తెల్లవారింది.
మరోసారి బద్దకంగా ఆవలించి పక్కకి ఒత్తిగిలి పడుకుంది శాంతి.
తెల్లవారిందని మరోసారి రుజువు చేస్తూ వెలువడిందో శబ్దం.
శాంతి చప్పున మంచం మీద లేచి కూర్చుని, కిటికీ రెక్క కొద్దిగా తెరిచింది.
నిజంగానే తెల్లవారింది.
కానీ రోజులా కాదు.
"నాయనా౧ నా తండ్రీ నీకప్పుడే నూరేళ్ళు నిండాయా? నాకింక దిక్కేది బాబూ!" ప్రశ్నిస్తోంది మాతృమూర్తి.
"నా బ్రతుకంతా చీకటి చేసి పోయావు కదయ్యా! నేనేం కావాలి? ఈ పిల్లల్ని యెట్లా పెంచాలి? నేనెట్టా బతకాలి?" భర్త మృతదేహాన్ని ప్రశ్నిస్తోందో ఇల్లాలు.
ఎదురింటి వాకిట్లో చాప మీద పడుకోబెట్టబడి ఉంది ఓ శవం. శాంతి గబగబా అక్కడి కెళ్ళింది. శాంతిని చూస్తూనే దుర్గమ్మ బావురుమంది.
"శాంతమ్మా! నా బిడ్డకి నూరేళ్ళు నిండాయి తల్లీ. రాత్రి డ్యూటీ నుంచి వస్తుంటే లారీ గుద్దేసింది. రాత్రంతా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుకుని చచ్చిపోయాడు."
శాంతి మ్రాన్పడి పోయింది. నిన్న సాయంత్రం డ్యూటీ కి వెళ్ళే టప్పుడు వచ్చి తనను కలిశాడు సత్యం. మనియార్డరు చేసిన రశీదు ఇచ్చి వెళ్ళాడు. ప్రతి నెలా అమ్మావాళ్ళకి తను సత్యం ద్వారానే మనియార్డరు పంపిస్తుంది. అంతేకాదు తనకెంతో సాయం చేస్తాడు సత్యం. "చెల్లమ్మా! చెల్లమ్మా!' అంటూ తన బిడియాన్ని పోగొట్టి ఎంతో ఆప్యాయత చూపించే సత్యం, నిర్జీవంగా పడి ఉన్నాడు. అతని చుట్టూ తల్లి, పిల్లలు, భార్య బంధువులు కూర్చుని ఏడుస్తున్నారు. తండ్రి దూరంగా కండువాలో మొహం దాచుకుని నిల్చున్నాడు. సత్యం మంచితనాన్ని నలుగురికి సాయపడే అతని తత్వాన్ని బంధువులంతా గుర్తు చేసుకుంటూ మరీ ఏడుస్తున్నారు.
శాంతి మనసు కలచి వేసినట్లయింది. గుండె భారంగా అయింది. నెమ్మదిగా వెళ్ళి సత్యం భార్యని, తల్లిని చెరో చేత్తో దగ్గరకి తీసుకుంది. శాంతి ఒంటరిగా ఈ జీవనం సాగించటం మొదలు పెట్టిన ఈ ఏడాదిలో తనను కంటికి రెప్పలా చూసుకుంటూ, ఆప్యాయత ను పంచి ఇచ్చి, తల్లిదండ్రులను , తోబుట్టువులను మరిపించిన కుటుంబం. చేతి కంది వచ్చిన కొడుకు పోయిన దుర్గమ్మ హృదయ విదారకంగా ఏడుస్తోంది. అతని భార్య అంధకార బంధురమైన తన భవిష్యత్తు లో పిల్లలకి దారి కనిపించక కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఆ భాధార్తులను ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు శాంతికి. రాత్రి తను ఫ్రెండ్స్ తో సెకండ్ షో సినిమా కెళ్ళి వచ్చి నిద్రపోయింది. దుర్గమ్మ ఇంట్లో ఇంత విషాద కరమైన సంఘటన జరిగిందని ఇప్పుడే తెలిసింది. శాంతికి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. మంచి వాళ్ళకే అకాల మరణం సంభావిస్తుందేమో నెమ్మదిగా రుద్దమైన కంఠం తో అన్నది.
"లే దుర్గామ్మా! నువ్వే అలా బాధపడితే ఆ అమ్మాయిని ఓదార్చే వాళ్ళెవరు? నువ్వేడ్చినంత మాత్రాన అతను బతికోస్తాడా? లే ధైర్యం తెచ్చుకో! చూడు వాళ్ళంతా ఎలా ఏడుస్తున్నారో! పద లోపలికి , లేవాలి మరి." అసహజంగా అన్పిస్తున్నా , ఎలాగో ఓదార్చడానికి ప్రయత్నించింది శాంతి. ఆమెకి తెలుసు తన ఓదార్పు అర్ధం లేనిదని. సత్యం మరణం ఆ కుటుంబానికి గొడ్డలి పెట్టు. అతని మీద ఆధారపడి బతుకుతున్న ఆ ఐదు ప్రాణాలకు దిక్కెవరు అన్నది ముందున్న మహా సమస్య. "ఎట్లా తట్టుకొను తల్లీ! ఎట్లా తట్టుకొను' గుండెలు పగిలేలా ఏడుస్తూ అన్నది. సత్యం అత్తగారు భోరున ఏడుస్తూ "నా బిడ్డ పాతికేళ్ళ కే పసుపు కుంకుమలకు దూరమైంది తల్లీ!' అంటూ గొల్లుమంది.
