Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 2


    "ఏం చేస్తారు మీరు? .... ఐ మీన్.... అంటే మీరెవరు?"
    "టి.యస్. అనే సంస్థ తెలుసా? దాని ప్రెసిడెంట్ ని నేను."
    "టి. యస్సా? అంటే -"
    "ట్రబుల్ షట్టర్స్".
    ఆమెకి అర్ధం కాలేదు. "పిల్లి అంటే మార్జాలం అన్నట్టుంది" అంది.
    "ట్రబుల్ షట్టర్స్ అంటే కష్టాల్ని పరిష్కరించేవాళ్ళు అన్నమాట. దీన్నే తెలుగులో చెప్పాలంటే అ.ఆ.ఇ.ఈ. సంఘం" అన్నాడు. "అ ఆ ఇ ఈ అంటే అనాధల్ని ఆపదల్నుంచి ఇవతలికి ఈడ్చే సంఘం. మీ ఇంట్లో పనిమనిషి ట్రబులిచ్చినా, వంటవాడు స్ట్రయిక్ చేసినా, మీ ఇంటిముందు వీధి దీపం ఆర్నెల్ల నుంచి వెలక్కపోయినా, మీ ఆఫీసరు రాత్రి పదింటివరకూ పనీ పనీ అని తోముతున్నా, మీకు న్యాయంగా రావల్సిన ప్రమోషను 'అ'నివార్య కారణాలవల్ల రాకపోయినా, మీకు ఎమ్మెల్యే పదవి రావాలన్నా, భారత రాయబారిగా మీరు అమెరికాలో సెటిల్ అవ్వాలన్నా, మీకు పెళ్ళి అవ్వాల్సి వుండీ రుక్మిణీ కళ్యాణం పుస్తకం దొరక్కపోయినా, మీ చంటిపాపకి ధర్మాసుపత్రిలో మందు సరీగ్గా ఇవ్వకపోయినా ఏ సమస్య అయినా సరే - అది సాంఘికం గానీ, రాజకీయం గానీ, ఆర్ధికం గానీ- ఏదైనా సరే మీ సమస్యల కోసం సంప్రదించండి - ట్రబుల్ షట్టర్స్! అతి తక్కువ ఫీజుతో మీ సమస్య అతి త్వరగా పరిష్కరింపబడాలంటే - ట్రబుల్ షట్టర్స్ టింగ్ టింగ్" అని అడ్వర్టయిజ్ మెంటులా గడగడా చెబ్తూన్న వాడల్లా చప్పున ఆగి, "సారీ అమ్మాయ్! నీకైతే ఫీజు అక్కర్లేదు. టి.యస్. ప్రెసిడెంట్ ప్రాణాలు రక్షించిన దృష్ట్యా నీకు ఫ్రీ సర్వీసు హామీ ఇస్తున్నాం" అన్నాడు.
    ఆమె వచ్చే నవ్వు ఆపుకొని, "మీ ఆఫీసు నేనెక్కడా చూడలేదే?" అంది.
  "అ ఆ ఇ ఈ సంఘానికి ఆఫీసుండదమ్మాయ్, కష్టాలు ఎక్కడుంటే అది అక్కడుంటుంది. అ ఆ ఇ ఈ అంటే అతడు ఆమె ఇతడు ఈమె."
    ఆమెకిదంతా ఏదో ఫాంటసీ కథలా వుంది. అయినా దాని గురించి పట్టించుకోకుండా, "వెళ్ళొస్తాను తాతగారూ!" అంది.
    "అదేమిటమ్మాయ్ - సాయం కోరకుండానే వెళ్ళిపోతున్నావ్?" అన్నాడు. ఆమెకు అంతకుముందు వాళ్ళిద్దరి మధ్యా జరిగిన సంభాషణలోని పురాణగాధా ప్రసక్తి జ్ఞాపకం వచ్చింది. నవ్వు దాచుకొని "మీరేమన్నా ఆర్చేవారా తీర్చేవారా స్వామీ" అని అడిగింది అమాయకత్వం నటిస్తూ.
    "ఆర్చలేనేమో గానీ తీరుస్తానమ్మాయ్! అలా తీర్చటం కోసం కావాలంటే మనుష్యుల్ని ఆర్చుతాను కూడా."
    మొదట 'అర్చటానికి' అర్ధం అరవటం అనీ, రెండు 'ఆర్చటానికి' అర్ధం ఆడించటం అనీ ఆమెకి తెలీదు. బి.ఏ.లో సోషియాలజీ ఆమెది మెయిన్.
