Previous Page Next Page 
ఖజురహో పేజి 15


    ఆ నిశ్శబ్దంలో నేనున్నానంటూ గణగణా మ్రోగింది ఫోన్.
    
    కాంచన హృదయం ఆ ధ్వనికి ఎగిసిపడే అలలా మారింది. ఆమె కార్డ్ లెస్ తీసి- "హలో!" అంది "హలో హనీ!"
    
    తన జీవిత సర్వస్వం ఆ రెండు మాటల్లోనే ఇమిడ్చి భగవంతుడు అందిస్తున్న బహుమతిలా అనిపించిందామెకు.
    
    "ఎలా వున్నావు కాంచీ...." జయచంద్ర గొంతు నవనీతంలో ముంచి తీసిన వేణువులా వుంది.
    
    కాంచనకి మాట రావడం కష్టమైపోయింది. ఆనందం, బాధా మిళితమై రెండు కన్నులనుండీ కాల్వలు కట్టాయి.
    
    "ఇంకా ఎంతకాలం ఇలా ఎదురుచూడనూ?" ఆమె కంఠంలోని బరువు వియోగంవల్ల బాధతో అందామె.
    
    అతను తేలిగ్గా నవ్వేసి- "బయలుదేరుతున్నాను ఎల్లుండి ఉదయానికల్లా అక్కడ వుంటాను.....సరేనా?" అన్నాడు.
    
    "ని.....జం....గా!" ఆ క్షణం ఆనందంతో తన గుండె ఆగిపోతుందేమో అనిపించింది.
    
    "ఏమిటదీ కొత్త పెళ్ళికూతుర్లా? ఈమాత్రం ఎడబాటుకే?" జయచంద్ర ఆట పట్టించాడు.
    
    "ఏమండీ..." కాంచనకి ఆపైన మాట్లాడాలంటే భయం వేసింది తన బాధని అతను పసిగట్టి విలవిల్లాడతాడేమోనని!
    
    "వచ్చేస్తున్నాను. ఆరోగ్యం జాగ్రత్త.....బేబీ జాగ్రత్త....బేబీకి చెప్పు మై స్వీట్ ఏంజిల్ ఎల్లుండి నీ పక్కనే వుంటాను. సరేనా....బై" రిసీవర్  క్రెడిల్ చేసిన ధ్వని వినిపించింది.
    
    'ఇంత ఆనందాన్ని ఎలా తట్టుకోవాలా? ఎవరితో పంచుకోవాలా?' అనుకుంటూ వుండగా-
    
    "అమ్మా" అన్న సంధ్య పిలుపు వినిపించింది.
    
    కాంచనకి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుగా లేచి అడుగులు వేసింది.
    
    చీకటిని వెన్నెలతో, వడగాలుల్ని కొబ్బరినీళ్ళతో, వియోగాన్ని మధురమైన జ్ఞాపకాలతో, విషాదాన్ని ఆనందకరమయిన ఆలోచనలతో పారద్రోలే శక్తి ఆ దేవుడే ఇస్తాడు. ఆ నిముషం కాంచన తన బాధ యావత్తూ మరిచిపోయింది.
    
    "సంధ్యా.....నాన్న ఎల్లుండి వస్తున్నారు" ఉద్వేగంగా పలికింది.
    
    సంధ్య అక్కడే అలాగే నిలబడిపోయి తల్లి కళ్ళల్లోని వెలుగునీ, సంతృప్తినీ చూస్తుండిపోయింది. 'ఆ నిముషాన్ని పట్టి బంధించగలిగితే ఎంత బావుండును' అనిపించిందామెకు. ప్రపంచం అంతా తన పాదాక్రాంతం అయిపోయినట్టు సంతోషిస్తున్న తల్లిని చూస్తుంటే, ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. స్త్రీకి సౌభాగ్యంలో ఎంత సౌఖ్యాన్ని దాచిపెట్టాడా భగవంతుడు? సంధ్య కళ్ళల్లో అనందాశ్రువులు నిండాయి!!
    
                                              * * *
    
    "అదొక పిచ్చిది" హేళనగా అంది చాయ.
    
