Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 17

 

    నువ్వు మాట ఇస్తే చాలు" అన్నాడు విశ్వం.
    "నా మాట మీద నీకు అంత నమ్మకం ఉందా?" ఆశ్చర్యంలో తల మునకలై పోయాడు గౌతమ్.
    "మీరు మాట ఇస్తే తప్పని మనిషి అని చూడగానే అర్ధం చేసుకొన్నాను."
    మానవుడి బలహీనత మీదే దెబ్బ కొట్టాడు విశ్వం. గౌతమ్ ముఖం ఇబ్బందిగా పెట్టాడు.
    "చూడగానే అనుకొన్నారా?" దేన్నీ బట్టి?"
    "మీ నిర్మొహమాట వైఖరినీ, ఎవడ్ని లక్ష్య పెట్టని మీ స్వభావాన్ని చూసి అలా అనిపించింది." అనేసి గౌతమ్ ముఖంలోకి లోతుగా చూశాడు.
    తను ఆశించిన భావం ఆ ముఖంలో కనిపించి సంతృప్తిగా నవ్వుకున్నాడు.
    పడ్డాడు. ఎందుకు పడడూ?
    మనిషిలోని ఇగో తామర గజ్జి లాంటిది.
    దాన్ని కొంచెం గీరాలి. అదీ మృదువుగా అంతే - పరవశించిపోతాడు మనిషి.
    "ఇన్నింటికీ నేను చెయ్యల్సింది చెప్పారు కాదు."
    విశ్వం తమ ప్లాను చెప్పసాగాడు.
    గౌతమ్ శ్రద్దగా వింటున్నాడు. కొంతసేపు ఆశ్చర్యంతోనూ, కొంత సేపు చిరాగ్గానూ, మరి కొంతసేపు ఆలోచనా పూర్వకంగానూ వింటున్నాడు.
    "మీ అన్నయ్యంటే అసలు నీకెందు కింత కోపం?" అడిగాడు గౌతమ్.
    "అదంతా నీకు అనవసరం." దురుసుగా అన్నాడు రవి.
    "మిస్టర్ రవీ! మీరు ఇంకెప్పుడూ నాతో, ఆ గొంతుతో మాట్లాడకు. అలాంటి కంఠం విని సహించే ఓపిక నాకు లేదు ." తీవ్రంగా ఉంది గౌతమ్ కంఠం.
    రవి తుళ్ళి పడ్డాడు. గౌతమ్ ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు.
    "ఏమిటలా నోరు తెరిచావ్?"
    "మా....."
    "పూర్తీ చెయ్యి."
    "మా అన్నాయ్య కూడా అచ్చం ఇలాగే అంటాడు. " పూర్తి ఆశ్చర్యం నుంచి బయటపడకుండానే తనకు తనే అనుకున్నట్టుగా అన్నాడు.
    గౌతమ్ విస్మయం చెందాడు.
    "నా రూపం - నా గొంతు - వ్యక్తిత్వం కూడా నాదేనా?" నవ్వాడు గౌతమ్.
    "ఇద్దరూ అన్నాదమ్ములేగా? ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేముంది?" విశ్వం అతి మాములుగా అన్నాడు.
    గౌతమ్ చివ్వున తలెత్తి చూశాడు.
    "అన్నదమ్ములా? ఏ ఇద్దరూ?"
    "ఇంకెవ్వరూ? ఈ గౌతమ్ - ఆ గౌతమ్!"
    "నాన్ సెన్స్! మే మిద్దరం అన్నదమ్ములం ఏమిటి?"
    "నువ్వు ఎంత బుకాయించినా ఆ విషయం నీకూ తెలుసు."
    "ఓహో! మనసును చదివే తంత్ర విద్యా పారీణుడివా?" వ్యంగ్యంగా అన్నాడు.
    "నాకెవరూ సోదరులు లేరు. మా అమ్మ పేరు వర్ధనమ్మ." కసి తొంగి చూసింది అతడి కంఠం లోంచి.
    "మరి అమలను చుట్టాని కెందుకొచ్చావ్?"
    "అమలా?"
    'అదే అన్నపూర్ణమ్మగారిని."
    "ఆమె పేరు అమలా....?"
    "అవును. మొదటి పేరు అమలే."
    "గౌతమ్ ఆలోచనలో పడ్డాడు."
    "నేను ఎవర్ని చూట్టానికి రాలేదు."
    "మళ్ళీ ,మొదటి కొచ్చావ్. మనం అనుకున్న కార్యాని సాధించాలంటే  మన మధ్య అరమరికలు ఉండకూడదు."
    గౌతమ్ సమాధానం ఇవ్వలేదు.
    "ఎంతో ఆశతో నీ కన్న తల్లిని చూడాలని వెళ్ళావ్."
    "ఏం ఆశ?" తీవ్రంగా ఉంది గౌతమ్ కంఠం.
    "నీ కన్న తల్లి కళ్ళారా ఒక్కసారి చూడాలన్న ఆశ. పసిగుడ్డుగా పారేసిన బిడ్డ! ఆరడుగుల ఎత్తున అకస్మాత్తుగా ఎదురుగా నిల్చుంటే ఆతల్లి హృదయం ఆనందంతో ఎంత తుళ్ళిపడుతుందో చూడాలనే ఆశ, పిచ్చి ఆవేశంలో నిన్ను పట్టుకుని ఒళ్ళు నిమురుతూ వాత్సల్యంబుధిలో తలమునకలు చేస్తుందని ఆశ....."
