Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 15

 

    విశ్వం బేరర్ ని పిల్చి మూడు కాఫీలు తీసుకురమ్మని పురమాయించాడు.
    "చెప్పండి. నాతొ ఏం పని మీకు?"
    "కొంతకాలం నువ్వు గౌతమ్ గా నటించాలి."
    గౌతమ్ పకపక నవ్వాడు.
    అన్నయ్య ఇంత గట్టిగా నవ్వడు అని అనుకొన్నాడు రవి.
    "గౌతమ్ లా నటించడమేమిటి? నీకేమైనా పిచ్చా? నేను గౌతమ్ నే!" వాళ్ళ అభిప్రాయం తెలిసి, తెలియనట్లుగా అన్నాడు.
    "అది కాదు. మా అన్నయ్యలా నటించమని ....." రవి అన్నాడు.
    'అదా? అందువల్ల నాకేం లాభం? నేనెందుకు అంత రిస్కు తీసుకోవాలి? పైగా మీ అన్నయ్య నాకేమీ అపకారం చెయ్యలేదే?" పరిశీలనగా రవిని చూస్తూ అన్నాడు.
    రవి విశ్వం ముఖంలోకి చూశాడు.
    "చెప్పండి. అలా చేస్తే నాకేమోస్తుంది?"
    "శంకర్రావు ఆస్తిలో సగ భాగం."
    గౌతమ్ విశ్వం ముఖంలోకి విస్మయంగా చూశాడు.
    "అదెలా సాధ్యం?"
    "ఎందుక్కాదు? నువ్వే అతడి పెద్ద కొడుకుగా ఆ ఇంట్లో ప్రవేశిస్తావు."
    "శంకర్రావు ఆస్తి ఎంత ఉంటుంది?"
    "ఎంత లేదన్నా నీ వాటా 20 లక్షలు వస్తుంది."
    "మిమ్మల్ని నమ్మడం ఎలా?"
    ఇద్దరూ నీళ్ళు నమిలారు.
    "చెప్పండి"
    "నమ్మాలి - అంతే!"
    "సొంత అన్నయ్యకే ఇంత దోహం తలపెట్టిన నీ ఈ స్నేహితుడు . ఏ సంబంధం లేని నాకు సగ భాగం ఇస్తాడా?"
    "ఏ సంబంధం లేకపోవడం ఏమిటి? రవికి నువ్వూ అన్నయ్యవె."
    గౌతమ్ చిరాగ్గా చూశాడు.
    "ఎందుకలా అంటున్నావ్? వాళ్ళన్నయ్య పోలికలున్నయ్యనేనా?"
    "కాదు."
    "మరి!" నొసలు ముడిపడ్డాయి. స్వరంలో ఆవేశం.
    "ముగ్గుర్ని కన్నతల్లి ఒక్కరే కనుక. ఒకే తల్లి రక్తమాంసాలు."
    "స్టాపిట్! " దాదాపు అరిచినట్టే అన్నాడు.
    "నేను చెప్పింది నిజం."
    "ఐ సే స్టాపిట్. లేదా మీ ఇద్దర్ని చెరో చేత్తో ఎత్తి బయటికి విసిరేస్తాను."
    ఈ వాలకం చూస్తుంటే అంత పనీ చేసేట్టే ఉన్నాడు దుర్మార్గుడు. తమ కార్య సాధనకు పనికొస్తాడు. వెధవ సెంటిమెంట్స్ లేవు. అది కనుక్కోదానికే తను ఆ మాట అన్నాడు. తను విసిరినా మాట తగలాల్సిన చోటే తగిలింది.
    గౌతమ్ ముఖం ఎర్రగా ఉంది. కళ్ళు అగ్ని గోళాల్లా ఉన్నాయి.
    అన్నయ్యకి, ఇతనికీ స్వభావంలో చాలా తేడా ఉంది. ఇతని మాటల్లో చూపుల్లో కూడా కాటిన్యం ఉంది.
    బేరర్ మూడు కాఫీలు తెచ్చాడు.
    ముగ్గురూ మౌనంగా కాఫీ తాగారు.
    ఇప్పుడో ఇంకాసేపటికో పెలబోయే టైం బాంబు ఉన్న గదిలో కూర్చున్నట్టుగా ఉన్నారు ముగ్గురు.
    ముగ్గుర్ని కన్నది ఒక్క తల్లే. ఒకే స్త్రీ రక్తమాంసాలు పంచుకొని పుట్టినవాళ్ళు. ఈ వాక్యాలు గౌతమ్ బుర్రలో గిరగిరా తిరుగుతున్నాయి.
    అవును. అతడు అన్నది వాస్తవమే. కాని తన మనసును ఆ మాట లోతుగా గాయపరిచింది.
    ఎందుకని?
    అది చేదు నిజం!
    ఆ చేదును తను జీవితమంతా మౌనంగానే భరించాడు. మరొకరు ఆ చేదును ఎత్తి చూపడం భరించలేకపోయాడు.
    గోడ నేర్రెలో నుంచి ఒక్కొక్క చీమే బయటికి వస్తున్నట్టు గౌతమ్ మెదడులో అనేక చేదు జ్ఞాపకాలు ఒకదాని వెన్నంటి ఒకటి సాగుతూనే ఉన్నాయి.
