Previous Page Next Page 
ఒప్పందం పేజి 17

 

    "అలా అనుకుంటే ఎలా భారతీ? మీ అత్తలాగా అందరూ సంఘానికి భయపడి ఆచారాలను కుంటూ , ఇలాంటి అనాచారం పాటిస్తున్నారు. నీలాగే అత్తలకు, అమ్మలకు , అక్కలకు అమ్మలక్క లకు భయపడి అందరూ వాళ్ళ పనిని సమర్ధిస్తున్నారు. ఇలా ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్లకు భయపడుతూ ఉంటె ప్రగతి అనేది ఎలా సాధ్యపడుతుంది? సంఘం , సంఘం అంటారు , ఇలా భయపడే వాళ్ళంతా ఈ సంఘం లోని మనుషులేగా, పదిమంది భారతులు , ఇరవై మంది దుర్గమ్మ లు, ఇంకా కొందరు మల్లమ్మలు, ఎల్లమ్మ లు వీళ్ళందరి కలయికే ఒక సంఘం. అలాంటి సంఘానికా మీరంతా భయపడేది? ఎంత విషాదం! ఇలాంటి పనులు నీ ఒక్కదానికి అవమానం కాదు. మొత్తం స్త్రీ జాతికే అవమానం. పదిమంది ఆడవాళ్ళు కలిసి నీ బొట్టు, చేరిపెయడమనే సంప్రదాయం , సంప్రదాయం కాదు, నీచత్వం, అమానుషత్వం, ఈ మనుషులు కుళ్ళు మనస్తత్వానికి ప్రతిబింబం . నువ్వు దీనిని ప్రతిఘటించాలి నామాట విను భారతీ..."
    "నేను నీలాగా పెద్ద చదువులు చదువుకోలేదు శాంతక్కా! నువ్వు మాట్లాడే వన్నీ పెద్ద పెద్ద మాటలు. అవన్నీ నాకర్ధం కావు. నేనింతే, నా బతుకింతే . ఆయనే చనిపోయాక నాకు బొట్టు, అంత ముఖ్యం కాదు. నేనెలా ఉంటె ఏం? నా బిడ్డల్ని పెద్దవాళ్ళ ను చేస్తే చాలు."
    భారతి వెక్కి వెక్కి ఏడ్చింది నిస్సహాయంగా.
    శాంతి ప్రయత్నాలన్నీ విఫలం అయినాయి. ఆరోజు రానే వచ్చింది. ఎదురింట్లోంచి శోకాలు గుండె చెదిరి పోయేలా వినిపిస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఆరోజు ఆదివారం.శాంతి ఎలాగైనా ఆ సంఘటన జరక్కుండా ఆపాలని ఇంట్లోనే ఉండిపోయింది.
    పక్కింట్లో ఉంటున్న సునంద దగ్గర కెళ్ళింది శాంతి. సునంద, ఆమె కొడుకు ఉంటున్నారు. సునంద బ్యాంకు లో పనిచేస్తోంది. శాంతిని చూడగానే "రండి రండి" శాంతి గారూ కూర్చోండి." అని ఆహ్వానించింది సునంద.
    "సునంద గారూ, ఈరోజు ఎదురింట్లో చాలా ఘోరం జారగాబోతోంది తెలుసా?' అడిగింది శాంతి.
    "ఏవిటండీ అది?' గాభరాగా అడిగింది సునంద.
    "సత్యం పోయాడు కదండీ. ఇవాళ పదోరోజు . పాపం భారతికి బొట్టు తీసేయడం అలాంటివేవో చేస్తారట."
    'అదా! ఏవిటో అనుకున్నాను. అది మామూలే కదండీ!' తేలిగ్గా అన్నది సునంద. అదిరిపడింది శాంతి. ఎంత ఈజీగా అంటోంది. ఈమె చదువుకుని ఉద్యోగం చేస్తోన్న సునందేనా?
