ఇందుమతి చివ్వున తలెత్తి చూసింది.
"ఏం? అనుమానంగా ఉందా? స్టేషన్ కు ఫోన్ చేసి కనుక్కో!"
"ఏం బండి ఆలస్యం అయితే! సినిమా మొదలవుతుంది పదకొండున్నరకు. ఆలస్యంగా రాకూడదా?" అనాలనుకుంది. కాని మాటలు పెదవుల వెనకే ఉండిపోయాయి.
"సినిమాకు వెళ్దాం వస్తావా ఇందూ?"
అతడి కంఠంలో ఏదో బాధ ధ్వనించింది.
"అలాగే ఇప్పుడే వస్తాను" అంటూ లోపలకు వెళ్ళి పదిహేను నిముషాల్లో చీర మార్చుకుని వచ్చింది.
గౌతమ్ లేచి నిల్చున్నాడు.
"అప్పుడే ఎందుకూ? ఇంకా చాలా టైమ్ ఉందిగా?"
"వెళ్తూ వెళ్తూ ఒకసారి పెట్రోల్ బంకుకు వెళ్దాం. నాలుగు రోజులైంది క్యాష్ లెక్క చూసి. రేపు ఉదయం బాంకుకు పంపించాలి."
"రేపు ఉదయం చూసుకోవచ్చుగా?"
"రేపు వర్క్ షాపు వెళ్ళాలి."
"సరే పద!"
ఇద్దరూ స్కూటర్ మీద బయలుదేరారు.
పెట్రోల్ బాంకు దగ్గర స్కూటర్ ఆగింది. ఇద్దరూ లోపలకు నడిచారు. మానేజరూ, క్లర్కూ లేచి స్వాగతం చెప్పారు.
"క్యాష్ రిజిస్టర్సూ, క్యాషూ తీసుకురా!" కుర్చీలో కూర్చుంటూ అన్నాడు గౌతమ్.
ఇందుమతి పక్క కుర్చీలో కూర్చుంది.
మానేజర్ వెర్రిముఖంవేసి గౌతమ్ ను చూడసాగాడు.
"ఏమిటి నాగభూషణం అలా చూస్తావేం? నాకు టైమ్ లేదు. త్వరగా తియ్."
మానేజర్ కదల్లేదు.
క్లర్కు కూడా వెర్రివాడిలా చూస్తూ నిలబడ్డాడు.
గౌతమ్ ఇద్దర్నీ మార్చి మార్చి చూశాడు.
"ఏమిటలా ఉన్నారు? ఏమైంది?" ఆదుర్దాగా అడిగాడు.
"తమరు మూడు గంటలకొచ్చి క్యాష్ తీసుకెళ్ళారుగదండి. రిజిస్టర్లు కూడా చూశారుగా? మా మీద ఏమైనా అనుమానం కలిగిందా?" మానేజర్ అన్నాడు.
"గౌతమ్ "వ్వాట్! అన్నాడు ఎగిరిపడినంత పనై.
"నేను వచ్చానా? డబ్బు తీసుకెళ్ళానా?"
"అదేంటి బాబూ! అలా అడుగుతున్నారు?" అన్నాడు క్లర్కు ఆశ్చర్యంగా.
ఇందుమతి గౌతమ్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.
"మీకు మతిపోయిందా? నేను రావడమేమిటి? డబ్బు తీసుకెళ్ళడం ఏమిటి?
అప్పటికే రిజిష్టర్లు తెచ్చి ముందు పెట్టారు.
గౌతమ్ రిజిస్టర్ లో ఉన్న సంతకం చూసి కొయ్యబారిపోయాడు.
ఇందుమతి ముందుకువంగి సంతకం చూసింది. అది గౌతమ్ కళ్ళు మూసుకొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కుర్చీలో వెనక్కు చేరబడి ఉన్నాడు.
గౌతమ్ కు ఏమైంది? ఉదయం తనను గుర్తించలేదు. మధ్యాహ్నం ఇక్కడ్నుంచి డబ్బు తీసుకెళ్ళాడు. కాస్తకూస్తాకాదు పదిహేను వేలు సంతకం కూడా చేశాడు. అయినా గుర్తులేదు. అంటే? ఇందుమతి వెన్నెముఖలోకి చలి కుదుపులా వచ్చింది. గౌతమ్ ను కళ్ళప్పగించి చూడసాగింది.
మేనేజరూ, క్లర్కూ దిమ్మెరపోయినట్టు గౌతమ్ నే చూస్తూ నిల్చున్నారు.
గౌతమ్ కళ్ళు తెరిచాడు.
"సారీ నాగభూషణంగారూ! మధ్యాహ్నం వచ్చిన విషయం మర్చిపోయాను." మామూలుగా అని లేచి నిల్చున్నాడు.
"వంట్లో బాగాలేదా బాబూ?" క్లర్కు సుబ్బారావు అడిగాడు.
క్లర్కుగా సుబ్బారావు పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నా గౌతమ్ ను చిన్నప్పట్నించీ తెలిసినవాడు. గౌతమ్ ప్రవర్తన అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
"నా ఆరోగ్యం బాగాలేదని ఎందుకనుకున్నారు?" గౌతమ్ సుబ్బారావు ముఖంలోకి సూటిగా చూశాడు.
