Previous Page Next Page 
లీడర్ పేజి 20

    "ఇదెక్కడి చోద్యం! మాటవరసకేదో అన్నాను" అంటూ రమణమ్మ లబలబలాడింది. కానీ ఆయన్ని ఎవరూ ఆపలేరు! ఏదైనా అనుకుంటే తక్షణం  ఆ పని జరుగవలసిందే   
    ఆయన తవ్వుతుంటే, తమ్ముడు మట్టెత్తి పోస్తున్నాడు. కాసేపయ్యాకా అతను తవ్వుతుంటే ఆయన ఎత్తసాగాడు. ఇంక తప్పదని ఆమె కూడా చీర పై కెగ్గట్టి పనిలోకి జొరబడింది. ఇరుగూ పొరుగూ విచిత్రంగా చూడసాగారు.    
    మర్నాడు ప్రొద్దుట దాకా తవ్వుతూనే వున్నారు. ఆమె అలసట భరించలేక రాతిమీద కూర్చుంది కాసేపట్లోనే.    
    "వదినా! గంగమ్మ తల్లి కరుణించింది." అన్నాడు జగ్గారావు సంతోషంగా.    
    ఆమె గబుక్కున లేచి వచ్చింది.    
    తన రెండు చేతులతో నీటి వూట పట్టి ఆమె నోట్లో పోస్తూ "ఇంకా నీళ్ళకి ఇబ్బంది పడనక్కరలేదు నువ్వు" అన్నారు శ్రీహరిరావు అంత మొండి మనిషి!    
    అప్పుడు కుమ్మరిని పిలిచి ఒరలు పెట్టించారు.    
    ఆ బావి వారికే కాక ఎందరికో ఉపయోగపడింది.    
                                      *    *    *    *    
    ఆమె కూడా మొండితనంలో భర్తకేమీ తీసిపోనీ ఇల్లాలు.    
    ఏ మిత్రుడితోనైతే పొత్తుగా తాటాకు పాక నిర్మించాడో, అతనితో శ్రీహరిరావుకి అభిప్రాయభేదం రానే వచ్చింది.    
    ఓనాడు-    
    "అమ్మాయ్!" అంటూ వచ్చాడాయన.    
    "ఏమిటి బాబాయ్!" అంది రమణ అయన తన తండ్రికి ప్రాణస్నేహితుడు కూడానూ.    
    "నేనీ పాక నిర్మూలించదలచుకున్నానమ్మా! నువ్వు వెంటనే నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోవడం మంచిది" అన్నారాయన.    
    "అదేమిటి? మావారికి చెప్పారా?"    
    "ఆ....మొండివాడు, ఆ పాకమీద నీకెంత హక్కుందో, నాకూ అంతే హక్కుంది. ఎలా తీస్తావు? అంటున్నాడు" ఆయన కళ్ళల్లో కోపం.    
    రమణమ్మ మౌనంగా నిలబడింది.    
    "నేను మనిషినిచ్చి పంపిస్తాను. మీ ఇంటికి బయల్దేరు."    
    "నేనెక్కడికీ వెళ్ళను. ఆయనొచ్చేదాకా ఇక్కడే వుంటాను."    
    ఆ మొండితనానికి అయన ఒళ్ళు మండిపోయింది.    
    "వాడి తిక్క సగం మీక్కూడా ఎక్కిందే! నేను మనుషుల్ని మాట్లాడాను. వాళ్ళు తీసేస్తారు. ఆ తర్వాత నీ యిష్టం!"    
    "ఫరవాలేదు!"    
    ఆయన మనుషుల్ని పెట్టి తననుకున్నట్లే ఆ పాకలూ తీసేయించి వెళ్ళిపోయాడు.    
    పైన కప్పులేదు. కింద చాపమీద రమణమ్మ పిల్లల్ని పెట్టుకుని పడుకుంది. ఊరగయా జాడీలు ఒక పెట్టెమీద పెట్టుకుంది. పెద్దగా ఉరుములూ, మెరుపులూ మొదలయ్యాయి.    
    ప్రక్కనే లీల అనే చాకలి అమ్మాయీ, భర్తా వుండేవారు. లీల వచ్చి పరిస్థితులూ చూసి, "అక్కా! మా ఇంటికి పోదాం రా" అంది.    
