పాండవులు అయిదుగురు. ఆ సంఖ్య పెరక్కూడదు. అర్జునుడు చస్రే నేను అతడి స్థానంలోకి వస్తాను. లేదా నేనే పొతే పంచపాండవులు ఉంటారు అని అన్నాడు కర్ణుడు."
విశ్వం అతడి ముఖంలోకి చిత్రంగా చూశాడు.
"తమ్ముడూ నీకు ద్రోహం చెయ్యను. నువ్వు చెయ్యబోయేది మంచి పని కాదని నాకు తెలుసు. కాని మందలించే హక్కు నాకు లేదు." ఓ క్షణం ఆగి మళ్ళీ అన్నాడు.
"నీకు ఒకే అన్నయ్య ఉన్నాడు. అతడి పేరు గౌతమ్."
ఇద్దరూ అయోమయంగా చూశాడు.
"ఆ గౌతమ్ జైల్లో ఉంటె ఈ గౌతమ్ నీకు అన్నయ్యగా ఉంటాడు. ఈ గౌతమ్ జైల్లో ఉంటే ఆ గౌతమ్ నీకు అన్నయ్యగా ఉంటాడు" అతడి కంఠం గరగరలాడింది.
"వస్తాను, తమ్ముడూ!' అని కౌగలించుకొన్నాడు రవిని.
రవి తేరుకొనే లోపలే గౌతమ్ గది బయటికి వెళ్ళిపోయాడు,
వరండాలో నడుస్తూ చెమ్మగిల్లిన కళ్ళను చేత్తో తుడుచుకున్నాడు గౌతమ్.
5
"అస్తిత్వపు బలహీనతలో ఈదుతున్నాను.
జీవిత భారాన్ని తృణం మీద వేసి ఈదుతున్నాను.
పొగమంచు నిట్టుర్పుల్లో దాక్కున్నాయి తీరాలు రెండూ ఈ ప్రవాహంలో తెలుసుకున్నాను ఈ తధ్యాన్ని....
మేఘాల మాటున కనిపించే
స్వర్ణ సామ్రాజ్యం
నక్షత్ర మాలికల్లో
తేలిపోతున్న స్వర్ణ కాంతులు
అన్నీ మిధ్యేనని తెలుసుకున్నాను
నిన్ను నేను కోరేది ఒక్కటే
నమ్మించకు ఈ లోకాన్ని
మిధ్యా వచనాలతో
తొలగించు పరంపరాగతంగా వస్తున్న
అస్తమా! విశ్వాసాలనూ నీ మన్హ పుటల నుంచి
మానవుడు క్రియా శీలుడు
మునిగిపోతాడు
అయినా తప్పిపోడు
అధికారం హస్తగతం చేసుకోవడానికి
వెనుకాడడు వెళ్ళడానికి
పాతాళినికైనా....."
రాస్తూ రాస్తూ ఆపి చివ్వున తలెత్తి చూసింది ఇందుమతి.
ఎదురుగా ఉన్న కుర్చీలో గౌతమ్ కనిపించాడు.
కొద్ది క్షణాలు మౌనంగా అతణ్ణి పరిశీలించింది.
ఇతనికి ఏమైంది? అలా ఉన్నడెం? మధ్యాహ్నం సినీమాహల్లో పలకరిస్తే తిరిగి చూసి, చిరునవ్వయినా నవ్వలేదు. తను రాస్తున్నప్పుడు వస్తే "ఏం రాస్తున్నావు" అని అడగకుండా ఉండడు. చేతిలో పుస్తకం లాక్కుని చదువుతాడు. తనను ఏడిపిస్తాడు.
"ఏమిటలా ఉన్నావ్?"
"ఎలా ఉన్నానూ?" నవ్వడానికి ప్రయత్నించాడు.
"నవ్వు రాకపోతే ఎందుకు నవ్వడానికి ప్రయత్నిస్తావు?" చిరాకును బయటకు కనిపించకుండా మృదువుగానే అన్నది ఇందుమతి.
ఈసారి గౌతమ్ పెదవుల మీద హస రేఖ కదిలింది. ఆ చిరునవ్వు సహజంగా అనిపించలేదు ఇందుమతికి.
"ఏం నా నవ్వు అంత భయంకరంగా ఉందా?" ఏదో అనాలి కనుక అన్నట్టుగా అన్నాడు.
"నా మీద కోపం వచ్చిందా?"
"కోపమా? నీ మీదా? ఎందుకు వస్తుంది?"
"మీ స్నేహితుల మధ్యలో ఉన్న నిన్ను పేరు పెట్టి గట్టిగా పిలిచి నందుకు. న్యాయంగా కోపం నాకు రావాలి. వచ్చింది కూడా. ఎంత కోపం వచ్చిందంటే - ఇంటికొచ్చి ఏడ్చేశాను."