సుబ్బారావు కొంచెం తడబడ్డాడు.
"మధ్యాహ్నం మీరు వచ్చి ముభావంగా సంతకం చేసి, డబ్బు తీసుకొని వెళ్ళిపోయినప్పటినుంచీ సుబ్బారావు బాధపడుతున్నాడు" అన్నాడు మానేజరు.
"బాధపడటం ఎందుకూ?"
"మీ దబ్బర పనిచేస్తున్నా సుబ్బారావు మీరంటే వాత్సల్యప్రేమ. అది మీకూ తెలుసు. తన పిల్లల సంగతి కూడా చెప్పడు. కాని చిన్నప్పుడు మీరు చేసిన అల్లరి గురించి తెగ చెప్తూ మురిసిపోతూ ఉంటాడు. మీరూ అలాగే రాగానే ముందు సుబ్బారావును పలకరిస్తారు. ఇవ్వాళ మీరు అతన్ని పలకరించలేదు. అందుకే బాధపడుతున్నాడు."
"ఓ ఆదా! ఊరినుంచి ఇవ్వాళే వచ్చాను, ప్రయాణం బడలిక. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. దానికి తగ్గట్టు ట్రైన్ లేటయింది. మధ్యాహ్నం అందుకే అలా ఉన్నాను. ఆ సంగతి మరిచేపోయాను. సారీ!" అంటూ బయటికి వచ్చాడు గౌతమ్.
ఇందుమతి కుర్చీలోంచి కదల్లేదు. ఏదో ఆలోచిస్తూ ఉంది.
గౌతమ్ వెనక్కు తిరిగివచ్చి "ఇందూ! ఏమిటి అలాగే కూర్చున్నావ్? సినిమాకు టైమ్ అవుతోంది పద!" అన్నాడు.
ఆమె అన్యమనస్కంగానే లేచి బయటకి వచ్చింది.
స్కూటర్ బయలుదేరింది.
"ఏ సినిమాకెళదాం?"
"సినిమాకు వద్దు. మూడ్ లేదు."
గౌతమ్ కొద్ది నిముషాలు మాట్లాడలేదు.
"ఇందిరా పార్కుకి వెళదాం" అన్నది ఇందుమతి.
"ఓ.కే."
ఇద్దరూ ఇందిరా పార్కులో శుభ్రమైన స్థలం చూసుకొని కూర్చున్నారు.
గౌతమ్ అశాంతిగా వచ్చి గడ్డిపరకల్ని తుంచుతున్నాడు.
ఇందుమతి అతన్ని చూస్తూ ఆలోచనల్లోకి జారిపోయింది.
గౌతమ్ ఏమైంది. ఇదేం మతిమరుపు? సినిమాకు వెళ్ళినట్టు గుర్తులేదు. తనను చూసినట్టయినా గుర్తురాలేదు. ఆఫీసుకు వెళ్ళినట్టు కూడా గుర్తులేదు. అంటే?
ఇందుమతి అరచేతులకు చెమట్లు పట్టాయి.
గౌతమ్ మతిస్థిమితం కోల్పోతున్నాడా? అంతలోతుగా గాయపడ్డాడా? ఆ డబ్బేం చేశాడో అదైనా గుర్తుందోలేదో!
"గౌతమ్!"
పీకిన గడ్డిపరకను విసిరేసి చెయ్యి దులుపుకుంటూ ఇందుమతి ని చూశాడు.
"ఆ డబ్బు ఏమైంది?"
"ఏ డబ్బు?" అతడి కంఠంలో ఆశ్చర్యానికి ఇందుమతి మతిపోయి నట్టే అయింది.
"అదే మధ్యాహ్నం నువ్వు తీసుకున్న డబ్బు!"
గౌతమ్ అదోలా నవ్వాడు.
ఆ నవ్వుకు తుళ్ళిపడింది ఇందుమతి. ఇదేం నవ్వు? ఇలా ఎప్పుడూ నవ్వడు గౌతమ్. గౌతమ్ కు నిజంగానే....
"నువ్వూ నమ్ముతున్నావా ఇందూ? మధ్యాహ్నం నేనే వెళ్ళి ఆ డబ్బు తీసుకొని మరిచిపోయినట్టు....."
ఇందుమతి గుడ్లప్పగించి చూసింది.
"నువ్వు కూడా నమ్మితే, నామీద నాకే అనుమానం వచ్చేలా ఉంది.
"అంటే ఇంతకుముందే మరి కొందరు...." సందేహంగా చూసింది.
"నమ్మారు. ఉదయం నేను ఇంటికి వచ్చేసరికి పదకొండు దాటింది. పెట్టె చేత్తో పట్టుకొని లోపలకు వస్తున్న నన్ను మాపని వాళ్ళు తెల్లముఖాలువేసి చూడసాగారు. అది గమనించి గమనించనట్టే నా గదిలోకి వెళ్ళి స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాను...."