    గౌతమ్ కు ఊహతో పాటే తన కన్న తల్లిదండ్రులు వర్ధనమ్మ ఆమె భర్తా కాదని తెలిసింది. అది ఎలా తెలిసిందో అతడికే తెలియదు. చుట్టూ వాళ్ళు మాట్లాడే మాటల  వల్ల కావచ్చును. పసివాడు కదా అని వర్ధనమ్మా ఆమె భర్తా మాట్లాడిన మాటల ప్రభావమే కావచ్చు. పసివాళ్ళకు ఏం తెలుసులే అనుకుంటూ పెద్దవాళ్ళు చాలా విషయాలు మాట్లాడుకుంటారు. అప్పుడు వాళ్ళకు ఆ మాటల అంతరార్ధం బోధపడకపోవచ్చును. ఆ ప్రభావం మాత్రం వాళ్ళ మీద ఉంటుంది. వయసుతో పాటు ఆ ప్రభావం కూడా బలపడుతుంది.
    స్కూల్లో చేర్చించాకనే గౌతమ్ పసి మనసు గాయపడింది. ఆ గాయం వయసుతో పాటు పెరుగుతూనే వచ్చింది.
    "నువ్వు వర్ధనమ్మకు డస్ట్ బిన్ పక్క దొరికావటగా?"
    "మీ అమ్మ నిన్ను పారేసిందట."
    "వర్ధనమ్మ సమయానికి నిన్ను చూడకపోతే చచ్చిపోయేవాడివట."
    "నీకు నాన్న లేడంట. అందుకే మీ అమ్మా నిన్ను పారేసిందట. మా అమ్మ చెప్పింది" ఇలా ఎన్నో ప్రశ్నలు ఆ పసి వాణ్ణి బాధించేవి.
`    ఒకరోజు ఈ అప్సర హోటల్ ప్రొప్రయిటర్ కొడుకునే అతను చితక బాదాడు. వాడికి మూతి పగిలి రక్తం కారింది. మూతి వాచింది. గౌతమ్ అది చూసి హనుమంతుడు అంటూ చప్పట్లు కొట్టాడు. అతడితో పాటు మరి కొందరు కూడా ఎగతాళి చేశారు.
    ఇద్దరూ స్కూలు వదిలాక ఆటల్లో పేచీ పడ్డారు.
    "మీ అమ్మ మంచిది కాదు" అన్నాడు సురేష్ అప్పుడు గౌతమ్ కు పదకొండేళ్ళు.
    "ఏమన్నావురా?" అంటూ అతని షర్టు పట్టుకొని గుంజాడు.
    "వదులు." గుంజుకున్నాడు.
    "ఇందాక అన్నమాట మళ్ళీ అను."
    "ఏం? అంటాను. భయమా? మీ అమ్మ మంచిది కాదు. నిన్ను కుప్పతోట్టేలో పారేసింది."
    మాటలు పూర్తీ అయీ కాకుండానే సురేష్ ను కిందపడేసి గుండె మీద కూర్చుని మూతి మీద పిడికిళ్ళు బిగించి రక్తం కారేలా కొట్టాడు. సురేష్ పెద్దగా ఏడుస్తుంటే కొందరు కుర్రాళ్ళు పరిగెత్తు కెళ్ళి హెడ్ మాస్టర్ తో చెప్పారు.
    హెడ్ మాస్టర్ పరుగు పరుగున లబలబలాడుతూ వస్తున్నాడు. అది చూసి గౌతమ్ పరుగు లంకించుకున్నాడు. ఆ పరుగు పరుగు దాదాపు ఇంటికి వచ్చీ గానీ ఆగలేదు.
    సురేష్ అంటే హెడ్ మాస్టర్ కు ఇష్టం. సురేష్ మంచి బట్టలు వేసుకుంటాడు. కార్లో వస్తాడు. అందుకే అతడంటే హెడ్ మాస్టర్ కు ఇష్టం అనే భావన గౌతమ్ హృదయంలో లోతుగా నాటుకుపోయింది.
    ఆరోజు నుంచి ఆ స్కూలు కు వెళ్ళలేదు. అప్పటికి వర్ధనమ్మ భర్త చనిపోయాడు. హైదరాబాద్ లో ఇల్లు అమ్మేసి గుంటూరు వచ్చి చిన్న బోర్డింగ్ లాడ్జింగ్ పెట్టాడు. అయన పోయాక బోర్డింగ్ మానేజ్ చెయ్యలేక, బోర్డింగ్ మూసేసి లాడ్జింగ్ మాత్రమే ఉంచింది. గౌతమ్ కు లాడ్జి వైపు వెళ్ళాలంటేనే గిట్టదు.
    ఆ సంఘటన తర్వాత వేరే హైస్కూల్లో చేరి పది పాసయ్యాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో చదువుకు స్వస్తి చెప్పాడు. స్నేహితులతో తిరగడం, భవిష్యత్తు గురించి పగటి కలలు కనడం అలవాటై పోయింది.
    గౌతమ్ ఒంటరితనాన్ని భరించలేడు. అందుకే ఎప్పుడూ పదిమంది మధ్యలో ఉంటాడు. అతనికి ఒంటరితనమంటే భయం. ఆ భయం వయసుతో పాటు పెరిగింది. ఆ భయం మరేదో కాదు- తన జన్మకు సంబంధించిన ఆలోచనల భయం. అతని అంతరంతరాల్లో నుంచి నిరంతరం 'తనను ఎంగిలి విస్తరాకులా తన తల్లి కుప్పతోట్టిలో పారేసింది' అనే భావం విషాద రాగంలా వినపిస్తూనే ఉంటుంది.
    అతడిలో ఒక రకమైన కసి బయలుదేరింది. ధనవంతుల మీద కసి, రాజకీయ నాయకుల మీద కసి , బలహీనుల్ని కొట్టేవాళ్ళ మీద కసి, స్త్రీలను కించపరచేవాళ్ళంటే కసి - ఆ కసితో మంచి పనులతో పాటు అనేక చెడు పనుకు కూడా చేశాడు.

 Previous Page Next Page