"చూడు! నేను అంతస్థుల మనిషిని మేడల్లోవుండేవాళ్ళు అలాటి వాళ్ళతోనే తిరగాలనీ, గుడిసెల్లో ఉండేవాళ్ళు గుడిసెల్లో ఉండే వాళ్ళతోనే తిరగాలనీ నేను ఆశిస్తాను."
జవాబుగా తలవంచుకున్నాడు రవి. స్వాతి విస్మయముతో విభ్రమంతో, భయంతో చూస్తోంది.
"నువ్వు నీ చెల్లయిని అదుపులో పెట్టుకోవాలి! మా స్వప్న పిల్లతనంతో మిమ్మల్ని పలుకరించినా మీరు పలక్కూడదు. దానికి లోకం యింకా తెలియదు. మీరు తెలుసుకుని మెలగాలి.
"అలాగేనండీ!"
"ఈ యిల్లు నా తండ్రిగారిది. ఆయన మాతల్లి ఆస్తికి యిల్లరికం వచ్చాడు. తద్వారా యీ ఆస్తి నాది, నా భర్తది. ఇందులో ఎవరికీ వాటాలేదు. నా కొక్కతే కూతురు. అది చనిపోతూ స్వప్నని నా చేతుల్లో పెట్టింది. దాని బాగోగులు అహరహం నేను కంట్లో ఒత్తులువేసుకుని చూస్తూ ఉంటాను."
తలూపేడు రవి.
"నీవు నీ చెల్లాయికి జబ్బు నయం చేయించుకోవాలని వచ్చావు. ఎలా వచ్చావో యిక్కడికి వచ్చావు. మీనాన్న పోయాడన్నావు. బహుశా మీ అమ్మచెప్పి వుండచ్చు కదూ?"
"అవునండీ!"
"సరే! ఎవరు చెపితేనేం యిక్కడికి వచ్చాక నాఆశ్రయం కోరేక వాళ్ళ బరువు బాధ్యతలన్నీ నావే! తెలిసిందా."
"తెలిసిందండీ!"
"అమ్మాయికి టి.బి. అటకదా? చాలా జాగ్రత్తగా వుండాలి. అది అంటు వ్యాధి. అందుకే మీరిద్దరూ ఆ అవుట్ హవుస్ లోనే వుండండి. ఇంత దాకాలాగానే మీకు రోజూ ఆహారం వస్తుంది ఇంకా పాలు పండ్లు ఎక్కువగా వస్తాయి. డాక్టరు వచ్చి చూస్తాడు. మా ఇంటి డాక్టరు కృష్ణమూర్తే చికిత్స చేస్తాడు. అతని హస్త వాసి మంచిది. డయగ్నయిజ్ బాగా చేసే శక్తివుంది. ప్రిస్క్రిప్షన్ కూడా బాగా చేస్తాడు. అతని చేతిలోపడి తే మృత్యుంజయమంత్రం సిద్ధించినట్టే. చచ్చేరోగైనాయముడితో పోట్లాడి తిరిగొస్తాడు. అంతటి గట్టి డాక్టరు. కాబట్టి మరేమీ ఫర్వాలేదు. ఇక నువ్వు నీ ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు. నీకు సాధ్యం కాకపోతే చెప్పు మామేనేజర్ తోనో, డాక్టర్ తోనో, ప్లీడర్ తోనో రికమెండ్ చేయించి తెప్పిస్తాను!"
రవికి ఆమె ఠీవి దర్పం అహంకారం దురుసుతనం ఏమీ నచ్చలేదు. ఆ కంఠస్వరం, ఆ వైఖరి అసలే నచ్చలేదు. అయితే ఆమె చెప్పిన విషయాలు మాత్రం బాగా నచ్చాయి. చెల్లాయ్ ఆరోగ్యం కోసం విషం లాటి ఆమె డాంబికాన్ని డామినేషన్ ని సహించాలనుకున్నాడు.
