"ఉన్నమాటంటే ఉలుకెందుకుగాని దొరగారి చెల్లెలితో నీకు స్నేహం ఎక్కువైందని విన్నాను! ఎర్రగా బుర్రగా ఉన్నావని వల్లో వేసుకోవాలనుకొన్నట్టుంది! గొప్పింటి ఆడవాళ్ళకు ఇలాంటి చాటు మాటు వ్యవహారాలు మామూలు అయినా, ఆంజనేయులుగారికి తెలిస్తే చెల్లెలని చెయ్యి చేసుకోకపోవచ్చుగాని, ముందు నీ భరతం పడతాడు! ముందు దేహశుద్ధి, తరువాత ఉద్యోగం ఊడబీకటం! కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు!"
"నీకా సంగతి తెలిసిపోయింది కాబట్టి నేనోమాట అడుగుతానత్తా!" మోహన్ గారంగా మేనత్త భుజాలమీద చేతులు వేశాడు.
"ఏమిట్రా?" అడిగింది గాబరాగా, ఏదో వినకూడని మాట వినబోతున్నట్టుగా.
"నేను.... నేను రుక్మిణిని పెళ్లి చేసుకోవాలనుకొంటున్నానత్తా!"
"ఆ విధవముండనా?" వెంకటలక్ష్మమ్మ ముఖమంతా అసహ్యంగా మార్చుకొంది ఖస్సుమంది. ఆమె ముఖంలో ఇందాకటి ప్రసన్నతా, ఆప్యాయతా మచ్చుకైనా లేవు.
"నువ్వింత కఠినంగా మాట్లాడితే నా మనసు కష్టపడుతుందత్తా!" గాయపడ్డట్టుగా అన్నాడు.
"నీ మనసు కష్టమే చూస్తావుగాని నా మనసు కష్టం చూడక్కరలేదన్నమాట!"
"ఏం కష్టం? కొంచెం సహృదయం చూపడం? మొగుడు చచ్చి ముండమోసిన దాన్ని పెళ్ళాడతానంటే ఆనందంతో ఎగిరి గంతులేయాలంటావా?"
"పెళ్ళి అయిన రెండుసంవత్సరాలకే ఆ అర్ధాయుష్యం వాడు గుటుక్కుమంటున్నప్పుడు రుక్మిణిదా? నిండా ఇరవై సంవత్సరాలు లేని అమ్మాయి అలా మ్రోడులా మిగిలిపోవాల్సిందేనన్నమాట! సాటి ఆడదానివి! అందునా వైధవ్య భారం ఎరిగిన దానివి! నువ్వే ఆమెని ఇంతగా అసహ్యించుకొని మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందత్తా!"
"వైధవ్య భారం గుట్టుగా భరించడం తెలుసుగాని ఇలా మధించిపోయి ఎవడినెత్తినో ఎక్కి మంది కొంపముంచడం తెలియదురా! ఈ మగడు చస్తే ఇంకొకడు, ఈ మగడు కాకపోతే ఇంకొకడు అంటూ పోతే ఈ సంసారాలు ఏమైపోతాయి? సంప్రదాయాల్ని ఇలా తలక్రిందులు చేస్తూ పోతే ప్రపంచం అల్లకల్లోలం, అస్థిరం అయిపోదా?"
"నేనొక వితంతువును భార్యగా స్వీకరించినంత మాత్రాన ఈ ప్రపంచం ఏమీ తలక్రిందులైపోదు, అత్తా!"
"ప్రపంచం మాట నాకెందుకుగాని ఇలాంటి అనాచారం నా ఇంట్లో జరగడానికి మాత్రం వీల్లేదని ఖచ్చితంగా చెబుతున్నానురా!" అని బరబరా వంటింట్లోకి వెళ్లి ప్లేట్ లో టిఫిన్ పెట్టి పిలిచింది.
"ఏదో పరీక్షలకు రాస్తున్నదానిలా ఎంత శ్రద్ధ, ఎంత ఏకాగ్రత! అసలు ఆ పాడు నవలలు చదువొద్దన్నానా? ప్రేమలూ పైత్యాలూ అవేగా అందులో ఉంట! అలాంటి కథలు చదివి నువ్వు ఏమైపోవాలనీ?" గొంతు పెంచి అంది మేనత్త.
"ఏమిటత్తా?" విసుగ్గా తలెత్తింది రుక్మిణి.
ఏ రామాయణమో, భారతమో చదువుకోవాలి మనబోటి విధవ ముండలు, కృష్ణా రామా అనుకొంటూ ఏ మూలనో పడి ఉండాలి. అంతే గాని, ఈ రంగు రంగుల చీరలూ, ఈ అలంకారాలూ - ఇవన్నీ ఎవరి కోసం? చెప్పి చెప్పి నాకు చాలైపోతూంది గాని, నీకు మాత్రం బుర్రకెక్కడం లేదుకదా, నేనెందుకిలా చెబుతున్నానో, మనసు చెడ్డాక శరీరం చెడడానికి ఎంతసేపు పడుతుంది? ముందా మనసు చెడకుండా జాగ్రత్తపడమని నేను చెబితే వినవెందుకు?"
"తలలు బోడులైన తలపులు బోడులౌనా అన్నాడు ఒక యోగి. పెదవులు కృష్ణారామా అంటూ ఉంటాయి. మనసు వలపు ఊహలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది. ఈ మనసుని బంధించడం ఎలాగో చెప్పత్తా!" జాలిగా అడిగింది రుక్మిణి.