3
లాస్ ఏంజెల్స్, వెస్ట్రన్ కాలిఫోర్నియా, హోటల్ షెర్టాన్ నాలుగో అంతస్తులో అయిదువందల ఇరవై రెండో నెంబరు గదిలో రాత్రి ఒంటిగంటా నలభై అయిదు నిముషాలకి ఫోన్ ఎడతెరపి లేకుండా మొగసాగింది. ఫాస్ట్ సెక్రటరీ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ - జేమ్స్ డొనాల్డ్ కొద్దిగా కదిలి రజాయి కిందనుంచి చెయ్యి బయటికి పెట్టి రిసీవర్ అందుకొని "హలో!" విసుగ్గా అన్నాడు.
రూమ్ టెంపరేచర్ కృత్రిమంగా కంట్రోలు చెయ్యబడినా గాజు అద్దాల్లోంచి బయటి మంచు వెన్నులో చలి పుట్టిస్తోంది.
రిసీవర్ ని చూపుడు వేలితో టాప్ చేసి "హలో" అన్నాడు మళ్ళీ హోటల్ ఆపరేటర్ లైన్ లోకి వచ్చి, "ఎక్స్యూజ్ మీ సర్" అంది. "కాల్ ఫ్రమ్ వాషింగ్టన్."
రజాయి కింద మెక్ కొద్దిగా కదిలేడు.
నలభై అయిదేళ్ళ వయసు తెల్లబడుతూన్నజుట్టు, ఆరడుగుల రెండంగుళాలు ఎత్తు, యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ పట్ల అపారమయిన గౌరవం ఒక భార్యా ఇద్దరు పిల్లలు.
"హలో"
అవతలిపక్క లైనులోకి ఎవరో వచ్చిన ధ్వని "హలో మెక్!"
"ఎవరూ?"
"రోజర్స్.... విలియమ్ రోజర్స్."
మెక్ చేతిలో రిసీవర్ బిగుసుకుంది. పక్కమీద చప్పున లేచి కూర్చొని, "సర్!" అన్నాడు.
"నువ్వు వెంటనే బయల్దేరు."
"సర్!"
"వాషింగ్టన్ కాదు..... ఫ్రిస్కో"
నిన్న సాయంత్రం న్యూయార్క్ నుంచి తనతో మాట్లాడాడే! అట్లాంటిక్ సముద్రం నుంచి పసిఫిక్ వైపు ఇంత అర్జంటుగా ఈయనెందుకు వచ్చేడు?
"ఇంకో గంటలో నువ్విక్కడ వుండాలి. ఈ లోపులో మనక్కావలసిన పూర్తి సమాచారం వస్తుంది."
ఏ సమాచారం అని అడగలేదు. "వస్తున్నాను" అని ఫోన్ పెట్టేశాడు. మంచం మీద నుంచి దిగి, గబగబా పది బస్కీలు తీసి, సింక్ లో మొహం కడుక్కొని బాటిల్ చివర్లో వున్ననాల్గు చుక్కలూ కొట్టేసి, సూట్ కేస్ సర్దుకొని అయిదు నిమిషాల్లో మెట్లు దిగేడు.
"ఇంత అర్దరాత్రి వెళ్ళిపోతున్నారేం?" రిసెప్షనిస్టు పలకరించింది. ఇరవైయ్యేళ్ళ యవ్వనాన్ని ముద్దచేసినట్టుంది. రెండ్రోజుల క్రితం పరిచయం.
మెక్ నవ్వి, "ఫోనొచ్చింది" అన్నాడు. మెక్ నవ్వితే గ్రేగరీపెక్ లా వుంటాడు. నవ్వకపోతే రాక హడ్సన్ లా వుంటాడు. రాత్రి రెండు నిర్మానుష్యమైన వరండా.
"ఎవరు ?భార్యా?"
తల అడ్డంగా వూపి "కాదు" అన్నాడు.
"బైట బాగా మంచు కురుస్తోంది, కారు నడవదు."
"ఎలాగో సర్దుకొంటాను."
"దార్లో మాటిమాటికీ కాప్స్ (పోలీసులు) ఆపుతారు."
"గుర్తింపు కార్డు వుంది."
"పీటర్స్ స్ట్రీట్ లో రెండు తర్వాత వెళ్ళనివ్వరు."
"చుట్టూ తిరిగి నార్త్ స్క్వేర్ మీంచి వెళతాను" ఆగి అన్నాడు....."ఎలాగూ రూమ్ ఖాళీ చేసేశాను."
"రూమే సమస్య అయితే ఇంకో గంటలో నేను రిలీవ్ అయిపోతున్నాను. షెర్టాన్ హోటల్, రిసెప్షనిస్టులకి మంచి కాటేజీలిస్తుంది మిస్టర్ మెక్."
మెక్ ఆమెవైపు చూశాడు. బాబ్డ్ గ్రే హెయిర్, నీలి కళ్ళు, పగడాల్లాంటి పెదవులు.
నవ్వి, "ఉండేవాన్నే. కానీ పిల్చింది విలియమ్ రోజర్స్" అని, సూట్ కేసు పట్టుకొని చీకటిలో కలిసిపోయాడు.
ఆమె అటే చూస్తూ నిలబడింది. నెమ్మదిగా ఆమె పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. 'విలియమ్ రోజర్స్' అట. అమెరికన్ ప్రెసిడెంట్ ది కూడా ఆ పేరే.