    ఆమె తల అడ్డంగా ఊపింది. చాలా రోషంగా, ఎందుకో భర్త మీద కోపంగా అనిపించింది. ఎంతకీ ఇంటికి రాని భర్త కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.    
    ఆ దంపతులు ఆమెని ఇంట్లోకి రమ్మని బ్రతిమాలి, బ్రతిమాలి చివరికి, పిల్లల్ని మాత్రం తీసుకుని వెళ్ళిపోయారు.    
    నెమ్మదిగా వర్షం ప్రారంభమయింది. ఆమె తడిసిపోసాగింది. లీల భర్త మడతమంచం వాల్చి వెళ్ళాడు. ఆమె దానిమీద పడుకుని ఆకాశం కేసి చూడసాగింది. వర్షం అంతవరకూ పెద్దడయింది.    
    "కుక్క తోకట్టుకుని గోదావరీదడానికి వెళుతోంది" అన్న తండ్రి మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఏం మనిషి! ఎటుపోతే అటేనా? భార్యా పిల్లల గురించి ఆలోచనే లేదా! ఆ వర్షం నీళ్ళతోబాటు, ఆమె కన్నీళ్ళు కూడా కలిసి, చెక్కిలి మీదనుంచి జారిపోసాగాయి.    
    లీలా, భర్త వీరి ఇంట్లోనే నిలబడి, ఆమెనీ, నీళ్ళల్లో తేలిపోతున్న ఊరగాయ జాడీల్ని, నిస్సహయంగా చూడసాగారు. ఆమె దగ్గరకొచ్చి పలకరించాలంటే కూడా ఆ నిమిషంలో వారికి ఏదో తెలియని భయం కలిగింది. ఆ కళ్ళల్లో అంత తీక్షణత, పట్టుదలా కనిపించాయి.    
    వర్షం వెలిసింది. ఆమె లేవలేదు. తెల్లవారుతుండగా, తల్లీ, తండ్రీ వచ్చారు. వస్తూనే పెద్ద పెట్టున శోకాలు పెడుతూ, అల్లుడ్ని తూర్పార బట్టసాగారు. "నీకేమొచ్చిందే! వాడి పిచ్చి నీకు కూడా అంటించాడా? నేను ముందే చెప్పాగా, వాడివల్ల ఈ సంసారం ఈదడం కాని పనని! పద ఇంటికిపోదాం!" అన్నాడు తండ్రి.    
    "లేదు నాన్నగారూ, ఆయనకి చెప్పకుండా నేను రాలేను. నన్నిక్కడ వుంచి వెళ్ళారు. ఎప్పటికో వస్తారు. అప్పటిదాకా ఇక్కడే వుంటాను."    
    ఆమె స్థిరత్వాన్ని, మతిభ్రమణంగా భావించి, వాళ్ళు పిల్లలని తీసుకుని వెళ్ళిపోయారు.    
    పాక నిర్మూలించిన మిత్రుడే స్వయంగా వారింటికెళ్ళి "మీ అమ్మాయి మొండిగా చేస్తోంది. వెళ్ళి తీసుకురండి" అని చెప్పాడట పాపం!    
    మధ్యాహ్నానికి శ్రీహరిరావు ఇంటికి చేరాడు. ఆమె మాట్లాడలేదు. అప్పటికే జ్వరం మొదలయింది ఒంట్లో.  లీల భర్త పరిస్థితినంతా వివరించి చెప్పాడు.    
    ఆయన ఆమెవైపు చూశాడు. ఆమె ఉక్రోషంగా ఆయనవైపు చూసింది. "నిన్ను నమ్ముకునొస్తే ఇంతేనా నా గతి!" అన్నట్లున్నాయా చూపులు.    
    "నా ధ్యేయం వేరు! నా మార్గం అంతా ఇలాగే ముళ్ళతో, ఎదురుదెబ్బలతో కూడుకున్నది. నాతో కలిసి ప్రయాణమంటే ఇలాగే వుంటుంది. చెయ్యగలవో, లేదో నిర్ణయం నీకే వదిలిపెడ్తున్నాను" అన్నట్లు ఆయన చూశారు.

 Previous Page Next Page