Read more!
 Previous Page Next Page 
యుగాంతం పేజి 2

   

     "సర్లే సర్లే, తెలియక అన్నానా మాట" నవ్వింది. మళ్ళీ ఫోటోవేపు చూస్తూ, "అయినా ఇంతందంగా వున్నాడూ అంటే ఈపాటికే ఎవర్తోనో ప్రేమలో పడే ఉంటాడు" అంది.
   
    "లంచ్ టైమ్ అయిపోయినట్టుంది?" శైలజ గుర్తుచేసింది.
   
    రాణి నవ్వి, లేస్తూ "సర్లే సాయంత్రం కలుస్తాను" అని వెళ్ళిపోయింది.
   
    ఆమె వెళ్ళేక శైలజ అప్లికేషన్ ఫైల్లో పెట్టేస్తూ ఫోటోవేపు చూసింది. రాణి అన్నట్టు అతడు చాలా అందంగా వున్నాడు. అమాయకంగా, తనకన్నా చిన్నగా.
   
    పేరు చూసింది.
   
    రమణ.
   
    బి.ఏ. యూనివర్సిటీ ఫస్ట్.
   
    ఫైల్లో అప్లికేషన్ పెట్టేసి, దాన్ని డ్రాయర్ లోకి తోసేసి, తన పనిలో మునిగిపోయింది.
   
                                *    *    *

   
    సాయంత్రం అయిదింటివరకూ శైలజకి ఊపిరి సలపని పని తగిలింది. మేటర్ కంపోజింగ్ కి యివ్వటం, కంపోజ్ అయివచ్చిన మేటర్ ఫ్రూఫులు దిద్దటం, అడ్వర్టయిజ్ మెంట్ బ్లాకులకు ఫోన్ చెయ్యటం లాటివి. "పగవాడికైనా సబ్ ఎడిటర్ పని వద్దురా బాబూ!' అంటూ ఆమె వళ్ళు విరుచుకుంటుంటే రాణి వచ్చింది.
   
    "పోదామా?"
   
    "ఇదిగో అయిపోయింది."
   
    మరొ అయిదు నిమిషాల్లో ఆమె టేబుల్ సర్దివేసింది.
   
    ఇద్దరూ బయటకొస్తూంటే రాణి అడిగింది.
   
    "ఆ కాగితంలో ఏం వుందో కనుక్కొన్నావా!"
   
    "ఏ కాగితం?"
   
    "అదే! గోరీల మధ్య దొరికిందన్నావే- అది."
   
    "ఉహు.... ఎక్కడా తీరిక దొరకందే!"
   
    వాళ్ళిద్దరూ కారిడార్లో నడుస్తూంటే ఎదురుగా అటెండర్ వస్తూ కనిపించేడు. వాడి పేరు ఇస్మాయిల్.
   
    రాణి అతణ్ణి ఆపి, "ఇదిగో, ఈ కాగితంలో ఏం వ్రాసివుందో చెప్దూ" అంది.
   
    అతడు కాగితం అందుకొన్నాడు. చదువుతూంటే అతడి మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనబడింది.
   
    "ఏముందందులో?" నిశ్శబ్ధాన్ని భరించలేక అడిగింది.
   
    అతడు మాట్లడలేదు.
   
    "ఏమిటది.....? ఉర్దూనా?"
   
    అతడు కాగితంవైపు మళ్ళీ చూసేడు.
   
    "కాదు..... అరబ్బీ!"
   
    "నీ కొచ్చా?"
   
    "వచ్చు."
   
    అతడు చదివేడు. "యోమాయూస్ ఫిక్స్ ఫిసూరి పతుతూనా ఆఫ్ వాజా!"
   
    "అంటే....?" ఇద్దరూ ఒకేసారి అడిగేరు.
   
    అతడు తల పైకెత్తాడు. అతడి కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. మొహం భావరహితంగా వుంది. అనాసక్త కంఠంతో అతనన్నాడు-
   
    "...ఒకరోజు శంఖం వూదబడుతుంది. ఆకాశం తెరవబడుతుంది. అప్పుడు శవాలన్నీ గుంపులు గుంపులుగా లేచి వస్తాయి."
   
    అతనా మాటలంటూ వుంటే దూరంగా ఎక్కడో ఉరిమింది. ఆ రాత్రి కురవబోయే కుంభవృష్టికి సూచనగా మేఘాలు అలుముకుంటున్నాయి.
   
    నాంది :
   
    మినుకు మినుకుమని వెలుగుతూన్న దీపాన్ని గాలి సాయంతో టప్పున ఆర్పి చీకటి మరింత చేతనత్వాన్ని పొందింది. మనోసముద్రపు నిబంధనల చెలియలికట్టని కొద్దిగా తొలగిస్తే వెల్లువలా బయటకు దూకే పాపం. మనిషి మనసులో పాపంలాంటి చీకటి.
   
    తలుపు సందుల్లోంచి బలంగా వీస్తున్న ఈదురుగాలి శబ్దం శరీరాన్ని గగుర్పొడుస్తూంది. మనిషిని అనుక్షణమూ బ్రతికిస్తూన్న గాలి కొద్దిగా చెలరేగితే మనిషి గడ్డిపోచలా ఎగరాలి.
   
    బాబు జానకి ఒళ్ళో మరింత మునగదీసి పడుకున్నాడు. గదిలో దీపం ఆరిపోయినా ఆమె కదల్లేదు. మినుకు మినుకుమనే వెలుగుకన్నా చీకటే బావుంది. ప్రక్కగదిలో మరిది ఇంకా చదువుతూనే వున్నాడు. రేపు పత్రికాఫీసులో ఇంకో ఇంటర్వ్యూ ప్రకాశరావు ఇంకా రాలేదు. అప్పుడప్పుడు మామగారి దగ్గు వినిపిస్తూ వుంది. దూరంగా గడియారం ఒంటిగంట కొట్టింది.
   
