తెల్ల తెల్లవారుతూ వుండగా, శారద పాచి చెయ్యడానికి, చీపురూ, బక్కెట్టుతో బయటి కొచ్చింది. సమయం కోసం వేచి వున్న రమణమ్మ, "శారదా" అని రహస్యంగా పిలిచింది. "ప్రొద్దుటే ఎందుకబ్బా!" అనుకుంటూ ఆ పేడ చేత్తోటే వచ్చి "ఏం టత్తా?" అంది.
"ముందా చేతులు కడుక్కుని, లోపలెవరున్నారో చూడు!" అంది రమణమ్మ. ఆమె అలాగే చేసింది. లోపలికొచ్చి, కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న కృష్ణమూర్తిని చూసి తెల్లబోయింది.
"మీ మావయ్య నీ కోసం తెచ్చిన పెళ్ళికొడుకు! నచ్చాడా?" అనడిగింది రమణమ్మ.
ఆమె సిగ్గుల మొగ్గగా మారి వంటింట్లోకి పరుగుతీసింది. అక్కడ తులశమ్మ కనిపించింది. "అత్తా!" అంటూ ఆవిడ్ని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది శారద.
"ఊర్కో! ఇంకేడవకు ముందు మొహం కడుక్కుని, కాస్త కాఫీ తాగు" అని ఓదార్చిందావిడ.
అంతా అనుకున్నట్లుగానే జట్కా తెచ్చి, అందులో శారద నెక్కించుకుని, అందరూ కలిసి పదిగంటలకల్లా బళ్ళారి చేరుకున్నారు. ఊరి మొదట్లోనే ఒక ఆంజనేయస్వామి దేవాలయం వుంది. ఆ పక్కనే ఒక మగపిల్లల హాస్టల్ కూడా వుంది.
అక్కడ దిగి, పూజారిగారి దగ్గరకెళ్ళి "మేము చాలా అవసరంగా, ఆలస్యం కాకుండా ఈ పిల్లకీ పిల్లాడికీ పెళ్ళి జరిపించెయ్యాలి" అని చెప్పారు.
పెళ్ళికి చక చకా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈలోగా శ్రీహరిరావు ప్రక్కనే వున్న మగపిల్లల హాస్టల్ కెళ్ళి "మేమిక్కడో పెళ్ళి జరిపిస్తున్నాము. మీరందరూ సాక్షులుగా రావలసింది" అని ఆహ్వానించారు.
కుర్రకారంతా పరమానందంగా వచ్చేశారు.
మొదటిసారిగా శ్రీహరిరావూ, రమణమ్మా పీటలమీద కూర్చుని కన్నెధారపోసి, శారద వివాహం కృష్ణమూర్తితో జరిపించేశారు.
ఒక కుర్రవాడు పాలూ, చక్కెరా కలిపిన అన్నం ఒక చిన్న గిన్నెలో తెచ్చి, పెళ్ళికూతురికీ, పెళ్ళి కొడుక్కీ నోరు తీపి చేయించాడు. ఆ తర్వాత హాస్టల్లో ఆ పూట వండిన అన్నం, సాంబారూ, పెరుగూ అన్నీ తరలించుకు వచ్చి పెళ్ళి భోజనాలు పూర్తి చేశారు. అందరూ మంచి హుషారుగా వున్నారు. శారద కూడా చాలా సంతోషంగా, గుసగుసగా కృష్ణమూర్తి ప్రశ్నలకి జవాబులిస్తోంది. పసుపు బట్టలతో ఆ జంట చాలా చూడముచ్చటగా వుంది.
ఇంతలో జట్కా వచ్చి ఆగింది. అందులోంచి పెద్ద గొంతులతో తిడ్తూ, దుమ్మెత్తిపోస్తూ, శారద మేనత్తా, బావా దిగారు.
శారదకోసం వారు ఊరంతా వెతికి, ఏడుస్తూ చచ్చిపోయిన దనుకుని బావి దగ్గర కెళ్తుండగా, పక్కింటి కుమారస్వామి, "మీ శారదని ఆ ఉత్తరాదివాళ్ళు జట్కాలో ఎక్కించుకుని తీసుకుపోయారు" అని చెప్పాడట. వాళ్ళు జట్కావాడ్ని పట్టుకుని, అదే జట్కాలో బళ్ళారివచ్చారు. వారి వెంట వచ్చిన పెద్దమనుషులు, "ఏం పనయ్యా ఇది! ఇలా పిల్లనెత్తుకొచ్చి పెళ్ళి చేస్తావా? ఇదే నీ పిల్ల కిలా ఎవరైనా చేస్తే ఊర్కుంటావా?" అనడిగారు శ్రీహరిరావుని.
