Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 16

"పళ్ళున్న చెట్టుకేగా రాళ్ళు! కానీ..." అన్నాడు పక్క సరిచేసుకుంటూ.
"పొద్దుట లేవాలి. పాలవాడొస్తాడు" గుర్తుచేసింది శక్తి.
"లేవక ఛస్తానా? ఎవరి పెళ్ళి మరీ" అని పడుకుని "ఈ దుప్పటి కప్పి వెళతావా?" అడిగాడు.
"నేనా?" ఆశ్చర్యంగా అడిగింది.
"కాదు పక్కింటి అమ్మాయిని అడిగాను" వెక్కిరింతగా అన్నాడు.
"సరే..... సరే.... ఎందుకంత అలకా?" శక్తి నవ్వుతూ వచ్చి దుప్పటి తీసి మెడదాకా కప్పింది. ఆమెచేతిని అలాగే పట్టుకుని పైకి లాక్కున్నాడు. అదాటుగా అతనిమీద పడేసరికి ఆమెనుదురు అతని పెదవులకి తగిలింది.
"నుదుటిమీది ముద్దు పాపిట పిందె" అన్నాడు.
శక్తి లేవబోతుంటే చెంపలు ఆమె నోటికి ఆనించి "చెంపకి పెదవులు ఆనితే చెంపస్వరాలు, పెదవులకి పెదవులు ప్రేమ తాంబూలాలు....చూడు ఎలా పండుతాయో!" అంటూ ఆమె లేత పై పెదవిని తన నోటిలోకి తీసుకుని మునిపంట చిన్నగా నొక్కి వదిలాడు.
శక్తి చిన్నగా అరిచింది.
"చూశావా ఎలా పండిందో ఎర్రగా" నవ్వుతూ అన్నాడు.
ఆ తొలిస్పర్శకీ, పులకింతకీ ఆమె పలుకురాని పైడిబొమ్మే అయింది. ఆమెలోని సర్వశక్తులూ అతను పీల్చేసినట్లు అచేతనంగా వుండిపోయింది.
"బావుందా?" నవ్వుతూ అడిగాడు.
శక్తికళ్ళు అతనికళ్ళతో కలుసుకున్నాయి.
ఇంతకాలం నేను "మొగుడంటే పులుసూ, కూరా, మల్లెమొగ్గలూ, పట్టుచీరలూ, కీచులాటలూ, రాజీపడటాలూ అనుకున్నాను. చాలా వుందే" అన్నట్లు చూసింది.
'ఇప్పుడేం చూశావు? ఇంకా చాలావుంది" అన్నట్లు అతను కళ్ళతో జవాబిచ్చాడు.
ఆమె చప్పున సిగ్గుపడి అక్కడినుంచి లేచి తన పక్కమీదకి వెళ్ళి పోయింది.
"మొత్తం సిగ్గంతా ఈ రాత్రి ఖర్చు చెయ్యి రేపటికి ఏమీ మిగల్చకు గుడ్ నైట్!" ఆవలిస్తూ అన్నాడు.
"గుడ్ నైట్" అప్పటికే సిగ్గుతో దుప్పటి ముసుగేసిన ఆమె లోపలినుంచే చెప్పింది.
పెద్దబావా, చిన్నబావల అలకలతో గోపాలరావు బతిమిలాటలతో శక్తీ, ఇంద్రనీల్ ల పెళ్ళి ఆర్భాటంగా, హంగామాగా జరిగిపోయింది.
"చీర చెరంగులు ముడియిడి
కూరిమి చిటికెనలు పట్టి,
కొనగూరి చితా దారం జాతిని గడునిం
పారగ మ్రొక్కించి రప్పుడాలిన్ మగనిన్...."
అన్నపద్యం తలుచుకుంటూ అరుంధతీ నక్షత్రానికి మొక్కారు దంపతులు.
శక్తి, ఇంద్రనీల్ చెవిలో "అరుంధతికి సరిగ్గా దణ్ణం పెట్టుకో మనమధ్య పోట్లాటలు రాకూడదని" అంది.
"వశిష్టులవారు ఎంత అనుకూలురు కాకపోతే అరుంధతికి పతివ్రతగా ఇంత పేరొస్తుంది" అన్నాడు గుసగుసగా.
శక్తి మూతి తిప్పేసింది.
