Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 18


    వేసవి సెలవుల అనంతరం మళ్ళీ స్కూళ్ళు తెరిచారు.
    ఓ రోజు కృష్ణవేణమ్మగారు రవిని పిలిచి స్వాతిని దగ్గరలో వున్న బళ్ళో చేర్పించమంది. అతను వూరి నుంచి టి.సి. తెప్పించి చేర్పించాడు. ఆ మధ్యన వూరికెళ్ళి తల్లిని కూడా తమతో వచ్చెయ్యమన్నాడతను అయితే సుందరమ్మ దానికి సుతరామూ అంగీకరించలేదు.
    "పట్నంలో నువ్వో ఉద్యోగస్తుడివై, నీకై నీవు ఓ ఇల్లు ఏర్పరచుకుని, ఓ యింటివాడవై తే అప్పుడొస్తాను లేరా? ఈ వూళ్ళో మనకేం ఆస్తిపాస్తులు లేవు అయితే తల దాచుకుంది ఓ కొంప వుంది. ఆదరంతో ఆప్యాయతతో పలుకరించే యిరుగు పొరుగు వున్నారు. నా ఒక్క డానికి ఎలాగో గడిచిపోతుంది. నెల నెలా నువ్వు పంపే వందా నాకు ఎక్కీ తొక్కీ! నేను చెప్పేదొకటే! ఆ కృష్ణవేణమ్మ గారిపై ఆధారపడి బ్రతకాలనుకోవద్దు. నీ కాళ్ళపై నువ్వు నుంచోవాలి. ఒకరి దయా భిక్షతో ఎన్నేళ్ళు సాగుతుంది?"
    తల్లి మాటలు అతనిపై బాగా పనిచేశాయి.
    చెల్లాయ్ కి నయం కావటం, ఆమె చదువు నిర్విఘ్నంగా సాగటం అతనిలో క్రొత్త ఉత్సాహాన్ని నింపేయి.
    దాంతో నిర్విరామంగా తిరిగేడు. ఆఖరికి ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించేడు. జీతం నాలుగొందలు. అయితేనేం? అది తన స్వార్జితం. ఆనందంతో తల్లికి ఉత్తరం రాశాడతను.
    
                                          11
    
    "స్వప్నా!"
    పెర్రీమానస్ యింగ్లీషు నవల చదువుతూ పడుకున్న స్వప్న నవల మూసేసి యిటు తిరిగింది.
    అమ్మమ్మగారు మనవరాలి మంచంపై కూర్చుని స్వప్న చేతి నందుకుంది.
    "ఏమిటమ్మమ్మా?"
    "బి.ఏ. అయిపోయిందిగా? ఇంకేం చేస్తావు?"
    "ఎమ్మే  చదువుతాను!"
    "పోనీ ఎమ్మే రెండేళ్ళూ అయ్యాక?"
    "డాక్టరేట్ చేస్తాను!"
    "అదెన్నేళ్ళు?"
    "మూడేళ్ళు పట్టొచ్చు."
    "అంటే మొత్తం అయిదేళ్ళన్నమాట. తర్వాతేం చేస్తావు?" నెమ్మదిగానే అడిగింది అమ్మమ్మగారు.
    ఒక్కక్షణం ఆలోచించింది స్వప్న! ఆమె పెదాలపై చిరునవ్వు వెలిసింది. "అమ్మమ్మా! తర్వాత ఉద్యోగం చేస్తాను. ఏం?" అంది.
    స్వప్న ముఖంవైపు తీక్షణంగా చూసి "పెళ్లి చేసుకోవా?" అంది.
    "ఎందుకు చేసుకోను?"
    "ఎప్పుడు చేసుకుంటావే?" కోపంగా అడిగింది.
    "నువ్వెప్పుడు చేస్తే అప్పుడు!" నవ్వుతూ జవాబు చెప్పింది.
    "నేను ఈ రోజే పెళ్లి చేస్తాను. సరేనా?"
    "సరే! నీ యిష్టం అలాగే కానీ అయితే యింత పెద్దయిల్లు ఎప్పుడలంకరిస్తావ్?" కొంటెగా నవ్వుతూ ప్రశ్నించింది స్వప్న.
    కళ్ళు చిట్లించింది అమ్మమ్మగారు. ఆమెకి కోపం ఉధృతంగా వస్తోంది. ఏమీ అనలేని ప్రేమ వలని నిస్సహాయత స్వప్న అల్లరితనం ఆమెని ఉడికించేయి. "క్షణాలపై అలరిస్తాను. ఫోన్ చేసి పిలుస్తా అందర్నీ - శుభలేఖలు మరో గంటలో వచ్చేస్తాయి. హోటల్ కీ, స్వీట్ స్టాల్స్ కి ఫోన్ చేసి కేజీలకి కేజీలు స్వీట్స్ తెప్పిస్తాను. ఈ కృష్ణవేణమ్మంటే ఏమనుకున్నావ్?" అంది. ఒక్క క్షణమాగి మళ్ళీ "అందరూ నన్ను చాటు మాటున పులి అంటారు తెలుసా?" అంది గర్వంగా-దర్పంగా.
    పక పక నవ్వింది స్వప్న. తెరలు తెరలుగా వస్తున్న నవ్వుని ఆపుకోలేక కళ్ళల్లో నీళ్ళు వచ్చేయి.
    "మరి స్వప్నా నీ ప్రశ్నలకి సమాధానం వచ్చిందిగా పెళ్ళి చేసుకుంటావా?"
    "ఓఁ"
    "ఇప్పుడేనా?"
    "ఏమిటి? ఇప్పుడా?" అంది గుండెలపై చేయి వేసుకుంటూ, కళ్ళు కలువల్లా విచ్చుకున్నాయి.
    "ఊఁ యిప్పుడే!"
    "సరే! నీ యిష్టం!" నవ్వుతోంది స్వప్న.
    "స్వప్నా ఁ బావుందే నీ చమత్కారం! పెళ్ళికి అన్నీ తయారుగా వున్నా అసలైన విషయం దాటేశావే?"
    "ఏమిటమ్మమ్మా?" చిలిపిగా ప్రశ్నించింది స్వప్న.
    "పెళ్ళి కొడుకే? ఎక్కడినుంచి తేవాలి?"
    తలొంచుకుంది స్వప్న.
    "స్వప్నా! ఈ చమత్కారాలు చాలించు. నేచెప్పేది విను. నాకు వయసై పోతోంది. నీకూ వయస్సు వస్తోంది. ఏ వయస్సులో జైర్గే ముచ్చట్లు ఆ వయస్సులో జరగాలి. ఇంకా చదువెందుకు నీకు? బి.ఏ. చదివావు ఫస్టులో పాసయ్యావు చాలు. ఇక నా  మాట వినాలి. నీ పెళ్లిచూసి ముని మనవడిని ఎత్తుకుని హాయిగా కళ్ళు మూస్తాను. నీవు సరే నంటే మనకి తగిన సంబంధాలు చూస్తాను." గంభీరంగాఅంది అమ్మమ్మగారు.
    స్వప్న ముఖం కూడా గంభీరంగా మారిపోయింది. చప్పున సమాధానం ఇవ్వలేదు.
    "చెప్పు స్వప్నా!"
    "నీ యిష్టం అమ్మమ్మా!" మామూలు ఆడపిల్లల్లాగే అంది స్వప్న.
    అమ్మమ్మగారి ముఖం వికసించింది.

 Previous Page Next Page