"నా తల్లీ! నా బంగారే! నా స్వప్న నా మాటకాదంటుందా?" మామూలు అమ్మమ్మ అయిపోయి మనవరాలి బుగ్గలు పుణికింది కృష్ణవేణమ్మగారు.
స్వప్న ముఖం రాగరంజితమైంది.
12
అయిదారు రోజులు గడిచిపోయాయి.
స్వప్న స్నేహితులంతా బిలబిలా వచ్చేశారు....అంతా ఎదిగిన ఆడపిల్లలే. పెళ్లి కావలసినవాళ్ళే బి.ఏ పాసైన వాళ్ళే. అందంగా ఆరోగ్యంగా నిష్పూచీగా కాలం గడిపేస్తున్న వాళ్ళు. రీడింగ్ రూంలో వున్న స్వప్నని చుట్టుముట్టేశారంతా.
"ఏమిటీ దండయాత్ర?" నవ్వుతూ అడిగింది స్వప్న.
"దండయాత్ర కాదే! విహారయాత్ర!" అంది గీత.
"ఎక్కడికి?"
"పిక్నిక్ అంటూ ఖాయమైతే ఎక్కడికైనా సరే!" అంది విజయ.
"ఇదిగో స్వప్నా! విజయకి ఎక్కడికైనా వెళ్ళాలనుందే! పెళ్లి చేస్తే అత్తగారింటికి బుద్దిమంతురాలిలా వెళ్ళి పోతుందే!" అంది గీత.
"గీతా! నీకు ఎప్పుడూ పెళ్ళి రంధే! ఇతర్లని అనేందుకుమారుగా నీవే పెళ్ళి చేసుకుని అత్తారింటికెళ్ళి అంట్ల తప్పేలాలు కడుగుతూ, బోకులు తొలుస్తూ, మొగుడికి వీపు రుద్దుతూ, బూట్లు పాలిష్ చేస్తూ, అత్తా మామలకి పాదసేవ చేస్తూ బ్రతకరాదూ?" అంది సౌందర్య.
"ఛ! ఛ! నే నెప్పుడూ అలా చెయ్యను తెలుసా?"
"గీతా! అలా చెయ్యవా? చెయ్యకపోతే చింతబరిక తీసుకుంటాడు నీ ప్రాణ నాధుడు" అంది సౌందర్య.
"నే రూళ్ళ కర్ర తీసుకుంటాను!"
"నేనూ కొడతాను!" అంది గీత.
"ఏమిటీ మొగుడ్నే కొడతావా?" ఆశ్చర్యంగా అడిగింది వినయ. వినయ బ్రాహ్మలపిల్ల! ఆమెకి మామూలు కుటుంబజీవనం తెలుసు. కానీ ఈహిపోక్రసీ. ఈ పోష్ క్వాలిటీ బ్రతుకూ తెలియదు. స్వప్నా వాళ్ళు ధనవంతులని తెలుసు. కానీ మరీ యింత కోటీశ్వరులని తెలియదు. ఈ ఐస్వర్యం ఈ అలంకరణ చూస్తూ వుంటే ఆమెకి మతి పోతోంది.
"మొగుడ్ని కాక-మామని కొడతారా?" అడిగింది విజయ.
"అవసరమైతే ముందుగా మామనే దెబ్బ కొట్టాలి. తల్లిని కొడితే దూడ పరిగెత్తినట్టుగా తండ్రిని దెబ్బతీస్తే కొడుకులకి బుద్ది వస్తుంది." రెట్టించింది గీత.
వాళ్ళ వాదనలు వింటూ నవ్వుతోంది స్వప్న.
"అసలెందుక్కొడతావే మొగున్ని" అడిగింది కిరణ్.