    "కానీ, ఇంకా మన సమాజంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే నాకు చాలా బాధగా ఉందండీ" అంది.
    "భాదేకాని, మనకు కొన్ని కస్టమ్స్ ఉన్నప్పుడు వాటిని ఫాలో అవ్వాలి గా, ఏం చేస్తాం." శాంతికి అసహ్యం వేసింది. కస్టమ్స్ ట. దానికో భాష ఎరువు తెచ్చుకోడం కూడా.
    "అందుకే నేనివాళ మా అమ్మగారింటికి వెళ్ళాలను కుంటున్నాను."
    "దేనికి?" విచిత్రంగా అడిగింది శాంతి.
    "దేనికేవిటండీ ? మీరు వట్టి అమాయకుల్లా ఉన్నారే! ఎల్లుండి భారతి మొహం చూడకూడదు. పొరపాటు గా కనిపిస్తే ఎలా? పైగా మంగళవారం కూడాను. మీరు కూడా చూడకండి. పెళ్ళి కావాల్సిన వారు.
    "ఆమెని చూస్తె నాకు పెళ్ళి కాదంటారా/ చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడటం నాకు బాధగా ఉంది."
    "మీకు నమ్మకం లేదా ఏం? పెద్దవాళ్ళు ఊరికే అనలేదండీ! ఏదో లేకపోతె ఇలాంటి రూల్స్ అన్నీ ఎందుకు పెడతారు? మాంగల్యం ఉంటేనే స్త్రీకి రక్షణ, గౌరవం.' అంటూ మెళ్ళో మంగళసూత్రాలు కళ్ళ కద్దుకుంది.
    'అయినా, మీ పిచ్చి గాని, మనం గొంతు చించుకున్నంత మాత్రాన, అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? వ్యక్తుల్లో మార్పు రావాలి, సంస్కారం ఉండాలండీ! ఇలాంటి సంస్కరణలు రావడానికి. అయినా ఆమె బొట్టు తీయనంత మాత్రాన మనమంతా ఆమెని ముత్తయిదువుగా అంగీకరించి బొట్టు పెట్టగలమా?" సునంద రాగం తీస్తూ అన్నది.
    ఎంత హిపోక్రసీ! సంస్కారం కావాలిట. సంస్కారం లో ఎన్ని అక్షరాలూ ఉన్నాయో కూడా తెలీని సునంద సంస్కారం గురించి మాట్లాడు తొంటే రోత పుట్టింది. నిరసనగా అన్నది.
    "పెట్టగలమా? అనకండి. నేను పెట్టగలను. పెట్టి తీరుతాను." విసురుగా అనేసి బైటి కొచ్చేసింది. తన క్కాస్త సపోర్టు గా ఉంటుందని ఆశ పడ్డ సునంద అలా మాట్లాడటంతో శాంతికి పిచ్చెక్కి నట్లయింది. మహిళా సంఘాల వాళ్ళను పిల్చుకొస్తే స్త్రీ ఉద్యమ కారుల్ని పిలిస్తేనో, కాలేజీ స్టూడెంట్స్ ని పిలిచి ఉద్యమం చేస్తేనో ఇలా రకరకాలుగా ఆలోచిస్తూనే ఉంది. కానీ ఆమెకి ఏం చేయాలో తోచలేదు. నిజానికి సమస్య సమాజానికి సంబంధించిందే. కానీ ఎవరికీ వాళ్ళు అది వ్యక్తిగత సమస్య అంటూ ఎవరినీ కల్పించుకోనివ్వటం లేదు. కట్నాల సమస్య కూడా సమాజానికి సంబంధించినదే. కాని అది కూడా వ్యక్తిగత సమస్య అని పోలీసులు కూడా కల్పించుకోవడం లేదు. ఎలా? ఎలా ఈ సమాజం మారేది.
