స్వప్న ముఖం ఎర్రనైంది. "ఏమిటి రవిగారూ? నేను మీతో రాదగనా? లేక నా సెలక్షన్ బావుండదా?"
తడబడుతూ "అదికాదు. అప్పుడే ఎనిమిది కావస్తోంది. అమ్మమ్మగారు మీ కోసం ఎదురు చూస్తూ వుంటారు వెళ్ళండి. ఇంకా రాలేదేమని గాబరా పడుతూ వుంటారు!" అన్నాడు.
"ఇంతకు క్రితం మీరే కాపాడకపోతే ఆమె ఎంత గాబరా పదేదో-ఇంకెంత ఆలస్యమయ్యేదో ఆలోచించండి. నన్ను ఆస్పత్రికి తీసికెళ్ళవలసి వచ్చేది మీరు. అయినా ఎందుకీ తర్కం నడవండి. నాలుగడుగులు." అంది చొరవగా.
విధిలేనట్టుగా అనుసరించేడు రవి. అతనికి అడుగు అడుగునా కృష్ణవేణమ్మగారి హెచ్చరికే గుర్తుకొస్తూంది. "గుడిసెల్లో వుండేవాళ్ళు ఆ స్థాయి వాళ్ళతోనే తిరగాలి."
"షాపులో యజమాని అడిగిన సవాలక్ష ప్రశ్నలకి బదులు చెపుతూ ఆయన తెప్పించిన కూల్ డ్రింక్ తాగుతూ చక చకా స్వాతికి కావలసిన డిజైన్ లో నాలుగయిదు ఫ్రాకులు నాలుగయిదు మాక్సీలు సెలక్ట్ చేసింది స్వప్న.
షాపింగ్ ముగించుకుని తిరిగి వచ్చి కారులో అతన్ని అవుట్ హవుస్ ముందు దించి యింట్లోకి వెళ్ళేసరికి అమ్మమ్మ గారు భద్రకాళిలా కూర్చుని వున్నారు హాల్లో. అక్కడెవరూ లేరు. ఆమె ఒక్కతే అడవిలో పులిలా కూర్చుని వుంది ఆమె స్వప్నని చూడగానే లేచి నుంచుంది.
అంతదాకా నవ్వుతూ త్రుళ్ళుతూ షాపింగ్ ముగించి దారిలో రవితో కబుర్లు చెబుతూ వచ్చిన స్వప్న అమ్మమ్మ గారిని చూడగానే నీరసంగా భయంగానుంచుండిపోయింది. ఏదో తప్పుచేసిన దానిలా ఆగిపోయింది.
"రా!" సింహం గొర గొర లాడినట్లుంది ఆ పిలుపు.
తర తర లాడిపోయి నాలుగడుగులు వేసింది.
"ఇంత సేపు ఏం చేస్తున్నావ్? ఎక్కడికి వెళ్ళేవు?"
నోరెత్తలేదు.
"ఏమయ్యావో! ఏమైందో అని అల్లల్లాడిపోయాను. షాపుకి ఫోన్ చేస్తే గంట క్రింద వెళ్ళిపోయావని చెప్పాడు అతను. ఇంతసేపూ ఎక్కడున్నావ్?"
అమ్మమ్మగారి మాట వినగానే స్వప్న ముఖంలో బల్బు వెలిగినట్టుగా ఆనందం నిండింది. చప్పున దగ్గరికి వచ్చి అమ్మమ్మగారిని కౌగలించుకుని "అమ్మమ్మా! ఎంత ప్రమాదం తప్పిందనుకున్నావ్? కారు కోసం రోడ్డు దాటబోతూ వుంటే స్పీడ్ గా వస్తోన్న కారు క్రింద పడబోతూ వుంటే మన ఔట్ హవుస్ లో వున్న రవిగారు కాపాడేరు. అమ్మమ్మా! ఆ సమయంలో అతనె అక్కడ లేకపోయి వుంటే ఎంత ప్రమాదం జరిగేదో ఏమో! ఆస్పత్రిలో చూసే దానివి నువ్వు నన్ను..." అంది గోముగా బేలగా.
