"ఒక్కొక్కడూ ఒక్కొక్క రోమన్ రాజులాగా మనదేశపు ఆరువందల మంది మంత్రులు రాజభోగాల్ని అనుభవిస్తున్నారు. మొన్న మొన్ననే మన టూరిజం మంత్రిగారు ఫ్రాంక్ ఫర్డు నుంచి లండన్ మీదుగా పారిస్ ద్వారా జానీవా చేరుకున్నారు. అంతకన్నా హాస్యాస్పదమూ, అవమానమూ అయిన విషయము ఏమిటంటే, టూరిజం డైరెక్టర్ గోవాలో ఒక సమావేశాన్ని వాయిదా వేయటం కోసం తన సాయశక్తులా ప్రయత్నించాడు. మరో కారణం అది తన "స్పెయిన్" ప్రయాణానికి అడ్డురావటమే! ఆ ప్రయత్నంలో ఆయన దాదాపు పాతికవేలు ఖర్చుపెట్టాడు. అదీ ప్రభుత్వ అకౌంటులో"
"మీలో ఎంతమందికి తెలుసు? ఒక కాబినెట్ మినిష్టర్ సంవత్సరపు ఆదాయం నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేలని? ఒక సగటు భారతీయుడికన్నా అతడు 848 రెట్లు ఎక్కువ సంపాదిస్తాడని?" పరశురాముడు ఒక ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ చూపించాడు.
"నాలుగు లక్షలమంది ఓటర్లు 'మాకు ఎమ్మెల్యేగా నువ్వు వద్దు' అని ఎలక్షన్లలో ఓడిస్తే, అతగాడిని ఓదార్చడానికి ప్రభుత్వపు రూలింగ్ పార్టీ అతడికిచ్చే పదవి పేరు 'గవర్నరు'. లక్షలమందిచే తిరస్కరింపబడ్డవాడు అయిదుకోట్ల మందికి అధికారి అవుతాడు. ఒక సంవత్సరపు మహారాష్ట్ర గవర్నరు ఖర్చు- తోట, కరెంటు, నీరు, టాక్సులు కలిపి ఆరులక్షలా యాభైవేలు. మన ప్రెసిడెంటు వుంటున్న ఇల్లు ముప్పైనాలుగు కోట్ల రూపాయల విలువ గలది. డెబ్భై నాలుగు లాబీలు, మైలున్నర పొడవున్న వరండాలూ, పద్దెనిమిది చోట్ల మేడ మెట్లు, ఇరవై ఏడు ఫౌంటెన్లు, మూడు వందలా నలభై గదులూ వున్న రాజభవనం- ఫుట్ పాత్ ల మీద నిద్రపోయేవాళ్ళు పదిశాతం వున్న మన భారతదేశపు ప్రజల ఫస్ట్ సిటిజెన్ ది" అతడి గొంతు నాలుగు గోడల మధ్య ప్రతిధ్వనించింది.