    "బియ్యే సెకెండ్ క్లాసులో ప్యాసయ్యేను. ఏదైనా ఉద్యోగం ఇప్పించు పరమేశ్వరా!" అంది. ఇలాంటి కథల్లో పార్వతీ పరమేశ్వరులు ఆకాశమార్గాన తిరుగుతూ భక్తుల కష్టాలు చూసి, మనుష్య రూపంలో వచ్చి 'నీ కష్టం ఏమిటి?" అని అడుగుతారని ఆమె - ఎప్పుడో చందమామలో చదివింది. అదే నిజమైతే తను "పరమేశ్వరా!" అనగానే మారువేషంలో వున్న ఈ ఈశ్వరుడు ఉలిక్కిపడతాడు అనుకొంది. అయితే టి.యస్. ప్రెసిడెంటునని చెప్పుకొంటూన్న ఈ వృద్ధుడు ఉలిక్కిపడలేదు సరికదా పైగా నవ్వి, "ఏ ఆఫీసులో కావాలమ్మాయ్ నీకు ఉద్యోగం" అని అడిగేడు దేశంలో ఆఫీసులన్నీ తనవే అయినట్టు!
    "ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసులో కావాలి స్వామీ!" అంది నమ్రతగా - మొహంలో భక్తి అల్లరి చేస్తుండగా, పళ్ళ బిగువున నవ్వు అదిమిపెట్టి.
    "సర్లే, దానికేముందమ్మా - తథాస్తు!" అన్నాడు.
    ఈసారి ఆమె నవ్వు ఆపుకోలేకపోయింది. పైట నోటికి అడ్డుపెట్టుకుందామనుకుంది. కానీ అది బాగా తడిసిపోయింది. పైగా అక్కడక్కడ నాచు అంటి వుంది కూడానూ.
    "రేపే ఇంటర్వ్యూ తాతగారూ! ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసులో. ఐ మీన్ - అదే రేడియో స్టేషన్ లో."
    "ఇక దాని గురించి నువ్వు ఆలోచించకమ్మాయ్!"
    "మరి నే వెళ్ళిరానా తాతగారూ!" ఆరిన చీరవైపు చూసుకొంటూ అన్నది. ఆమె చీరెకి అక్కడక్కడా అంటిన నాచువైపు చూస్తూ- "అనవసరంగా నీళ్ళలో దూకేవు. అన్ని వెదురు బొంగులున్నాయి, ఒకటి అందిస్తే సరిపోను కదా." అన్నాడతను.
    నీళ్ళలోంచి పైకొచ్చిన బొంగుల వైపు చూస్తూ "అబ్బే - అవి ఇనుము పైపుల్లా వున్నాయి. ఎంత లాగినా రాలేదు" అంది.
    అతడు ఉలిక్కిపడ్డాడు. అప్పటివరకూ ఆ వృద్ధుడి మొహంలో వున్న ఆందోళన మేఘం విచ్చుకున్నట్టు తొలిగిపోయింది. చప్పున ఆ వెదుర్లకేసి దృష్టి సారించాడు. తన భావాల్ని తనలోనే దాచుకుని "మంచిదమ్మాయ్ - వెళ్ళిరా" అన్నాడు.
    ఆమె వెనుదిరిగింది.
    ఆమె నడుస్తూంటే వెనుకనుండి అతడు అరిచాడు, "రాధమ్మా - జ్ఞాపకం వుంచుకో, ఎప్పుడో ఎలాంటి కష్టాల్లో పడినా అ ఆ ఇ ఈ."
    నవ్వుతూ చెయ్యి వూపి "అలాగే తాతగారూ! పడితే తప్పకుండా వస్తాను. పడకూడదనే ఆశిద్దాం" అంది బదులుగా.
    ఆమె కొద్ది దూరం సాగికనుమరుగయిన తర్వాత, అతడు ఓ చిన్నరాయి తీసుకుని వెదుర్లకేసి విసిరాడు.
    'టంగ్' మని చప్పుడయింది.
    -ఏదో లోహానికి తగిలినట్టు!
    అతడు ఉలిక్కిపడ్డాడు.
    మరి ఆలోచించకుండా నీళ్ళలో దూకాడు.
    అప్పటికి రెండువందల గజాలకి పైగా నడిచి వుంటుంది రాధ. వెనుక దబ్ మన్న చప్పుడు వినిపించింది. చప్పున ఆగి, వెనక్కి తిరిగి చూసింది. వృద్ధుడు కనిపించలేదు. అతడు మళ్ళీ పడ్డాడా అని అనుమానం వచ్చింది.
    అతడి మెదడు విషయమై ఆమెకి మొదట్నుంచీ అనుమానంగానే వుంది. తనని ఏడిపించటానికి ఓ బండరాయిని వేసి పక్కన దాక్కొన్నా దాక్కొని వుండవచ్చు.    
    ఆమె తల దించుకొని ఇంటివైపు నడక సాగించింది. ఆ చప్పుడు వృద్ధుడు చేసిందేనని ఆమెకు తెలుసు. ఆమెకి తెలియనిదల్లా అతడు గజ ఈతగాడనీ నీళ్ళల్లో మునిగి నాల్గయిదునిముషాల దాకా వూపిరి బిగపట్ట గలడనీ.
    దాదాపు అయిదు నిముషాల్దాకా ఆ చెరువు- అడుగున మాత్రం వృద్దుడు చేపలా కదుల్తూ తిరగసాగాడు.
    నీటిలో అడుగున వెదురు బొంగులు దూరంగా, అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడు బారల్లో వాటిని చేరుకున్నాడు. అడుగున బురదలో పాతిపెట్టబడి వున్నాయి. చేతిలో వాటిని తడిమి చూశాడు.
