"మరో విషయం చెప్పడం మార్చాం" అన్నాడు విశ్వం.
"ఏమిటది?"
"ఇందుమతి గురించి...."
"ఏం ఆమెను కూడా రేప్ చెయ్యాలా?"
"అబ్బే, అలా అనడం లేదు. ఆమెను నువ్వు పెళ్ళి చేసుకోవాలి."
గౌతమ్ తుళ్ళి పడ్డాడు.
"ఇంపాజిబుల్!"
"ఏం? ఎందుకని? పెళ్లి చేసుకోవాలన్నాం కాని ఆమెతో కాపరం చెయ్యమనడం లేదుగా?"
"ఇది మరీ దారుణం. గౌతమ్ ను జైలుకు పంపించదానికి మీరు వేసిన పధకమే దారుణమైంది. అయితే ఈ రోజుల్లో ఒకణ్ణి జైలుకు పంపాలంటే చాలా తేలికైన పని అది. అందుకే నా ఆత్మ ఎదురు తిరుగుతున్నా అంగీకరించాను. మళ్ళీ ఇప్పుడు ఇందుమతిని పెళ్ళి చేసుకోవాలంటారే? పైగా కాపరం చేయనక్కర్లేదా? అంటే ఆ మూడు ముళ్ళు వేసి వదిలెయ్యాలా? జీవితాంతం ఆవిడ ఏడుస్తూ జీవితం గడపాలా? నో! నో! ఇది నావల్ల కాదు."
"నువ్వనుకుంటున్నట్టు ఇందుమతి తలవంచుకుని మూడు ముళ్ళు వేయించుకోదు. పూలదండల పెళ్ళో, రిజిస్టర్ మారేజో అంగీకరిస్తుంది. పైగా నువ్వు వదిలేస్తే భారత పతివ్రతలా నిన్నే తల్చుకుంటూ ఏడుస్తూ కూర్చోదు."
గౌతమ్ కు ఆ మాటలు వింటుంటే ఇందుమతి వ్యక్తిత్వం కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. అతడికి ఆమె మీద గౌరవం పెరిగింది.
"ఆడవాళ్ళంటే అలాగే ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళంటే నాకెంతో గౌరవం."
"అందుకే ఆమెను చేసుకో."
"అది మాత్రం నావల్ల కాదు."
"రవీ! కాసేపు నువ్వు మాట్లాడకు. గౌతమ్ , అది చివరి అంకం మనం ఆడబోయే నాటకానికి . అప్పటికి నీకు ఇందుమతి మీద ఇష్టం ఏర్పడితేనే వివాహం చేసుకో. అంతేకానీ బలవంతం ఏమీ లేదు."
"విశ్వం....."{ ఏదో చెప్పబోతున్న రవిని వారించాడు విశ్వం.
'అయితే మరి ముగ్గులోకి ఎప్పుడు దిగమంటారు?" అన్నాడు గౌతమ్.
శుభస్య శీఘ్రం- నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి."
"మీతోనా? నాకిక్కడ కొన్ని చిన్న చిన్న పనులున్నాయే!"
"మరి ఎప్పుడు వస్తావ్?"
"వచ్చే శుక్రవారం. నాతొ పాటు మరొక మిత్రుడు కూడా వస్తాడు."
"అతడికి కూడా హోటల్ ఖర్చులు భరించాలా?" రవి తెల్ల ముఖం వేశాడు.
"తప్పదు మరి. మీరు వేసింది సామాన్యమైన పదకమా? దానికి మరొకడి సహాయం లేకుండా పకడ్భందీగా జరగదు. మనం ఫేయిక్ అయితే నేనే కాదు నాతొ పాటు మీ ఇద్దరూ కూడా కటకటాల వెనక్కు వెళ్తారు."
రవి కళ్ళల్లో భయం తాలుకూ నీడలు రెపరెప లాడాయి.
"భయపడకు బ్రదర్!' అంటూ రవి భుజం తట్టాడు గౌతమ్.
రవీ, డబ్బు గురించి ఆలోచించవద్దు."
"అలాగే చెప్తావు- అదీ నీ డబ్బు కాదుగా? ఈ లెక్కన మన పూర్తి అయే సరికి నా చేతికి చిప్పే వస్తుంది." విశ్వం మీద అక్కసుగా విరుచుకుపడ్డాడు.
"ఏమిటోయ్ - ఇదంతా నాకోసమే చేస్తున్నట్టుగా నా మీద పడ్తావ్?"
"మరి నీ కోసం కాదా? నువ్వు కదూ నన్ను ఇలా పురికొల్పింది."
"ఇది మరీ బాగుంది. నీ కిష్టం లేకపోతే ఈ కధకు పుల్ స్టాప్ పెట్టుకో నాదెం పోయింది."
గౌతమ్ కు చేజిక్కిన చాన్సు వెళ్ళ సందుగా జారిపోతున్నట్టు అనిపించింది.
