Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 17

"లైటు వెయ్యి ఇంకా ఆలస్యం ఏమిటి మరి?" అంది శక్తి.
"స్విచ్ వేశాను కానీ వెలగలేదు" అన్నాడు.
"ఏం? కరెంట్ లేదా?"
"కాదు..... బల్బు లేదు" తాపీగా చెప్పాడు.
శక్తీ చిరాగ్గా "ఛీ! ఇంటివాళ్ళు అదికూడా మన ఖర్చే అనుకున్నారా?" అంది.
"ఇప్పుడేం చేద్దాం?" చీకటిలోనే ఇంద్రనీల్ అడిగాడు.
"ఇంత రాత్రివేళ వాళ్ళని లేపితే బావుండదు కానీ సూట్ కేస్ లోంచి ఓ జంపఖానా తీసి పరు. మనమే ఎడ్జస్ట్ అయిపోదాం" అంది.
"ఇంత చీకట్లో ఫస్ట్ నైటా...." నసిగాడు."చెప్పినట్లు చెయ్యి" అరిచింది.
ఇంద్రనీల్ ఆమె చెప్పినట్లే చేసి "ఇంక పడుకుందామా?" అన్నాడు.
శక్తి ఆవలిస్తూ "వారంనుంచీ ఈ పెళ్ళిపనులవల్ల పూర్తిగా అలసిపోయాను" అంది.
అతను చీకట్లో ఆమె దగ్గరగా జరుగుతూ "మీ అక్క యిచ్చిన పూలు పెట్టుకో..... జడ ఏదీ?" అడిగాడు.
శక్తి విసుగ్గా "కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో ఇప్పుడు నా జడ కావాల్సి వచ్చిందా నీకు?" అనరిచింది.
"సరే..... వద్దులే... నా చేతికి చుట్టుకుంటాను మంచి వాసన వస్తున్నాయి. శక్తీ.... నీ బుగ్గలు ఎంత మృదువుగా వున్నాయీ..." వేలితో రాస్తూ అన్నాడు.
"అవి నా అరికాళ్ళు కానీ.... తెల్లారక విపులంగా చూద్దువుగాని.....ఇప్పుడు పడుకో" అంది.
అతను మాటలకోసం వెతుక్కుంటూ "ఇది.... ఇది మన ఫస్ట్ నైటా?" అన్నాడు.
"బ్రహ్మాండమైన ఓపెనింగ్" కస్సుమన్నట్లు చెప్పింది.
"ఆశావాది ప్రతి విషయంలో అవకాశం వెతుక్కుంటాడు. చీకటైతె మాత్రం ఏమిటి?" ఆమెకు దగ్గరగా జరుగుతూ అన్నాడు.
ఆమె మాట్లాడలేదు.
అతను చీకట్లో ఆమెని తడుముతూ "అబ్బా! మరీ అంత మోటు సరసమా?" అని అరిచాడు.
"సరసమా? నేనేం చేశాను?" శక్తి ఆవలించి అడిగింది.
"చేతిమీద అంత గట్టిగా గిచ్చావేంటీ? చూడు.... ఎలా చురుక్కుమంటోందో?" వూదుకుంటూ అన్నాడు.
"చురుక్కుమనటం ట్యూబ్ లైట్ వెలుతురులో చూసినా కనపడదు కానీ..... నేనేం గిచ్చలేదు."
"ఆ! మరి ఎవరు గిచ్చారూ?" కంగారుగా అడిగాడు.
"ఏ తేలో, మండ్రగబ్బో కుట్టివుంటుంది" ఆమె మాట పూర్తి అయ్యేలోగానే అతను గావుకేక పెట్టి "అమ్మో.... ఇప్పుడు నేనేం చెయ్యాలి?" అడిగాడు.
"నాకు మంత్రం వచ్చు విషం పైకెక్కకుండా ఆపుతానుగానీ.....మాట్లాడకుండా పడుకోవాలి మరి!"
"సరే..." బుద్దిగా పడుకున్నాడు.
