడినా అరచినట్టే ఉంటుంది. ఆవిడ భర్త అచ్యుతరామయ్య కి ఫర్నిచర్ షాపుంది. మూడు పూలు, ఆరుకాయలుగా అయన వ్యాపారం సాగుతోంది. మార్కెట్ లోకి కొత్త ఫర్నిచర్ వచ్చిందంటే ఈయన షాపుకి రావాల్సిందే జనం.... విదేశాల నుంచి కూడా కావలసిన బ్రోచర్స్ తెప్పించుకుని డిజైన్ చేస్తుంటాడు. ఆడపిల్లలిద్దరూ ఒకళ్ళు కాలిఫోర్నియాలో, ఒకరు న్యూజెర్సీ లో ఉన్నారు. మగపిల్లాడు సత్యం కంప్యూటర్స్ లో మంచి పదవిలో ఉన్నాడు. కోడలు కూడా ఇంజనీరే. ఓ సాప్ట్ వేర్ కంపెనీలో చేస్తోంది. కొడుక్కి ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలను చూసుకోడానికి భ్రమరాంబ చేతకాక, తన తల్లి గారి ఊరైన రేపల్లె నుంచి పాలేరు కూతుర్ని తెచ్చుకుంది. సంవత్సరానికి నాలుగు వేలు, రెండు పూటలా తిండి. ఇంట్లో ఆశ్రయం అనే కండిషన్ మీద తెచ్చుకుంది. పార్వతి తండ్రి సోమరిపోతు , తాగుబోతు ....భార్యనీ, పిల్లల్ని వదిలి చాలా కాలం క్రితమే ఎటో వెళ్ళిపోయాడు. అప్పటికి పార్వతికి ఐదేళ్ళు.... దాని తమ్ముడికి రెండేళ్ళు. అప్పట్నించీ ఆ తల్లే ఆ పనీ, ఈ పని చేస్తూ పిల్లల్ని పోషించింది. కానీ, రానురాను ఆమెకి చేతకాక, పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టలేక, కొడుకునీ, చిన్న కూతురు ని అడిగిన వాళ్ళకి పనిపిల్లలుగా పంపించింది. ఇప్పటికీ పార్వతి ఆ ఇంటికి వచ్చి మూడేళ్ళు దాటుతోంది. భ్రమరాంబ కి అలంకారాలు, ఆభరణాలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ నిండుగా, అలంకరించుకుని, ఉన్న బంగారం అంతా వంటి మీద దిగేసుకుని, పార్వతికి ఆ పనీ, ఈ పనీ పురమాయిస్తూ , ఇంటినీ, ఇంట్లో వాళ్ళని చిటికెన వేలిమీద ఆడిస్తూ వుంటుంది. అచ్యుతరామయ్య వ్యాపారం విషయాలేగానీ, ఇంటి విషయాలు పట్టించుకోరు. కొడుకూ, కోడలూ పొద్దున్న వెళితే రాత్రిగ్గాని రారు. అంతా ఈవిడదే రాజ్యం. ఆవిడే పెత్తందారీ, దానికి తగ్గట్టు ఆవిడకి చాలా పెద్ద గొంతు ఇచ్చాడు భగవంతుడు. ఆ గొంతుతో ఆవిడ ఏం చెప్పినా అవతలి వాళ్ళు భయంతో గజగజలాడాలి. ముఖ్యంగా పనివాళ్ళు.... పార్వతి క్కూడా ఆ గొంతంటే చచ్చే భయం. ఆవిడకీ మాడీ, శుచీ, శుభ్రతా ఎక్కువ. కొందరికి అవి చాదస్తంగా అనిపిస్తాయి. మరికొందరికి మూర్ఖంగా అనిపిస్తాయి. కానీ ఆవిడకి అవిచాలా మంచి లక్షణాలుగా అనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైంది . పనివాళ్ళ ను లోపలికి రానివ్వక పోవడం...వాళ్ళు స్నానం చేయకుండా ఏ పనీ చేయనివ్వక పోవడం.... కేవలం గదులు, అవి కూడా బెడ్ రూమ్స్, హాలు మాత్రమే , తప్ప వంటగది వైపు కానీ, భోజనాల గది వైపు కానీ రాకూడదు. ఆ పని తనే చేసుకుంటుంది...ఆవిడ సన్నగా పొడుగ్గా ఉంటుంది. మంచి ఓపిక గల మనిషి... ఇంట్లో ఏ పండగైనా ఫంక్షన్ అయినా, వంటవాళ్ళ ను పెట్టుకుని అజమాయిషీ చేస్తూ వంటలు చేయిస్తుంది. క్యాటరింగ్ ఒప్పుకోదు. వాడె గుడ్డలతో వండుతాడో... పైగా కంచాలు లెక్కపెట్టుకుని డబ్బులు తీసుకుంటాడు ,పదిమంది ఉన్న ఇల్లు నలుగురు ఎక్కువ రావచ్చు, నలుగురు తక్కువ రావచ్చు క్యాటరింగేంటి? హాయిగా ఇంతపెద్ద ఇల్లుంచుకుని , ఇంట్లో కావలసినవి వండించు కోక అంటూ వండించడమే చేస్తుంది. పిల్లలు, ముఖ్యంగా కూతుళ్ళు అమెరికా నుంచి వచ్చినప్పుడల్లా "ఏంటమ్మా ఈ చాదస్తం" అంటే "మీకేందుకే ...