"ఇలాటి ఆడాళ్ళంటే అసహ్యం! మైగాడ్! ఆ భర్త ఎలా భరించాడో?" అనుకున్నాడు.
"ఊ తెలిసిందా ఇదంతా ఎందుకు చేస్తున్నానో!"
రవి సమాధానం చెప్పలేదు.
"కేవలం మీ మీద జాలివల్ల. అంతే మీరు వెళ్ళవచ్చు. ఇదిగో! నాకై నేను మళ్ళీ కబురంపే దాకా నీవుకాని-ఆ నీ చెల్లాయి కానీ ఈ వరండా దాటి ఈ హాల్లో ప్రవేశించకూడదు. మీకేం కావలసివచ్చినా నేను ఆయాతో కనుక్కుని పంపుతూ వుంటాను. మీరేం అడగక్కర్లేదు.
తలూపి వెనుదిరిగేడు రవి.
స్వాతి అనుసరించింది.
"ఇదిగో! ఎమ్మే చదివేవు...కనీసం థాంక్స్ చెప్పాలనయినా తెలియదా?" తేట తెల్లంగా నవ్వుతూ ప్రశ్నించింది.
రవికి ఎంతో ఘాటుగా సమాధానం చెప్పాలనిపించింది. అయినా అణుచుకుని చిరునవ్వుతో "థాంక్స్ అన్నాడు. వెంటనే వెనుదిరిగేడు.
"ఇదిగో!" మళ్ళీ పిలిచిందామె.
చికాగ్గా వెనుదిరిగేడు రవి.
"ఇదిగో ఈ నెల పాకెట్ మనీ మూడొందలు మూడు సరికొత్త వంద రూపాయలనోట్లు కట్టలు యిచ్చింది వెళ్ళి అందుకున్నాడు రవి. అది కేవలం తన ప్రిస్టేజ్ ప్రదర్శించుకునేందుకే ఇచ్చినట్టనిపించింది రవికి.
"ఇక వెళ్ళొచ్చు!"
"దీనికీ థాంక్స్! వస్తామండీ!" అని చెల్లాయిచేయి అందుకుని విసవిసా వెళ్ళిపోయాడు.
"కుర్రకుంక!" అనుకుంది కృష్ణవేణమ్మ.
మరో అయిదు నిమిషాల తర్వాత అక్కడినుండి మెల్లిగా కదిలి భర్త వున్న తైలవర్ణం పటం వద్దకి వెళ్ళి "కుర్రవాడు గట్టివాడే! తాతగారి పేరు నిలబెట్టేట్టుగానే వున్నాడు. ఫరవాలేదు. మొదటి పరీక్షలో నెగ్గాడు!" అంది ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఆయనా తెలిమీసాల చాటున నవ్వినట్టనిపించింది ఆమెకి.
9
"హాయ్!"
ఏదో పనిమీద బజారుకు వెళ్ళిన స్వప్న షాపు మెట్లు దిగుతూ వుండగా పలకరించాడు మోహన్.
విస్తుపోయింది స్వప్న! "ఏదో కాలేజీలో దూరంగా చూసినట్టు గుర్తు! చదివిన అయిదేళ్ళలోనూ ఏనాడూ దగ్గరిగా నడిచినట్టు కూడా గుర్తులేదు. ముఖం పరిచయమైనదే అయినా పలకరింపులు మాత్రం ఏనాడూ లేవు. అలాటిది ఈ నాడు పనిగట్టుకుని తనని పలుకరిస్తాడా? ఇంకెవర్నేనా పిలిచాడేమో!" ఆలోచనల్లో పడిపోయిన స్వప్న జవాబివ్వలేదు.
సాయం సమయం దాదాపు ఏడు గంటలు కావస్తోంది. వీధంతా బిజీగా వుంది. ఇంకా బాగా చీకట్లు పరుచుకోలేదు. షాపుల్లో మాత్రం లైట్లు వెలిగేయి. వీధి దీపాలు వెలగలేదు. వినువీధి దీపం వెలుగు పుంజుకుంటోంది క్రమంగా.