ఇది శ్రీహరిరావు తీవ్రంగా వ్యతిరేకించాడు. చట్టాన్ని వ్యతిరేకిస్తూ, గుప్పెడు, గుప్పెడు బియ్యం అర్ధణాకీ, అణాకీ అమ్మారు.
ఆ కారణంగా అరెస్టయి మళ్ళీ రాజమండ్రి జైలులో వున్నారు మూడు నెలలు.
* * * *
రామ్మూర్తిగారు గవర్నమెంటు సర్వెంటు. ఆయనకి మొదట్నుంచీ అల్లుడి ప్రవర్తన కంటక ప్రాయంగానే వుంది. కానీ పిల్లనిచ్చుకున్నందుకు తప్పడం లేదు.
"ఎప్పుడో నీ భర్త కొంప ముంచేస్తాడమ్మా! ఈ అన్నం కూడా పుట్టకుండా చేస్తాడు" అంటుండేవారు.
ఓనాడు సాయంత్రం కనుచీకటి పడుతుండగా, శ్రీహరిరావూ, కొర్రపాటి వెంకటరామయ్యా ఓ బుట్ట పట్టుకుని దిగారు. రహస్యంగా "రమణా!" అని పిలిచి, "ఓ చాప మేడమీద వాల్చు" అని చెప్పారు.
రమణ చూస్తుండగానే, ఆ బుట్ట తీసుకెళ్ళి, మంచం కింద దాచారు. ఆ బుట్టతీసి అందులో ఏముందో చూడాలనే కోరిక ఆమె ఆ రాత్రికి అతికష్టంమీద ఆపుకుంది. మర్నాడు ప్రొద్దుటే వాళ్ళు వెళ్ళిపోయాకా, ఇంకా మనసాపుకోలేక, మంచం క్రిందనుండి బుట్టతీసి చూసింది. అందులో తాళ్ళూ, రంపం, కత్తులూ, కటార్లూ, కనపడ్డాయి. కొర్రకాటి వెంకట్రామయ్య తీవ్రవాదిగా ముద్రపడినవాడు. ఆమె ఆ విషయం చూచాయగా వింటూనే వుంది. ఆమె గుండెలదిరాయి. ఈ వస్తువులన్నీ చూసాకా. తండ్రి ఉద్యోగానికే యిది ముప్పు తెచ్చేలా వుందని తెలుసుకుంది. వెంటనే ఆలోచించి, ఓ నిర్ణయానికొచ్చింది. ఆ బుట్ట ఎవ్వరికీ కనపడకుండా తీసుకెళ్ళి గడ్డిమేటు పెట్టే స్థలంలో క్రింద ఓ గుంట తీసి కప్పెట్టేసింది.
సాయంత్రానికి శ్రీహరిరావు హడావుడిగా వచ్చి, మంచం కింద వెతికి బుట్ట కనిపించకపోవడంతో, "రమణా!" అని గాబరాగా పిలిచాడు.
"ఏమిటండీ!" అంది ఆమె మామూలుగా వుండడానికి ప్రయత్నిస్తూ.
"ఇక్కడ పెట్టిన బుట్టేది?"
"అదేమిటి అలా అడుగుతారు? మీరేగా ఒక తెల్లబట్టలేసుకున్నాయన్ని పంపించారు బుట్టకోసం. ఆయన కిచ్చి చక్కా పంపించాను" అందామె తొణక్కుండా.
ఆయన ఓ నిమిషం ఆమెవైపు రెప్పార్పకుండా చూసారు. ఆ తర్వాత మోచెయ్యి నుదురు కాన్చుకుని మంచంమీద ఆ రాత్రివరకూ అలాగే పడుకునుండిపోయారు. తన పనులు తను మౌనంగా చూసుకోసాగింది.
మర్నాడు మధ్యాహ్నం రామ్మూర్తిగారు భోజనం చేస్తుండగా, తలుపు టక టక చప్పుడయింది, తలుపు తెరిచేసరికి ఎదురుగా ఇన్ స్పెక్టర్. ఆయన తండ్రి స్నేహితుడని తెలుసు. కానీ ఇలా హఠాత్తుగా యూనిఫారమ్ లో ఎందుకొచ్చాడా? అని అనుమానం వచ్చింది. "రండి, కూర్చోండి. నాన్నగార్ని పిలుస్తాను" అని లోపలికొచ్చేసింది. రామ్మూర్తిగారు హాల్లో కొచ్చి, మిత్రుడ్ని మామూలుగా కుశల ప్రశ్నలేశారు.