"ఎందుకేమిటే? ప్రతి దాన్లో తప్పు దొరుకుతుంది. సిగరెట్ కాలుస్తాడనుకో మానెయ్యమనికొట్టొచ్చు. ఆడబ్బు ఆదాచేసి మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చుట! కాఫీ తాగుతాడనుకో - మరీ మరీ అడిగితే ఒకటిచ్చు కోవచ్చు. రక రకాల డ్రస్సులు కావాలంటాడనుకో కొరడా ఝుళిపించొచ్చు. ఈవెనింగ్ షోకి కాక నైట్ షోకి వెడతానంటాడనునో ముఖం వాచేట్టు బాదొచ్చు!" లిస్ట్ యిచ్చేసింది గీత.
అల్లరిగా కళ్ళు చిట్లిస్తూ "యివన్నీ ఎలా తెలుసుకున్నావే?" అడిగింది విజయ.
"అనుభవమే!"
"స్వానుభవమా?" కొంటెగా అడిగింది కిరణ్.
"ఏయ్!" చివ్వున లేచింది గీత. కిరణ్ తప్పించుకుంది గీత వెంట పడింది.
"గీతా!" పిలిచింది స్వప్న. ఈ అల్లరి, ఈ కేకలు ఈ పరుగులు అమ్మమ్మగారికి తెలిస్తే కేకలేస్తుంది. అందుకే స్వప్నకి భయం.
గీత ఆగింది. "ఇంతకీ ఎలా గ్రహించావే?"
"స్వప్నా! మీ యిల్లు పార్లమెంటు భవనమంత వుంది. మీకు ఇరుగు పొరుగు చరిత్రలూ బాధలూ కష్టాలూ వాళ్ళగాధలు తెలియవు. మా ఇళ్ళు అలా కాదే అగ్గిపెట్టెలా వుంటాయి. భార్యాభర్తలు గట్టిగా మాట్టాడుకుంటే చాలు వినిపించేంత మందంగా వుంటాయి గోడలు ఆ మాటకొస్తే గట్టిగా ముద్దు పెట్టుకుంటే ఆ చప్పుడు వినిపిస్తుంది."
గీత మాటలకి అడ్డొస్తూ "ఎప్పుడయినా విన్నావా?" అడిగింది సౌందర్య.
"ఓఁ బోల్డెన్ని! మా ఇంటి ప్రక్కతను గుమాస్తా! యింటికి రావటం లేటుగా వస్తాడు. రాకతోటే అష్టకం మొదలు. తిట్లు, కొట్టడం. తర్వాత ఆమె ఏడ్పులు మళ్ళీ ఉదయం ఎనిమిది కొడితే కానీ నిద్దర్లేవడు. బెడ్ కాఫీ కావాలి. ఒకటా? భార్యని వేచుక తింటాడనుకో."
"పాపం విని విని నీ మనస్సు నెగెటివ్ గా తయారైందన్నమాట." అడిగింది విజయ.
"నాకెంత కోపం వుందంటే నాకే అధికారం వస్తే___"
"గీతా! ఇక మాటలు చాలించు. వచ్చిన విషయం చెప్పు. నీకు అధికారం వస్తే మొగుడితో వంట చేయిస్తావు. ఇల్లు ఊడ్పిస్తావు. చాకిరీ చేయిస్తావు. మాకు తెల్సు. కానీ పిల్లల్ని కనిపించలేవు. తెలుసా?" వెక్కిరింపుగా అంది విజయ.
"నోర్ముయ్యవే. ఎంత చదువుకున్నా మన బ్రతుకులు వంటింటికి అంకితం కాక తప్పదా? స్థాయి తగ్గితే మామోలు స్టవు-పెరిగితే గ్యాస్ స్టవ్- అంతేగా?" రౌద్రంగా అడిగింది గీత.
"స్టాప్! స్టాప్!" కేకపెట్టింది స్వప్న. "యుద్దాన్ని వాయిదా వేస్తున్నాం. మరోసారి డిక్లేర్ చేసి అంతా కలసి గీతతో యుద్ధం చేద్దాం."