వెళ్ళి హాయిగా మేడ మీద కూర్చోండి.... కమ్మటి వంటలు పెడతాను...." అంటుంది. చివరికి పిల్లల పుట్టిన రోజులు మాత్రం హోటళ్ళ లో చేయడానికి ఒప్పుకుంది... ఈ విధంగా భ్రమరాంబ అజమాయిషీ లో ఆరోజు వంటలన్నీ పూర్తీ అయి, సత్యనారాయణ వ్రతం ప్రారంభం అయింది స్నేహితులు.... పరిచయస్తులు, బంధువులతో ఇల్లంతా కిటకిటలాడుతోంది. వాకిలి ముందు షామియానా వేయించారు. వచ్చిన వాళ్ళంతా ఖరీదైన బహుమతులు తెచ్చారు. అమెరికా అమ్మాయిలూ, వాళ్ళ పిల్లలు ఖరీదైన బట్టల్తో, ఖరీదైన నగలతో అంతకన్నా ఖరీదైన డ్రైఫ్రూట్స్ , పళ్ళు తినో లేక అమెరికా వాతావరణానీకో తెల్లగా మెరిసిపోతూ అటూ ఇటూ తిరుగుతూ వచ్చిన వాళ్ళను పలకరిస్తూ అమెరికా కబుర్లు చెపుతూ  తుళ్లుతున్నారు. పార్వతి అందరికీ కూల్ డ్రింకులు, కాఫీలు, టిఫిన్లు అందిస్తూ మధ్యమధ్య అమ్మగారి మనవరాలిని ఆడిస్తూ, పాప పాడుచేసిన బట్టలు, మారుస్తూ బిజీగా ఉంది... చక్రంలా తిరుగుతోంది. బొంగరం లా తిరుగుతోంది. మౌనంగా చెవులు కధ మీద వేసి, కళ్ళు ఖరీదైన బట్టల వేపు ఆశగా వేసి, నాసికా పుటాలకు తగులుతోన్న రకరకాల వంటల పరిమళాలను ఆస్వాదిస్తూ , మరబోమ్మలా చేతులూ, కాళ్ళూ కదిలిస్తూ పనులు చేస్తోంది. ఉదయం తగిన ఓ కప్పు టీ తప్ప కడుపులో ఏం లేదు. బంధువులకీ, స్నేహితులకీ బతిమాలి, బామాలి జీడిపప్పు ఉప్మా, పెట్టిస్తున్నారేగానీ, ఎవరూ పార్వతికి ఓ విస్తరాకులో ఇంత ఉప్మా వేసి తినమన్న వాళ్ళు లేరు. చాలాసేపటి దాకా ఆ ఉప్మా చూసి ఆకలితో అరచిన పేగులు నీరసించి నిస్త్రాణంగా ఉండిపోయాయి. పోనీలే.... కాస్సేపయాక పూజ అయాక అన్నం తినచ్చు.. రోజూ పచ్చడి మెతుకులు సరిపోతున్నాయి. ఇవాళ ఎంచక్కా రకరకాల వంటలు తినవచ్చు. నచ్చ చెప్పుకుంది కాలే కడుపుకి.
    పూజ అయింది. ప్రసాదం ,తీర్ధం ఇస్తున్నారందరికీ.... అందరూ లైనుగా వెళ్ళి తీసుకుంటున్నారు. పార్వతి చేతిలో పాపని పట్టుకుని నిలబడింది. అందరూ అయాక తనూ తీసుకోవచ్చునన్నట్టుగా తన వంతు కోసం ఎదురుచూస్తూ ....పాప తల్లి వచ్చి పాపను అందుకుంది... "చిట్టి తల్లీ దా ప్రసాదం తిందువు గానీ.... జేజి ప్రసాదం"అంటూ లోపలికి తీసికెళ్ళింది. పార్వతి అలా నిలబడి ఉంది. అందరూ అయిపోయారు. పార్వతి కూడా తన ముందు నిలబడిన ఇద్దరి తరువాత తన వంతు కోసం చూస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయి...ప్రసాదం నోట్లో వేసుకుంటే కాస్త నెమ్మదిస్తుంది అనుకుంది. "ఒసేయ్....ఎక్కడికే నువ్వు.... నీకూ తొందరేనా?" కాస్సేపాగాలేవూ.... తగుదునమ్మా అని పూజడగ్గరకి అలా వచ్చేయడమే.... వెళ్ళవతలకి...టేబిల్స్ శుభ్రంగా తుడువు. భోజనాల వేళైంది." అంటూ వంట గదివైపు వెళుతోన్న భ్రమరాంబ గట్టిగా అరిచింది. ఉలిక్కిపడిన పార్వతి "పెసాదం అమ్మ గారు!" అన్నది గొణిగినట్టుగా.