"రవే౧ ఒకటి చెయ్!"
"ఏమిటి?" గౌతమ్ ముఖంలోకి చూశాడు రవి.
"నువ్వు నీ భాగంలో సగం నాకు రాస్తున్నావుగా?"
"అవును. మిగతా సగం అమ్మి నీ ఖర్చులకు పెడ్తావు." వ్యంగ్యంగా అన్నాడు.
"అక్కర్లేదు. ఆ డబ్బంతా నాకు అప్పుగా ఇవ్వు. ఎప్పటికప్పుడు లెక్క రాయి. సంతకాలు తీసుకో."
"అప్పా? ఆ తర్వాత నీ కేముందని వసూలు చేసుకోమంటావ్?"
"మీ నాన్న ఆస్తిలో సగ భాగం - నీ వాటాలో సగం భాగం - నాకు ఏమీ లేకపోవడమేమిటి?"
విశ్వం గౌతమ్ ముఖంలోకి చూశాడు.
చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకమే. ఫరవాలేదు. అనుకొన్న పని సాధించవచ్చు.
"ఏం విశ్వం! నేను చెప్పింది ఎలా ఉంది?"
"బేషుగ్గా ఉంది" అన్నాడు విశ్వం.
"రవికి అంగీకారమో కాదో కనుక్కో."
రవికి లోతు తెలియని అగాధంలోకి పడిపోతున్నట్టుగా ఉంది. పడిపోకుండా పట్టుకోవడానికి మెట్టు కోసం వెతుక్కుంటున్నట్టుగా ఉంది.
"రవీ! చెప్పు"
"అలాగే" ఎక్కడ్నుంచో చాలా దూరం నుంచి వచ్చిన ధ్వనిలా ఉంది అతడి కంఠస్వరం.
"ఇలాంటి ప్లాన్సు వేసినప్పుడు ప్రతిదానికి దివాళా తీసినట్టు అయిపోకూడదు. స్పోర్టివ్ గా ఉండాలి. పట్టుదల ఉండాలి. ఒకే ఒక లక్ష్యం వైపు దృష్టి ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి దేన్నయినా త్యాగం చెయ్యగల తెగువ ఉండాలి." రవి భుజం తడుతూ అన్నాడు గౌతమ్.
"మా వాడికి అప్పుడప్పుడు గాలి కొడుతూ ఉండాలి. సరే! డీల్."
"డీల్!"
"అయితే మాకు బండికి టైం అవుతోంది బయలుదేరాలి. శుక్రవారం వస్తావు కదూ?"
శుక్రవారం రాత్రి హోటల్ దక్కన్ లో కలుసుకోవచ్చు అన్నాడు గౌతమ్.
"ఓ.కే " లేచి చెయ్యి ముందుకు చాపాడు విశ్వం.
గౌతమ్ చెయ్యి అందించలేదు."
"వట్టి చేతిని నేనేం చేసుకోను?"
విశ్వం అయోమయంగా చూశాడు.
"అడ్వాన్సు ఏదీ?"
"అడ్వాన్సా?"
"అవును . రెండు జతలైనా ఖరీదైన బట్టలు కుట్టించుకోవాలా? నాతొ వచ్చేవాడికి కూడా కుట్టించాలా? ఇంకా ఎన్ని హంగులు కావాలి శ్రీమంతుడిగా చెలామణి కావాలంటే?"
"యెంత కావాలి?"
"పదివేలైనా కావాలి?"
"ఇప్పుడు మా దగ్గర లేవు " అన్నాడు రవి.
"వెళ్ళగానే బాంకు డ్రాప్ట్ పంపించండి."
"అలాగే పంపిస్తాం" అన్న విశ్వం ముఖంలోకి రవి తీవ్రంగా చూశాడు. విశ్వం చిరునవ్వు నవ్వాడు.
"అలాగే పంపిస్తాం. నువ్వు మాత్రం....."
"శుక్రవారం హోటల్ దక్కన్ లో కలుసుకుందాం!" అంటూ విశ్వానికి షేక్ హాండ్ ఇచ్చాడు.
రవిని చూస్తుంటే గౌతమ్ కు జాలిగా ఉంది. విశ్వం ట్రాప్ లో పడ్డాడని ఎప్పుడో అర్ధమయింది.
"రవీ!"
గౌతమ్ కంఠం ఆర్ద్రంగా పలికింది.
రవి తలెత్తి ఆశ్చర్యంగా గౌతమ్ ను చూశాడు.
"కుంతీ కర్ణుడి దగ్గరకు వచ్చి పాండవుల్లోకి వచ్చి చేరిపోమ్మని అడిగింది. అప్పుడు కర్ణుడు ఏమన్నాడో తెలుసా?"
రవి అడ్డంగా తల ఊపాడు.
విశ్వం ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు కానీ....." నువ్వు అగు అన్నట్టు చేత్తో వారించాడు గౌతమ్.