కష్టపడి ఆడి విజయం సాధించగా, చేతికందిన మెడల్ ని గర్వంగా చూసుకునే క్రీడాకారుడిలా అతను చెంప నిమురుకున్నాడు.
* * *
పసుపూ, కుంకుమపూల పంటల్ని పాలతో చెలిమి చేయించి మేని రంగునీ అప్పుడే విచ్చుకుంటున్న పూవునడిగి కోమలత్వాన్ని, దానిమ్మ చిగురునడిగి పెదవి రంగునీ, కలువ రేకులనుండి కనుదోయి సొగసునీ, కోహినూర్ వజ్రంనుండి కంటి కాంతినీ, గులాబీ మొగ్గల్ని అడిగి బుగ్గల్లో సిగ్గు దొంతర్లనీ అరువు తెచ్చి ఆమెని సృష్టించాడేమో ఆ బ్రహ్మ అన్నట్లుగా వుందామె.
నల్లని చుడీదార్ లో ఆమె కారుమేఘాల మధ్య మెరుపుతీగలా మెరిసిపోతోంది!
'విలాసవంతులు క్రీగంట చూపునుండి విద్యుచ్చక్తి సరఫరా చేస్తారు' అని తిలక్ ఊరికినే అనలేదు అనుకున్నాడు కిరణ్.
అతనికి ఆమె స్పర్శ సోకినప్పుడల్లా ఒంట్లోకి వెయ్యి ఓల్టుల కరెంట్ ప్రవహిస్తుందేమో అనిపిస్తుంది.
"కొద్దిగా దగ్గరకు జరుగు" అన్నాడు.
"ముందు సరిగ్గా డ్రైవ్ చెయ్యి అక్కడికి వెళ్ళాకే అవన్నీ" అంది చాయ.
కిరణ్ వెంటనే కారు ఆపేసాడు.
"ఏం ఆపావు?" కళ్ళు చిట్లిస్తూ అడిగింది.
"పెట్రోలు పడాలి" చెప్పాడు కిరణ్.
"అవన్నీ ముందు చూసుకోరూ! ఈ అడవిలో ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందీ?" చిరాగ్గా అంది.
"ఇక్కడే దొరుకుతుంది" ఆమె పెదవులని అందుకుంటూ అన్నాడు కిరణ్.
"పెట్రోలంటే...."
"కారుకి కాదు నాకు."
"సర్లే.....త్వరగా పద" అయిష్టంగానే అతనికి పెదవులు అందించింది.
కానీ మరు నిముషంలో ఆమె పెదవులు ఇష్టంగా అతని పెదవుల్తో ఆటలాడసాగాయి.
"మొదట హద్దనీ, రెండోసారి వద్దనీ, మూడవసారి పోనిద్దూ అని, నాలుగోసారి ఇద్దూ అనీ, ఆ తర్వాత ఎందుకొద్దూ అని మీ స్త్రీలు ప్రాణం తీస్తారట" ఆమెను విడిచిపెడుతూ అన్నాడు కిరణ్.
"ఓహో" కళ్ళు చక్రాల్లా తిప్పింది చాయ.
కిరణ్ పాట పాడ్తూ డ్రైవ్ చేయసాగాడు.
"ఆజ్ ఫిర్ జీనేకా తమన్నా హై
ఆజ్ ఫైర్ మర్ నే కా ఇరాదా హై"
"ఆ రెండోది నాకు నచ్చలేదు. సరిగ్గా డ్రైవ్ చేయ్" అంది చాయ.
కిరణ్ నవ్వేసాడు.
"కిరణ్! అక్కడ మనకి ఫుడ్ దొరుకుతుందా?" సందేహంగా అడిగింది.
"ఆహా! రాణిగారికోసం సకల ఏర్పాట్లూ అయ్యాయి" ఆమెను ఓ చేతితో దగ్గరగా తీసుకుంటూ అన్నాడు.
"పనివాళ్ళుంటారా?' అడిగింది.
"జీ మాలిక్....కావల్సినంతమంది" నవ్వుతూ చెప్పాడు.
చాయ అతని భుజం మీద తలవాల్చి "కిరణ్ ఐయామ్ వెరీ హేపీ" అంది.
కిరణ్ కూడా చాలా హేపీగా ఫీలయ్యాడు.
చాయకి మబ్బుల్లో తేలిపోతూ రోదసీలోకి విహారయాత్రకి వెళ్ళినట్లుంది.
కారుదిగి చాయ క్రింద కాలు పెట్టగానే కిరణ్ చాలా హడావుడి చేసాడు.