ఆ రాత్రి....
"ఈ రోజుకి పెరట్లో పడుకుందామండీ.... మా చెల్లెలికీ, మరిదికీ గది కావాలి" అంది అరుంధతి శంకర్ తో.
"నోర్ముయ్! వెర్రిమొహమా! నేనేమైనా పెద్దపాలేరునా పెరట్లో పడుకోవడానికీ? ఇంతకీ అరిశలూ, సున్నుండలూ బావున్నాయి. స్వగృహా ఫుడ్సా?" అడిగాడు ఫలహారం కానిస్తూ.
"అయ్యయ్యో.. అవన్నీ వాళ్ళకండీ" కంగారుపడింది అరుంధతి.
అతను కీచుగా నవ్వి "అందుకే నిన్ను ముద్దుగా పిచ్చిముండా అంటాను. వాళ్ళకి స్వీట్లు తినటానికి తీరికెక్కడుంటుందే?" అన్నాడు.
అరుంధతి అసహాయంగా చూస్తూ నిలబడింది.
సుమతి కూడా శంకర్ తో "పదండి.... బయట నాన్నతోపాటే వరండాలో సర్దుకుందాం ఈరోజు వాళ్ళని వసారాలోనో, పెరట్లోనో పడుకోమంటే బావుండదు" అంది.
పెళ్ళయి ఇన్నేళ్ళయినా మీ పెద్దబావకైతే రూం యిస్తారు కానీ నన్ను మాత్రం దొడ్లో పడుకోమంటావా? నేనంటే మీకు ఎంత అలుసూ? చూపిస్తా నా తడాఖా" అంటూ గిరి గదిలోవున్న సామాన్లన్నీ చిందరవందర చేస్తూ వీరంగం చేశాడు.
గోపాలరావు లోపలికెళ్ళి అతని గెడ్డం పట్టుకుని శాంతింపచేశాడు.
ఈలోగా లోపల్నుంచి శక్తీ, ఇంద్రనీల్ లు చిన్న సూట్ కేస్ తో వచ్చారు.
"మీకు ఎవరికీ మావల్ల యిబ్బంది లేదు. మేం మా ఇంటికి వెళ్ళిపోతున్నాం" చెప్పింది శక్తి.
"ఇంత రాత్రా?" అడిగింది అరుంధతి.
"ఔను రాత్రి అనేగా మీ భర్తలకి సమస్యగా మారిందీ విషయం అందుకే పరిష్కారం నేను ముందే ఆలోచించి పెట్టుకున్నాను" అంది.
సుమతి శక్తిమతిని దగ్గరగా తీసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
"వెళ్ళొస్తాం నాన్నా" శక్తి, ఇంద్రనీల్ లు గోపాలరావు కాళ్ళకి నమస్కరించి ఇంట్లోంచి వెళ్ళిపోయారు.
అరుంధతి వెనకాలే వెళ్ళి ఓ ప్యాకెట్ అందిస్తూ స్వీట్లూ, అగరబత్తీల ప్యాకెట్లూ, మల్లెపూలూ" అంది.
శక్తి నవ్వి "థాంక్స్ అక్కా" అని అందుకుని ఆటోలో ఎక్కి కూర్చుంది.
ఇంద్రనీల్ కూడా ఎక్కాక ఆటో వాళ్ళ కొత్తఇంటివైపు వుల్లాసంగా దూసుకు పోయింది.
                                             * * *
"కుడికాలు ముందుపెట్టు" శక్తి తాళంతీస్తూ ఇంద్రనీల్ కి చెప్పింది.
ఇద్దరూ కుడికాలు ముందు లోపలికి పెట్టి అడుగుపెట్టారు. లోపలంతా చీకటి. ఏమీ కనిపించడంలేదు.
"లైటెయ్యి" అంది శక్తి.
ఇంద్రనీల్ గోడలన్నీ చేత్తో రాస్తూ "ఎక్కడా కనపడందే..." అన్నాడు.
"నన్ను కాదు! గోడని తడుము" శక్తి విసుగ్గా అరిచింది.
"ఓ..... అది నువ్వా?" శక్తి వంటిమీదనుంచి చెయ్యితీసి గోడని తడిమి "దొరికింది" అన్నాడు.

 Previous Page Next Page