ఆయన దానికి ఎంతో నిబ్బరంగా- "నా పిల్లకీ గతి పట్టనే పట్టదు. ఎందుకంటే దాన్ని నేను డబ్బుకోసం అరవై ఏళ్ల ముసలాడికిచ్చి కట్టబెట్టాలనుకొను కాబట్టి. రెండో విషయం, ఆ పిల్లని నేనెత్తుకుని రాలేదు. చెట్టంత పిల్ల తనంత తాను ఇష్టపడే వచ్చింది" అని చెప్పారు.
వాళ్ళు శారదని పిలిచి, ప్రశ్నలువేసి, అసలు సంగతంతా రాబట్టి- "ఏం పెద్దమనిషివయ్యా, సిగ్గులేదూ, నీ కూతురికి మంచి సంబంధం దొరికిందని, అదే వయసుపిల్ల గొంతుకోసి ముసలాడికిచ్చి చేస్తావా?" అని గడ్డిపెట్టి, వధూవరులమీద అక్షింతలేసి ఆశీర్వదించి, శ్రీహరిరావుకి క్షమార్పణలు చెప్పుకుని వెళ్ళిపోయారు.
ఇంకా అక్కసు తీరని మేనత్తా, నారాయణాచారీ, వెళ్తూ వెళ్తూ పోలీస్ స్టేషన్ లో రిపోర్టు రాసిచ్చి మరీ వెళ్ళారు.
శ్రీహరిరావుగారూ, వాళ్ళూ బయల్దేరుదామనుకుంటుండగా, పోలీసు జీపోచ్చి ఆగింది. అందులోంచి ఇన్స్ పెక్టర్ దిగి, "మీరేనా శ్రీహరిరావు గారు? ఎవరో పసిపిల్ల నెత్తుకొచ్చి పెళ్ళి చేశారుట. వాళ్ళ వాళ్ళు రిపోర్టు యిచ్చారు" అనడిగాడు.
"అవును! నేనే శ్రీహరిరావుని, రండి, నే నెత్తుకొచ్చిన పసిపిల్లని చూపిస్తాను" అని, శారదని కేకేసి పిలిచారు.
ఇన్స్ పెక్టర్ పసుపు బట్టలతో ఒడ్డూ పొడుగ్గా వున్నా పిల్లనీ, పిల్లాడ్నీ చూసి ఆశ్చర్యపోయాడు. "ఆ అమ్మాయి మేజరే, ఆ అమ్మాయి ఇష్టప్రకారంగానే ఈ పెళ్ళి జరిపించాను" అని చెప్పారు.
అయన కూడా సంగతంతా తెలుసుకుని, ఏమీ అనుకోవద్దని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రే కృష్ణమూర్తీ వాళ్ళు శారదని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు.
రమణమ్మ మూడోసారి గర్భవతి అంతదూరం రాలేనని, మరోసారి వస్తానని చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు.
తరువాత కొన్నాళ్ళకి కృష్ణమూర్తి చెల్లెలు లీల పెళ్ళి ఉల్లి గుండం పూర్ణప్రజ్ఞ నిచ్చి శ్రీహరిరావుగారే కుదిర్చిచేశారు. అతని అక్కగారి పిల్లలే షావుకారు జానకీ, కృష్ణకుమారీ పేరిట చలనచిత్ర సీమలో ప్రఖ్యాతి గాంచారు.
1939లో మూడవసారి కూడా ఆడపిల్ల సత్యవతి పుట్టింది. ఆయనకి ముగ్గురూ కుమార్తెలే! మగపిల్లలు లేరు.
* * * *
కాకినాడలో వుండగా గవర్నమెంటు ఓ రూల్ పెట్టింది. బియ్యం గవర్నమెంట్ రేషన్ షాపులో తప్ప ఎక్కడా అమ్మకూడదనీ, పట్టుకెళ్ళకూడదనీ.