Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 15

"ఔను! మా ఇంట్లో అన్నం వండుకొని తినం. అందుకే మీ అక్క అలా చెక్కబొమ్మలా చిక్కిపోయింది" అంటూ మండిపడ్డాడు చిన్నల్లుడు గిరి.
అతన్ని శాంతింపజేయడానికి గోపాలరావుకి తలప్రాణం తోకలోకి వచ్చింది.
గిరిని చూశాక ఇంద్రనీల్ కి శంకర్ మంచితనం కొట్టొచ్చినట్టు కనిపించింది కనీసం అతను మాటలు దులిపేసుకుని మళ్ళీ మామూలుగా అందరితో కలిసిపోతాడు.
కానీ గిరి ప్రతిదానికీ సిమెంట్ లో నీళ్ళు పడ్డట్లు గట్టిగా బిగుసుకుపోతుంటాడు. అతను తినడూ, ఇంకోళ్ళని తిననివ్వడు ప్రతిదానికీ అలకే! 'ఆ' అంటే తప్పూ, 'ఊ' అంటే తప్పూను.
"మళ్ళీ నెల తప్పింది మీ కూతురికి. ఈసారి ఆడపిల్ల పుడితే విడాకులే!" బెదిరించాడు మవగార్ని.
"మగపిల్లలుండడం అదృష్టమయ్యా! నన్ను చూడు.... పుట్టమన్నా ఆడపిల్ల పుట్టదు" శంకర్ గొప్పగా చెప్పాడు.
"మీ అక్కని చూసి నేర్చుకో దేభ్యం మొహమా" అంటూ సుమతిని తిట్టిపోశాడు గిరి.
ప్రతివిషయంలో శంకర్ తో పోల్చుకుని తనకి ఏదో అమర్యాద జరిగిపోతోందని గొడవ చేసేస్తున్నాడు.
ఇంద్రనీల్ సమగతి పట్టించుకునే వాళ్ళే లేరు.
మర్నాడు పెళ్ళి అనగా శక్తీ, ఇంద్రనీల్ వెళ్ళి సన్నాయివాళ్ళనీ, ఫోటోగ్రాఫర్నీ మాట్లాడారు. పాలకి ఆర్డరిచ్చారు. కూరలబస్తా మోసుకొచ్చారు.
వంటవాళ్ళని వెంటబెట్టుకొచ్చారు.
ఇంటెడు నీళ్ళూ నింపారు.
పెద్దల్లుడూ, చిన్నల్లుడూ కాఫీలూ, ఫలహారాలూ ఠంచనుగా చేస్తూ, పేకాటేసుకుని కూర్చున్నారు.
'జలుబు లొకరికీ,. తుమ్ములొకరికీ' అని ఏ అల్లుడు డబ్బులు పోగొట్టుకున్నా మావగారి జేబుకే దెబ్బ!
మొత్తం పెళ్ళి పనులయ్యాక శక్తి ఇంద్రనీల్ కి ఓ ప్యాకెట్ అందించి "ఇందులో నాకు నచ్చినవి ఓ రెండు జతలబట్టలున్నాయి. ప్రస్తుతానికి సర్దుకో తర్వాత నీ ఇష్టం వచ్చినవి కొంటాను" అంది.
ఇంద్రనీల్ అవిచూసి "వాహ్! నీ టేస్టూ, నా టేస్టూ ఒకటే నన్ను కొనుక్కోమన్నా ఇవే కొనుక్కునేవాణ్ణి" అన్నాడు.
"నిజంగానా? ఇది నా పెళ్ళిచీర" శక్తి ఎర్రఅంచు చందనం రంగు పట్టుచీర చూపించింది.
"అరె..... నన్ను కొనమన్నా ఇదే కొనేవాడ్ని" అన్నాడు. "నేను మాత్రం ఇది చచ్చినా కొనుక్కునేదాన్ని కాదు. ఇది మానాన్న కొన్నారు" అంది.
"కాఫీలు... కాఫీలు..." బిజీగా పేకాడుతున్న శక్తి బావలు కేకలు పెట్టారు.
"వేళ్ళు రాకపోతే మన పెళ్ళి ఆగిపోతుందేమోనన్నట్లు మా నాన్న వూరికే ముందు పిలిచి కూర్చున్నారు. చాకిరీ చెయ్యలేక చస్తున్నాను" శక్తి విసుక్కొంది.