ఆయన ఎంతో సంశయిస్తూ "ఏమనుకోకురా! నీ అల్లుడిమీద ఏదో అనుమానం వచ్చింది. అందుకని ఇల్లు సోదా చెయ్యమని పైనించి రిపోర్టు వచ్చింది" అన్నారు మాటలు కూడబలుక్కుంటూ.
రామ్మూర్తిగారి మొహం మ్లానమైంది. ఆయన పరువుకి ప్రాణం పెట్టేమనిషి.
"ఎవరి ఉద్యోగ ధర్మం వారిది. కానీ!" అన్నారు.
పోలీసులు యిల్లంతా సోదాచేసి, "ఏమీ దొరకలేదు సార్!" అన్నారు.
వాళ్ళు వెళ్ళిపోయాకా "నేను అబద్దమాడి మంచిపనే చేశాను" అనుకుంది గుండెలనిండా ఊపిరి పీల్చుకుంటూరమణ.
ఈ సంఘటన తరువాత మావకీ, అల్లుడికీ మధ్య ఏదో కొంచెంగా వున్న బంధం కూడా పుటుక్కున తెగినట్లయింది.
"నువ్వింక నా ఇంట్లో వుండటానికి వీల్లేదన్నట్లు" చూచాయగా చెప్పారు.
శ్రీహరిరావుకీ రోషమొచ్చింది. "నా భార్యా, పిల్లల్ని తీసుకుని వేరెళ్ళిపోతా"నన్నాడు.
"ఎక్కడికెళతావు? ఇల్లా? వాకలా? అమ్మా, బాబా?" అని కోపంగా అరిచారు రామ్మూర్తి.
"నేనెక్కడుంటే అక్కడే వుంచుతను వాళ్ళని" అని అంతకంటే గట్టిగా చెప్పాడతను.
ఆ రాత్రే భార్యనీ, పిల్లల్నీ తీసుకుని మావగారింటి నుండి బయటపడ్డాడు.
తల్లీ దండ్రీ అతనివెంట వెళ్ళొద్దని రమణకి చెప్పి చూసారు. కానీ ఆమె కూడా ఆయనకి తగిన ఇల్లాలే వారిమాట వినలేదు.
"కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదుతానంటోంది. పోనీ దాని ఖర్మకి!" అన్నారు చివరిగా దుఃఖం ఆపుకోలేక రామ్మూర్తిగారు.
* * * *
శ్రీహరిరావూ, అతని స్నేహితుడు.....కలిసి రామచంద్రాపురంలో ఊరిచివర ఒక తాటాకుపాక వేయించారు. అది దిక్కులేని పశువులకై నిర్దేశించబడిన గోరక్షణ శాల. అందులో రమణమ్మా, శ్రీహరిరావూ కాక, ఆయన తమ్ముడు జగ్గారావు కూడా అన్నగారి వద్దనే వుంటుండేవాడు.
మంచినీళ్ళకి చాలా ఇబ్బందిగా వుండేది. రోజూ కాలినడకన చాలా దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సొచ్చేది.
ఓనాడు విసుగ్గా "మావగారిమీద అలిగి, ఇలా నీళ్ళు కూడా దొరకని చోట కాపురం పెట్టారు. అంతంత దూరాలెళ్ళి అందర్నీ నీళ్ళు ముష్టెత్తాల్సొస్తోంది!" అంది రమణమ్మ.
"బావి తవ్వమంటావా చెప్పు!" అన్నాడు శ్రీహరిరావు వెంటనే.
"అందుకు కూడా సమర్దులే మీరు" అంది ఎద్దేవా చేస్తూ ఆమె.
అయన వెంటనే "జగ్గా! పలుగూ, పారా పట్రా! మీ వదిన బావి తవ్వమంటోంది" అని కేక పెట్టాడు.
"అలాగే అన్నయ్యా!" అంటూ లక్ష్మణుడిలా పలుగూ పారా పట్టుకుని వచ్చాడు జగ్గారావు.