నెమ్మదిగా ఆమె తల నిమిరాడు. గువ్వలా ఆయన గుండెల్లో ఒదిగిపోయి, రాత్రినుండీ పడిన ఆవేదనంతా తీరేదాకా ఏడుస్తూనే వుందామె.
* * * *
1942, 'క్విట్ ఇండియా మూవ్ మెంట్' ముమ్మరంగా మొదలయింది.
రాజమండ్రిలో ఉద్రిక్తంగా ఉపన్యాసా లివ్వసాగారు. ఎవరి నోట విన్నా శ్రీహరిరావు పేరే! ఎక్కడ చూసినా అయన మాటలు చెప్పుకునే వారే! రాత్రింబవళ్ళు ఉపన్యాసాలిస్తూ ఎరెస్టయ్యారు.
రాజమండ్రిలో ఎరెస్ట్ చేసి, బళ్ళారి పంపించారు.
"జైలర్ వస్తున్నారు" అని చెప్పారు.
తలెత్తి 'విష్' చేద్దామనుకునేసరికే ఎదురుగా అతను!
వైజాగ్ లో 67 రోజులు, పుస్తకాలివ్వడానికి నిరాహారదీక్ష చేయించిన జైలర్! శ్రీహరిరావు చిరునవ్వు నవ్వాడు.
"మళ్ళీ కలుస్తామనుకోలేదు!"
"అవును! ఈ సారి ఈ కలయిక నీకు బాగా గుర్తుండిపోతుంది."
ఆయన మాటలకి అర్ధం, మర్నాడు అవగతమయింది.
* * * *
'సెల్'లో కూర్చున్న శ్రీహరిరావు దగ్గరికి నలుగురు 'సెంట్రీ' లొచ్చారు. "జైలర్ గారు మిమ్మల్ని తీసుకు రమ్మన్నారు" అని చెప్పారు. ఆశ్చర్యపోతూ బయటికొచ్చారు. బయటంతా మైదానం! ఒక 'వేన్' ఆగి వుంది. దానిమీద 'కడలూర్ మెంటల్ జైలు' అని రాసి వుంది. జైలర్ పక్కనే మరో వ్యక్తి పోలీసుబట్టలు ధరించి నిలబడి వున్నాడు.
"ఇతనే నే చెప్పిన ఖైదీ" జైలర్ కళ్ళల్లో ఏదో పైశాచిక తృప్తి మెరవడం, శ్రీహరిరావు దృష్టిని దాటిపోలేదు.
ఆయన తన మనుషులవైపు తిరిగి సైగ చేశాడు. ఇద్దరూ గబగబా ముందుకువచ్చి, శ్రీహరిరావు చేతులను వెనక్కి విరిచి కట్టారు. ఇంకో యిద్దరు బలవంతంగా తోసి వేన్ లో కెక్కించారు.
వేన్ పొలిమేరలు దాటాకా శ్రీహరిరావు పెదవి విప్పి మాట్లాడాడు. "నన్నీవిధంగా అమర్యాదగా మీరు తీసుకెళ్ళడానికి కారణం! చూడబోతే చాలా విజ్ఞుల్లా వున్నారు" అతని కంఠంలో పలికే స్థిర ప్రజ్ఞతకీ, ధారాళమైన ఆంగ్లానికీ ఆ సూపర్నెండెంటు కాస్తతడబడి.
"నువ్వు మెంటల్ పేషెంట్ వనీ, భయంకరమైన ఉన్నాదంలో వున్నావనీ మాకు జైలర్ రిపోర్ట్ పంపాడు."
"అవును ఉన్మాదినే! నా ఉన్మాదం పేరు అభిమానం! దాన్ని ఏమీ చెయ్యలేని ఆ జైలర్ ఇలా వెనుకదెబ్బ కొట్టాడన్న మాట. నేను కాదు. అతను పిచ్చివాడు! ఇదే తన విజయంగా భావిస్తున్నాడు పాపం!"
అతని మాటల్లో గంభీరతకి చలించిపోయిన సూపర్నెండెంట్, "దయచేసి, ఆ జైలర్ ఇలా ఎందుకు రాసి పంపాడో చెప్తారా? నాకేమీ అర్ధం కావట్లేదు. నా అనుభవం మిమ్మల్ని పిచ్చివాడు కాదు. 'మేధావి' అంటోంది' అని అడిగాడు.
