Read more!
 Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 2

   
    "ఇంత అందమైన పిల్లవి! మా సింహాన్ని ఎలా చేసుకొంటున్నావు? నేనైతే జీవితంలో పెళ్ళికాకపోయినా సరే, చచ్చినా చేసుకోకపోదును, తెలుసా?" అంది శ్యామల.

    ఆ మాటకి సంధ్య కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి! "అమ్మా నాన్నా ఎవరూలేని అనాధ పెళ్ళికాకుండా మిగిలిపోవడం ఎంత బాధాకరమో, అసలు ఎంత ప్రమాదమో నీకు తెలియదు శ్యామల!"

    "తన కళ్ళెదురుగా నిన్ను మరొకడు బలవంతం చేసినా రక్షించుకో లేని మగవాణ్ణి కట్టుకొంటున్నావు కదా?" శ్యామల వెటకారం సూటిగా తగిలింది సంధ్యకు. ఏదో సమాధానం చెప్పబోయేంతలో నర్సమ్మగారు గుండు మీద కొంగు సవరించుకొంటూ హడావిడిగా ప్రవేశించింది.

    "నువ్విక్కడే కూర్చుండిపోయావా, శ్యామలా? అవతల బోలెడు పనులున్నాయి, పదమ్మా!" అంది.

    "వస్తాను, పదత్తా!" నర్సమ్మగారు వెళ్ళిపోతుంటే వెనుక మూతి త్రిప్పింది శ్యామల. "భలే సుందర పురుషుడినీ, జ్ఞానవంతుడినీ కన్నది మహాతల్లి! వాడికో పెళ్ళి తక్కువైందని ఈ పిల్లగొంతు కోస్తూంది." అంది కసిగా. "ఇది పెళ్ళికాదు! బలికార్యక్రమం! ఇంతమంది ఉండి ఈ బలికార్యక్రమం సాగనిస్తున్నారా? సంధ్యా, ఈ పెళ్ళి సందర్భంగా కాకుండా మనం ముందే కలుసుకొని ఉంటే నీకోసం చదువుకొన్న చక్కని అబ్బాయిని చూసేదాన్ని తెలుసా? కట్నంకానుకలు ఆసించకుండా కేవలం అమ్మాయి రూప సౌశీల్యాలు చూసి చేసుకొనే అబ్బాయిలకు మరీ గొడ్డుపోలేదు మనదేశం!" శ్యామల ఆవేశంగా అంది.

    "కట్నం కానుకలు లేకపోయినా చేసుకొనేవాళ్ళున్నారేమోగాని సంప్రదాయం మంచిది కాకపోతే చేసుకొనేవాళ్ళు మాత్రం ఉండరు, శ్యామలా!" సంధ్య బరువుగా నిట్టూర్చింది.

    "నీ సంప్రదాయం మంచిది కాదా? ఏం?"

    "మా నాన్నతో అమ్మది రెండవ పెళ్ళి! ఆమెకు మొదటిభర్త చనిపోయాడు!" గతస్మృతులతో హృదయం భారమైపోగా కథగా చెప్పసాగింది సంధ్య.

                       *         *        *


    ఆ ఊరి పేరు రాజానగరం!

    పేరున్నంత అందంగా ఉంటుంది ఆ గ్రామం! చుట్టూ కొండలు. ఊరు చుట్టూ పచ్చని పొలాలు. ఊరి అంచున అమ్మ చెరువుగా పిలువబడే పెద్ద బరువు. చెరువు అలుగు ఊరిని రెండుగా చేసింది. అటువైపు ఊరు చాలా పెద్దది. ఇటువైపు ఊరు ఊరినుండి విడిపోయిన చిన్న ముక్కలా ఉంటుంది! ఓ పాతిక ఇళ్ళదాకా ఉంటాయి! నాలుగైదిళ్ళు బ్రాహ్మలవి. మిగతావి ఇతర వర్ణస్తులవి. మహమ్మదీయులుకూడా ఉన్నారు. అక్కడ విశేషంగా చెప్పుకోతగింది వనపర్తి రాజాగారి పాలెస్. వాళ్ళు కట్టించిన వేణుగోపాలస్వామివారి ఆలయం. ఆలయంచుట్టూ సువిశాలమైన మంటపాలుంటాయి. ఆలయం ముందు మహావృక్షాల్లా పెరిగిపోయిన రెండు చింతచెట్లు. ఆలయానికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన రధశాల గూళ్ళలో ఎప్పుడూ కువకువ సంగీతాలు వినిపించే అడవి పావురాలు. ఇళ్ళ మధ్య నుండే పారుతూ ఉంటుంది పంటకాలువ.

    అక్కడుండే నాలుగైదు బ్రాహ్మల ఇళ్లలో వెంకటలక్ష్మమ్మగారిది ఒకిల్లు. నియోగి బ్రాహ్మలు. భర్త ఆమె ముప్పయ్యోఏట పోయాడు. చాలా కొద్దిపాటి పొలం, చిన్న ఇల్లు ఆవిడకున్న ఆస్తిపాస్తులు. తల్లీ తండ్రీ చిన్నప్పుడే పోయిన మేనల్లుడినితెచ్చి పెంచుకొంది. ఇప్పుడు ఆవిడకున్న ఆశా, ఆధారం అన్నీ అతడే. పేరు మోహన్ రావు. స్కూల్ ఫైనల్ పాసయ్యాడు. అలుగుకి అటువైపు ఊళ్ళో ఉండే దొరగారు ఆంజనేయులు దగ్గర గుమాస్తాగా చేస్తున్నాడు, సంవత్సరం నుండి.

    "ఎంత ఉద్యోగం చేస్తున్నా ఇరవైనాలుగు గంటలు దొరగారి కొలువేనా ఏమిటి? కాస్త ఆ పొలందగ్గరికి వెళ్లి చూచుకోవద్దా?" చేటలో బియ్యం ఏరుతూ, స్నానంచేసి అద్దంముందు నిలబడిన మేనల్లుడితో అంది వెంకటలక్ష్మమ్మ.

    "దొరలదగ్గర కొలువంటే జీవితం ఇరవైనాలుగు గంటలు వాళ్ళకు తాకట్టుపెట్టినట్టే, అత్తా!" అన్నాడు మోహన్ శ్రద్ధగా క్రాప్ దువ్వుకొంటూ.

    వెంకటలక్ష్మమ్మ బియ్యంలో రాళ్ళేరడం పూర్తిచేసి లేస్తూ, ఇంకా మేనల్లుడు అద్దంముందు నిలబడి చొక్కా సరిచేసుకోవడం చూసింది. "ఏమిట్రా, ఈ మధ్య నీ అందంమీద చాలా శ్రద్ధ ఏర్పడింది? దొరగారి దగ్గరికి పనికి వెడుతున్నావా, లేక ఆడపిల్లలకు పోజులుకొట్టడానికి వెడుతున్నావా?" అంది అతడికేసి మురిపెంగా చూస్తూ.

    "అవునత్తా! ఆడపిల్లలకి పోజులు కొట్టడానికే వెడుతున్నాను! అదేగా నా ఉద్యోగం? దానికే ఇస్తారు రెండువందల జీతం!" పెంకెగా అన్నాడు మోహన్.

 Previous Page Next Page