"వాతావరణ కాలుష్యం అంటే ఏమిటి గ్రాండ్ పా?"
"అంటే! జనాభా పెరుగుతున్న కొద్ది, జీవితావసరాలు పెరిగాయి. అకామడేషన్స్ కమ్యూనికేషన్, ఫెసిలిటీస్ , ట్రాన్స్ పోర్టు, ఇండస్ట్రీస్ ఇలాంటి వాటి అవసరం పెరిగింది. తత్ఫలితంగా భూభారం పెరిగింది. పరిశ్రమలు వదిలివేసే వెస్ట్ వలన, వాహనాల ద్వారా వెలువడే పెట్రోలు, డీజిల్ వగైరా ఇంధనాల ద్వారా వాయు కాలుష్యం , నీటి కాలుష్యం ఏర్పడింది. కాంక్రీట్ భవనాల పునాదుల తాకిడికి భూభారం పెరిగి, సహజ వనరులు దెబ్బతిన్నాయి. ప్రజల్లో స్వార్ధం ధనమదం, భోగలాలసత పెరిగి అన్యాయాలు, అక్రమాలు చేయడం ప్రారంభించి, ఆహార పదార్ధాలలో కల్తీ పదార్ధాలు కలపడం ప్రారంభించారు. ఆఖరికి అన్నదాత అయిన రైతుకి సరఫరా చేసిన విత్తనాల్లో కూడా కల్తీ విత్తనాలు ఇచ్చి, ఉత్పత్తులు మీద దెబ్బ తీశారు. ఈవిధంగా వాయుకాలుష్యం, నీటి కాలుష్యం , పరిసరాల కాలుష్యం, ఆహార కాలుష్యం, పెరిగిపోయి , సూర్యుని అల్ట్రా వయొలెట్ కిరణాలు నుంచి భూమినీ మానవజాతిని సంరక్షించే ఓజోన్ పొర చిరిగిపోయింది. మనుషుల ఆరోగ్యం మీద, ఆయుష్షు మీద దెబ్బ కొట్టింది.
చెరువులు, నదులు, బావులు డ్రై అయిపోయాయి. వర్షాలు పడడం ఆగిపోయింది. ప్రజలంతా దాహంతో, ఆకలితో అలమటించే వారు. తినటానికి లేక, తాగడానికి లేక , పిల్లలు స్త్రీలు , వృద్దులు అందరూ అకాల మరణంచెందారు. అప్పుడున్న స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ పరిమాణాలన్నిటినీ పరిశీలించి దీర్ఘంగా చర్చించి, ప్రపంచ దేశాల శాస్త్రజ్ఞులను అందరినీ ఆహ్వానించి , వర్షాల కురవడానికి ఏదన్నా మార్గం ఆలోచించమన్నారు. ప్రకృతి కరునించడం తప్ప చేసేదేం లేదని శాస్త్రజ్ఞులు అన్నారు. ప్రకృతి కరుణించాలంటే ఏంచేయాలో అని అప్పటి ప్రభుత్వాచి నేతలు అడిగారు. యజ్ఞాలు, చేయాలి,పూజలు చేయాలి అన్నారు శాస్త్రజ్ఞులు. వెంటనే వారు రాష్ట్రంలో, దేశంలో ఉన్న ధనాన్నంతా వెచ్చించి యజ్ఞాలు చేయించారు. కానీ ప్రకృతి కరుణించలేదు. సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చేసుకుంటున్నారు కదా! అదే మిమ్మల్ని మీ ప్రజలనూ రక్షిస్తుంది అని ఆకాశవాణి పలికింది. వెంటనే వారు సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పటికే రాష్ట్ర ఖజానా , దేశ ఖజానా కూడా చిల్లు పడడంతో ఆధునిక సాంకేతిక విజ్ఞానం అమలు పరచడానికి అభివృద్ధి పరచడానికి తగిన వనరులు, ధనం లభించలేదు.
అపర చాణుక్యుడి గా పేరుపొందిన ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖజానా నింపడానికి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించారు. అందులో భాగంగా ప్రజలు కూర్చున్నా, నిలుచున్నా నవ్వినా, ఏడ్చినా పన్నులు చెల్లించాలని ప్రకటించారు. అప్పటి దాకా ప్రజాస్వామ్య దేశంలో బతికినా అ ప్రజలు ఈ నిరంకుశుడి బాధలకు తాళలేక , అయన చెప్పిన విధంగానే పన్నులు కట్టారు. ఆవిధంగా రాబట్టిన డబ్బుతో, ఆధునిక విజ్ఞానం అంతులేనంతగా సాధించారు. అయినా, ఆ తరం ప్రజలు జీవితాలను కాపాడలేక పోయారు.
కళ్ళు విశాలం చేసుకుని వింతగా వింటున్న కుర్రవాడు కుతూహలంగా అడిగాడు. "మరి ఆ కాలంలో ప్రజలు ఏం తినేవారు?"