శ్రీహరిరావు వైజాగ్ జైల్లో జరిగిన వృత్తాంతం యావత్తూ పూసగుచ్చినట్లు చెప్పాడు.
"అప్పుడు నన్నేం చెయ్యలేక, ఓటమిని అంగీకరించాడు. ఇప్పుడు కూడా నన్నెదుర్కొనే సాహసం చెయ్యలేక, ఇలా మెంటల్ హాస్పిటల్లో వేసి వదిలించుకుంటున్నాడు."
అంతా విని, సూపర్నెండెంట్ ఆలోచనలో పడ్డాడు. "ఇప్పుడేమిటి చెయ్యడం?"
"నా గురించి బాధపడకండి! నేను చెయ్యాలనుకుంటున్న పనొకటి మిగిలిపోయింది సమయంలేక! ఇప్పుడు మీవద్ద లభిస్తున్న విశ్రాంతిని నేనెందుకు వాడుకుంటాను. నాకు దయచేసి పెన్నూ, పేపర్లూ ఇప్పించండి. 'మానవ జీవితం' గురించి అనేక విషయాలు పొందుపరుస్తూ ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను."
"తప్పకుండా! మీకు నా సంపూర్ణ సహాయ, సహకారాలందిస్తాను. ఈవేళ్టినుండీ మనం మిత్రులం!"
శ్రీహరిరావుగారి చేతుల బంధనాలు ఆయనే స్వయంగా తొలగించి, కరచాలనం చేశారు.
* * * *
"ఎస్సేస్ ఆన్ హ్యూమన్ లైఫ్" అనే హ్యూమన్ ఎవల్యూషన్ కి సంబంధించిన పుస్తకం, ఆ జైల్ లో కూర్చునే పూర్తి చేశారు.
శిక్షాకాలం పూర్తయింది. సూపర్నెండెంటూ, శ్రీహరిరావూ మంచి మిత్రులయ్యారు.
"మీ పుస్తకం ఒక కాపీ నాకు పంపడం మరిచిపోకండి!"
"అలాగే! అంతకంటే ముందు నే చెయ్యవలసిన ముఖ్యమైన పనొకటి వుంది."
"ఏమిటది?"
"నన్ను పిచ్చివాడ్ని చేసి మెంటల్ జైల్ కి పంపించిన, జైలర్ మీద పరువు నష్టం దావా వెయ్యడం!"
* * * *
జడ్జిగారు, శ్రీహరిరావు మెంటల్ జైల్లో కూర్చుని రాసిన ఎస్సేస్ ఆన్ హ్యూమన్ లైఫ్ పుస్తకాన్ని చదివి ఆశ్చర్యపోయారు.
"ఒక పిచ్చివాడు ఇలాంటి విషయాలమీద పరిశోధన చేసి వ్రాయగలడా?" అనే అతని వాదనకి ఎదురు చెప్పలేకపోయారు. ఫలితంగా జైలర్ కి 1200 రూ. నష్టపరిహారం పడింది. అప్పుడు చూశారు జైలర్ వైపు విజయదరహాసంతో.
బెజవాడ వచ్చి తన ఆప్తమిత్రుడైన అయ్యంకి వెంకటరమణయ్య గారి ప్రెస్సులో దాన్ని అచ్చు వేయించారు. మొదటి కాపీ కడలూరు మెంటల్ జైల్ సూపర్నెండెంట్ కి పంపడం మరిచిపోలేదు.
1942 వ సంవత్సరంలో రాజమండ్రిలో మళ్ళీ అరెస్టయి రాయ వెల్లూరు జైలుకి పంపబడ్డారు.
ఈ లోగా రామ్మూర్తిగారు కలం చేసిన వార్త తెలిసింది. కొడుకయినా అల్లుడైనా తనే, వెళ్ళి శ్రాద్ధకర్మలు నిర్వర్తించారు. ప్రశాంతంగా కళ్ళుమూసుకుని వున్న అయన భౌతికకాయాన్ని చూస్తుంటే, బహుశా మరణవేదనకంటే ఎక్కువ బాధ కూతురి భవిష్యత్తుని గురించి పడుంటారు అనిపించింది. అయినా అతనేం చెయ్యలేడు. అతని జీవితం తెగిన గాలిపటం లాంటిది ఆ కొస ఎవరి చేతుల్లో లేదు!