అతడి మొహం మీద విషాదకరమైన నవ్వు వెలిసింది. ".....సమసమాజ ధ్యేయంతో పని చెయ్యవలసిన మన ప్రభుత్వం, రెండు లక్షలు అని ఆశపెట్టి రాత్రనకా పగలనకా రిక్షాలాగే వాడి దగ్గర రూపాయితో లాటరీ టిక్కెట్టు కొనిపిస్తుంది. రేసులు దగ్గర నిండేకార్లకన్నా రేసుకోర్సు సైకిల్ స్టాండ్ లో వున్న సైకిళ్ళను చూస్తే ఎన్ని మధ్యతరగతి కుటుంబాలు నాశనమవుతున్నాయో తెలుస్తుంది. నిరుద్యోగం పేరుతో ప్రొహిబిషన్ పెట్టడం లేదీ ప్రభుత్వం. ఫ్రెండ్స్.... ఇటువంటి వ్యవస్థని కూలదొయ్యటం కోసం రకరకాల సిద్ధాంతాల ద్వారా రకరకాల మంది ప్రయత్నం చేశారు. 'టోటల్ రివల్యూషన్' అన్నారు కొంతమంది. 'కమ్యూనిజం' అన్నారు కొంతమంది. 'నక్సలిజం' అన్నారు కొంతమంది. నేను నా పద్ధతిలో వ్యవస్థల్ని మార్చటానికి ప్రయత్నిస్తాను. నా ఇజం పేరు 'మాడిజం'. తెలుగులో చెప్పాలంటే పిచ్చితనం" పరశురాముడు నవ్వేడు. "ఈ దేశపు మేధావులంతా జరుగుతున్నది చూస్తూ నిస్సహాయంగా వుండిపోయారంటే వాళ్ళంతా నిజంగా పిచ్చివాళ్ళు. ఈ పిచ్చివాళ్ళంతా కలిసి వ్యవస్థని మార్చటానికి చేసే ప్రయత్నమే 'మాడిజం'. దాని ప్రయత్నమే ఈ ప్రధానమంత్రిని ఆటపట్టించటం."
"దానివల్ల లాభం ఏమిటి?" ఎవరో అడిగారు.
"ఏ ఇజమూ మన వ్యవస్థని మార్చలేకపోయింది. అంత మూర్ఖులు మన ప్రజలు! మనం వాళ్ళ ప్రతినిధుల మవ్వాలంటే మరింత మూర్ఖులుగా నిరూపించుకోవాలి. ఇలాంటి పన్లు చేసేకొద్దీ మన బలం విస్తరిస్తుంది. వచ్చే ఎలక్షన్లలో మనకే ఓట్లు వేస్తారు. నేను మిమ్మల్ని కోరేదల్లా నా పార్టీలో చేరమని. మీరంతా చదువుకున్నవాళ్ళు, డబ్బులేనివాళ్ళు, తెలివితేటలనే ఆస్థి మాత్రమే వున్నవాళ్ళు. నాతో చేయి కలపండి-"
"రేపటి మీ కార్యక్రమం ఏమిటి?"
పరశురాముడు నల్లటి బోర్డుమీద సుద్దముక్కతో రెండు గీతలు గీశాడు. "ఇది రోడ్" అన్నాడు. "ప్రధానమంత్రి కారు చెరువు ప్రక్కనుంచి ఫార్మ్ ప్రారంభోత్సవానికి వెళ్ళేది ఈ దారినే. ఇదిగో ఇక్కడ చిన్న బ్రిడ్జి. చెరువు నీరు వెళ్ళటానికి కాలువ. ఈ బ్రిడ్జికి రెండు కర్రస్తంభాలు సపోర్టు. సరీగ్గా ప్రధానమంత్రి కారు ఈ బ్రిడ్జిమీద కొచ్చేసరికి ఈ స్తంభాలు పేల్చివేయబడతాయి."
ఆ గదిలో క్షణం నిశ్శబ్దం ఆవరించింది. ముందు వరుసలో కూర్చున్న యువకుడు తల అడ్డంగా వూపుతూ "అది అంత సులభం కాదు" అన్నాడు. "సెక్యూరిటీ అధికారులు చేతులు ముడుచుకొని కూర్చోరు. ప్రధానమంత్రి వెళ్ళే దారి ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్ష చేయబడుతుంది. దూరంగా తుపాకీ పట్టుకుని నిలబడి కాల్చెయ్యటానికి ఇది ఇంగ్లీషు సినిమా కాదు. అందులోనూ అదంతా చెరువు. దారికిరువైపులా మనుష్యులుంటారు. పోలీసులుంటారు. రెండు స్థంభాలూ ఒకేసారి కూలాలంటే ఫిరంగులు కావాలి. అవి పేలే సమయానికి కారు సరీగ్గా బ్రిడ్జిమీద ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా. ఆ ఫిరంగులు పేల్చేవాడు ప్రాణాలమీద ఆశ వదులుకొని ఆ పనికి సిద్ధపడాలి. నా ఉద్దేశ్యంలో ఇదంతా నిజంగా పిచ్చితనమే.- అదే - ఐ మీన్ మాడిజం."