    పార్కులో ఆమె పక్కన కూర్చుని చుట్టూ వున్న ప్రపంచాన్ని మరిచిపోతున్న కిరణ్ కళ్ళు చిట్లించి చూశాడు.
    
    "అదే...నేను చెపుతూ వుంటానే.....సంధ్య అనీ....దాన్ని గురించే. వాళ్ళ అమ్మకి జబ్బట.... అందుకని తను కాలేజీ విడిచిపెట్టగానే పరిగెత్తుకుని వెళ్ళిపోవాలట.... వాళ్ళ నాన్న రేపు ఫారిన్ నుండి వస్తున్నారట..... ఈవిడగారు ఎయిర్ పోర్టులో కనిపించకపోతే తట్టుకోలేరట! అది బావిలో కప్ప..... దాని ప్రపంచమంతా ఆ అమ్మానాన్నలే!" అదేదో జోక్ లా నవ్వుతూ అంది చాయ.
    
    కిరణ్ కి ఆమె అలా నవ్వడం నచ్చలేదు.
    
    "పైనుంచి చూసేవాళ్ళకి అదంతా ఫూలిష్ గా కన్పించినా, అవి అనుభవించే వాళ్ళకే ఆ బంధాలూ, ఆత్మీయతలూ చాలా ఊరటనిస్తాయి. చాయా చాలా సున్నితమైన మనవ సంబంధాలు! వన్ కెనాట్ డిఫైన్ దట్ ఫీలింగ్" అన్నాడు.
    
    చాయకి ఆ మాట గుచ్చుకున్నట్లు ఆమె ముఖం సీరియస్ గా మారింది.
    
    ఆమెకి కోపం వచ్చిందేమోనని కిరణ్ కొద్దిగా జంకుతూ-
    
    "ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందంలే.... ఆ అమ్మాయి గురించి మనకు ఎందుకు?" అన్నాడు.
    
    "అవును పిచ్చే ఉత్తి ఫూల్స్! చుట్టూ ఇన్ని ఆనందాలుండీ అనుభవించడానికి డబ్బులేక ఒకరేడుస్తూంటే, బోలెడు డబ్బుండీ ఏవీ అనుభవించలేని మానసిక దరిద్రంతో చస్తున్నారు.
    
    కారు వద్దు, నడిచి.....బస్సులో, ఆ కంపులో వస్తాను అని పేచీ పెడుతుందిట ఈ హీరోయిన్! పోనీ తను అనుభవించకపోతే మానెయ్! ఫ్రెండ్స్ కోసం అయినా ఖర్చు పెడుతుందా అంటే అదీ లేనే లేదు.
    
    కాలేజీ అవుతూనే ఏవో కొంపలు మునిగిపోయినట్లు 'అయ్యో అమ్మ ఎదురుచూస్తుంది ఇంటికెళ్ళాలి' అంటూ ఒకటే గొడవ! ఎక్కడికి పోతుందనీ ఆ జబ్బు తల్లి.... మంచంలోనే పడుంటుందిగా! అదొక పెద్ద నట్ అని నాకు మొదటిరోజే తెలిసిపోయింది" అంది అక్కసుగా చాయ.
    
    కిరణ్ టాపిక్ ని డైవర్ట్ చేయడానికన్నట్టు....
    
    "ఇంతకీ మా అక్క.... అదే వార్డెన్ అమ్మగారు ఏవంటున్నారు?" అని నవ్వాడు.
    
    చాయ నిర్లక్ష్యంగా- "ఆవిడ ఏవంటుందిలే! అయినా ఆవిడ నీకు అక్క ఎప్పట్నుంచి అయిందీ!" అంది.
    
    కిరణ్ ఆమె పైటకొంగు అందుకుని అందులోనుంచి పోగులని తాకుతూ-
    
    "పాల కోసం రాయి మోసినట్టూ.... నీకోసం ఆవిడని మంచిచేసుకోడానికి నానా నాటకాలు ఆడాను. లేని అక్కని సృష్టించి, చంపి ఆవిడ్ని నా అక్కలా వున్నారన్నాను" అన్నాడు.
    
