అతడికి బాగా డబ్బు సంపాదించాలనే కోర్కె గాడంగా ఉంది. తనను చిన్నతనంలోనూ , పెద్దయ్యాక కొంచపరిచిన వాళ్ళ మీద కసి తీర్చుకోవాలంటే డబ్బు కావాలి అవి అతడి నమ్మకం.
అతడూ ప్రేమించాడు. అందరిలాగే ప్రేమ డైలాగులు చెప్పాడు. అతడు ప్రియురాలి పేరు స్వప్న. పేరుకు తగినట్టుగానే ఉండేది. పదో క్లాసులో ప్రారంభం అయిన వారి ప్రేమ ఉప్పెనలా ఎల్లల్ని లెక్క చెయ్యనట్టుగా ఉండేది. స్వప్నతో దాదాపు మూడేళ్ళు ప్రేమ వ్యవహారం నడిచింది. నాలుగో సంవత్సరం స్వప్న తండ్రి చూసిన ఇంజనీర్ ను పెళ్ళి చేసుకుంది. గౌతమ్ దాదాపు పిచ్చివాడే అయ్యాడు.
"నీ నిర్ణయం ఇదేనా?"
"నన్ను అర్ధం చేసుకో గౌతమ్!"
"ఏమిటా అర్ధం చేసుకొనేది?"
"చిన్నప్పుడు మంచీ చెడూ తెలియదు."
"ఓహో ఇప్పుడు తెలిసిందన్న మాట ఇంజనీర్‌ను పెళ్ళి చేసుకుంటే విలాసమయ జీవితం గడపొచ్చని....." వ్యంగ్యంగా అన్నాడు గౌతమ్.
"విలాసమయ జీవితం అక్కర్లేదు. సుఖంగా జీవించడానికి కొన్ని వసతులు కావాలిగా? తాడూ బొంగరం లేని నిన్ను చేసుకుంటే ఏమవుతుంది? కొద్ది రోజుల్లోనే ప్రేమ జ్వరం దిగిపోతుంది. ఒకరికి ఒకరం శత్రువులుగా కనిపిస్తాము. ప్రేమను తిని, ప్రేమను తాగి బ్రతకలేంగా? నన్ను మర్చిపో గౌతమ్!" అనేసి పర్సు గిరగిర తిప్పుతూ సాగిపోతున్న స్వప్నను వెర్రిగా చూశాడు గౌతమ్.
ఇది జరిగి నాలుగేళ్ళయినా స్వప్నను మరిచి పోలేక పోయాడు. ముఖ్యంగా స్వప్న అన్న 'తాడూ బొంగరం లేని నిన్ను చేసుకుంటే ' మాట నిరంతరం అతణ్ణి మృగం వెంట పడ్డ వేటగాడి లాగా తరముతూనే ఉంది.
స్వప్న భర్త గుంటూరులో మునిసిపాలిటిలో జూనియర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. అత్తగారిచ్చిన సెకెండ్ హ్యాండ్ పియాట్ లో తిరుగుతూ ఉంటాడు. ఎన్నోసార్లు స్వప్న భర్త పక్కన కూర్చుని కార్లో వెళ్తూ కనిపిస్తూ ఉంటుంది.
గౌతమ్ కు ఆ రోజంతా పెనంలో వేగిపోతున్నట్టే ఉంటుంది.
ఇటీవల అతణ్ణి తమాషా కోరిక నిలవ్వనివ్వడం లేదు.
తను కారు కొనాలి. విమానం లాంటి కారు డొక్కు కార్లో వస్తున్న స్వప్నకు ఎదురు రావాలి. స్వప్న కళ్ళు పెద్దవి చేసి తననూ తన కారునూ ఆశగా చూడాలి. అప్పుడు తను ఓ చిరునవ్వు విసిరి దాటిపోవాలి.
అంతేకాదు , పెద్ద బిల్డింగ్ కట్టాలి. ఆవిడగారికి ఓ చిన్న ఇల్లు తండ్రి కట్టించింది ఊరుకి దూరంగా ఉంది. అది ఇప్పుడిప్పుడే డేవలిపింగ్ ఏరియా. అక్కడే తను పెద్ద బిల్డింగ్ కట్టాలి. స్వప్న ఆశగా ఆ ఇంటి వైపు చూడాలి. తనను వివాహం చేసుకోవడానికి తిరస్కరించినందుకు కుళ్ళి కుళ్ళి ఏడ్వాలి. ఇలాంటి ఆలోచనలతోనే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు స్వప్నకు ఇద్దరు పిల్లలు. ఇటీవలే స్వప్న భర్త లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సస్పెన్షన్ లో ఉన్నాడు. ఎప్పటికప్పుడు గౌతమ్ ఈ విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు.
స్వప్న మీద కసిగా ఉంది. ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది. కేవలం తను ఆమె భర్త కంటే పై అంతస్తులోకి వెళ్ళి ఆమె బాధపడుతుంటే చూస్తూ ఆనందించాలని ఉంది. అదే అతడి ప్రతీకారేచ్ఛ.
అనుకోకుండా లక్షల ఆస్తికి వారసుడయ్యే అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని పిచ్చివాడిలా జార విడుచుకో కూడదని మనసు హెచ్చరించింది.
"ఏమిటండీ అంత గాడంగా ఆలోచిస్తున్నారు? మీకు ఇష్టమైతేనే అన్నాడు విశ్వం, గౌతమ్ కొంత మెత్తబడుతున్నాడని తెలుసుకొని బింకంగా.
"నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు."
"ఏమిటి?"
"మీ పని అయిపోయాక నన్ను మీరు ఎక్స్ ఫోజ్ చేయ్యరనీ, మొత్తం ఆస్తి ఈ రవి ఒక్కడే స్వాధీనం చేసుకోడనీ నమ్మకం ఏమిటి?" ఇద్దర్నీ మర్చి మర్చి లోతుగా చూశాడు.
"అందుకు మమ్మల్ని ఏం చెయ్యమంటారు?"
"రవి భాగంలో సగం నాకు రాసి రిజిస్టర్ చెయ్యాలి. మీరు మోసం చేసినా కనీసం ఆస్తిలో నాలుగో భాగం అయినా నాకు దక్కుతుంది."
విశ్వం రవి ముఖంలోకి చూశాడు. రవి ముఖం వెలా తెలా పోతున్నది.
"ఏం అంగీకారమేనా?"
"మీరు మమ్మల్ని నమ్మాలి." ప్రాధేయపూర్వకంగా అన్నాడు విశ్వం.
"ఏం ! ఎందుకు నమ్మాలి? సొంత అన్నకే ఎసరు పెట్టె ఈ రవిని నేనెలా నమ్ముతాను?" అన్నాడు గౌతమ్.
రవి తల వంచుకున్నాడు.
"సారీ! బాధ పెట్టానా?"
రవి మాట్లాడలేదు. ఎవరి చేతో బాగా దెబ్బలు తిని పారిపోయి వచ్చినా వాడిలా కనిపించాడు.
"అంత డీలా పడిపోయారేం బ్రదర్?" గౌతమ్ రవి వీపు తట్టాడు.
"గౌతమ్ స్థానంలో నువ్వొస్తావు. నీకు సగం ఆస్తి దక్కుతుంది. అప్పుడు రవి ఏం కావాలి?"
"సగం రాసిచ్చేస్తాను." తేలిగ్గా అనేశాడు గౌతమ్.
"మమ్మల్ని నువ్వు నమ్మలేదు. నిన్ను మేము మాత్రం ఎలా నమ్ముతాం?" అన్నాడు విశ్వం లా పాయింటు లాగుతూ.
'అయితే వదిలెయ్యండి. నేను మీ దగ్గరకు రాలేదుగా?" అన్నాడు గౌతమ్ లేచి నిల్చుంటూ.
"ప్లీజ్ ఓ క్షణం కూర్చోండి" అని గౌతమ్ ను కూర్చోబెట్టి "రవీ! ఇలారా!" అంటూ గదిలో నుండి వరండాలోకి నడిచాడు విశ్వం.
రవి కింకర్తవ్య విముడుడి;లా విశ్వం వెనకే బయటికి వెళ్ళాడు.
గౌతమ్ ముసిముసిగా నవ్వుకున్నాడు.
"అతడు చెప్పిన షరతుకు ఒప్పుకో!"
రవి చివ్వున తలెత్తి విశ్వం ముఖంలోకి చూశాడు. రవికి కోపంగా ఉంది. విశ్వాన్ని బాగా తిట్టాలని ఉంది. అది సమయం కాదని కోపాన్ని దిగమింగుకున్నాడు.
"ఏమిటలా చూస్తావ్?"
"నీకేం చెప్తావ్? నా భాగంలో సగం ఆస్తి అంటే మాటలా. దాదాపు పన్నెండు లక్షలు. ' నీరు కారిపోతూ అన్నాడు రవి.
"నీ మొహం! ఎందు కంత ఇదై పోతావ్? మీ అన్నయ్య జైలుకు వెళ్ళగానే ఇతడి బండారం బయట పెడతాం!" అంటూ నవ్వాడు విశ్వం.
"లాయర్ బుర్ర నీది. అయినా నేను రాసి ఇచ్చిన నా భాగంలోని సగం ఆస్తి పోతుంది?"
"అయితే నేం? మిగతా మూడు వంతులు నీదే."
"ఏమిటో నా కంతా అయోమయంగా ఉంది. నా బుర్ర పనిచెయ్యటం లేదు. నీకు ఇలాంటి లిటిగేషన్స్ బాగా తెలుసు. పైగా లాయరవూ. అంతా నీకే అప్పగిస్తున్నాను. నన్ను ముంచినా నువ్వే తేల్చినా నువ్వే !"
"రవీ! థాంక్యూ ! నా మీద నీకు నమ్మకం ఉంది, అంతే చాలు. ఇంకేమీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నా కంఠం ప్రాణం ఉండగా నీకు అన్యాయం జరగనివ్వను. నన్ను నమ్ము రవీ!"
"నీ ఇష్టం వచ్చినట్టే చేస్తాను" అన్నాడు రవి.
ఇద్దరూ లోపలికి వచ్చారు.
గౌతమ్ వారి ముఖాల్లోకి కుతూహలంగా చూశాడు.
"నీ షరతుకు అంగీకరిస్తున్నాము."
గౌతమ్ విస్మయంగా చూశాడు. వాళ్ళు నిజంగా ఆ మాట అన్నారా అనే సందేహం వచ్చింది.
"ఏమిటన్నారు?"
"మీ షరతుకు అంగీకరిస్తున్నాము. ఇక మీరు మేము చెప్పినట్టు చెయ్యాలి. ప్రతిసారీ ఎందుకూ , ఏమిటి?" అంటూ ప్రశ్నించకూడదు."
"అలా అని రాసుకుందామా?" పకపక నవ్వాడు గౌతమ్.