ఆరోజు జరగవలసిన తంతు అంతా ఏదో వాళ్ళ పద్దతి ప్రకారం జరిపించారు. సత్యం కొడుకు పదేళ్ళ వాడు శవం వెనకాల కుండలో నిప్పు తీసుకెళ్ళడం . శవాన్ని ఊరేగింపుగా తీసు కెళ్ళడం , దారిలో అందరూ గట్టిగా ఏడవడం....ఇదంతా అయోమయంగా అనిపించింది.
"దినకర్మల కి బోలెడు డబ్బు కావాలి. బంధువులంతా వస్తారు" అంది సత్యం తల్లి. శాంతి తెల్లపోయింది. "దినకర్మలేవిటి? బంధువులంతా రావడం మేమిటి?"
"దినాలు చేయాలి కదమ్మా! పదోరోజు పదకొండో రోజు,పన్నెండో రోజు మూడు రోజులు చేయాలి. బంధువులంతా ఈ మూడు రోజులుంటారు. పదోరోజు మా కోడలికి పసుపు కుంకుమలు తీసేస్తాము."
శాంతి నిలువెల్లా వణికిపోయింది. ఎప్పుడో ఒక తెలుగు సినిమాలో చూసింది. భర్త పోయిన నాయికకి ఆడవాళ్ళంతా కలిసి నీళ్ళు పోసి, గాజులేసి, మరీ పగలకొట్టడం, బొట్లు పెట్టి మరీ తుడిచేయడం, ఇలాంటి దారుణాలు నిజంగా ఈ సమాజంలో ఇంకా జరుగుతున్నాయా?
"ఎంత మోటు పద్దతులివి? వీటినా సంప్రదాయాలనేది? సమాజం మారిందన్నారే! మరి ఎక్కడ? ఈ దుర్గమ్మ ఏవిటి ఇలా మాట్లాడుతోంది? లేదు అలా జరగటానికి వీల్లేదు. దుర్గమ్మ కి తెలీదు కాబోలు" శాంతి కొంచెం గట్టిగా అరిచింది.
"లేదు దుర్గమ్మ! అదంతా చేయనవసరం లేదు. వచ్చిన డబ్బు బాంక్ లో దాచి పిల్లల చదువులకు ఉపయోగించండి. మీ అబ్బాయి పనిచేసిన చోట మీ కోడలికి ఉద్యోగం ఇస్తారు. ఆ అమ్మాయి అ ఉద్యోగం చేసుకుంటూ నాలుగక్షరం ముక్కలు నేర్చుకుంటుంది. తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది. ఇవన్నీ చాదస్తాలు దుర్గమ్మా! ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి నమ్మకాలతో డబ్బు వృధా చేయకూడదు."
"మీరంతా చదువుకున్నవాళ్ళు తల్లీ! మీకు తప్పు అయినవి మాకు ఒప్పు. మాకు ఒప్పు అయినవి మీకు తప్పు. ఇదంతా చేయకపోతే, మా బంధువులంతా మమ్మల్ని అడిపోసు కుంటారు. పిల్లాడు పోయి నాలుగు రోజులన్నా కాకుండా వాడిని మర్చి పోయా విస్త్రమంటారు. అయినా నా కొడుకుకు కావలసిన వాళ్ళం మేమంతా బతికి ఉండి వాడిని అనాధ శవం లాగా తగలేసి ఊరుకోలెం కదమ్మా!"
రెండు మూడు రోజులు గడిచి పోయాయి. శాంతి యధాప్రకారం ఆఫీసు నుంచి రాగానే ఆ ఇంటి కెళ్ళి వాళ్ళకు కావాల్సిన సాయం చేస్తూనే ఉంది. ఎంతో ప్రయత్నించిన మీదట సత్యం భార్య భారతి తో మాట్లాడే అవకాశం కలిగింది.
నెమ్మదిగా , తనకు జరగబోతున్న అన్యాయపు తంతు తెలియని దానిలా, నిర్లిప్తంగా ఉంది భారతి. వంటింట్లో కూర్చుని ఆమెకు జరగబోయే అన్యాయం వివరించి, ఆ ఆచారాన్ని ప్రతిఘతించమని ఆవేశంతో చెప్పింది శాంతి.
అంతా విన్న భారతి నీరసంగా అన్నది. "నావల్ల కాదు శాంతక్కా! నాకంత ధైర్యం లేదు. అయినా ఎప్పటి నుంచో జరుగుతున్న పద్దతులు నాకోసం మారుస్తారా? అమ్మా, అత్త, అక్కలు, వదినలు ఎవరూ ఒప్పుకోరు. నేను గొడవ చేస్తే, బొట్టు కోసం ఏడుస్తున్నానని, మొగుడు పోయినా ఫర్వాలేదు బొట్టు కావాలా? అని నానా మాటలంటారు. అంతకన్నా వాళ్ళెం చేసినా నోరు మూసుకుని ఊరు కోవడం మంచిది."