    అతడి వళ్ళు జలదరించింది.
    అవి వెదుర్లు కావు-
    ఆ షేప్ లో అమర్చిన ఇనుప గొట్టాలు.
    అతడి చేతిలో వాటిని చివరివరకూ తడిమేడు. అక్కడ దొరికింది చిన్న వైరు.
    అతడోసారి నీతిపైకి వచ్చి గుండెల్నిండా ఊపిరి పీల్చుకుని, మళ్ళీ మునిగాడు.
    ఇనుప గొట్టం చివర్లో వున్న రెండు వైర్లు ఎక్కడికి వేల్తున్నాయో చూసేడు. మరో ఇనుప గొట్టపు వైర్లకొచ్చి కలిసినయ్. చివరికి వచ్చేసరికి జల్లెడలా తయారయినాయ్. ఆ జల్లెడ చివర చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్ సీల్ చేయబడి వుంది. అతడు పాకెట్ విప్పేడు. పాకెట్ కాలిక్యులేటర్ లాంటిది అందులో వుంది. నీటికి నానకుండా ప్లాస్టిక్ కవరులో చుట్టబడి అన్ని వైర్లు అక్కడ షోల్డరింగ్ చేయబడి వున్నాయి.
    అతడు జేబులోంచి కటింగ్ ప్లేయరు తీసి వైర్లు కట్ చేయబోయి ఏదో అనుమానం వచ్చి ఆగాడు. ఇనుప గొట్టాల ఇంకో చివర ఏముందో అని వచ్చి చూశాడు.
    నీటిలో వుండబట్టి సరిపోయిందిగానీ, లేకపోతే అతడికి నుదుటిమీద చెమట పట్టివుండేదే.
    ఇనుప గొట్టంలో మినీ బాంబులు అమర్చబడి వున్నాయి. అతడు కటింగ్ ప్లేయర్ తో, వైరుని కత్తిరించిన మరుక్షణం అతడి వొళ్ళు ఖండ ఖండాలుగా ఆ చెరువులో తేల్తూ వుండేదే.
    తన అదృష్టాన్నీ, సమయస్ఫూర్తినీ అభినందించుకుంటూ అతడు ప్లేయర్ లోపల పెట్టుకుని నీటిపైకి వచ్చేడు. ఒడ్డుకు వచ్చి, బట్టలు పిండుకుంటూ ఆలోచనలో పడ్డాడు.
    నీటిలోంచి సగం లేచిన వెదురు బొంగులు పైకి అమాయకంగా కనిపిస్తూన్నాయి. చూపరులకు వెదురు బొంగుల్లా వున్నాయి. అవి ఎంతటి మారణాయుధాలో తల్చుకుంటే అంతటి అనుభవజ్ఞుడికి కూడా వళ్ళు జలదరించింది. క్షణంపాటూ ఏం చెయ్యాలో తోచలేదు.
    ఆ రోడ్డుమీద నుంచే మరుసటిరోజు ప్రధానమంత్రి "ఫార్మ్" ప్రారంభోత్సవానికి వెళుతున్నారని అతడికి తెలుసు. ఆయనమీద హత్యా ప్రయత్నం జరగబోతూందని కూడా తెలుసు- అప్పట్నుంచీ దాని గురించి వెతుకుతూనే వున్నాడు అతడు- ఏ పద్ధతిలో జరుగుతుందా అని. ఇంత పకడ్భందీగా జరుగుతుందని అతడు ఊహించలేదు. "పరశురాముడూ- నువ్వు చాలా తెలివైనవాడివిరా' అనుకున్నాడు మనసులో.
                          2
    "నేను ఈ దేశపు సగటు తెలివైనవాణ్ణని నా ఉద్దేశం. సగటు తెలివైనవాడు అంటే జరుగుతున్న విషయాల్ని చూస్తూ గ్రహించ గలిగేవాడు అన్నమాట" అన్నాడు పరశురాముడు. అతని ముందు ఆ గదిలో ఇరవైమంది యువకులు కూర్చొని వున్నారు. "నాకు ఈ దేశంలో జరుగుతున్నదంతా చూస్తూంటే వళ్ళు మండి పోతుంది. మీకు తెలుసా? సామాన్యుడు ప్రభుత్వానికి కట్టే పన్నులో అరవైశాతం కేవలం మంత్రులు, గవర్నర్లు, బ్యూరోక్రాట్లు-వీళ్ళ ఖర్చుకే సరిపోతుంది. సగటు భారతీయుడి ఆదాయం నెలకి రూ. 44. దాదాపు ముప్పై కోట్లమంది ప్రజలు ప్రతిపూట తిండిలేక బాధపడ్తున్నారు. ఇదంతా చీకటివైపు. అవతలి వైపుకు చూస్తే...." పరశురాముడు బల్లమీదున్న గ్లాసులో నీళ్ళు తాగిచెప్పటం ప్రారంభించాడు. అప్పుడు నాలుగున్నరయింది. మాడిజం అన్ రిజిస్టర్డు ఆఫీసది.  

 Previous Page Next Page