    "ఏం? నీకర్జంటూగా పుణ్యం కావాల్సి వచ్చిందా?తరవాత తిందువు గానిలే....ఎక్కడికి పోతావ్?" ఎగతాళిగా అంటూ వెళ్ళిపోయింది.
    పార్వతి సన్నగా నిట్టూర్చి షామియానాలో వేసిన టేబిల్స్ దగ్గరకు నడిచి బట్టతో దుమ్ము తుదవసాగింది. ఎవరో నలుగురు కుర్రాళ్ళు చేతిలో పెద్ద తెల్లకాగితం ఉండ తీసుకొచ్చి టేబిల్ మీద పరిచారు. మరి ఇద్దరు గ్లాసులు, అరిటాకులు వేసారు. ఒక కుర్రాడు పార్వతిని చూస్తూ...."ఏయ్....ఆ అరిటాకులు తుడువు అన్నాడు" పార్వతి ఒక్కో అరిటాకే తుడుస్తూ ఆకలిని అణచుకోడానికి ప్రయత్నించసాగింది. నెమ్మదిగా వడ్డన ప్రారంభం అయింది. అతిధులంతా వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. ఉప్పుతో మొదలైన వడ్డన, గారెలు, బూరెలు, లడ్లు, బజ్జీ, పులిహోర, పాయసం, వంకాయ కూర, ఆలుగడ్డ వేపుడు, జిలేబి, పప్పు, తెల్లటి మల్లెపూవు లాంటి అన్నం, నెయ్యి, అలా సాగుతోంది. పార్వతి షామియానాకి అవతల నిల్చుంది. వడ్డన ప్రారంభం కాగానే ఆ పిల్లని అవతలికి తరిమేశారెవరో -- ఆ పిల్ల కళ్ళు నిండుగా వున్న అరిటాకుల వైపు వున్నాయి. అణిగిపోయిన ఆకలి ఒళ్ళు విరుచుకుని విజ్రుంభించింది. జీవితంలో ఎప్పుడూ తినలేదు. ఇలాంటి వంటలు అప్పుడప్పుడూ ఫంక్షన్స్ లో పులిహోర, పాయసం, పెట్టారు కానీ, ఇవన్నీ ఎప్పుడూ పెట్టలేదు. ఇంకేదో స్వీటులు, ఐస్ క్రీమ్ లు పాప పుట్టినరోజుకి హోటల్లో అందరికీ పెట్టించారు. కానీ, తనకి ఆరోజు ఇంట్లోనే చద్దన్నం పెట్టి తీసికెళ్ళారు. చివరకు ఫంక్షన్ అంతా అయి వచ్చేటప్పుడు భ్రమరాంబ అదేదో కాజా అంటూ ఒకటి చేతిలో పెట్టి "తినవే' అన్నది. ఆ మాత్రానికే పొంగిపోయింది పార్వతి.
    వాళ్ళంతా హోటల్లో తింటూ తనకి ఎందుకు చద్దన్నం పెట్టారో అర్ధం కాలేదు. అంతేనేమో అలాగే పెడతారు కాబోలు అనుకుంది. హమ్మయ్య ఇన్నాళ్ళ కి పుట్టిన ఇంతకాలానికి తను చాలా పదార్ధాలు తినగాలుగుతుంది. వీటిల్లో కొన్ని దాచుకోవాలి? పార్వతికి అర్ధం కాలేదు. అమ్మా, అక్కా, తమ్ముడు గుర్తొచ్చారు. పాపం వాళ్ళు ఇంకా గంజే తాగుతున్నారు. తను కనీసం ఇప్పుడైనా ఇవన్నీ తినగలుగుతుంది. కానీ, వాళ్ళు ఎప్పటికీ తినలేరేమో.. వాళ్ళందరి మీదా జాలితో పార్వతి గుండె ద్రవించింది.
    "ఏయ్....వచ్చి ఆకులూ తీసెయ్...." పాప తల్లి పార్వతి ని కేకేసింది.
    పార్వతి నుంచున్న చోటి నుంచి కదిలింది. ఆకులూ తీస్తోంటే ఆకుల్లో వదిలేసిన లడ్డు, జిలేబీ , గారెలు ఒక కుర్రాడు తీసి ఒక చిన్న గిన్నె లో వేశాడు.  