    గదిలో రమణ పుస్తకంలోకి చూస్తూ మాలతి గురించి ఆలోచిస్తున్నాడు. మరుసటిరోజు ఇంటర్వ్యూ అయినా ఆలోచనలు మాలతి చుట్టూనే.
   
    .....జానకి బాబుని ఒళ్లోంచి లేపి, మంచంమీద పడుకోబెట్టింది. కిటికీ తలుపు తెరచి చూడబోతే ఫెడేలున వర్షపుజల్లు మొహం మీదకు కొట్టింది. చప్పున తలుపు మూసింది. గడియ విరిగిపోతుందేమో అన్నంత బలంగా గాలి వీస్తూంది.
   
    శివుడి జటాజూటం నుంచి దభిల్లున గంగానది జారినట్టు శబ్దం ఏనుగు తొండాల్తో పోసినట్టు కుంభవృష్టి.
   
    తలుపు దబదబా బాదిన చప్పుడు. వెళ్ళి తలుపు తీసింది. ప్రకాశరావు, ముద్దగా తడిసిపోయాడు. చలికి వణికిపోతున్నాడు. గాలితోపాటు లోపలికొచ్చేడు. తలుపు బలంగా వేసింది. "ఇక్కడ జల్లు పడుతోంది" అని ముసలాయన గొణుగుతున్నాడు. ఆయన్ని లేవమని చెప్పి మంచం మరిది గదిలో వేసింది. ముసలాయనకి లైటుంటే నిద్ర పట్టదు. రమణ లైట్ ఆర్పేసేడు. చీకట్లో వెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకున్నాడు. మాలతి. మాలతి. మాలతి.
   
    ప్రకాశరావు తల తుడుచుకొని బట్టలు మార్చుకొంటుంటే జానకి వంటింట్లోకి వెళ్ళి అన్నం, నీళ్ళూ పెట్టింది. అతడు రెండు మెతుకులు తిని లేచిపోయాడు. జానకి అన్నీ చూస్తూంది. మాట్లాడలేదు. పెళ్ళయి ఎనిమిదేళ్ళయింది. మాట్లాడటానికేమీ మిగల్లేదు. కంచం తీసింది.
   
    ప్రకాశరావు గదిలోకి వచ్చేడు. బాబుని క్షణం చూసి పక్కనే పడుకున్నాడు. లోపల వంటగదిలో సామాను సర్ది జానకి కూడా వచ్చింది. మంచం పక్కనే చాప వేసుకొని పడుకొంది. తల దగ్గరే వున్న మాసిన బట్టల పెట్టెలోంచి తడిసిన బట్టల వాసన.
   
    కుడిచేతి పక్కకి వత్తిగిల్లుతూ "ప్రళయం వచ్చేటట్టు వుంది పాడు వర్షం' అనుకొన్నది జానకి. తధాస్తన్నట్టు మిన్ను వెన్ను మీద మెరుపు మెరిసింది.
   
                                        2
   
    విరిగి పడటానికి సిద్దంగా వున్న పాక చూరుకింద రాజయ్య ఎడతెరపిలేకుండా పడుతున్న వర్షాన్ని చూస్తున్నాడు. అతడి మొహంమీద ముడతలు అతడి గత జీవితపు కష్టాల్లా లెక్క పెట్టలేనంతగా వున్నాయి. ఆనందాన్నీ విషాదాన్నీ ఒకేలా ప్రదర్శించటానికి అలవాటుపడ్డ గాజు కళ్ళు వర్షాన్ని నిర్లిప్తంగా చూస్తున్నాయి.
   
    రాజయ్య ఎకనమిక్స్ చదువుకోలేదు. ఎనిమిదో క్లాసు కూడా చదువుకోలేదు. అయినా భూషణం చెప్పిన లెక్క సరిగ్గానే వున్నట్టు తోచింది. ఆ లెక్కఅర్ధమయ్యేటట్లు చెప్పటానికి భూషణమూ, పెదకామందూ చాలా కష్టపడవలసి వచ్చింది. మరి ఎనిమిదో క్లాసువరకూ అయినా చదువుకోని రాజయ్యకి, వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా నిర్మించిన అర్ధశాస్త్రాన్ని బోధించటం అంటే సామాన్యంకాదు. అయినా వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు. చేతివేళ్ళు ఉపయోగించి లెక్కలు కట్టడం నేర్పారు. ఎలాగైతేనేం ఓ చిన్నలెక్కని అతని బుర్రలోకి ఎక్కించారు. అది అర్ధమయినా కాకపోయినా ఒక విషయం మాత్రం అతడికి బాగా అర్ధమైంది. ఇంకో నెలలో తన పాకా, పొలమూ ఖాళీచేసి అతడు భూషణానికి అర్పించాలి. పాక సంగతి సరే- దాంట్లో వున్నా బయట వర్షంలో వున్నా ఒక్కటే. అయితే తాతముత్తాతళ పొలం అది. దాన్ని వదులుకోవాలంటే బాధ. రాజయ్య వాళ్ళ తాత రాజయ్యకిచ్చిన అరెకరాన్నీ భూషయ్యవాళ్ళ తాత భూషయ్యకిచ్చిన వందెకరాల్తోనూ కలపకుండా ఎవరాపగలరు?
   
    ప్రవాహంలా కదుల్తూన్న వాన నీటిలోకి తుపుక్కున ఉమ్మేసి, "ఎదవలోకం! ఎదవలోకమంట. థూ, భూకంపం వచ్చి కూలిపోకూడదూ" అన్నాడు చుట్ట కోసం తడువుకుంటూ.

 Previous Page Next Page