పరశురాముడు ఆ యువకుడివైపు చూసి నవ్వేడు. "మీరేం చదువుకున్నారు?"
"ఎమ్.టెక్. ఎలక్ట్రానిక్స్."
అంగీలోంచి చుట్టతీసి వెలిగిస్తూ "నేనంత చదువుకోలేదు" అన్నాడు పరశురాముడు.... "కానీ ఒక బ్రిడ్జి కూల్చేయటానికి- ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అంత కష్టపడనక్కర్లేదనుకొంటాను?"
అతడు బ్లాక్ బోర్డువైపు తిరిగాడు.
"ఈ చెరువులో వెదురుబొంగుల్లా కనబడే నాలుగు ఇనుప గొట్టాలు పాతేను" అతడు చెప్పటం ప్రారంభించాడు.
"ఆ ఇనుపగొట్టాల్లో తుపాకి మంది కూర్చబడి వుంది. గొట్టాలచివర ట్రిగ్గర్ వుంది. దాన్ని కదల్చగానే స్థంభాలు పేలిపోతాయి."
నవ్వుతూ ఎవరో "మీరుగానీ జలస్థంభన విద్య ద్వారా నీళ్ళలో వుండి కారు రాగానే పేలుస్తారా?" అని వెనుకనుంచి అన్నారు. గొల్లున నవ్వులు. పరశురాముడు కూడా నవ్వేడు.
నవ్వుతూ "అది పేలే సమయానికి నేను అక్కడ వుండను. నేనే కాదు, మనవాళ్ళు ఎవరూ వుండరు" అన్నాడు.
"టైంబాబు పెడతారా?" ఒకరడిగారు.
"ఎలా? కారు ఎప్పుడొస్తోందో తెలీదుగా" ఇంకొకరన్నారు.
"మరెలా? నీటిలోని ఫిరంగుల్ని ఏది పేలుస్తుంది?"
పరశురాముడు మళ్ళీ నవ్వేడు. "ఏ కారు బ్రిడ్జిమీదకు రాగానే స్థంభాలు కూలిపోవాలో, ఆ కారే చెరువులోని ఫిరంగుల్ని పేలుస్తుంది."
"ఎలా?" నాలుగయిదు కంఠాలు ప్రశ్నించాయి.
"ఆ కారు వెనుక చక్రం దగ్గర గుర్రపు నాడా అయస్కాంతం పెడతాను కాబట్టి."
"అయితే?"
అతడు చెప్పటం ప్రారంభించాడు.
"రోడ్ మీద చెక్క బ్రిడ్జిలని ఎప్పుడైనా గమనించారా? బ్రిడ్జి ప్రారంభం అవబోయేముందు దారికి అడ్డంగా ఇనుపవూచ వుంటుంది. ప్రస్తుతం ఈ బ్రిడ్జికి కూడా అలానే వుంది. ఏ వాహనమైనా ఈ వూచని తొక్కుకుంటూనే వెళ్ళాలి" అతడు ఆగాడు.
"రోడ్ చివరికంటా వచ్చిన ఆ వూచకి, చివర్న ఒక రాగి వైరు చుట్టేను" అన్నాడు. "ఆ రాగి వైరుని నీళ్ళలోకి దింపేను. ఆ రాగి తీగెలకి, ఒక ఆపరేషన్ ఆంప్లిఫయర్, ఒక స్టెప్పర్స్ మోటార్ తగిలించబడి వున్నాయి."