"హు....వేదాంతి లా నవ్వాడాయన. "రైతులు సంవత్సరమంతా కష్టపడి వరి, గోధుమ , మొక్కజొన్న, కందులు, పెసలు, రాగులు, అనే ధాన్యాలను , వంకాయలు, టమాటాలు, బెండకాయలు, సొరకాయలు, పోట్లకాయలు అనే కాయగూరలను, మామిడి, జామ, అరటి, బొప్పాయి అనే పండ్లనూ పండించేవారు. ఆనాటి స్త్రీలు వాటితో రుచికరమైన వంటలు చేసేవారు. ప్రజలంతా రకరకాల ఆహార పదార్ధాలను తినేవారు. వాటిని అధికారంతో కొందరు, గూండాయిజంతో కొందరు ఉచితంగా తెచ్చుకొని పీకల దాకా తిని కొవ్వు పట్టి తిరిగేవాళ్ళు. కొందరు చెమటోడ్చి కాయకష్టం చేసి, ధనం సంపాదించి, ఆ ధనంతో ఈ ఆహారపదార్ధాలను కొనుక్కుని తినేవాళ్ళు. రైతులకీ, వినియోగదారు లకీ మధ్య దళారీలుండే వాళ్ళు. వాళ్ళు అమాయకులైన రైతులను మోసం చేసి ఉత్పత్తి ధరల కన్నా ఎక్కువ ధరకి వినియోగదారు లకి ఆహార పదార్ధాలను అమ్మి కోట్లు సంపాదించి అహంకారంతో కన్నూ, మిన్నూ గానక ప్రవర్తించేవాళ్ళు.
ఈ నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల మీద ప్రేమ, సానుభూతి వరదలా పొంగుతున్నట్టు నటించి, రైతు బజార్లంటూ ఏర్పాటు చేశాడు. దాని వలనకూడా రైతులకు లాభం కనిపించలేదు. వ్యవసాయం లో ముఖ్యమంత్రి రూపొందించిన ఆధునిక పద్దతులేవీ సామాన్య రైతులకు అందుబాటులోకి రాలేదు. ఇలా అనేక కారణాలతో రైతులు ఆర్ధికంగా నష్టపోయి, ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే ఇప్పుడు పండించే నాధుడు లేక పంటలనేవి లేవు.శాస్త్రజ్ఞులు సాధించిన ప్రగతికి నిదర్శనంగా మనకి ఈ టాబ్లెట్లు, డ్రై ఫ్రూట్స్ మిగిలాయి. ఈ లాప్ టాప్ లు, రాకెట్లు అనుభవిస్తున్నాం. అప్పుడు మనుషులు చేసే పనిని ఇప్పుడు మనకు రోబోట్స్ చేస్తున్నాయి. ఇది సాంకేతిక యుగం బాబూ.... ఇక్కడ మనిషికి ఆయుష్షు పెరిగింది. యవ్వనం శాశ్వతం అయింది. కానీ, అనుభూతులూ, ఆనందాలు లేవు . జీవితం అంటే , జీవన మాధుర్యం అంటే తెలియదు. అదంతా గడిచిన కాలం.... కరిగిపోతే తిరిగిరానిదికాలం.... ఇక ఆ కాలం రాదు బాబూ...."
"గ్రాండ్ పా... చాణుక్యుడు అన్నారే....ఆయనేవరు?"
అయన నిట్టూర్చాడు ...."హు...అది మరో చరిత్ర. ఇంకెప్పుడైనా చెప్తాను. నిద్రొస్తుంది గుడ్ నైట్..."
చంద్రయ్య నెమ్మదిగా కుర్చీలోంచి లేచి మనవడికి గుడ్ నైట్ చెప్పి , లిప్ట్ లో తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
కూర్చున్న కుర్చీలో నే ఆ కుర్రవాడు నిస్సేజంగా వెనక్కి వాలి పైకి చూశాడు. ట్యూబు లైట్లూ, నియాన్ లైట్లు, మెర్క్యురీ లైట్లు చిన్న చిన్న చుక్కల గుంపులుగా కనిపించాయి. అసహనంగా కదిలి అనుకున్నాడు. "ఛ.... ఈ టైం లో కూడా అక్కడ ఇంత ట్రాఫిక్కా? ఇన్ని విమానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో.... ఈ జనానికి పనీ పాటా లేదా? ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉంటారా? ఏం మనుషులో!" గోడకున్న స్వేచ్ నొక్కాడు.
రోబోట్ కొన్ని క్షణాలు ఆలశ్యంగా వచ్చింది.
"వాట్ హపెండ్? ఇంత లేట్ గానా వచ్చేది? ఏం చేస్తున్నావు అంత సేపూ?"
"సారీ!సర్.... మీ హోం వర్క్ ఇప్పుడే కంప్లీట్ చేశాను..."
"ఒకే....టెక్ మీ టు బెడ్ రూం...." ధీమాగా అన్నాడు.
రోబోట్ కుర్రవాడిని ఎత్తుకుని లిప్ట్ వైపు నడిచింది.
***