"రంగమ్మా.....రత్తీ ఎక్కడున్నారు? అమ్మగారికి కూల్ డ్రింక్ తీసుకురండి.....అరెరె....ఒక్క నిముషం ఆగు. క్రింద రెడ్ కార్పెట్ పరవనీ ఆ! ఇప్పుడు అడుగు వెయ్యి! రత్తీ ఆ బుట్టలోని గులాబీరేకులు జల్లు లేకపోతే ఆ నాజూకు పాదాలు కందిపోతాయి. అలా చూస్తూ నిలబడ్డారేం, సినిమా హీరోయిన్ కాదు బ్రిటీష్ యువరాణి అంతకన్నా కాదు. ప్రపంచ సుందరికన్నా ఎక్కువ నా ప్రేమ దేవత. నా జానేమన్" అంటూ చాయ చేతిని అందుకుని కిరణ్ గర్వంగా ముందుకి నడిచాడు.
రత్తి బుట్టలోని గులాబీ రేకుల్ని దారంతా జల్లుతూ వుంటే చాయకి సిగ్గుతో, ఒళ్ళు బరువుగా, మైమరపుగా అనిపించింది.
"ఎలా వుంది మన ప్రేమ సామ్రాజ్యం?" లోపలికి వెళ్ళగానే చాయని అమాంతం పైకి ఎత్తేస్తూ అడిగాడు కిరణ్.
"అంతా కలలా వుంది. రోజూ తెల్లవారుజామున నాకొచ్చే కలలా వుంది. ఏదీ ఒకసారి గిల్లు" తన చేతిని జాపుతూ అంది చాయ.
కిరణ్ ఆమె అరచేతిని కొరికాడు.
కెవ్వుమంది చాయ. "అరె! నిజమేనా! ఇది కలకాదు. నేను నా రూంలో గచ్చుమీద పడుకుని లేను. థాంక్ గాడ్" అంది సంతోషంగా.
కిరణ్ ఆమెని గిరగిరా తిప్పుతూ పకపకా నవ్వాడు.
ఆ నవ్వులో చాయ కూడా శృతి కలిపింది.
"చిన్నబాబూ! మీరు చెప్పినట్లు ఫ్రాన్స్, సూప్, చికెన్ కర్రీ అన్నీ చేసాను. ఇంకా ఏమయినా కావాలా?" వంటమనిషి వినయంగా చేతులు కట్టుకుని అడిగాడు.
"వెరీగుడ్! వడ్డించెయ్ ఓ పట్టు పడ్తాం" చాయని క్రిందికి దింపుతూ అన్నాడు.
"కిరణ్....నా ఐస్ క్రీమ్!" గారాంగా అంది చాయ.
"అదెప్పుడో రెడీ డియర్!" ఆమె పెదవుల్ని అందుకుంటూ అన్నాడు కిరణ్.
అందంగా సెట్ చేయబడ్డ ఆ విశాలమైన డైనింగ్ టేబుల్ ని, దానిమీదున్న అత్యంత ఖరీదైన డిన్నర్ సెట్ ని చూడగానే చాయ కళ్ళు సంభ్రమంతో విచ్చుకున్నాయి.
"ఇవన్నీ మనకోసమేనా?" అంది.
"సరిపోతాయా? ఇంకా ఏమైనా కావాలా?" నవ్వుతూ అడిగాడు కిరణ్.
కిరణ్ ఆమె ముక్కుపట్టి ఊపుతూ "మొత్తం సామ్రాజ్యానికి సర్వాధికారిణివి కాబోతూ ఏమిటా ప్రశ్నలు?" అన్నాడు.
ఆ మాట చాయకి చాలా ఉత్తేజాన్నిచ్చింది.
కిరణ్ కొసరి కొసరి తినిపిస్తూ వుంటే, ఆమె అన్ని పదార్ధాలు తినలేక అవస్థ పడింది. ఆమెకి తను రోజూ తినే ముక్క వాసనకొట్టే అన్నం, ఉప్పు, కారం సరిగ్గాలేని పప్పూ గుర్తువచ్చాయి. ఈ కల కరిగిపోయి మళ్ళీ నేనా నరకంలో పడిపోనుకదా?" అనుకుంది.
"ఏదీ నోరు...." కిరణ్ ఐస్ క్రీమ్ స్పూన్ తో తీసి అందిస్తూ అన్నాడు.
చాయ నోరు తెరిచింది.
కిరణ్ ఐస్ క్రీమ్ కి బదులు తన పెదవులని అందిస్తూ "ఇంకా రుచి కరమయినవి మనకోసం ఎదురుచూస్తున్నాయి" అన్నాడు.
"ఏవీ?" అడిగిందామె.
"చెప్తాను పద...." ఆమె చేతిని పట్టుకుని లేపుతూ అన్నాడు కిరణ్.