"ఇంతకీ యిప్పుడు మా రాకకి కారణం పిక్నిక్." అంది విజయ.
"ఎందుకు? ఎక్కడికి? ఎప్పుడు?"
"ఎక్కడికయినా సరే! యెప్పుడయినా సరే! ఇక యెందుకంటావా-?"
సౌందర్య మాటలు పూర్తి కాకముందే అందుకుంది కిరణ్ "స్వప్నా! అందరికీ చదువై పోయింది. అయిపోయిందా అంటే చెప్పలేను. ఎమ్మేచదవ్వొచ్చు. ఇంకా రీసెర్చ్ చెయ్యొచ్చు. అది కాదు. ఈ కాలంలో బి.ఏ ఒక ఫుల్ స్టాప్. ఇక చాలామంది చదవలేరు. ఉద్యోగమో, పెళ్ళి ప్రయత్నాలో అడ్డొస్తాయి. అంచేత అందరంకలసి హాయిగా యీ ఆఖరి పిక్నిక్ గడిపేద్దాం."
"ఓకే." అంది స్వప్న.
"మరెక్కడికి?"
"మీ వూరెళదాం?" అందించింది సౌందర్య.
"స్వప్నా! సౌందర్యకి పల్లె సౌందర్య మంటే ప్రేమ పడి చస్తుంది. నా మాట విని మీ వూర్లో కధానాయకుడ్ని చూడు. ఆఖరికి మీ పొలం చేసేవాడైనా సరే." వెక్కిరింతగా అంది గీత.
మిర్రి చూసింది సౌందర్య.
"స్టాప్, స్టాప్, నువ్వు తిట్లకి దిగొచ్చు. ఓ.కే, ఓకే. మా ఊరే వెళదాం అమ్మమ్మని అడిగితే మా తోటలో బంగళాలో ఎరేంజ్ చేయిస్తుంది. మా కారులు తీసికెళితే ఝామ్మని గడిపి రావచ్చు. కెమెరా, టేప్ రికార్డర్ తీసి కెళదాం. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుందికి ఫోటోలుంటాయి. ఈ రోజులు మళ్ళీ తిరిగి రావుగా!" అంది స్వప్న.
"మీకు తోట వుందా?"
"అవును మామిడి తోట మాతోట పేరేమిటో తెలుసా?"
"ఏమిటి?"
"ఎలమావి తోట!"
"ఎంత అందమైన పేరు!" అందరూ ఒక్కుమ్మడిగా అన్నారు.
"ఊఁ ఏంటనుకున్నావ్ మరి? మా తాతయ్యగారా పేరు పెట్టారు. కృష్ణశాస్త్రిగారి పాట వినలే! బ్ర్తతుకే ఎలమావితోట! అది విని పేరు పెట్టారుట!" గర్వంగా అంది స్వప్న.
"తప్పకుండా వెళదామే!" అంది విజయ.
"ఊఁ నువ్వూ అడిగావంటే తప్పకుండా వెళ్ళాల్సిందే. మా అమ్మమ్మని పర్మిషన్ అడిగి వెళదాం."
"ఎప్పుడే?"
"సండే!"
"అదేం?'
"సండే ఈజ్ హాలిడే! ఎంజాయ్ చేయాల్సింది ఆ రోజే!"
"సరే, మేం వెళతాం!" లేవబోయింది గీత.
"ఉండండే! టిఫిన్ కాఫీ తీసుకుని వెళుదురుగాని!" అని వంటింటికి ఇంటర్ కమ్ లో చెప్పింది స్వప్న.
అంతా కబుర్లలో పడ్డారు మళ్ళీ.
13
"ఒరేయ్, నువ్వొట్టి చవటవురా! స్వప్నని ప్రేమించి కనీసం ప్రేమించినట్టుగా నటించి లొంగ దీసుకోరా వెధవా అంటే విన్నావూ? ఊహూఁ నీ బుర్రకు అలాటివి ఎక్కవులే నాకు తెలుసుగా?
లెక్చరర్లు అహోరాత్రులు కష్టపడి చదవమనిపాఠాలు నూరి పోస్తేనే నీ బుర్ర కెక్కడ పరీక్ష తప్పేవు. ఒక్కగానొక్క కొడుకువి. నిన్ను బాగా చదివించాలని మంచిహోదా గల ఉద్యోగం యిప్పించాలని శతపోరాను. లాభం లేక పోయింది. కనీసం మంచి ఆస్తి వున్న అమ్మాయినైనా కట్టపెడదామనుకుంటే నీ కర్మ యిలా తగలడింది!"
ముఖం వాచేట్టుగా చివాట్లు పెట్టాడు.
మోహన్ కిక్కిరు మనలేదు.
మళ్ళీ వెంకట్రామయ్యే మొదలెట్టాడు. "ఇంతకీ అ ఆమ్మాయితో ఒక్క సారయినా మాటాడేవా?"
తలూపేడు మోహన్.
"ఏం మాట్టాడేవు?"
"నేను ప్రేమిస్తున్నా అన్నాను."
"ఎవర్ని?"
"నిన్ను."
"నన్నా!"
"అదే స్వప్నని ఆవిడ దానికి నవ్వేసింది."
"నవ్వదట్రా చవటా. ప్రేమిస్తున్నానని చెపితే పాఠం చెప్పినట్టుగా వుండదట్రా. ఇలాగే దిబ్బ ముఖం వేసుకుని చెప్పావు కదూ?"
"నాన్నా నన్ను మాటి మాటికీ దిబ్బ ముఖం, ఏబ్రాసి ముఖం, చవట ముఖం, సన్నాసి ముఖం అని తిట్టకండి. నా ముఖం నాది. దేవుడిచ్చిన ముఖం దాన్ని బట్టల కొట్లో నచ్చని చీర రిటర్న్ చేసి మరో చీర మార్చుకున్నట్టుగా మార్చుకోలేం కదా?" బుంగమూతి పెట్టి అన్నాడు మోహన్.
"అదే నేను అనేదీనూ. దేవుడు నీ ముఖాన దరిద్రపు రాత రాశాడ్రా. నేను దాన్ని తిప్పి రాయాలన్నా రాయటానికి కాదులే." విసుగ్గా అన్నాడు వెంకట్రామయ్య. ఆయన చాణక్యుడు. జిత్తులమారి ఎత్తుకు పై ఎత్తు వేసి శత్రువుల్ని చిత్తు చేయడంతోనే ఆయన జీవితం చాలామట్టుకు గడిచిపోయింది. పులి కడుపున మేకపిల్లలా యిప్పుడిలా చురుకులేని కొడుకు కలగటం ఆయనకి చాలా బాధాకరంగా వుంది.
మోహన్ పలకలేదు.