"హాయ్! నిన్నే స్వప్నా!"
మరికాస్త దగ్గరగా వచ్చి పలుకరించాడు.
ఆ మొరటు దనానికి, ఆ అసభ్యతకి అసహ్యవేసిందామెకి. అందుకనే కాస్త కరుగ్గా "ఎవరు నువ్వు?" అంది.
చిరునవ్వు నవ్వేడు మోహన్. "నా పేరు మోహన్. మితుర్లు హన్ అంటారు. పెద్దలు బాబూ అని పిలుస్తారు. గర్ల్ ఫ్రెండ్స్ అయితే హనీ అంటారు....మనం ఒక కాలేజీలోనే చదివేం....నేను బి.ఏ పాలిటిక్స్ గ్రూప్!" తన వివరాలు అందించాడు మోహన్.
వీధిలో తిరుగుతూ, షాపుకి వస్తున్న జనం మెట్లముందు నిలబడి అతనితో మాట్లాడుతున్న స్వప్న కేసి చూడసాగారు. అందంగా నాజూగ్గా షోకేస్ లో బొమ్మలా వుంది స్వప్న! ఆమె శరీరం నుంచి మైసూర్ శాండిల్ పరిమళాలు ఫారిన్ యింటిమేట్, మాచ్ అజ్ చల్లుకున్న స్ప్రే పరిమళం కలసి చిరుగాలికి విస్తరిస్తున్నాయి.
"ఇక్కడ యెందుకు నుంచోవాలి? అలావెళదామా పార్కుదాకా?"
"ఇతను నిజంగా ఇడియట్ కాదు, ఫూలుకూడా!" అనుకుంది స్వప్న "సారీ! నేను యింటికి వెళ్ళాలి" అంది సభ్యంగా.
"నో! నో! అలా అంటే యెలా నేను మీతో మాట్లాడాలి!"
"ఏమిటి మాటాడతారు?"
సిగ్గు పడ్డాడు మోహన్ "అలా తెగేసి నిలేసిఅడిగితే యెలా? పార్కుకి వెళ్ళి తీరికగా కూర్చుందాం పదండి. అక్కడ చెబుతాను!"
"సారీ! నేను యింటికి వెళ్ళాలన్నాగా!" ఒకడుగు వేసింది.
అతను మరికాస్త దగ్గరగా వచ్చి "స్వప్నా! దయచేసి వెళ్ళొద్దు. నీతో చాలా పని వుంది. అలాగా చెపుతాను!" అన్నాడు.
స్వప్న సీరియస్ అయిపోయింది. రోడ్డుకి అవలి వేపున కారు పార్కు చేసి వుంది. డ్రైవరు కారు నానుకుని నుంచున్నాడు. థాంక్ గాడ్! అతనసలు చూడటం లేదు. చూస్తే ఎంత అబ్సర్డు. అనుకుని, "చూడండి మిస్టర్ మోహన్! నాకు పార్కులకి, బీచ్ లకి సినిమాలకి షికార్లకి వచ్చే అలవాటు లేదు. అయినా దారిలో పరిచయం లేని అమ్మాయిని పార్కుకి రమ్మని పిలవటం సభ్యత కాదు." అంది తీవ్రంగా.
"పరిచయం కోసమే పార్కుకి రమ్మంటున్నాను." నవ్వుతూ అన్నాడు మోహన్.
"షటప్! వెళ్ళిపో దయచేసి అనవసరంగా సీన్ క్రియేట్ చెయ్యకు..." మరో అడుగు వేసింది.
"స్వప్నా! నాతో పార్కుకి రా చాలా విషయాలు చెప్పాలి!"
ఆమె పలక్కుండా కదిలింది ముందుకి.
"స్వప్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను!"
వింతైన విషయం వింటున్నట్టుగా చప్పున తల తిప్పిందామె. ఆమె ముఖంలో క్రోధారుణ ఛాయలు ప్రతిబింబం చాయి. వీధి దీపాలు వెలిగేయి.
"ఈ విషయం చెప్పటానికే పార్కుకి రమ్మన్నాను. ఇప్పుడొస్తావా?" అదే చిరునవ్వు. అదే స్మైల్.
"మైండ్ యువర్ బిజినెస్! నీవు ప్రేమిస్తే అయిపోతుందా?...."
ఆమె మాటలు పూర్తి కాకముందే "అందుకే నిన్ను ప్రేమించమంటున్నాను కదా?" అన్నాడు.
"ఒరే ఫూల్!" అనుకుంది స్వప్న. మృదువుగా చెపితే లాభం లేదనుకుని "షటప్! మరోసారి నీ ప్రేమ పురాణం చెప్పొద్దు....బై...." అంది ముందుకి చక చక వెళుతూ.
మోహన్ విస్తుబోయి చూడసాగాడు.
కోపంతో, అవమానంతో, అసహ్యంతో వెళుతున్న స్వప్న అటు నుంచి వేగంగా వస్తోన్న కారుని చూళ్ళేదు. స్పీడ్ గా వస్తోన్న అ కారు క్రింద పడబోయే సమయంలో చప్పున అది చూసిన ఓ యువకుడు ఆమె చేయి పట్టుకుని లాగేడు. కారు దూసుకెళ్ళింది. స్వప్నకి ఏం ప్రమాదం జరగలేదు. అయితే వేగంగా లాగటంతో ఆమె ఆ యువకుడి చేతుల్లో వాలిపోయింది.
జరిగిన సంఘటన నుంచి తేరుకుని సరిగ్గా నుంచుని ఆ యువకుడిని చూసి "థాంక్స్!" అని వెంటనే గుర్తుపట్టి "రవిగారూ!" అంది సంభ్రమంగా.
రవికి కూయా స్వప్నని చూసే వరకూ తను రక్షించింది స్వప్న అని తెలియదు. ఎవరో అమ్మాయి దూకుడుగా వెళుతోంది. కారు మరీ దూకుడుగా వస్తోంది. క్షణంలో ప్రమాదం జరగబోతోంది అనుకుని ఆ క్షణంలో సగంలో చొరవ చేసి లాగేసి రక్షించాడు. తను రక్షించింది స్వప్ననా? అనుకున్నాడు.
"మీరా స్వప్నా! ఎంత ప్రమాదం తప్పిపోయింది!" అన్నాడు ఆనందంతో.
"మెనీ థాంక్స్!"
చుట్టూ చేరబోతున్న మనుషుల్ని తప్పించుకోవటానికి తను కారువేపు నడుస్తూ "మీరు యింటికేనా? వెళదాం రండి." అంది ఆహ్వానిస్తూ.
ఆ పిలుపుని అంగీకరించినట్టుగా రోడ్ క్రాస్ చేసి ఆమెని కారెక్కించి "జాగ్రత్తగా వెళ్ళండి. నాకు కొంచెం పని వుంది." అన్నాడు.
"ఏమిటా పని?"
"మా చెల్లాయికి ఫ్రాకులు, మాక్సీలు కొనాలి!"
చప్పున కారు డోరు తీసి దిగి "పదండి. ఈ లైన్ లోనే నాకు బాగా తెలిసిన వాళ్ళ షాపుంది. అందులో బేబీ డిజైన్స్ వుంటాయి. కొని వెళదాం." అంది.
రవి ముఖమాట పడ్డాడు. ఇబ్బంది ఫీలవుతూ "మీరు వెళ్ళండి. నేను షాపింగ్ చేసుకుని బస్సులో వచ్చేస్తాను" అన్నాడు ముఖమాటంగా.