    గౌతమ్, విశ్వాన్ని, కళ్ళప్పగించి చూస్తున్నాడు.
    విశ్వం ఓ క్షణం గౌతమ్ ముఖంలోకి చూసి మళ్ళీ ప్రారంభించాడు.
    "కాని ఆమె ప్రవర్తన నీ ఆశకు విరుద్దంగా ఎదురైంది. ఏ తల్లీ ప్రవర్తించనీ రీతిలో ప్రవర్తించింది. నిన్ను చూడగానే , నువ్వు ఫలానా అని తెలియగానే షాక్ అయింది. వెళ్ళిపో! వెళ్ళిపో, అంటూ ఏడుస్తూ పిచ్చిగా అరిచి ముర్చపోయింది. ఒక్క క్షణం అక్కడ నిలబడలేక బయటికి వచ్చేశావ్. అప్పుడు నువ్వెంత దారుణ మానసిక వ్యధను అనుభవించావో మనసున్న ఎవరికైనా అర్ధం అవుతుంది."
    "స్టాపిట్!" వినలేనట్టుగా అరిచాడు గౌతమ్.
    గౌతమ్ మెడమీద నరాలు తేలాయి. గవదలు బిగుసుకుపోయాయి. కళ్ళు ఎర్రబడ్డాయి.
    ఇనుం వేడెక్కింది. ఇప్పుడే కొట్టాలి అనుకొన్నాడు విశ్వం.
    "ఆమెకు ప్రపంచంలో ఎవరన్నా ప్రేమ లేదు. ఒక్క ఆ గౌతమ్ గాడు ఉంటే చాలు. రవిని కూడా ఇద్దరూ కలిసి అన్యాయం చెయ్యాలని చూస్తున్నారు."
    "కన్నతల్లి అలా చేస్తుందంటే నమ్మలేకుండా ఉన్నాను." గౌతమ్ తనకు తనే చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు.
    "ఏం? ఎందుకు చెయ్యలేదు. పెళ్ళి కాకుండా పిల్లవాణ్ణి కని పారేసింది. ఆ విషయం దాచిపెట్టి శంకర్రావు లాంటి ఉత్తమున్నీ పెళ్ళాడింది. ఉత్తమ ఇల్లాలుగా తన పాత్రను చక్కగా నటించింది."
    "ఆమె గురించి మాట్లాడకండి." అరిచినట్టే అన్నాడు.
    "సరే! గౌతమ్ ఎంత దుర్మార్గుడో చెబుతాను."
    "అతడు దుర్మార్గుడని నేను భావించడం లేదు."
    రవి, విశ్వం ముఖ ముఖాలు చూసుకున్నారు.
    "అతడు దుర్మార్గుడో, సన్మార్గుడో నాకు అనవసరం. నాకు డబ్బు కావాలి అంతే!"
    విశ్వం రిలీఫ్ గా గాలి పీల్చుకున్నాడు.
    "కొంతకాలం నువ్వు హైదరాబాద్ లో ఉండాలి. మన ప్లానుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. తొందరపడకూడదు."
    "ఓ.కే. వస్తాను. హోటల్ దక్కన్ లో రవి పేరు మీద గది బుక్ చేయండి."
    "హోటల్ దక్కన్ లో ఉంటావా? మనం గ్రౌండ్ ప్రిపేర్ చెయ్యడానికి కనీసం నెలైనా పట్టవచ్చును." రవి నీరసంగా అన్నాడు.
    "అక్కడే ఎందుకుంటాను? హోటల్స్ మారుస్తాను."
    రవి మరీ నీరు కారిపోయాడు.
    "చాలా ఖర్చు అవుతుంది. " నీళ్ళు నమిలాడు రవి.
    "నువ్వు పన్నిన కుట్రలో నేను ఇరుక్కోవాలి. ఇంపర్సనేషన్ ఎంత పెద్ద అపరాధమో నీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాయర్ గా నీకు  అన్నీ తెలుసు." విశ్వాన్ని చూస్తూ అన్నాడు.
    విశ్వం రవిని చూశాడు.
    "నేను అతణ్ణి , అతడు నన్ను చూడకుండా ఫాలో కావాలి. అతడి అలవాట్లు తెలుసుకోవాలి. అతడి మేనరిజమ్స్ అలవర్చుకోవాలి. అతడు వేసుకునే దుస్తుల్ని గమనిస్తూ అలాంటివే ధరించాలి. కనీసం ఓ రెండు నెలలైనా కేవలం అతణ్ణి గమనించడానికే పడుతుంది" అన్నాడు గౌతమ్.
    "అవును!" అన్నాడు విశ్వం పచ్చి వెలక్కాయ గుజ్జు గొంతుకు అడ్డం పడ్డట్టు గుటక వేసి.
    రెండు నెలలు కేవలం అబ్జర్వు చెయ్యడానికా?" రవి నోరు వెళ్ళ బెట్టాడు.
    "ఒకడు మరోకడిగా ఇంట్లో జోరబడాలంటే మాటలనుకోంటున్నావా?" హేళనగా అన్నాడు గౌతమ్.
    "అవుననుకో!" రవి నీళ్ళు నమిలాడు.   

 Previous Page Next Page