శక్తి అతనిచెయ్యి పట్టుకుని మెత్తగా రాస్తూ ఏదో మంత్రం చదివింది. "దిగిందా...?" అడిగింది.
నెప్పి చాలావరకూ తగ్గినట్లే అనిపించి "ఊ" అని మూలిగాడు.
"మాట్లాడితే విషం గబగబా ఎక్కేస్తుంది. మాట్లాడకుండా పడుకో" అంది.
అతను "ఊ" అనడానికికూడా జంకి మెదలకుండా పడుకున్నాడు.
"మొదటిరాత్రే మొగుడ్ని మోసం చేసేయాల్సొచ్చింది" అనుకుంటూ శక్తికూడా ఇంకోవైపుకి తిరిగి పడుకుంది.
అలసిపోయిన ఆ ఇద్దరూ అతి త్వరగా నిద్రలోకి జారిపోయారు.   
                                                 * * *
తూరుపుదిశ నుంచి వచ్చిన వేటగాడు గురిచూసి బాణం విరిసినట్లు సూర్యకిరణం ఒకటి సూటిగా వచ్చి మొహంమీద పడేసరికి శక్తి కళ్ళు తెరిచింది.
గదంతా తట్టుకోలేనంత వెలుగ్గా వుంది. గబుక్కున కళ్ళు మూసేసుకుని మళ్ళీ వెలుతురికి అలవాటు పడుతూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది.
కళ్ళు తెరవగానే ఎదురుగా కాసంత బొట్టు పెట్టుకుని, పండిన తలతో పెద్ద ముత్తయిదువలా మామ్మగారు కనిపించారు. ఆవిడ పక్కనే విభూతి కట్లతో నంబియార్ లా తాతగారు దర్శనం యిచ్చారు. వాళ్ళని చూసి అదాటుగా లేవబోయింది కానీ వీలుకాలేదు.
ఇంద్రనీల్ ఆమె నడుంచుట్టూ చేయివేసి, కాళ్ళతో కాళ్ళని మెలిపెట్టి ఆమెని కదలలేనిస్థితిలో వుంచాడు.
శక్తికి చచ్చేటంత సిగ్గేసింది. కసుక్కున అతని చేతిమీద గిచ్చి "లే.... లేచి కూర్చో.... వాళ్ళు వచ్చారు" అంది.
"ఇంత పొద్దుటే తలుపు తియ్యవద్దని వాళ్ళతో చెప్పు" కదలకుండానే చెప్పాడు.
"తలుపులు వేస్తే కదా బాబూ నువ్వు తియ్యడానికీ!" మామ్మగారు ఘళ్ళున నవ్వుతూ అంది.
ఆ నవ్వుకి, తను ఏ చెట్టుకిందో పడుకుని వుండగా, ఆ చెట్టుకొమ్మ ఫెళఫెళమని విరిగిపడుతుందేమోనన్న భ్రాంతితో అమాంతం లేచి కూర్చున్నాడు.
శక్తికూడా లేచి, స్థానభ్రంశం అయిన చీర సర్దుకుంటూ "రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాము. లైట్లు లేవు అందుకే.... తలుపులసంగతి చూసుకోలేదు" అని నసిగింది.
"కొత్తల్లో అవన్నీ ఏం చూసుకుంటార్లే..." తాతగారు శ్లేషగా అంటూ మామ్మగారివైపు చూశారు.
ఆవిడ అమాంతం సిగ్గుపడి మొహం అంతా సొట్టలు పడేసుకుంది.
శక్తి ఇంద్రనీల్ తో "మొహం కడుక్కో....సామానులు తెచ్చుకుని వంట మొదలుపెట్టొచ్చు" అంది.
"ముందు ఇంట్లోకి బల్బులు కొని తేవాలి" విసుగ్గా అన్నాడు.
శక్తి క్రీగంట అతను చేతిని వూదుకోవటం చూసి నవ్వుకుంది.
"అదిగోనమ్మా బావి..... మీరు కొనుక్కునేవరకూ మా తాడూ, చేదా వాడుకోండి" ధారాళంగా దానం చేస్తున్నట్టు అంది మామ్మగారు.

 Previous Page Next Page