    పార్వతి చకచకా అంతా క్లీన్ చేసింది. రెండో రౌండ్ మొదలైంది. అలా నాలుగు రౌండ్లు పూర్తయ్యాక గాని ఇంట్లో వాళ్ళతో సహా అందరి భోజనాలు పూర్తీ కాలేదు. పార్వతి రౌండు, రౌండు కీ ఆకులూ తీయడం, డిస్పోజబుల్ గ్లాసులు తీసి పారేయడం, అంతా క్లీన్ చేయడం చేస్తోంది. అప్పటికి టైం మూడున్నర.... ఆఖరి రౌండ్ పూర్తయింది. కళ్ళు తిరుగుతున్నాయి. కాళ్ళు శక్తి కోల్పోయాయి. చేతులు ఇంక పనిచేయలేము అంటూ మొరాయిస్తున్నాయి. కడుపులో పేగులు అరిచి, అరిచి శోషొచ్చి పడుతున్నాయి. అన్ని అవయవాలనూ బుజ్జగిస్తూ తినబోయే పదార్ధాలను తలచుకుంటూ పనిచేస్తోంది పార్వతి.
    లోపలి నుంచి భ్రమరాంబ గుమ్మం లోకి వచ్చి "ఒసేయ్ రా అన్నం తిందువు గానీ" అన్నది.
    నీరసించి సొమ్మసిల్లిన అవయవాలన్నీ హుషారుగా లేచాయి. చైతన్యం నింపుకుని పనిచేయడం ప్రారంభించాయి. పార్వతి ఉత్సాహంగా పంపు దగ్గరకు వెళ్ళి శుభ్రంగా కాళ్ళూ, చేతులు కడుక్కుంది. చీకటి గదిలోకి వెళ్ళి టవల్ తీసుకొని తుడుచుకుంది. కళ్ళల్లో తినబోయే పదార్ధాలను నింపుకుని పెరటి గుమ్మం దగ్గరకు వచ్చి "అమ్మగారూ" అంటూ పిలిచింది.
    "ఆ వస్తున్నా' అంటూ భ్రమరాంబ చేతిలో విస్తరాకు తో వచ్చి "రా తిను" అంటూ విస్తరి తలుపు దగ్గర పెట్టింది. పార్వతి ఆనందంగా విస్తరి అందుకుంటూ ఆ విస్తర్లో ఉన్న పదార్ధాలు చూడగానే తెల్లమొహం వేసింది. చెంచాడు పప్పు, రెండు ఆలుగడ్డ ముక్కలు, ఆవకాయ, చద్దన్నం..... పార్వతి కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. నిలువునా నీరసం ఆవహించింది. నీరసంతో వణుకుతున్న చేతుల్తో ఆకూ తీసుకుని అరుగు మీద చతికిల పడింది. అన్నం మెతుకులు మేకుల్లా ఉన్నాయి. మింగుడు పడడం లేదు.దుఃఖం గొంతుకుకు అడ్డం పడుతోంది. బలవంతంగా తినడానికి ప్రయత్నిస్తోంది. లేచి తనకి ఇచ్చిన గ్లాసుతో నీళ్ళు తెచ్చుకుంది. ముద్ద ముద్దకి ఒక్కో చుక్క నీళ్ళు గొంతులో పోసుకుంటే తప్ప ముద్ద గొంతులోకి దిగడం లేదు. భ్రమరాంబ స్వరం వినిపించింది. "ఏవన్నా కావాలంటే అడగవే....కాస్త పచ్చడి వేయనా?"
    పార్వతి సమాధానం చెప్పలేకపోయింది.
    "ఏవిటో అనుకున్నదానికన్నా ఎక్కువమంది వచ్చారు. పదార్ధాలు సరి పోలేదు చూశావా? ఇంకా చుట్టూ పక్కల వాళ్ళు రావాలి... సాయంత్రం వస్తారేమో కాస్త టిఫినన్నా పెట్టకపోతే బాగుంటుందా? ఇంకా నయం పులిహోర , జిలేబీ లడ్డూ మిగులాయి. వాళ్ళకి టిఫిన్ల కి సరిపోతాయి." భ్రమరాంబ కోడలితో అంటోన్న మాటలు వినిపించాయి. పార్వతికి కన్నీళ్ళు ధారగా కారాయి.
    "ఏవే... ఏం కావాలి" మరోసారి భ్రమరాంబ స్వరం వినిపించింది.
    "ఏ....ఏం వద్దమ్మగారూ ...కడుపు నిండిపోయింది...." బలవంతంగా గొంతు పెగల్చుకుని సమాధానం చెబుతూ, గుక్కెడు మంచినీళ్ళ తో పాటు కన్నీళ్లు కూడా మింగేసింది.

                                      ***

 Previous Page Next Page