    శాంతి ఆలోచనల్లో ఉండగానే, ఆ భయంకర క్షణం రానే వచ్చింది. భారతికి మొహం నిండా పసుపు రాసి, పెద్ద కుంకుమ బొట్లు పెట్టారు. చేతుల నిండా గాజులేశారు. పచ్చ చీర కట్టబెట్టారు. విరబోసిన జుట్టుతో, గుండెలు పగిలేలా ఏడుస్తున్న భారతిని, ఆ దౌర్భాగ్యురాల్ని , ఆ నిస్సహాయురాల్ని అదే జాతికి చెందిన మరికొందరు స్త్రీలు బలవంతంగా బైటికి తీసుకొచ్చారు. చీర చెంగుతో మొహం కప్పుకుని రోదిస్తున్న భారతిని చూస్తుంటే శాంతి రక్తం కుతకుత ఉడికిపోయింది.
    ఎంత మోటుదనం? వీటినా సంప్రదాయాలనేది? ఇవేనా ఆచారాలు? రాజా రామ్మోహన్ రాయ్ ఎక్కడ? వీరేశలింగం ఎక్కడ? మీరంతా ఎక్కడ? మీభోధనలతో మారిన సమాజం ఇది. చూడండి రండి. ఈ ఘోరాన్ని ఆపండి. నిస్సహాయురాల్ని కాపాడండి. సతీసహగమనం, రూపు మాపామన్నారే, ఇంతకన్నా అదే నయం కాదా? ఒక స్త్రీని భర్త పోయిన దుఃఖం లో ఉన్న తోటి స్త్రీని ఇలా చిత్రవధ చేయడం నేరం కాదా? అయితేదీనికి శిక్ష నడిబజార్లో ఉరి వేయటమే . రండి వీళ్ళందర్నీ ఉరి తీయండి. పుట్టుకతో సంపాదించుకున్న హక్కుల్ని నేలరాచి, చిత్రహింసల పాలు చేసే ఈ సంప్రదాయాన్ని ముక్కలు చేయండి. స్వార్ధంతో  అసూయతో అమానుషత్వం తో ఇంకా ఇలాంటి దురాచారాన్ని ఆచరించే ఈ సమాజాన్ని తగలబెట్టండి. రండి వీరశాలింగం గారూ, రాజారామ్మోహన్ గారూ బతికిరండి.
    శాంతికి ఉప్పెనలా దుఖం ముంచు కొచ్చింది.
    నడిబజార్లో ఒకస్త్రీని  ఎంత ఘోరంగా అవమానిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకోటుందా?ఈ సమాజానికి సిగ్గుందా? ఒక జీవితాన్ని సంప్రదాయాలకు వేలం వేస్తోంటే చూస్తూ ఊరుకునే ఈ సమాజానికి అత్మగౌరవముందా?"
    శాంతి ఇంక తట్టుకోలేక పోయింది. ఆమెలో ఆ ఆవేశం ఎక్కడి నుంచి వచ్చిందో , విసురుగా వెళ్ళి అడ్డొచ్చిన వాళ్ళని తోసేస్తూ , భారతి చేయి పట్టుకుని లాక్కొచ్చి, తన గదిలో పడేసింది. అదే ఆవేశంతో తలుపులు గడియ వేసి అడ్డంగా నిల్చుంది.
    "శాంతమ్మా! తలుపు తెరు శాంతమ్మా అది తప్పు" అని అరుస్తూ జనం తలుపు తడుతున్నారు. భయంతో బిగుసుకుపోయి , హటాత్తుగా ఏం జరిగిందో తెలుసుకున్న భారతి విహ్వలంగా పిలిచింది. "శాంతక్కా, ఏ....ఏవిటిది?"
    శాంతి జవాబు చెప్పలేదు. కళ్ళు మూసుకుని తలుపు కానుకుని అలాగే నిలబడింది. బైట నుంచి ఇంకా జనం అరుస్తూనే ఉన్నారు.

                                       ***

 Previous Page Next Page