గౌతమ్ ఇందుమతి ముఖంలో అయోమయంగా చూశాడు.
"ఏమిటలా చూస్తావు?"
"నువ్వంటున్న దేమిటో నాకు అర్ధం కాలేదు."
"నేను లాటిన్ లో మాట్లాడలేదు. " చిరుకోపంగా అన్నది.
"నువ్వు నన్ను పిలిచావా? ఎప్పుడు? ఎక్కడ?"
ఇందుమతికి నిజంగానే కోపం వచ్చింది. ముఖం ఎర్రబడింది.
"ఈ మధ్య అబద్దాలు అటడం కొత్తగా నేర్చుకున్నావా?"
గౌతమ్ నొసలు ముడిపడ్డాయి. దీర్ఘాలోచనలో పడిపోయాడు.
"ఎందుకలా వెళ్ళిపోయావు. నీ స్నేహితుల మధ్య నాతొ మాట్లాడటం నామోషీగా అనిపించిందా?"
"నువ్వనే దేమిటో నాకు అర్ధం కాలేదు. ఎక్కడ చూశావు? స్టేషన్ లోనా? నిన్ను నేను చూడలేదు."
"స్టేషన్ లో కాదు, సినిమాహాల్లో!"
"గౌతమ్ విస్మయంగా "సినిమా హల్లోనా?" అన్నాడు.
"అవును!"
"ఎప్పుడు?"
"ఇవ్వాళ మార్నింగ్ షోలో."
"ఇది మరీ బాగుంది. ఇవాళ నేను సినిమాకు వెళ్లేందే?"
"తమాషా చాలించి అసలు విషయం చెప్పు - నన్ను ఎందుకు పలకరించలేదు. నేను పిలిచినా ఎందుకు గబగబా వెళ్ళిపోయావు?"
"నువ్వు ఎవర్నో చూసి...."
"ఇక అపు. నా కళ్ళ కింకా చత్వారం రాలేదు. పైగా నేను నిన్ను చూడనేలేదు. సుమతి చూసి చెప్పింది."
"సుమతి చెప్పిందా? సుమతి కూడా అతణ్ణి చూసి నేనే అనుకుందా? అయినా ఇందులో ఆశ్చర్యమేముంది. నువ్వే పొరపాటు పడినప్పుడు....."
తాను శంకర్రావు కొడుకు కాదని తెలిసినప్పటినుంచీ చాలా మార్పు వచ్చింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటున్నాడు. అంత గంబీరంగా కనిపించే గౌతమ్ లోని కొంటెతనం, అల్లరి తనకు తెలుసు. కాని అవన్నీ ఏమయ్యాయో! ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటున్నాడు. ఇటీవల మరీ, మతి స్థిమితం తప్పుతోందా? తను చేసిన పని మరిచి పోతున్నారా! గౌతమ్ లో ఇంత చందాసం ఉందని తను ఎన్నడూ కలలో కూడా ఊహించలేదు. అంటీ కూడా అదోలో ఉంటోంది. అంటీతో గౌతమ్ సరిగా మాట్లాడటం లేదా?
"ఏమిటి ఇందూ ఆలోచిస్తున్నావ్? నేను అబద్దం చెప్పాననుకోంటున్నావా?"
"అబ్బే! అదేం కాదు. బహుశా మేమే పొరపాటు పడి వుంటాం. జనంలో బయటికి వెళ్తున్నప్పుడు చూశాం" అని గౌతమ్ ముఖంలోకి చూసింది అతడి ముఖం చాలా గంబీరంగా ఉంది.
"మేము పొరపాటుపడ్డామా? నాన్సెన్స్ , డ్రస్సు కూడా అదే లైట్ నీలం షర్టు, తెల్ల పాంటూ మీద లైట్ నీలం షర్టు బాగాలేదని తను ఎన్నోసార్లు అన్నది కూడా. ఎందుకలా అబద్దం చెప్పాడు? తనను చూసి పలకరించలేదు. బహుశా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు తనలా పెద్దగా పిలవటం, అందరూ వెనక్కి తిరిగి చూడటం నచ్చలేదేమో? చాలా మంది మగవాళ్ళకు అది నచ్చదు. ఆడవాళ్ళు పదిమంది మధ్యలో అలా పెద్దగా మాట్లాడటం నచ్చదు. గౌతమ్ కు కూడా అలాంటి ఇన్ హిబిషన్స్ ఉన్నయ్యా?
"ఊరి నుంచి ఎప్పుడొచ్చావ్?"
"ఇవ్వాళ ఉదయం పదిన్నరకు!"
మరో అబద్దం . మద్రాసు బండి ఎనిమిది లోపే వస్తుంది.
"బండి రెండు గంటలు లేటుగా వచ్చింది."