ఆమె కోపం, ఆగ్రహం, దర్పం అన్నీ మరిచిపోయి మనవరాలిని గుండెలకి హత్తుకుని "అమ్మయ్యో! ఎంత ప్రమాదం తప్పింది. లేచిన వేళ మంచిది. ఎవరి ముఖం చూశావో క్షేమంగా యిల్లు చేరావు!" అంది.
"బయటి కెళుతూ నీ ముఖమే చూశా! అందుకే క్షేమంగా ఇల్లు చేరాను!" అంది స్వప్న నవ్వుతూ అమ్మమ్మ నరసింహావతారం చాలించినట్లు తెలుసుకోగానే నిట్టూర్చింది స్వప్న.
"పాడు ముఖం! అందుకే ప్రమాదం జరగబోయింది. స్వామివారి పుణ్యమా అని తప్పించుకున్నావు. తర్వాతేం జరిగింది?"
వివరంగా విడవకుండా చెప్పింది.
అంతా విన్న అమ్మమ్మగారి ముఖం మళ్ళీ బిగుసుకుపోయింది.
"స్వప్నా!
ఒకటి గుర్తుంచుకో! మొన్న ఏం చెప్పాను. మరచిపోయావా? ఇప్పుడు మళ్ళీ చెపుతున్నాను గుర్తుంచుకో...
వాళ్ళ స్థాయి వేరు. మన స్థాయి వేరు.
మనం వాళ్ళతో కలవకూడదు. తిరక్కూడదు.
వాళ్ళ దృష్టి ఎప్పుడూ మన ఐశ్వర్యం మీదే వుంటుంది. మనకుందనీ వాళ్ళకి లేదనీ వాళ్ళెపుడూ మరిచిపోలేరు. అందుకే ట్రాప్ చేయటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ వుంటారు.
"వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడేవుంచాలి! చనువు యివ్వకూడదు!"
స్వప్న ముఖం చిన్నబోయింది.
అమ్మమ్మకి ఎదురు సమాధానం చెప్పటం యిష్టం లేక "అలాగేలే! అబ్బ! ఎంత ఆకలి! భోం చేద్దాం పద!" అంది.
"దొంగపిల్ల! అన్నీ అల్లరి బుద్దులే పద పద!" అంది నవ్వుతూ.
ప్రసన్నంగా వున్న అమ్మమ్మ ముఖం చూసి తృప్తి పడింది స్వప్న.
10
రెండు నెలలు గడిచిపోయాయి.
స్వాతికి జబ్బు చాలా మట్టుకు తగ్గిపోయింది. ప్రతి దినమూ, యింజక్షన్సూ, టానిక్స్, టాబ్లెట్స్, పాలు, మార్నింగ్ ఎగ్, బ్రెడ్, పళ్ళు ఇవ్వటంతో మనిషి కూడా నేవళంగా తయారైంది. బుగ్గలు నిండుగా వచ్చి, వేసవిలో చిక్కి వరదొచ్చాక నిండుగా వుండే ఏరులా తయారైంది.
రిజల్సు వచ్చాయి బి.ఏ. ఫస్టుక్లాసులో పాసైంది స్వప్న. మోహన్ అనుకున్నట్టుగానే కొన్ని పేపర్సులో తప్పేడు. ఆ రోజు వెంకట్రామయ్య కొడుకుని వేసిన చివాట్లు మరెప్పుడూ వెయ్యలేదు. అయితే సామెత చెప్పినట్టుగా దున్నపోతుపై వర్షం కురిసినా చలించదన్నట్టుగా అతనేం బాధ పళ్ళేదు. మరో సంవత్సరం రికామీగా, బాధ్యతా రహితంగా తిరగొచ్చుకదా అని సంతోషించేడు.