".... కారు ఇనుపవూచ మీద నుంచి దాటగానే కారుకి అతికించబడి వున్న అయస్కాంతం వల్ల క్షణంలో వెయ్యవవంతు పాటూ రాగితీగల్లో కరెంట్ ప్రవహిస్తుంది. ఈ మాత్రం కరెంటు చాలు మనకి. అది ఆపరేషన్ ఆంఫ్లిఫయర్ ద్వారా అయిదు వోల్టులకి పెంచబడి స్టెప్పర్స్ మోటార్ ని, ఒక స్టెప్పర్ ముందుకి తోస్తుంది. లివర్ ముందుకు వెళ్ళగానే పేల్తుంది....."
"....చెక్క బ్రిడ్జి కాబట్టి కారు గంటకి ముప్పై మైళ్ళవేగంతో వెళుతుంది. వైర్లలో కరెంటు ప్రవహించి, ఫిరంగిని పేల్చటానికి నూటయాభై మిల్లీ సెకన్లు పడుతుంది. గంటకి ముప్పై మైళ్ళ వేగంతో వెళ్ళే కారు నూటయాభయ్ మిల్లీ సెకనుల కాలంలో దాదాపు అరవై అడుగుల దూరం వెళుతుంది. అంటే బ్రిడ్జి స్థంభాలు కూలే సమయానికి అది సరిగ్గా మధ్యలో వుంటుందన్నమాట-"
అతడు వూపిరి పీల్చుకోవటానికి ఆగాడు. ఆ గదిలో సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం వ్యాపించి వుంది. అందరూ అచేతనులై వింటున్నారు. చెవుల్ని నమ్మలేకపోతున్నారు. అందరిలోకి ముందు తేరుకున్న ఒక యువకుడు అడిగాడు.
"స్తంభాల్ని పేల్చేయడం ఎందుకు? ఏకంగా కారునే పేల్చేయొచ్చుగా."
పరశురాముడు తాపీగా "ప్రధానమంత్రిని చంపటం నా ఉద్దేశ్యం కాదు. స్తంభాలు కూలగానే బ్రిడ్జి నీళ్ళలోకి దిగిపోతుంది. కారు నీళ్ళలో మునిగిపోతుంది. అందులోంచి ప్రధానిని బైటకి తీయటానికి అందరూ నానా హైరానా పడిపోతారు. తడిసిన బట్టలతో, నానిన జుట్టుతో ప్రధాని నీళ్ళలోంచి బయటికి వస్తూంటే ఎన్నో వందల కెమేరాలు క్లిక్ మంటాయి. మొగవాళ్ళు కర్చీఫులూ, ఆడవాళ్ళు పైటలూ చాటు చేసుకుని నవ్వుకుంటారు. అదీ మనకి కావల్సింది...."
ఒక యువకుడు ఆవేశంగా పైకి లేచాడు. "కేవలం అక్కడున్న వాళ్ళని నవ్వించడం కోసం ఇంత ప్రయత్నమా- నే నొప్పుకోను. ఇది నిజంగా మాడిజమే."
పరశురాముడు తాపీగా అన్నాడు- "పూర్వం మన మంత్రిరేణ్యుడొకాయన గాంధీగారి సమాధిని గంగాజలంతో శుద్ధిచేస్తానన్నాడట. నేను చేస్తున్న పని మంత్రిగారు చేసిన దానికంటే హాస్యాస్పదం కాదు."
3
అదే రోజు- నాలుగున్నరయింది.
ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో అన్ని గడియరాలూ సెకన్లతో సహా నాలుగున్నర చూపిస్తున్నాయి. డైరెక్టర్ పార్ధసారధి తన కాబిన్ లో కూర్చుని ఉత్తరాలు చదువుతున్నాడు. మూడోది చిన్న టెలెక్స్. దానిలో నాల్గే లైనులున్నాయి. చదువుతూనే అతడు నిటారుగా అయ్యేడు. అందులో ఇలా వుంది-
"డిసెంబర్ ఇరవై మూడు : ఆంధ్రరాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రిపై ఈ రోజు హత్యాప్రయత్నం జరిగింది. మిగతా వివరాలు అందిన వెంటనే...."
ఇంగ్లీషులో టెలెక్స్ టైపు చేసిన విషయం అది.