"ఉష్! గట్టిగా అరవకు. బావుండదు" అని ఇంద్రనీల్ వంటింట్లోకి వెళ్ళి సుమతిని అడిగి కాఫీలు పట్టుకెళ్ళాడు.
గిరి కాఫీ అందుకుంటూనే "ఛీ! ఇదేం పనోయ్! తప్పుకదూ అల్లుళ్ళ పరువు తీస్తున్నావు" అని విసుక్కున్నాడు.
"ఓసారి మా ఆఫీస్ లో అటెండర్ పెళ్ళికెళ్ళాను. అతనుకూడా సూట్ కావాలనీ, ఒంటెమీదే వూరేగుతాననీ పట్టుబడితే అలాగే కానిచ్చారు ఆడపెళ్ళివారు. అలా వుండాలి పెళ్ళికొడుకు హోదా అంటే" అన్నాడు శంకర్.
"ఆ మావగారెవరో అదృష్టవంతుడు! ఆయన వీపుమీదెక్కి ఊరేగుతాననలేదు ఆ పెళ్ళికొడుకు" అన్నాడు ఇంద్రనీల్.
"అబ్బో.... చతురుడివేనే" నవ్వాడు గిరి. గోపాలరావు మాత్రం ఇంద్రనీల్ కి కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
రాత్రి పక్కలసమస్య మొదలయింది. మావగారింటికొచ్చినప్పుడు గది ఏర్పాటు లేకపోతే ఎలా? అని మొండిపట్టు పట్టారు అల్లుళ్ళు.
హాల్లో ఒకళ్ళకీ, పడకగదిలో ఒకళ్ళకీ ఏర్పాటుచేసి గోపాలరావుకి వరండాలో మంచంవేసి చాప, బొంతా పట్టుకుని పెరట్లోకి వెళ్ళింది శక్తి.
"రావోయ్ పెళ్ళికూతురా...." అన్నాడు ఇంద్రనీల్.
"ఈ చాప నేను వేసుకుంటాను. నువ్వు బొంతమీద పడుకో మళ్ళీ తెల్లవారుఝామునే లేవాలి. పాలవాడొస్తాడు" అంది.
"అది సరేకానీ....మీ బావలు మన పెళ్ళయ్యాక కూడా వుంటారా?" అడిగాడు.
"ఏం?" అంది.
"అబ్బే! ఫస్ట్ నైట్ కూడా ఇలా ఎగుడూ దిగుడూ గతుకుల నేలమీదే ఏమోననీ..." నసిగాడు.
శక్తి పక్కలు వేస్తున్నదల్లా ఆగి, సీరియస్ గా చూసింది.
ఇంద్రనీల్ ఆమె కళ్ళలోకి భయంగా చూసి "ఇక్కడ మాత్రం ఏం తక్కువలే శక్తీ! నిండా లైట్లు పెట్టినట్లు నక్షత్రాల్లా....నెలవంక, సూరీడు సిరిగల దొరలే కాదులే.... పూరిగుడిసెల్లో, పేదముంగిట్లో వెలిగేటి దీపాలులే....!" అని రాగం తీశాడు.
శక్తి చిరునవ్వు నవ్వి "అటువంటి సమస్య నీకు రాదు. పెళ్లవగానే మన యింటికి వెళ్ళిపోదాం" అంది.
"ఎప్పుడు ఇల్లు చూశావు?" ఆశ్చర్యంగా అడిగాడు.
"ఓ వారం క్రితమే! ఆ ఇంటివాళ్ళకి కూడా పెళ్ళికిముందే ఇల్లు చూసుకోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది" అంది.
"వంటగదీ అదీ నేను వచ్చి చూసుకోకుండానే సెటిల్ చేసేశావా?" అడిగాడు.
శక్తి ఫక్కున నవ్వేసింది.
"గుప్పెడు మల్లెలు రువ్వినట్లు ఎంత హాయిగా నవ్వుతావు శక్తీ" అన్నాడు.
"కాదు.... రాళ్ళు రువ్వినట్లు నవ్వుతాను. జీవితాంతం భరించాలి" మొండిగా అంది.

 Previous Page Next Page