    చాయ అతని చేతిలోంచి తన కొంగు లాక్కుని-
    
    "అవసరం లేదే! ఆవిడకి నన్ను ఏమీ అనే ధైర్యంలేదు. ఆవిడకే కాదు ఇప్పుడు మనం అంటే అక్కడ అందరికీ భయం! మొన్న మా కోమల లేచిపోబోయిన రోజు నేను చూడకపోతే ఆవిడ ఉద్యోగం ఊడిపోయేదని చెపుతానేమోనని కూడా ఆవిడకి భయం" అంది ధీమాగా.
    
    "ఆ సంగతి ముందే తెలిసుంటే ఈరోజు ఆవిడ కోసం కొన్న బుట్టెడుపళ్ళు డబ్బు మిగిలేదే!" అన్నాడు కిరణ్.
    
    "ఆప్ట్రాల్ వందరూపాయలు ఖర్చు పెట్టుంటావు అంతేగా! అది నీకో లెక్కా!" తేలిగ్గా అనేసింది చాయ.
    
    "కాదు....నీకోసం ఏం చేసినా.... ఎంత ఖర్చుపెట్టినా నాకు లెక్కకాదు" అలా అనేటప్పుడు అతని కంఠం వణికింది.
    
    ఆరంజ్ కలర్ చీరలో విరబూసిన తుంగేడులా మెరిసిపోతున్న ఆమెను చూస్తూ తమకం ఆపుకోలేనట్లు ఆమె చేతిమీద తన చేతిని వేశాడు కిరణ్.
    
    చాయ అతని చేతికున్న ఉంగరం చూస్తూ- "డైమండా!" అంది.
    
    "అవును అమెరికన్ డైమండ్!" కిరణ్ నవ్వుతూ- "ఇది నా వేలికంటే నీ వేలికే ఎక్కువ అందంగా వుండేటట్టుంది" అన్నాడు.
    
    చాయ మాట్లాడలేదు.
    
    అతను చనువుగా ఆమె చేతిని పట్టుకుని చేతికి ఉంగరం తొడుగుతున్నా ఏమీ అనలేదు.
    
    "రవీంద్ర భారతిలో గురుదాస్ మాన్ సింగ్ నైట్ వుంది. టిక్కెట్లు కొన్నాను పోదామా?" అడిగాడు.
    
    చాయ అతని చేతికున్న వాచీ పట్టుకుని టైం చూసి "లేటవుతుందా" అంది.
    
    "నేను డ్రాప్చేస్తా" అన్నాడతను.
    
    పార్కులోంచి బయటకు వహ్చి ఇద్దరూ కారులో కూర్చున్నాక అతను ఆమె భుజంచుట్టూ తనచేతిని వేసి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు.
    
    చాయ ముక్కుపుటాలకి అతన్నించి వచ్చిన మత్తయిన స్ప్రే వాసన ఆహ్లాదాన్నిచ్చింది.
    
    అతని కంఠం కింద తగులుతున్న ఆమె వేడి నిట్టూర్పుల సెగకి అతని రక్తం పొంగినట్టయింది.
    
    ఆమె ముఖాన్ని రెండు చేతులమధ్యా బంధించి ఆత్రంగా ఆమె పెదవులను అందుకోబోయాడు.
    
    "రేపు నిన్ను మా గెస్ట్ హౌస్ కి తీసుకెళతాను. చుట్టూ మామిడి తోటా.....అదీ! చాలా బావుంటుంది" అన్నాడు చాయతో కిరణ్.
    
    "రియల్లీ!" అతని మెడచుట్టూ చేతులువేస్తూ సంతోషంగా అంది చాయ.
    
    కిరణ్ కి మనసంతా సంతృప్తితో నిండిపోయింది.
    
    ఆమె కళ్ళల్లో కనిపించే ఆ సంతోషపు తళుకు కోసం అతను దేనికయినా సిద్దమే!
    
    ఇంగ్లీష్ చానల్ ఈదడానికయినా వెనుకాడడు ఈత రాకపోయినా!
    
    "యూ ఆర్ మై స్వీట్ డార్లింగ్" అని బుగ్గమీద ముద్దుపెట్టింది చాయ.

 Previous Page Next Page