4
మెక్ కాంటెస్సా ఎయిర్ పోర్టు వైపు దూసుకుపోతున్న సమయాన ఢిల్లీ ఇంద్రప్రస్థమార్గ్ పధ్నాలుగో నెంబరు యింటిలో ప్రధాన మంత్రి జగదీష్ చంద్ర తన టేబుల్ ముందున్న కాగితాల మధ్య మోచేతులాన్చి, చేతుల మధ్య తల పెట్టుకొని నిస్త్రాణగా కళ్ళు మూసుకొన్నాడు. అలసటతో అతని కళ్ళు మూతలు పడసాగాయి. కానీ ఆ రాత్రి ఆ విషయాన్ని తేల్చేయాలి. మరుసటిరోజు పార్లమెంటులో మంత్రివర్గాన్ని ప్రకటించాలి.
అతికష్టంమీద అతడి పార్టీ మెజారిటీ సంపాదించగలిగింది. కానీ ఈ మంత్రుల్ని ఎన్నుకోవటంలో ఏ మాత్రం పొరపాటు చేసినా తన పార్టీ అధికారం నుంచి పేకముక్కలా టప్పున పడిపోవటం ఖాయం'. అందర్నీ సంతృప్తి పరచటం ఎలా?
జగదీష్ చంద్ర చిన్నతనం నుంచీ కొన్ని సిద్దాంతాల మధ్య పెరిగినవాడు. తన జీవితాన్ని దేశం కోసం అర్పితం చేసినవాడు. అందుకే నలభై రెండేళ్ళ వయసులోనే ప్రధానమంత్రి కాగలిగేడు.
దేశాన్ని ఎదుర్కొంటున్న సమస్యలు ఇన్ని వుండగా ప్రతి పార్టీ స్వంత రాజకీయాలకి యింత ప్రాముఖ్యత ఎందుకిస్తుందో అతడికి అర్ధం కాలేదు. ఏ మంచిపని చేయబోయినా ప్రతిపక్షం దాంట్లో తప్పులు పట్టడానికి సిద్దంగా వుంటుంది. దేశం గురించి ఆలోచించటంకన్నా వీళ్ళ గురించి ఆలోచించటానికే తన సమయం సరిపోవటం లేదు.
ఎలా?
ఉత్తరప్రదేశ్ కి చెందిన వాడికి ఉపప్రధాని పదవి ఇవ్వాలి. తన పార్టీతో చేతులు కలిపిన లేబర్ పార్టీ ముగ్గురు మత్రుల్ని రికమెండ్ చేసింది. ఉత్తరభారతానికి, దక్షిణానికీ మధ్య సంబంధాలు అసలు బాగా లేవు. ఈసారి మెజారిటీ వాళ్ళకే ఇవ్వాలి. ఇద్దరు ముస్లిం మంత్రులూ, ఒక సిక్కు ప్రతినిధి.
తల విదిలించేడు.
రాజ్యాంగాన్ని మార్చి ఎన్నికల్ని రద్దు చేస్తే తప్ప దేశం బాగుపడదు. ఉహుఁ. తను అలా ఆలోచించకూడదు. భారతదేశపు ప్రధాని అలా ఆలోచిస్తున్నాడని తెలిస్తే దేశంలో......
ఫోన్ మ్రోగింది.
పార్టీ అధ్యక్షుడు అవినాష్!
"ఏమన్నా తేలిందా?"
"ఉహుఁ, ఓ పన్నెండు పేర్లు ఫైనలైజ్ చేసేను."
"అందులో పది సాయంత్రమే అనుకున్నాంగా."
జగదీష్ మాట్లాడలేదు.
"....నేను మెలకువగా వుంటాను. చెప్పు, ఎంతసేపయినా సరే-"
"ఎవరెవరున్నారు మీ గదిలో-"
అవతలివైపు నవ్విన ధ్వని. "అందరూ.....మొత్తం దేశం అంతా". ఫోన్ పెట్టేశాడు.
గడియారం రెండు కొట్టింది.
కిటికీ దగ్గర కొచ్చి బయటకు చూడసాగేడు. మబ్బులు విడిపోయి, వెన్నెల పడుతోంది. విశాలమయిన కాంపౌండు. సగం వరకూ పూల మొక్కలు అక్కడక్కడ పెద్ద బండరాళ్ళు. జుట్టు విరబోసుకున్న దెయ్యంలా దూరంగా పెద్ద చెట్టు. ఏదో ఒకటి తేల్చెయ్యాలి. కానీ అందరినీ సంతృప్తి పరచాలి. లేకపోతే పార్టీలో వుంటూనే గోతులు తీస్తారు. సమ్మెలు, లూటీలు, పోలీసు కాల్పులు పార్లమెంటులో ప్రశ్నలు, సైన్యం....
తన చేతకానితనాన్ని చాలా జాగ్రత్తగా నిరూపిస్తారు.
చీకట్లోకి చూస్తూ తనని తనే ఈ ప్రశ్న వేసుకొన్నాడు జగదీష్ చంద్ర. విశ్వంతో పోలిస్తే....యాభై అడుగుల పొడవూ, నలభై అడుగుల వెడల్పూ వున్న తెల్లకాగితం మీద సూదిని ఇంకులో ముంచి చుక్క పెడితే - కనబడే సూక్ష్మ బిందువులాంటి భూమీ....దానిమీద పీలకలాంటి మనిషి ఎందుకింత స్వార్ధంతో బ్రతుకుతాడు?